23, అక్టోబర్ 2010, శనివారం

సౌందర్యచిట్కాలు (Beauty Tips)

లుక్కు మారితే లక్కు మారుతుంది. అందుకే అందంగా పుట్టాలనీ, అందంగా తయారవ్వాలనీ చాలామంది కోరుకుంటారు. ఈ అందం అనేది ఒక సాపేక్షభావన (Relative concept) అని ఈస్థటిస్టుల అభిప్రాయం. ఆఫ్రికన్ల అందం కాన్సెప్టూ, భారతీయుల అందం కాన్సెప్టూ ఒకటి కావు. అలాగే వీరివీ తక్కిన జంబూద్వీపవాసులవీ ఒకటి కావు. అందం అనేది దాన్ని చూసే కళ్ళల్లో ఉంటుందని అందుకే పెద్దలు చెబుతూ వచ్చారు. ఇతరులకు అందంగా కనిపించకపోయినా ప్రతితల్లికీ తన బిడ్డ ముద్దులు మూటగట్టేస్తూ ఉంటాడు. అయితే అందంగా ఉండడంలో చాలా మతలబులున్నాయని చాలామందికి తెలియదు. అందం ఒక బాధ్యత. ఎందుకంటే అందం ఒక సంపద, ఒక వారసత్వం. అందం ఒక మత్తుమందు.

అయితే - చూడగానే ఆకట్టుకునే సూదంటుఱాయిలాంటి వ్యక్తిత్వం, చూపు తిప్పుకోలేనంత సుందరరూపం మొదలైన వాటితో ఎన్ని ఇబ్బందులున్నా ఫర్వాలేదనుకొని అవే కావాలని ప్రగాఢంగా అభిలషించేవారు వాటిని సాధించే ప్రక్రియలో కూడా చాలా ఇబ్బందులున్నాయని గ్రహించాలి. అందం యొక్క భౌతికస్వరూపమే ఎక్కువమందికి ఎఱుక. దాని ఆధ్యాత్మిక స్వరూపం గుఱించి చింతన చేసేవారు అఱుదు. అందం అంతిమ ఫలస్వరూపమే తప్ప దానికది ఒక స్వతంత్ర స్వమూర్తి (independent entity) కాదు. ఈ అంతిమ ఫలాన్ని కాచిన ఆ అందమైన వృక్షం పేరేంటి ? అందాన్ని మించిన ఆకర్షణపరిమళాన్ని వెదజల్లే ఆ పూలతీగ ఎక్కడిది ?

మానవుడి గొప్పతనాలన్నీ ఆతనియందు భగవంతుడు ప్రసన్నుడై ప్రసాదించగా వ్యక్తమౌతున్న భగవద్ విభూతులేననీ, అవి ఆయన ఆస్తి అనీ, ఒక తండ్రి తన ఆస్తిని కుమారులకు పంచి యిచ్చినట్లుగా ఆయన మనకు వాటిని పంచి యిస్తాడనీ గతంలో ఒకసారి ఒక ప్రసంగంలో అన్నాను. అదే అందానిక్కూడా వర్తిస్తుంది. మన అందం ద్వారా వ్యక్తమయ్యేది నిజానికి మనం కాము, ఆ భగవంతుడే. ఈ ముఖాలు భగవంతుడివి. ఈ శరీరాలు భగవంతుడివి. ఈ ఆకర్షణశక్తి భగవంతుడిది. మనం వాస్తవంగా భూతకాలిక పిండాలం, భవిష్యత్ శవాలం మాత్రమే. భౌతికమైన అందం మానసికమైన అందానికి ప్రతిబింబం మాత్రమే. అవ్యక్తుడైన పరమాత్మకు వ్యక్తరూపమే ఈ ప్రపంచం. అదే విధంగా సూక్ష్మమైన మనస్సు ధరించిన స్థూలరూపమే ఈ శరీరం. ఏదో ఒక జన్మలో ఒకనాడు మనం చేసిన మంచి ఆలోచనలు ఈ జన్మలో మన అందంగా వ్యక్తమౌతున్నాయి.

అందానికి ఏ ఆధ్యాత్మిక సత్యం వర్తిస్తుందో అందవిహీనత్వానికీ అదే సత్యం వర్తిస్తుంది. అంటే పూర్వజన్మలో మనం చేసిన అందవికారపు ఆలోచనల ప్రతిఫలమే ఇప్పటి అందవిహీనత్వం. పూర్వజన్మల దాకా పోనక్కఱలేదు. ఒక వ్యక్తి ఈ జన్మలోనే హత్య గానీ మఱో దుష్టుపని గానీ చేసేటప్పుడు అతను స్వతహాగా ఎంత అందగాడైనా సరే, అతని ముఖకవళికలు అతనికి తెలియకుండానే ఎంత అందవిహీనంగా మారిపోతాయో గమనించండి. ఆనాటి ఆ ముఖకవళికలే కర్మఫలం అనే రిఫ్రిజిరేటర్ లో దాచబడి భద్రంగా అతనికి మఱుజన్మలో అందించబడతాయి. ఆ తరువాత అతను తన ముఖాన్ని అద్దంలో చూసుకొని తననెందుకిలా భగవంతుడు అందవికారంగా పుట్టించాడో అర్థం కాక కుమిలిపోతూంటాడు. అది భగవంతుడు ఇవ్వాలనుకొని ఇచ్చిన అందవికారం కాదు. ఇతను ఒకప్పుడు కోరి యెంచుకున్నదే.

"అందమైన ప్రతివారూ మానసికంగా అందంగా ఉంటారనే హామీ ఏముంది ? ఈ అందగాళ్ళు/ అందగత్తెలు అంత మంచి పూర్వజన్మసంస్కారం గలవారైతే మఱి ఇప్పుడు ఈ జన్మలో ఆ సంస్కారం కొనసాగలేదెందుకని ? వీరిలో పిసినిగొట్లూ, కుట్రదారులూ, ద్రోహులూ, రౌడీలూ, కేడీలూ, వ్యభిచారిణులూ కూడా ఉన్నారెందువల్ల ?" అనే విచికిత్స తలెత్తుతుంది. సత్సంస్కారాలు మఱుజన్మలో కొనసాగాలన్నా దానికి మానవుడు ప్రయత్నపూర్వకంగా సంకల్పించుకోవాలి. అలా కొనసాగకుండా మధ్యలోనే చెడిపోవాలని నిర్ణయించుకుంటే దేవుడేం చేస్తాడు ? అందుకే సాయిబాబా ఒక భక్తుడితో అన్నారు : "నా దగ్గఱికి వచ్చేవారంతా మోక్షం పొందుతారా అనుకుంటున్నావు కదూ నీ మనసులో ? ఆ మామిడిచెట్టు వైపు చూడు. అక్కడున్న పూత అంతా కాపైతే ఎంత మంచి పంట అవుతుంది ? కానీ అలా జఱగదు. పూతగానే చాలా మట్టుకు రాలిపోతుంది. కొన్ని పిందెలుగా రాలిపోతాయి. కొన్ని మాత్రమే పండ్లవుతాయి." అలాగే ఒకప్పుడు మనిషి చేసిన మంచి ఆలోచనల ఫలితంగా అతనికి మంచి రూపం లభిస్తుంది. కానీ తదనంతరం అలవాటు చేసుకొన్న, అతనికి అత్యంత ప్రియమైన దుష్టసంస్కారాలు సమాంతరంగా కొనసాగుతాయి.

మనం చేసే ప్రతి వక్రాలోచనా, పలికే ప్రతి వంకరమాటా, చేసే ప్రతివంకర చేష్టా ఆత్మతేజస్సుపై దుమ్ములా కప్పేసి దాని సౌందర్యాన్ని మఱుగుపఱుస్తుంది. ఇందుకు విపర్యస్తంగా సదుద్దేశంతో మనం చేసే ప్రతి సత్కర్మ మన ఆత్మని పరిశుభ్రం చేసే చీపురుగా ఉపయోగపడి దాని సత్యస్వరూపాన్ని వెలికి తీస్తుంది. ఆత్మే అసలైన దీపం. దేహాలు పైపై చిమ్నీలు మాత్రమే. ఆత్మ అంటే మఱింకేమీ కాదు. మనలోని సూక్ష్మ భగవంతుడే. శ్రీ రామకృష్ణపరమహంస కఠోర తపస్సాధనల్ని ఆచరించే రోజులలో ఆయన శరీరం బంగారంలా ధగధగ మెఱిసిపోతూండేదనీ దిష్టి తగుల్తుందేమోనన్న భయంతో శిష్యులు ఆయన మీద పట్టుపీతాంబరాలు కప్పేవారనీ చదివాం. కనుక సదాలోచనల ద్వారా ఆత్మతేజస్సును వృద్ధి పొందించుకుంటే శరీరతేజస్సు దానంతట అదే జాజ్వల్యమానంగా ప్రకాశిస్తుంది.

కామెంట్‌లు లేవు:

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి