24, ఆగస్టు 2011, బుధవారం

హిందూమత వివాదాల పరిష్కారానికి ధార్మిక న్యాయస్థానాలు ప్రత్యేకంగా కావాలి

తమ చిన్ననాడు తమ తల్లిదండ్రులో, ఇతర పెద్దలో జాతక రచన నిమిత్తం నమోదు చేసిన జననతేదీకి విలువ ఇవ్వాలని కోరుతూ గతంలో కొన్ని వ్యాజ్యాలు వివిధ భారతీయ న్యాయస్థానాల్లో నడిచాయి. మన సెక్యులర్ (read anti-Hindu or non-Hindu) న్యాయవ్యవస్థ మనం ఊహించినట్లే ఆ వాదనల్ని కొట్టేసింది. పైపెచ్చు "వట్టి జాతకానికి విలువ లేదనీ, దాన్తో పాటు ఇంకేదైనా సహాయసాక్ష్యంగా ఉంటేనే జాతకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు" ననీ తీర్పులు చెప్పాయి మన న్యాయస్థానాలు.

తాజాగా, ఇటీవల ఇలాంటి ఇంకో వ్యాజ్యంలోనే భారత సర్వోన్నత న్యాయస్థానం "జననతేదీకి జాతకం ఒక బలహీనమైన సాక్ష్యాధారం (weak piece of evidence)" అని వ్యాఖ్యానించి హిందువుల మనోభావాల్ని నిస్సంకోచంగా గాయపఱిచింది. ఈ వ్యాజ్యంలో మద్రాస్ హైకోర్టు మాజీ రిజిస్ట్రార్ జెనరల్ మాణిక్యం అనే ఆయన తన అసలైన జననతేదీ 1950 అనీ, కానీ సర్వీస్ రికార్డులలో 1947 గా నమోదు చేయడం మూలాన తాను మూడేళ్ళ ముందుగా పదవీ విరమణ చెయ్యాల్సి వచ్చిందనీ మొఱపెట్టుకున్నాడు. తన SSLC పత్రాల్ని చూపించినా ఈ అన్యాయం సరిదిద్దబడలేదు. అప్పుడాయన తన జన్మజాతకాన్ని న్యాయస్థానానికిసమర్పించాడు. ఈ తీర్పిచ్చినవాళ్ళు హిందూ న్యాయమూర్తులు జస్టిస్ ముకుందకమ్ శర్మ మఱియు అనిల్ ఆర్. దవే.

హిందూ మతగురువులు తయారుచేసే జాతకాల్ని ఇలా కించపఱుస్తున్నవారు ముస్లిమ్ మతపెద్దలు వివాహసమయంలో జారీ చేస్తున్న నిఖానామాలను సాక్ష్యాధారంగా అంగీకరిస్తున్నారని గమనించాలి. అదే, హిందువుల దగ్గఱికొచ్చేసరికి "ఆ పెళ్ళి ప్రభుత్వ కచేరీలో నమోదైందా ? లేదా ?" అని ప్రశ్నిస్తున్నారు. ఇలా అడుగడుగడునా మన ఆచారాలకీ, విశ్వసనీయతకీ ఆధికారికంగా దెబ్బకొడుతున్నారు. హిందువుల పేరు చెప్పగానే ఎక్కడ లేని సెక్యులరిజమూ గుర్తొచ్చేస్తుంది మన న్యాయస్థానాలకి !ఈ రకంగా ఏ ఇతర మతస్థుడికీ అవసరం లేని సెక్యులరిజాన్ని మనమీద బలవంతంగా రుద్దుతున్నారు. మన మతవిశ్వాసాల్లో తమ సెక్యులర్ విశ్వాసాల్ని చొప్పించి మన ఆచారాల్ని కలుషితం చేస్తున్నారు. ఉదాహరణకి - మదురైలో ఒక పూజారి చనిపోగా అతని కూతురు పూజారి అవ్వొచ్చునని కోర్టు తీర్పిచ్చింది. కానీ హిందూమతంలో స్త్రీలకు అర్చకత్వం ఎప్పుడూ లేదు.

ఇక్కడ మన శాస్త్రం చెప్పినట్లు హిందువులు వినాలా ? లేక సెక్యులరిస్టులు చెప్పినట్లు దేవాలయాలు నడవాలా ? అనేది ప్రశ్న. లౌకిక విషయాల్లో మతోపదేశాల్ని అంగీకరించని సెక్యులరిస్టు న్యాయస్థానాలు మతవిషయాల్లో మాత్రం తామెందుకు వేలుపెడుతున్నాయి ? అనేది అసలు ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో మన మత వివాదాల పరిష్కారం నిమిత్తం ప్రత్యేకంగా హిందూ ధార్మిక న్యాయస్థానాలూ, వాటికి అధ్యక్షత వహించడానికి మతధర్మశాస్త్రాలలో పాండిత్యం గల ప్రత్యేక ఆస్తిక న్యాయమూర్తులూ అవసరం కాదా ? పిడుక్కీ,బియ్యానికీ ఒకటే మంత్రం లాగా ఎంతకాలం ఇలా మనం (హిందువులం) దేవుణ్ణీ, హిందూమతాన్నీ నమ్మని లౌకిక న్యాయస్థానాల తీర్పులకు బలైపోవాలి ? ఆలోచించండి.

ఏ ఇతర విధాలైన సాక్ష్యాల కంటేనూ జాతకానికే జననతేదీ విషయంలో ప్రామాణికత హెచ్చు అని నా అభిప్రాయం. ఎందుకంటే దాన్ని రచించేవాళ్ళ దృష్టిలో అది ఆ వ్యక్తి జీవితాన్ని శాసించే పత్రం. కనుక వారు దాన్ని రచించేటప్పుడు పొఱపాట్లు దొర్లకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు. అయితే ఆ జాతకం ఆ వ్యక్తి పుట్టినప్పుడే వేయబడిందనే పురావస్తు ఆధారం (archaelogical_evidence) లభ్యమవుతున్నప్పుడు దాన్ని ప్రమాణంగా స్వీకరించడానికి ఎవఱికీ అభ్యంతరం ఉండనవసరం లేదు.

2 కామెంట్‌లు:

ANALYSIS//అనాలిసిస్ చెప్పారు...

అందుకే Common civil code(ఉమ్మడి పౌర స్మృతి) కావాలని అంటున్నది. అప్పుడు అన్ని మతాలకి ఒకే చట్టం వర్తిస్తుంది . ప్రస్తుతం ముస్లింలు వారి చట్టాలైన Muslim personnel Law ప్రకారం విచారించబడుతున్నారు. Common civil code వస్తే అందర్నీ ఒకే గాటన కట్టడం వీలౌతుంది

ధర్మస్థలమ్ చెప్పారు...

ఇలాంటివి చెప్పడానికీ, వినడానికీ చాలా బావుంటాయి సార్ ! ఆచరణలో సాధ్యమైతే ఎప్పుడో అమలు జఱపగలిగేవారేగా ?

ఒకే మతానికి చెందని కోట్లాదిమందికి ఉమ్మడి పౌరస్మృతి ఎలా సాధ్యం ? పదుల కోట్లలో ఉన్న హైందవేతరులకి మన ఆచరణల్ని అనువర్తించడం ఎలా సంభవం ? ఒక మతస్థుల పౌరస్మృతి వారి ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఉంటుంది. కనీసం వారి తరతరాల సంప్రదాయం మీద ఆధారపడి ఉంటుంది. మేనచెల్లెల్ని చేసుకునే ముస్లిములకీ్, మేనమఱదల్ని చేసుకునే హిందువులకీ ఉమ్మడి పౌరస్మృతి ఎలా సాధ్యం ? విడాకులు అనే పరిభావననే అంగీకరించని హిందువులకీ, దాన్ని అంగీకరించే క్రైస్తవులకీ ఎక్కడ సాపత్యం ?

ఆ ప్రయోగాలన్నీ మనకొద్దు. మన మతానికంటూ ప్రత్యేక న్యాయస్థానాలు కావాలి. ఇదే మన డిమాండు. మతవిషయాల్లో దేవుణ్ణి నమ్మని సెక్యులర్ న్యాయస్థానాల అధికారాన్ని మనం ధిక్కరించబోతున్నాం, అంతే !

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి