సాధారణంగా భగవంతుడికి ఎవరి మీదా ఆగ్రహం కలగదు. ఆయన ఒక తెలివైన కర్మయంత్రాన్ని నిర్మించి ఉన్నాడు. ఆ కర్మయంత్రమే తానై ఉన్నాడు. కనుక మనుషుల దోషాలకి వారిని వాటినుంచి పరిశుద్ధుల్ని చేసే పనిని ఆ యంత్రమే తెలివిగా చేసుకుంటూ పోతుంది. దాని పనిలో ఆయన జోక్యం చేసుకోవడం అరుదు. అయితే తత్కారణం చేత ఆయనకి కామక్రోధాలు లేవని తలచడం సరికాదు. కోపించక పోవడం వేఱు. కోపమే లేకపోవడం వేఱు. సృష్టిఉన్నంతకాలం ఆయన సగుణ పరబ్రహ్మగానే ఉంటాడు. కనుక ఆ స్థితిలో ఆయనకి మాయామయమైన మనస్సు ఉంటుంది. అది ఉంటుంది కనుక కామక్రోధాలూ ఉంటాయి. కల్పాంతంలో సృష్టి అంతమయ్యాక ఆయన నిర్గుణ పరబ్రహ్మగా ఉంటాడు. అప్పుడాయనకి కామక్రోధాలు ఉండవు. మఱి సృష్టి ఉన్నప్పుడు ఆయన ఎందుకలా ? అనడిగితే, సృష్టి నడవాలంటే కామక్రోధాలుండాలి. నీ తండ్రిలో లేనిదేదీ నీలో లేదు. నీ తండ్రికి కామక్రోధాలుంటేనే నీకూ కామక్రోధాలుంటాయి. ఈ సత్యానికి హిందూమతమే కాక అన్ని మతాలూ సాక్ష్యం పలుకుతున్నాయి. "యెహోవా అను పేరుగల నేను మిక్కిలి రోషము గల దేవుడను" అని ఆయన అన్నట్లు యూదుల మతగ్రంథం పేర్కొంటోంది. ఇస్లామ్ కూడా దైవాగ్రహం (wrath of God) గుఱించి ప్రస్తావిస్తుంది. శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో భగవంతుడిలా చెప్పారు : "అవధూతది సంకల్పరహితమైన జ్ఞానం. నాది సంకల్పసహితమైన జ్ఞానం. నేను తల్చుకుంటే మోక్షం పొంది నాలో లీనమైనవాణ్ణైనా సరే, భూలోకంలో జన్మించమని ఆదేశించగలను."
దేవుడు మనలాంటివాడు కాదు గనుక ఆయనకి కామం లేదనీ, క్రోధం లేదనీ ఆయనెప్పుడూ చిఱునవ్వులు చిందిస్తూనే ఉంటాడనీ, మనమెన్ని వెధవపనులు చేసినా, ఎన్నిసార్లు చేసినా క్షమిస్తూ పోవడమే తప్ప ఆయనకి వేఱే పని లేదనీ - ఈ రకమైన అడ్డదిడ్డమైన, అవాస్తవిక పచ్చి అబద్ధాలు, దగాకోరు సిద్ధాంతాలు - కేవలం తమ మతప్రచారం, మతమార్పిళ్ళ కోసం కొందఱు కనిపెట్టినవి. ప్రపంచంలో పాపాత్ములెక్కువ కనుక వాళ్ళకి ఈ సిద్ధాంతాలు బాగా నచ్చుతాయని వాళ్ళకి తెలుసు. ఇవి తమ పాపాల్ని తామే క్షమించేసుకునే హక్కుని మానవులకి కట్టబెట్టాయి. వీటి ప్రచార ప్రభావానికి హిందువులు కూడా లోనై తమ మతగ్రంథాలు భగవంతుడి సంపూర్ణ మూర్తిమత్త్వాన్ని గుఱించి చేసిన వర్ణనల్ని మర్చిపోతున్నారు. మర్చిపోయారు. శివుడు సంభోగించడమేమిటంటున్నారు. కృష్ణుడు దేవుడైతే ఆయనకి గోపికలతో రాసలీలలేంటంటున్నారు. ఇదంతా విదేశీ మతసిద్ధాంతాల ప్రభావం.
భగవంతుడిలో దివ్యాంశలూ ఉన్నాయి. రాక్షసాంశలూ ఉన్నాయి. మంచీ ఆయనదే, చెడూ ఆయనదే. అయితే పామువిషం పాముకి బాధాకరం కానట్లే భగవంతుడి మాయాశక్తికి సంబంధించిన ఈ అంశల వల్ల ఆయనకి మాత్రం ఏ నష్టమూ లేదు. కానీ ఇవి మనలాంటి జీవుల అదుపాజ్ఞల్లో ఉన్న అంశలు కావు కనుక, ప్రస్తుతం మనమే వాటి అదుపాజ్ఞల్లో ఉన్నాం కనుక వీటి నాశ్రయించడం వల్ల మనకి నష్టం ఉంది - ఇదే హిందూమత సారాంశం. ఇందాక అనుకున్నట్లు భగవంతుడికి నిజంగా నిజమైన కోపం వచ్చేసందర్భాలు మహా అరుదు, అపురూపం. కారణం - సాధారణంగా మనం మనలాంటివాళ్ళ మీదా మన స్థాయిలో ఉన్నవాళ్ళ మీదా మాత్రమే కోపిస్తాం (కోపించగలం) తప్ప తద్భిన్నులైనవారియందు కోపించడం జఱగదు. పెళ్ళాం మీద కోపమొస్తుంది గానీ బాస్ మీద రాదు. మనమేంటో మన స్థాయి ఏంటో, మన పూర్వజన్మకర్మ ఏంటో, భవిష్యద్‍గతి ఏంటో అంతా ఆయనకి కూలంకషంగా తెలుసు కనుక ఆయనకి కోపం రాదు. ఒకవేళ వచ్చినా అది వాచా వ్యక్తీకరించబడక సంఘటనల రూపంలో వెల్లడవుతుందంతే ! దేవుడు కనిపించి కోపంగా మాట్లాడాడంటే మాత్రం ఆ వ్యక్తిమీద ఆయనకి విశేషమైన అనుగ్రహం ఉందనీ, అతన్ని మరమ్మత్తు చేసి అతని ద్వారా ఏదో లోకకల్యాణాన్ని సాధించదల్చుకున్నాడనీ అర్థం.
భగవంతుడికి తనమీద కోపం వచ్చిందని భావించిన భక్తుడు భగవంతుని అప్రమాద్యత (infallibility) పట్లా, న్యాయబుద్ధి (sense of justice) పట్లా అచంచల విశ్వాసాన్ని ఉంచాలి. కోపంలో సైతం ఆయన న్యాయంగానే వ్యవహరిస్తాడనీ, జీవుల్ని దయగానే చూస్తాడనీ నమ్మాలి. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి, "హే భగవాన్ ! నేను అల్పుణ్ణి. నీవు మహోన్నతుడివి. నువ్వు జ్ఞానసముద్రానివి. నేను మూఢుణ్ణి. నేను జీవుణ్ణి,. నువ్వు పరమాత్ముడివి. తప్పులు చేయడమే నాకు సహజం. నా తప్పుల పట్ల కోపించడం నీకు సహజం. నీ మందలింపులకీ, దండనకీ నేనెల్లప్పుడూ పాత్రుణ్ణే. నా బుద్ధిహీనత వల్లా, పూర్వ దుస్సంస్కారాల ప్రాబల్యం వల్లా నేను పొఱపాటు చేశాను. ఇంకెప్పుడూ ఇలా చేయను. నీ ఆదేశానుసారమే చరించి నీకు ప్రియతముణ్ణి కావడానికే ప్రయత్నిస్తాను. నన్ను క్షమించు. నేను నీ బిడ్డని. నీ దాసానుదాసుణ్ణి" అని సర్వస్యశరణాగతి చేసి స్తోత్రం చేయాలి. అప్పుడాయన సంతోషించి ప్రసన్నుడై సరైన దారి చూపుతాడు.
14, అక్టోబర్ 2011, శుక్రవారం
భగవంతుడు మన మీద ఆగ్రహిస్తే ఏంచేయాలి ?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 కామెంట్‌లు:
చాలా బాగుంది. ఎంతో పుణ్యము చేసుకుంటే తప్ప భగవంతుని కోపానికి గురికాము. కోపగించాడంటే ఉద్దరింపబడినట్టే. శిశుపాలుడు, కంసుడు మొదలగువారు అలానే ఉద్దరింపబడినారు. భగవానునికి కోపము వచ్చినది అని తెలుసుకొని భీష్ముడు తనను చంపమని తలవంచాడు.
మనకి మన కర్మ చాలు. కర్మ ఫలితంగా ఏర్పడే అనుకూల ప్రతికూలతలను మనము దైవానుగ్రహముగాను, దైవాగ్రహముగాను అనుకుంటాము. అంటా ఆయన అనుగ్రహమే అని భావించాలి..
మీ శ్రమని (విలువైన విషయాలని ఒక చోట పొందుపరుస్తునందుకు ) చాలా అభినందిస్తున్నాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి