10, సెప్టెంబర్ 2011, శనివారం

ఆయుర్వేదాన్ని శాస్త్రీయ పునాదులపై పునర్ నిర్మించడం-2 (సమాప్తం)

ఆయుర్వేదాన్ని ఒక వైజ్ఞానిక శాస్త్రంగా అభివృద్ధి చేయాలంటే-

౧. దాని మీద పడ్డ మతముద్ర తొలగాలి. ఆయుర్వేదంలో కొన్ని మందులకి నారాయణతైలం, నరసింహచూర్ణం మొదలైన పేర్లు ఉండడాన్ని గమనించవచ్చు. ఈ పేర్లు వాటిని తయారుచేసినవాళ్ళ భక్తిప్రపత్తుల్ని సూచిస్తాయే తప్ప శాస్త్రీయ దృక్పథాన్ని ఆవిష్కరించవు. ఇలాంటి పేర్లు పెట్టకూడదు. ఆయా మందులు ఏ పదార్థాలతో తయారయ్యాయో వాటి పేరు మీదుగా పెట్టాలి. లేదా ఏ నలతలకి వాటిని అభిసూచిస్తున్నారో వాటి పేర్ల ననుసరించి పెట్టాలి.

ఔషధాలకి ఇలా మతనామాలు రావడానికి ఒక కారణం - పూర్వం వైద్యులంతా బ్రాహ్మణులే, అందులోనూ శ్రీవైష్ణవులే కావడం. వారు ఈ కాలపు డాక్టర్లలా వైద్యానికి పరిమితమైన స్పెషలిస్టులు కారు. పౌరోహిత్యం, జోతిష్యం, వైద్యం లాంటి రెండుమూడు వృత్తులు ఏకకాలంలో చేసేవారు. అందువల్ల పాతపుస్తకాల ద్వారా తాము నేర్చుకున్నదాన్ని ప్రాక్టీస్ చేయడానికే తప్ప నవీన పరిశోధనలకి ప్రాధాన్యమిచ్చేవారు కారు. నేను విన్నదేమిటంటే - ఆ రోజుల్లో ఎక్కువమంది వైద్యవిద్యా జాఱుకోలరులు (drop-outs in medical education) అని ! వారు ఆయుర్వేద గురువు దగ్గఱ విద్యాభ్యాసానికి చేఱిన ఒకటి-రెండేళ్ళకే "చదివింది చాల్లే, జనానికి ఏదో ఒక మందిచ్చి బతకడానికి ఈమాత్రం పరిజ్ఞానం సరిపోతుంది" అనుకొని లేచి ఇంటికొచ్చేసేవాళ్ళు. కానీ దేశంలోకి ఇంగ్లీషువైద్యం అడుగుపెట్టాక ఇలాంటివాళ్ళ చికిత్సల మీద జనానికి క్రమంగా విశ్వాసం నశించసాగింది. "ఇంగ్లీషుడాక్టర్ ముందు ఆచారిగారు బలాదూర్" అనే మాట వచ్చింది. అలా ఈ అఱకొఱ శిక్షితులు ఆయుర్వేదానికి కొఱివిపెట్టేశారు.

౨. అధునాతన పరిశోధనల వెలుగులో ప్రతిరోగాన్నీ పునర్ నిర్వచించాలి, పునర్ వర్ణించాలి.

౩. వస్తుగుణదీపిక (Ayurvedic Pharmacopeia) ని మఱింత విస్తరించి వ్రాయాలి. కేవలం వనౌషధుల చికిత్సకలక్షణాలనే కాకుండా, ఆ ఔషధులలో ఏయే పదార్థాలు ఏయే అవయవాల మీద ఎలా పనిచేస్తాయో వివరించడం అవసరం. లేకపోతే వాటిని అంతర్జాతీయంగా సమర్థించుకోవడం కష్టమవుతుంది. ఈ రకంగా నిషేధాలకి గుఱికావాల్సి వస్తుంది. మన దేశస్థులకి సొంతబుఱ్ఱ శూన్యమనీ, తెల్లతోలువాళ్ళు ఏదంటే దానికల్లా తానతందానా పాడతారనీ మనకి తెలుసు గనుక, వాళ్ళని అనుసరించి ఇక్కడ కూడా ఆయుర్వేదాన్నినిషేధించాలని డిమాండ్లు బయలుదేఱితే ఆశ్చర్యం లేదు.

౪. విస్తృతమైన ప్రజామద్దతు సంపాదిస్తే తప్ప - ఆయుర్వేదం యొక్క శాస్త్రీయకరణకి అవసరమైన మానవవనరుల్నీ, ఆర్థిక వనరుల్నీ సమకూర్చుకోలేం. అలాంటి మద్దతు కావాలంటే ఆయుర్వేద వైద్యానికి కొన్ని బాహ్యాలంకారాలు కూడా అవసరం. అవి జనాన్ని ఇన్‌స్పైర్ చేసేలా ఉండాలి.

ముఖ్యంగా ఆయుర్వేద వైద్యులు దేశకాలానుగుణంగా తమ వేషభాషల్ని సమూలంగా మార్చుకోవాల్సి ఉంది. ఆయుర్వేదమంటే జనానికి పెద్దగా కళ్ళకి ఆనకపోవడానికీ, తేలిగ్గా చప్పరించేయడానికీ సగం కారణం ఈ నిరాడంబర వేషభాషలే. వీటి మూలాన యువ ఆయుర్వేద వైద్యులకి పెళ్ళికావడం కూడా కష్టమంటే అతిశయోక్తి లేదు. తమదగ్గఱికొచ్చే రోగులకి ఆయుర్వేద పరిభావనల్నీ, రోగలక్షణాల్నీ తెలుగు- సంస్కృత పదాల్లోనే కాక ఇంగ్లీషువాక్యాల్లో కూడా వివరించడం నేర్చుకోవాలి. అలాగే, ఎల్లప్పుడూ మెడలో ఒక స్టెతస్కోపుతో కనిపించాలి. ఒక కారునీ, డ్రైవర్ నీ కూడా మెయిన్‌టెయిన్ చేయాలి. అప్పుడు ఎక్కువమంది నమ్ముతారు. తప్పదు. నువ్వు మంచివాడివైతే సరిపోదు. మంచివాడిలా కనిపించాలి కూడా ! ఇంకొకటి - ఆయుర్వేద వైద్యశాలల్నీ, క్లినిక్కుల్నీ కూడా పాశ్చాత్య పద్ధతిలో తీర్చిదిద్దాలి. ఎందుకంటే ఈ రంగంలో ఈ కాలానికి దేశీయ అలంకరణ బొత్తిగా పనికిరాదు.

కామెంట్‌లు లేవు:

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి