30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

ఇతరమతాల నుంచి, మతస్థుల నుంచి హిందువులం ఏమేం నేర్చుకోవచ్చు ?

ఒక సభ్యుడు చేసిన వినతి

ఆర్యులారా !

హిందువులమైన మనం మన ధర్మాన్ని మన వఱకూ ఆచరించడంతో సంతృప్తి చెందుతూంటాం.అందువల్ల ఇతరులకి (కనీసం మన ధర్మంలోనే కొనసాగుతూ ఉన్న నిమ్నజాతులవారికి) ఈ ధర్మనిగూఢాల్ని బోధపఱిచే ప్రయత్నం మనమెప్పుడూ చేయలేదు. నిజానికి ఈధర్మం పురోహితుల చేతుల్లో బందీగా మారింది. ఇలాంటి సామాజిక, మానసిక కారణాల్ని పురస్కరించుకొని ఈ ధర్మం గతకొన్ని దశాబ్దాలుగా దెబ్బదినిపోతోంది. మన ఇంట్లో సాక్షాత్తూ అమృతమే ఉన్నప్పటికీ దాన్తో మనం నిమ్నజాతీయుల హృదయ, ఆత్మిక ఆకలిని మనం తీర్చలేకపోవడంతో వారు బయటికెళ్ళి పరధర్మపు చలివేంద్రాల్లో మంచినీళ్ళు తాగుతున్నారు. తాగి అది అమృతంలా ఉందని చెబుతున్నారు.

మనం పరధర్మీయుల చేతుల్లో ఎక్కడ వ్యూహాత్మక ఓటమిని పొందుతున్నాం ? హైందవం ఇవ్వజూపని ఏ వెసులుబాట్లని, feel good factors ని పరధర్మం ఇవ్వజూపగలుగుతోంది ? ధన/ ద్రవ్య ప్రలోభాలు కూడా ఉన్నాయని మనకి ఇదివఱకే తెలుసు. అవి కాకుండా ఇంకా ఏయే అంశాలున్నాయి ? వారి నుంచి మనం ఏమేం నేర్చుకొని వారిలాగే మన మతాన్ని కూడా అంతర్జాతీయ మతంగా మార్చగలుగుతాం ? ఎప్పటిలా పరమతాల్ని ద్వేషభావనతో చూడకుండా, కాస్త తెఱుపుడు మనస్సు (open mind) తో మన మతస్వార్థం కోసమే, వారిలోని మంచిని కాసేపు పరిశీలించి వెలికి తీద్దాం. కాసేపు పక్కా వాస్తవవాదులం అవుదాం. ఆత్మకరుణ (self-pity) లేని కఠిన కర్కశ తార్కికులమవుదాం. ఆత్మవిమర్శకులమవుదాం. ఈ మార్గంలో మీ మీ చింతనాధారని ఇక్కడ పంచుకోగలరని ప్రార్థన.

అందుకు ఇతర సభ్యుల సమాధానాలు :

ఒక సభ్యుడు : 1. క్రైస్తవం లేదా ఇస్లాం నుంచీ మనం నేర్చుకోవాల్సింది సామూహిక చింతన.కిరస్తానీలు, ముస్లింలు ప్రతీ వారం చర్చిలకు మసీదులకు గుంపులుగా వెళతారు.. మనలోఎంతమంది గుడికి వెళ్ళేటప్పుడు కనీసం మన ఇంట్లో వాళ్ళను తీసుకుని వెళతాం ?? అలా గుంపుగా వెళ్ళడం వల్ల వాళ్ళ మధ్య ఒక బలమైన బంధం ఏర్పడుతుంది.. ప్రతీ ఒక్కరికీ తమకంటూ ఎవరో ఉన్నారు అనే భావన, ఆ ఉన్న వాళ్ళు కేవలం తమ మతం వల్ల మాత్రమే ఉన్నారు అనిపిస్తుంది.. సంఘజీవి అయిన మనిషికి ఇది సహజంగానే మానసికధైర్యాన్ని ఇస్తుంది.

2. వాళ్ళనుంచీ నేర్చుకోవాల్సింది వాళ్ళ మతం పట్ల వాళ్ళకున్న అంకిత భావం.. ఒక ముస్లిం కు ఎన్ని పనులున్నా వాడు నమాజ్ చేయకుండా బయటికి కదలడు.. మనం మాత్రం ఏదైనా పని తగిలితే మొదట మానేసేది మన పూజా కార్యక్రమాలనే.. వాళ్ళు ఎప్పుడూ నమాజ్ చేయడం గురించి లేదా చర్చికి వెళ్ళడం గురించి సిగ్గు పడరు.. మనకేమో గుడికివెల్తున్నామంటే, ధ్యానం చేస్తున్నామంటే అదొక నామోషీగా భావిస్తాం.

3. ముస్లింలు, కిరస్తానీలు సొంతంగా వ్యాపారాలు ఎక్కువగా చేస్తున్నారు. మనవాళ్ళు ఉద్యోగాలు చెయ్యడానికి ఆసక్తి చూపుతున్నారు.. ఎంత చిన్నదైనా సరే సొంతంగా చేసే వ్యాపారం సమాజం లో ఎంతో కొంత పరపతిని పెంచుతుంది.. ఎందుకంటేవ్యాపారం చేస్తున్న వాడి దగ్గరికి ఒక రాజకీయ నాయకుడు వచ్చి పార్టీ చందా అడుగుతాడు, లేబర్ యూనియన్ల వాళ్ళు వచ్చి చందాలడుగుతారు.. మనం కూడా entrepreneurs గా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఉదా:- కర్నూల్ పుల్లా రెడ్డి గారు పక్కా హిందుత్వవాది కానీ ఆయన్ను విమర్శించే ధైర్యం ఎవరికీ లేకపోయింది.. ఎందుకంటే సమాజం లో ఆయన విలువ అలాంటిది.. అదే ఇంకెవరైనా అయ్యుంటే మన కమ్యూనిష్టులు, సెక్యులరిస్టులు, మట్టిస్టులు, మశానిస్టులు ఎప్పుడు ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారు.

మఱో సభ్యుడు : నాకున్న కొద్దిపాటి అనుభవంతో నా అభిప్రాయాలు కొన్ని పంచుకుంటాను.

1. క్రైస్తవం లేదా ఇస్లాం నుంచీ మనం నేర్చుకోవాల్సింది సామూహిక చింతన.

నాకు ఇది సెకండరీ అని అనిపిస్తుంది. వాళ్ళు మతం మారడానికి ముఖ్యకారణం డబ్బే. వాళ్ళు ఒక సారి మారిన తర్వాత ప్రతి ఆదివారం ప్రార్థనామందిరానికి రావాలనీ, వాళ్ళ సామూహిక ప్రార్ధనలలో పాల్గోవాలనీ వారిని బలవంత పెడుతుంటారు. పేదరికం కారణంగా ముందు మతం మారినా, తర్వాత ఇష్టం లేకున్నా వారు తప్పనిసరిగా ఆ మత నియమాలను పాటించాల్సిందే. అలాగే ఎవరైనా కొత్తవారిని వారి మతంలోకి తీసుకువస్తే అలా తీసుకు వచ్చిన వారికి కొంత డబ్బు ఇస్తారు.

వినాయక చవితి నాడు మాత్రం మన వాళ్ళు పూజ అయ్యాక సినిమా పాటలు పెడతారు. అక్కడికి వెళ్ళి చూస్తే చిన్న పిల్లలు కేరమ్స్ ఆడుకుంటూ కనిపించారు. పెద్దవాళ్ళంతా ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోయారు. చిన్న పిల్లలు వాళ్ళకి నచ్చిన పాటలు వాళ్ళు పెట్టుకున్నారు. ఈ పరిస్థితి మారాలి. మనమంతా తప్పని సరిగా దేవతా స్త్రొత్రాలనో, ఆధ్యాత్మిక ప్రసంగాలనో, పూజ్యుల ప్రవచనాలనో ఇలాంటి సంధర్భాలలో పెట్టేటట్లుగా చూడాలి. వీలైతే మనమే ప్రతిరోజు కొంత సమయం కేటాయించి మన ఇరుగుపొరుగులో ఉన్న చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకు, మన మత గొప్పతనాన్ని వివరించాలి మన ఆచార వ్యవహారాల ప్రాముఖ్యత అందరికీ తెలియజెప్పాలి. వారితో కలిసి కనీసం వారానికి ఒక సారైనా ఇంట్లో కూర్చొని పూజ చేయడం గానీ, దేవాలయానికి వెళ్ళడం కానీ చేయాలి చేయాలి.

వినతి చేసిన సభ్యుడు : నా దృష్టికొచ్చిన ఒకటి-రెండు అంశాలు వ్రాస్తాను.

౧. వారి మతబోధ క్లిష్టమైన వేదాంత సమస్యల చుట్టూ, లోతైన అంతరార్థాల చుట్టూ కాకుండా నిత్యజీవితానికి పనికొచ్చే బైబిలుబోధల చుట్టూ పరిభ్రమిస్తుంది. మనదేమో పక్కా intellectual religion అయికూర్చుంది. ఆ వ్యాఖ్యానాలూ, వివరణలూ కొద్దిమంది వయసుమళ్ళిన ఛాందస మేధావులకి ఆత్మానంద దాయకం. కానీ వినలేకా, అర్థం చేసుకోలేకా మిహతా సామాన్యజనం విసిగున్నారు.

౨. వారి మతబోధలో పరమత దూషణ, పరధర్మీయుల్ని పరాభవించడం, అపహాస్యం చేయడం, హీనంగా మాట్లాడడం కూడా ఉంటాయి. ఈ పనులు మన మతబోధకులు కలలో కూడా చేయరు.

౩. వారి మతగ్రంథాలూ, పాటలూ, స్తోత్రాలూ, మంత్రాలూ (అవి మంత్రాలని మనం అనుకుంటే) జనసామాన్య భాషలోనే ఉంటాయి. అందఱికీ అర్థమయ్యేలా ఉంటుంది యావత్తు మతనిర్వహణ. మనదంతా నిగూఢం. అయోమయం, రహస్యం. ఎంత అర్థం కాకపోతే అంత గొప్ప. చివఱికి ఈ అర్థం కానితనమే మనలో ఒక సంస్కృతిగా పరిణమించింది.

౪. వారిలో - ప్రార్థనామందిరాలకొచ్చే భక్తుల ఆర్థిక సమస్యల్ని కూడా మతగురువులు పట్టించుకుంటారు. ఉదాహరణకి - పేద భక్తుల కోసం హోల్‌సేల్ వ్యాపారులతో ఒక ఒప్పందానికొచ్చి తక్కువధరలకి కిరాణా సరుకుల వేలాన్ని ప్రార్థనామందిరంలోనే నెలకోసారి నిర్వహిస్తారు. మన విషయానికొస్తే, భక్తుల దగ్గఱ ఎంత గుంజుకుందామా ? అనేదే మన కాన్సంట్రేషను.ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. గుర్తుకొచ్చినప్పుడు వ్రాస్తాను.

మొత్తమ్మీద మన మతాన్ని ఒక అంతర్జాతీయ మతంగా, దేశదేశాల ఫెయిత్‌‍గా ఎలా రూపుదిద్దాలా ? అనేదే నా అంతర్మథనం. అలా చేయాలంటే మనం కొన్ని ఛాందసాల్ని వదిలిపెట్టాలనుకుంటాను. ఈ మతాన్ని ఈ దేశంలో పాటిస్తున్నట్లే యథాతథంగా అన్ని ఇతరదేశాల్లోనూ పాటించడం కుదరకపోవచ్చు. కనుక దీన్ని సాధ్యమైనంత అసంస్కృతీకరించి, సరళీకరించి ప్రచారం చేయాల్సి ఉంది. వాళ్ళ అవగాహన కోసం మన వివరణా, వ్యాఖ్యాన పద్ధతుల్ని కాస్త మార్చాలి. పురాణమతాన్ని చాలావఱకు గోప్యం చేయాలి.

వేఱొక సభ్యుడు :-

౧. మత ప్రచారానికి కావాల్సిన మానవ వనరులు సంపాదించుట.ఇది వారు చేసే మొదటి పని. అందుకే పేదలు, అనాథలు అంటూ కొన్ని తరాల పాటు మతానికి కావాల్సిన మానవ వనరులను సంపాదిస్తారు. తరువాత ముసుగులన్నీ తొలగించి పూర్తి మతాంతరీకరణ వైపు జరుపుతారు. ఇలా చేయటం కోసం అప్పటికే ఉన్న మానవీయ కేంద్రాలను నాశనం చేయటం, నేరుగానో, తిరగగానో. అందుచేత ఆర్థికంగా బలంగా ఉండటం. ఇది అన్నింటికంటే ముఖ్యమైనది.

౨. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం వాడకపోవటం. ఉదాహరణకు జర్మనులు ఒక రకంగా మతాంతరీకరించబడ్డారు, రోమన్లు ఒక రకంగా, ఆఫ్రికన్లు ఒక రకంగా, రెడ్ ఇండియన్లు ఒక రకంగా, దక్షిణ అమెరికన్లు ఒక రకంగా, గోవా వారు ఒక రకంగా, కేరళ వారు ఒక రకంగా.

౩. ప్రణాళికాబద్దంగా పోవటం.

౪. ఓపిగ్గా దశాబ్దాలు, శతాబ్దాలు ప్రయత్నించటం.

౫. కేంద్రీకరించబడ్డ వ్యవస్థ ఉండటం.

ఇంకో సందర్భంలో ఇంకో సభ్యుడు చెప్పినది :


బాగా చెప్పారు. అసలుకీలకం ఆ చివఱి పాయింటులోనే ఉంది.


హైందవేతర ప్రార్థనాస్థలాల్లో రాజకీయాలూ, సామాజికాలూ మాట్లాడ్డం నిషిద్ధం కాదు. అసలుదేవుణ్ణొదిలేసి అవే ఎక్కువగా చర్చిస్తూంటారక్కడ. కానీ హిందూ దేవాలయాల్లో అవి మాట్లాడ్డం నిషిద్ధంగా భావిస్తారు. మనం అవి మాట్లాడబోతే అవన్నీ ఇక్కడొద్దని తోటిహిందువులే మనల్ని వారిస్తారు. నిరుత్సాహపఱుస్తారు. క్రైస్తవంలా, ఇస్లాములా హిందూమతం మతస్థుల సమైక్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్న political, strategic creed కాదు. ఇది వ్యక్తియొక్క వైయక్తిక ఆధ్యాత్మిక సాధన, మోక్షం గుఱించి ఎక్కువ emphasis (వక్కాణింపు) చేసే మతం. అందువల్ల హిందువులు గుమిగూడే చోట్ల కూడా తమ సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల గుఱించి వారిని చైతన్యపఱచడం ఇసుమంతైనా సాధ్యం కావట్లేదు. కనీసం Endowments శాఖ కింద లేనటువంటి ప్రైవేటుగుళ్ళల్లోనైనా మన వాళ్ళకి సమావేశాలూ అవీ ఏర్పాటూ చేసి చైతన్యపఱచడం అవసరం. దీన్తోపాటు హిందూనాయకులు చేసిన ప్రసంగాల సీడీలు అక్కడ అందుబాటులో ఉంచి వాటిని తఱచుగా అందఱికీ వినపడేలా మోగిస్తూ ఉండాలి.

10, సెప్టెంబర్ 2011, శనివారం

ఆయుర్వేదాన్ని శాస్త్రీయ పునాదులపై పునర్ నిర్మించడం-2 (సమాప్తం)

ఆయుర్వేదాన్ని ఒక వైజ్ఞానిక శాస్త్రంగా అభివృద్ధి చేయాలంటే-

౧. దాని మీద పడ్డ మతముద్ర తొలగాలి. ఆయుర్వేదంలో కొన్ని మందులకి నారాయణతైలం, నరసింహచూర్ణం మొదలైన పేర్లు ఉండడాన్ని గమనించవచ్చు. ఈ పేర్లు వాటిని తయారుచేసినవాళ్ళ భక్తిప్రపత్తుల్ని సూచిస్తాయే తప్ప శాస్త్రీయ దృక్పథాన్ని ఆవిష్కరించవు. ఇలాంటి పేర్లు పెట్టకూడదు. ఆయా మందులు ఏ పదార్థాలతో తయారయ్యాయో వాటి పేరు మీదుగా పెట్టాలి. లేదా ఏ నలతలకి వాటిని అభిసూచిస్తున్నారో వాటి పేర్ల ననుసరించి పెట్టాలి.

ఔషధాలకి ఇలా మతనామాలు రావడానికి ఒక కారణం - పూర్వం వైద్యులంతా బ్రాహ్మణులే, అందులోనూ శ్రీవైష్ణవులే కావడం. వారు ఈ కాలపు డాక్టర్లలా వైద్యానికి పరిమితమైన స్పెషలిస్టులు కారు. పౌరోహిత్యం, జోతిష్యం, వైద్యం లాంటి రెండుమూడు వృత్తులు ఏకకాలంలో చేసేవారు. అందువల్ల పాతపుస్తకాల ద్వారా తాము నేర్చుకున్నదాన్ని ప్రాక్టీస్ చేయడానికే తప్ప నవీన పరిశోధనలకి ప్రాధాన్యమిచ్చేవారు కారు. నేను విన్నదేమిటంటే - ఆ రోజుల్లో ఎక్కువమంది వైద్యవిద్యా జాఱుకోలరులు (drop-outs in medical education) అని ! వారు ఆయుర్వేద గురువు దగ్గఱ విద్యాభ్యాసానికి చేఱిన ఒకటి-రెండేళ్ళకే "చదివింది చాల్లే, జనానికి ఏదో ఒక మందిచ్చి బతకడానికి ఈమాత్రం పరిజ్ఞానం సరిపోతుంది" అనుకొని లేచి ఇంటికొచ్చేసేవాళ్ళు. కానీ దేశంలోకి ఇంగ్లీషువైద్యం అడుగుపెట్టాక ఇలాంటివాళ్ళ చికిత్సల మీద జనానికి క్రమంగా విశ్వాసం నశించసాగింది. "ఇంగ్లీషుడాక్టర్ ముందు ఆచారిగారు బలాదూర్" అనే మాట వచ్చింది. అలా ఈ అఱకొఱ శిక్షితులు ఆయుర్వేదానికి కొఱివిపెట్టేశారు.

౨. అధునాతన పరిశోధనల వెలుగులో ప్రతిరోగాన్నీ పునర్ నిర్వచించాలి, పునర్ వర్ణించాలి.

౩. వస్తుగుణదీపిక (Ayurvedic Pharmacopeia) ని మఱింత విస్తరించి వ్రాయాలి. కేవలం వనౌషధుల చికిత్సకలక్షణాలనే కాకుండా, ఆ ఔషధులలో ఏయే పదార్థాలు ఏయే అవయవాల మీద ఎలా పనిచేస్తాయో వివరించడం అవసరం. లేకపోతే వాటిని అంతర్జాతీయంగా సమర్థించుకోవడం కష్టమవుతుంది. ఈ రకంగా నిషేధాలకి గుఱికావాల్సి వస్తుంది. మన దేశస్థులకి సొంతబుఱ్ఱ శూన్యమనీ, తెల్లతోలువాళ్ళు ఏదంటే దానికల్లా తానతందానా పాడతారనీ మనకి తెలుసు గనుక, వాళ్ళని అనుసరించి ఇక్కడ కూడా ఆయుర్వేదాన్నినిషేధించాలని డిమాండ్లు బయలుదేఱితే ఆశ్చర్యం లేదు.

౪. విస్తృతమైన ప్రజామద్దతు సంపాదిస్తే తప్ప - ఆయుర్వేదం యొక్క శాస్త్రీయకరణకి అవసరమైన మానవవనరుల్నీ, ఆర్థిక వనరుల్నీ సమకూర్చుకోలేం. అలాంటి మద్దతు కావాలంటే ఆయుర్వేద వైద్యానికి కొన్ని బాహ్యాలంకారాలు కూడా అవసరం. అవి జనాన్ని ఇన్‌స్పైర్ చేసేలా ఉండాలి.

ముఖ్యంగా ఆయుర్వేద వైద్యులు దేశకాలానుగుణంగా తమ వేషభాషల్ని సమూలంగా మార్చుకోవాల్సి ఉంది. ఆయుర్వేదమంటే జనానికి పెద్దగా కళ్ళకి ఆనకపోవడానికీ, తేలిగ్గా చప్పరించేయడానికీ సగం కారణం ఈ నిరాడంబర వేషభాషలే. వీటి మూలాన యువ ఆయుర్వేద వైద్యులకి పెళ్ళికావడం కూడా కష్టమంటే అతిశయోక్తి లేదు. తమదగ్గఱికొచ్చే రోగులకి ఆయుర్వేద పరిభావనల్నీ, రోగలక్షణాల్నీ తెలుగు- సంస్కృత పదాల్లోనే కాక ఇంగ్లీషువాక్యాల్లో కూడా వివరించడం నేర్చుకోవాలి. అలాగే, ఎల్లప్పుడూ మెడలో ఒక స్టెతస్కోపుతో కనిపించాలి. ఒక కారునీ, డ్రైవర్ నీ కూడా మెయిన్‌టెయిన్ చేయాలి. అప్పుడు ఎక్కువమంది నమ్ముతారు. తప్పదు. నువ్వు మంచివాడివైతే సరిపోదు. మంచివాడిలా కనిపించాలి కూడా ! ఇంకొకటి - ఆయుర్వేద వైద్యశాలల్నీ, క్లినిక్కుల్నీ కూడా పాశ్చాత్య పద్ధతిలో తీర్చిదిద్దాలి. ఎందుకంటే ఈ రంగంలో ఈ కాలానికి దేశీయ అలంకరణ బొత్తిగా పనికిరాదు.

ప్రశ్నించడము ఎలా ?

ఒక వ్యక్తినుండి మనకు కావలసిన విషయ సమాచారాన్ని రాబట్టుకోడానికి మనం ఒక ప్రశ్నవేస్తాం. మనం అడిగే ప్రశ్న యొక్క సొంపును బట్టి మనకొచ్చే సమాధానం కూడా అంత అందంగా ఉంటుంది.పైగా ఈ ప్రశ్న అడిగే విధం ఆధ్యాత్మిక జీవనంలో ఎంతో ముఖ్యం. అసలు ప్రశ్న వేసేముందు నిజాయితీ చాలా అవసరం. మనం నిజాయితీగాఅడుగుతున్నామా లేక ఎదుటివాడి పాండిత్యాన్ని తెలుసుకోవడానికి అడుగుతున్నామో ముందు మనమే నిర్ధారించుకోవాలి. రెండవరకమైతే అవతలి వ్యక్తినుంచి సమాధానం కాదుకదా ఈసడింపు కూడా కొన్ని సందర్భాలలో దొరకవచ్చు. 'అసలు ప్రశ్న ఏమిటి? దాని పూర్వాపరాలు ఏవి? ఎక్కడనుంచి ఆ అనుమానం లేదాప్రశ్న వచ్చింది ?' అన్నది ముందు మనం జాగ్రత్తగా గమనించి గుర్తుపెట్టుకోవాలి. అవతలి వ్యక్తిని అడిగినప్పుడు ఆయన "అసలెందుకొచ్చింది నీకీసందేహం ? ఆ సందేహం గురించిన వివరమో కథో చెప్పు ఒక్కసారి" అని అడిగితేఎందుకొచ్చిందో తత్కారణం చెప్పి వివరించగలిగేలా ఉండాలి. అలా కాక, "ఏదో అక్కడ విన్నానండి, ఇక్కడ వీరన్నారు. అందులో ఏముందో తెలుసుకోడానికి అడుగుతున్నా" అని మనకే అర్థంకాని రీతిలో ప్రశ్న చేయకూడదు.

ప్రశ్నల్ని ముఖ్యంగా రెండు రకాలుగా విభజించుకోవచ్చు

1) స్వతహాగా జీవన విధానంలోనూ, అనుష్ఠానంలోనూ కలిగిన సందేహాలు:- ఇవి అడిగి తెలుసుకుని అనుమాన నివృత్తి చేసుకుని ముందుకు సాగడం చాలా మంచిది.

2) స్వజీవితంలోనివే కాక, ధర్మ సూక్ష్మాలు ఇత్యాదులు:- స్వాధ్యాయం ద్వారా తెలుసుకుంటూ అనుమానం వచ్చినచోట సందర్భానుసారం, సమయానుసారం తెలిసినవారినడిగి తెలుసుకోవడం లేదా ఇతర ప్రామాణిక వ్యాఖ్యానాలు పుస్తకాలు చదివి విని తెలుసుకోవడం. తద్వారా పురాణేతిహాసాలు మనలో జీర్ణమై తదనుగుణంగా
మన జీవన మార్పు ఆధ్యాత్మికోన్నతికి సోపానమవుతుంది

ముఖ్యంగా గురువుల వద్ద, 'ఆయన దొరికారు కాబట్టి ఏదో అడగాలి' అని అడిగేయడం కాక మన ఆధ్యాత్మికోన్నతికి పనికి వచ్చే ప్రశ్నలు, అదీ ఆయన అనుకూల సమయం చూసి అడగాలి. అంతేకాని అప్పున్న వాణ్ణి ఎక్కడ కనపడితే అక్కడ అప్పడిగినట్టు కాదు.

అసలు ప్రశ్న అడిగేముందు ఆ ప్రశ్నకు సమాధానం కోసం మనం మన పరిశ్రమ ముందు చేయాలి. అసలు ఏ పరిశ్రమా లేక ఏదో అడిగేసి వారు తిరిగివేసిన ప్రశ్నకి మన దగ్గర బదులు లేక తత్తర పడకుండా జాగ్రత్త పడాలి.

గతంలో ఎంతోమందిని మన పూజ్యగురువుగారిని ఎక్కడపడితే అక్కడ ఏవో ప్రశ్నలు వేయడం చూసాను అలాంటి ప్రశ్నలు ఎలా వేస్తారో అని నాకో గొప్ప అనుమానం. అవి వారి ఆధ్యాత్మిక జీవనానికి ఎలా ఉపయోగపడతాయో అర్థంకాని ప్రశ్నలు. చాలా ప్రశ్నలు పుస్తక పరిశీలనం పురాణ పరిశీలనం ద్వారా తేలిపోతాయి. అసలు ఆ ప్రశ్నవెనుక వారి పరిశీలనం కాని పరిశ్రమ కానీ ఏమీ ఉండవు.

"భారతంలో ఇలాట కదండీ ! అలా ఎలా అండీ ! రాముడు ఇలా చేసాడు కదండీ ! సినిమాలో
చేప్పారు కదండీ ! నిజమాండీ ! ఎలా అండీ !" వంటి ప్రశ్నలు కొన్ని, ఆ అడిగిన ప్రశ్న ఏ సినిమా చూసో నాటకం చూసో అడిగుతున్నామని అడిగే వాళ్ళకీ తెలుసు. భారత రామాయణాలు చదివితే అందులో ప్రశ్నలకి సమాధానం కూడా దొరుకుతుంది కానీ చదివి చెప్పేవారు తేరగా దొరికారని ఇచ్చవచ్చిన ప్రశ్నలు అడుగుతుంటారు. ఇంకొన్నిప్రశ్నలు కూడా వారిని అడగడం చూసాను. "రామాయణం తెలుగు పుస్తకాలు, భాగవతం తెలుగు పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి టీకా తాత్పర్యాలు ఉన్నవి కావాలి" అని. వారిని చూసి ఎన్నో పుస్తకాల దుకాణాలున్నాయి ఏ పెద్ద దేవాలయానికి వెళ్ళినా అక్కడ ఉండే పుస్తకాల దుకాణదారులని అడిగినా చెబుతారు, అంతర్జాలంలో ఎన్నో పుస్తకాలు విక్రయించే వెబ్ సైట్లున్నాయి, ఉచితంగా చదువుకునే వెబ్ సైట్లున్నాయి. "అరెరె వీరికి అంత పెద్దాయన సమయం కేటాయిస్తే ఎలా సమయం వృధా చేసుకుంటున్నారురా" అనిపిస్తుంది.

రామాయణం బాలకాండ జాగ్రత్తగా చదివితే అసలు ప్రశ్న ఎలావేయాలో తెలుస్తుంది. వాల్మీకి విరచిత శ్రీరామాయణమే ప్రశ్నతో మొదలు. అందులో చక్కగా చెప్తారు వాల్మీకి నారదులవారిని అర్ఘ్యపాద్యాదులతో పూజించి "పరిప్రశ్న" చేసారు అని. పరిప్రశ్న అంటే బాగుగా ప్రశ్న అడుగుట. పరి పరి విధముల ఆలోచించి సరియైన ప్రశ్నను కూర్చి అడగవలసిన వారిని అడిగే విధంగా ప్రశ్న అడగడం. అలానే విశ్వామిత్రమహర్షిని శ్రీరాముడు అలానే సందర్భోచితంగా ప్రశ్నలువేసి విషయాలు తెలుసుకుంటారు.

మనకి ఇప్పుడు ఎన్నోరకాల మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి, ఎక్కడ పుస్తకాలు దొరుకుతాయి, ఎక్కడ ప్రవచనాలు, వ్యాఖ్యానాలు దొరుకుతాయి ఇలా అన్నివిషయాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఐనా కొందరు పరిశీలన చేయరు, పరిశ్రమ చేయరు, ఏ ప్రశ్న అడగాలో ఎలాఅడగాలో, ఎక్కడ అడగాలో అన్న స్మృతికూడా ఉండదు.

ఐతే ప్రశ్న అడగడంతప్పని నేను ఎంత మాత్రమూ చెప్పట్లేదు. ముందు మనని మనం ప్రశ్నించుకోవాలి, పుస్తకాలను ప్రశ్నించి సమాధానం రాబట్టుకోవాలి, పరిశీలనాత్మక దృష్టినేర్పరచుకోవాలి. ఐనా దొరకకపోతే ఆ సమాధానం దొరకకపోవడంవల్ల మన ఆధ్యాత్మిక జీవనానికి ఏమైనా లోటు ఉందా అని తర్కించుకోవాలి. లోటనిపిస్తే ప్రశ్నని చక్కగా కూర్చి పెద్దలనడగాలి.

ముఖ్యంగా గమనించవలసినదేమంటే ఈ టపా చూసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. కొంత మందిని చూసి చూసి ఈవిషయం చెప్పాలని, అటువంటి వారు మనగుంపులో ఉండకూడదని (లేరనే నేను నమ్ముతున్నా) ప్రస్తావించాను.

తెలియకపోవడం తప్పుకాదు. తెలుసుకోవడానికి పరిశ్రమించకపోవడం నేరం.


7, సెప్టెంబర్ 2011, బుధవారం

ఆయుర్వేదాన్ని శాస్త్రీయ పునాదులపై పునర్ నిర్మించడం

కొన్నేళ్ళ క్రితం ఆఫ్రికా నుంచి వచ్చిన ఒక నల్లజాతి క్రీడాకారుడు (పేరు గుర్తులేదు) హైదరాబాదులో పత్రికలవారికి ముఖాముఖీ ఇస్తూ "ఆఫ్రికా, ఇండియా రెండూ ఐరోపేయుల వలసపాలనలో వందలాది సంవత్సరాలు మగ్గిన ప్రాంతాలే. కానీ మీకూ, మాకూ చాలా తేడా ఉందని ఇక్కడికొచ్చినాక గ్రహించాను. వలసపాలనలో మేము మా సర్వస్వమూ పోగొట్టుకున్నాం. మా కట్టూబొట్టూ, ఆచారవ్యవహారాలూ, మతమూ, భాషా అన్నీ పోయాయి, మేమిప్పుడు క్రైస్తవమతాన్ని అవలంబిస్తూ, ఇంగ్లీష్, ఫ్రెంచిలాంటి ఐరోపేయ భాషలు మాట్లాడుతూ జీవిస్తున్నాం. కానీ మీ దేశంలో మీ భాషలు ఇంకా జీవించే ఉన్నాయి. మీ మతం కూడా జీవించే ఉంది. మీ ఆడవాళ్ళు ఇప్పటికీ చీరల్లోనే కనిపిస్తున్నారు. మీ శాస్త్రాలూ, ఆచారాలూ, దేవాలయాలూ అన్నీ సలక్షణం (intact) గా ఉన్నాయి. వందలాది సంవత్సరాల వలసపాలన మిమ్మల్నేమీ చేయలేకపోయింది." అంటూ అభినందించాడు.

అతను కొంతే గమనించాడనీ, పూర్తిగా లోతుల్లోకి వెళ్ళలేదనీ మనకి తెలుసు. మన మతమూ, భాషలూ, ఆచార వ్యవహారాలూ, శాస్త్రాలూ ఎంత ప్రమాదంలో ఉన్నాయో మనకి మాత్రమే తెలుసు.

ఇలా ప్రమాదంలో పడ్డ భారతీయ శాస్త్రాల్లో ఆయుర్వేదం కూడా ఒకటి. ఇది 4 రకాలుగా ప్రమాదంలో పడింది. ఒకటి - ఈ శాస్త్రానికి ప్రభుత్వపోషణ కఱువవుతున్నది. ప్రభుత్వం కొత్త ఆయుర్వేద కళాశాలల్ని గానీ, వైద్యశాలల్ని గానీ స్థాపించడం మానేసింది. ఉన్నవాటికి సరైన నిధులూ, సిబ్బందీ సౌకర్యాలూ లేవు. తద్ద్వారా ప్రజాదరణ కూడా అడుగంటుతున్నది. ప్రత్యేకంగా ఆయుర్వేద ఔషధాలమ్మే కొట్లు తగ్గిపోతున్నాయి. వాటిని కూడా మామూలు అల్లోపతీ మందుల దుకాణాలవాళ్లే అమ్ముతున్నారు.

రెండో కోణం - ఆయుర్వేదం ప్రధానంగా వనమూలికల మీద ఆధారపడ్డ వైద్యం. అడవుల్ని నఱికేయడం వల్లా, గ్రామకంఠాల్ని స్థానికులు దురాక్రమించి నానా ఇతరేతర అవసరాలకి వాడుతూండడం వల్లా అక్కడ సహజంగా పెఱిగే మొక్కలూ, వనమూలికలూ పునరుత్పత్తికి నోచుకోక నశించిపోతున్నాయి. ఉదాహరణకి - స్త్రీలకి ఋతుసమయంలోనూ, ఋత్వంతం (మెనోపాజ్) లోనూ అధిక రక్తస్రావం కాకుండా నిరోధించే తుఱకవేపాకు అనే మొక్క ఇప్పుడు అరుదైపోయింది. అందుకోసమే ఉపయోగపడే రెడ్డివారి నానుబ్రాలు అనే మఱో మొక్క కూడా అలాగే అదృశ్యమైపోతోంది. దాన్తో ఇప్పుడు ఇలాంటివాటన్నింటికీ ఖరీదైన అల్లోపతీ మందులు వాడుతూ, శస్త్రచికిత్సలు చేయించుకుంటూ జనం శాశ్వతంగా మంచాన పడుతున్నారు. ఇలాంటి అద్భుతమైన వనమూలికలెన్నో ఆయుర్వేదంలో ఉన్నాయి. ఇవన్నీ క్రమక్రమంగా అంతరించిపోతున్నాయి.అలనాటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు గారు ఇలాంటి వనౌషధుల ప్రాశస్త్యాన్ని గుర్తించి 1988 లో అనుకుంటా, తిరుపతిలో ఒక ఆయుర్వేదిక్ హెర్బేరియమ్‌ని (వనమూలికల ఉద్యానవనం) స్థాపించారు. కానీ అనంతరకాలంలో అధికారంలోకి వచ్చినవాళ్ళు ఆ హెర్బేరియమ్ ని ఏం చేశారో, రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకున్నారో ఏంటో ఏమీ తెలియదు.

మూడో కోణం - ఆయుర్వేదం మీద నాస్తికులూ, తదితర సంస్కృతివ్యతిరేకులూ (anti-culture elements), అల్లోపతీ మందుల ఉత్పాదకులైన బహుళ జాతీయ సార్థవాహాలూ పనిగట్టుకొని దుర్బుద్ధితో, ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారం. ఇది అంతర్జాతీయ స్థాయిలో విచక్షణారహితంగా చెలరేగిపోతోంది. ముఖ్యంగా ఆయుర్వేద మందుల్లో పాదరసం, బంగారం, వెండి, సీసం లాంటి ఘనలోహాల్ని (hard metals) ప్రమాదకర స్థాయిల్లో మిశ్రమం చేస్తున్నారనీ, అవి వాడితే శరీరం లోపలి కీలక అవయవాలు శాశ్వతంగా దెబ్బ దింటాయనీ ప్రచారం చేస్తూ అమెరికా యూరప్ జనాల్ని భయభ్రాంతులకి గుఱి చేస్తున్నారు. ఈ దుష్ప్రచార ఫలితంగా ఇటీవల యూరోపియన్ యూనియన్ ఆయుర్వేద మందుల్ని నిషేధించింది. త్వరలో అమెరికా చేత కూడా నిషేధింపజేయడానికి ప్రయత్నాలు ముమ్మరం గా జఱుగుతున్నాయి.

నాలుగో పార్శ్వం - ఆయుర్వేదాన్ని ఇతర వైద్యవిధానాలతో కలుషితం చేయడం. కొందఱు ఆయుర్వేద వైద్యులైతే ఆయుర్వేద మందుల్లో ఉత్తేజకాల్ని (steroids) కలిపి పక్కప్రభావాలకి కారకులవుతూ శాస్త్రానికి చాలా చెడ్డపేరు తెస్తున్నారు.

ఆయుర్వేదానికి వంకలు లేవని వాదించడం నా ఉద్దేశం కాదు. అయితే ప్రతివైద్యవిధానం లోనూ ఏదో ఒక లోపం ఉన్నది. ఉదాహరణకి - శరీరాన్ని కోయకుండా అల్లోపతివాళ్ళు ఏ చికిత్సా చేయలేరు. కానీ తెఱవబడ్డ యంత్రాలు తెఱవక ముందున్ననాటి పనితీరు (functioning) ని యథాతథంగా చూపించలేవు ఎట్టి పరిస్థితుల్లోనూ ! అటువంటప్పుడు కేవలం ఆయుర్వేదాన్నే విమర్శించడమూ, దుష్ప్రచారం చేయడమూ సబబు కాదు. అయితే విమర్శలు ఇలా వస్తున్నాయి గనుక ఆయుర్వేద వైద్యులూ, ఔషధ ఉత్పాదకులూ తమ వ్యూహాల్ని కాస్త మార్చుకుంటే బావుంటుంది. లోకుల సంతృప్తి కోసమైనా ఘనలోహాల మిశ్రమం లేకుండా ఔషధాల్ని తయారు చేయాలి. ఏ లోపలి అవయవం ఎలా పనిచేస్తుందో సరైన అవగాహన కల్పించే పాఠ్యపుస్తకాలు ఆయుర్వేదంలో లేవు. ఉన్నవి ఈ కాలపు అవగాహనకి సరిపోవు. అటువంటప్పుడు వాటిని ఇతర వైద్యవిధానాల నుంచి గ్రహించడంలో తప్పులేదు.ఆయుర్వేద వైద్యులిచ్చే మందులు తప్పకుండా పని చేస్తాయి. కానీ ఎలా పనిచేస్తాయో వారు ఈ కాలపు పరిభాషలో వివరించలేరు. ఆయుర్వేదవైద్యులు ఆధునిక రోగనిదాన (డయాగ్నాస్టిక్) పరికరాల్ని ఉపయోగించుకోలేక పోతున్నారు. ఆ పరికరాల ద్వారా తెలియవచ్చిన పరీక్షా ఫలితాలకి అనుగుణంగా మందుల్ని ఉత్పాదించాల్సి ఉంటుంది.

ఇవన్నీ ఎవఱూ గంభీరంగా పట్టించుకుంటున్నట్లు కనిపించదు. అసలు ఆయుర్వేదంలో పరిశోధనే స్తంభించిపోయినట్లు కనిపిస్తోంది. పరిశోధన కుంటువడ్డ శాస్త్రానికి భవిష్యత్తు లేదు. మన పూర్వీకులకి ఏమీ తెలియదనుకోవడం ఎంత మూర్ఖత్వమో, అనీ తెలుసు ననుకోవడమూ అంతే మూర్ఖత్వం. కనుక మన పూజ్య పూర్వీకుల కానుక, జాతికి గర్వకారణమూ అయిన ఈ వేదాంగం ఆయుర్వేదానికి ప్రత్యేక ప్రయోగశాలల్ని నెలకొల్పి సరికొత్త పద్ధతులలో, పరిశోధనాత్మకంగా నూతన జవసత్త్వాలు కల్పించాల్సిన అవసరం ఉంది.

భారతీయ భాషల్ని కాపాడుకోవాలి

చాలామంది హైందవాభిమానులైన హిందువులు సైతం తెలిసో తెలియకో విస్మరించే ప్రధానాంశం - తెలుగులాంటి భారతీయభాషల్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత. భాష లేకుండా మతం లేదు. సంస్కృతి లేదు. సామెతలూ, సంగీతం, జానపద పాటలూ, నాట్యం మొదలైన అనేక సాంస్కృతికాంశాలు భాష మీదనే ఆధారపడి ఉన్నాయి. యావత్తు మీడియా కూడా భాషానైపుణ్యాల మీదనే ఆధారపడి నడుస్తోంది. ఒక భాష నశిస్తే దానిలో ఆ భాషవారి పూర్వీకులు ఆలోచించి వ్రాసిపెట్టిపోయిన సాహిత్యం యావత్తూ నశిస్తుంది. అంటే ఒక జాతి యొక్క తరతరాల స్వతంత్ర దృక్పథం నశించినట్లే. ఒక విశిష్ట నాగరికత చిరునామా లేనివిధంగా భూస్థాపితమైనట్లే. ఇంగ్లీషులాంటి యూరోపియన్ భాషలన్నీ క్రైస్తవ మతచ్చాయలో పెఱిగిన భాషలు. అవి యూరోపియన్ వాతావరణాన్ని, క్రైస్తవ కాన్సెప్టులనీ, వారి నాగరికతా - చరిత్ర కాన్సెప్టులనీ మన పిల్లల మెదళ్ళలోకి ఎక్కిస్తాయి. అందువల్ల హిందువులంతా తమ పిల్లల్ని ఇంగ్లీషు మీడియమ్ లో చేర్చి  అదే సమయంలో మాతృభాషలో వారికి శిక్షణిచ్చే ఏర్పాట్లేవీ చేయకపోవడం వల్ల మన హిందూ పిల్లలంతా యూరోపియన్ దృక్పథాన్ని అలవఱచుకుంటూ మానసిక క్రైస్తవులుగా మారుతున్నారు. వారు పూర్తి క్రైస్తవులుగా మారడానికి ఇంక ఒక్ఖ తరం ఎడం (a single generation away) అంతే ! అందుచేత మన మతాన్ని కాపాడుకోవడానికి గల ఒక ప్రధానమార్గం మన భాషల్ని కాపాడుకోవడం. ఎందుకంటే హిందూమతం, సాహిత్యం, వారసత్వం, హిందూసంస్కృతి, హిందూ వాతావరణం ఈ భాషల ద్వారానే జీవిస్తున్నాయి.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి