7, జూన్ 2012, గురువారం

కదిలెను 'కోదండపాణి'...

నాటక, కథ, నవలా రచయితగా ఐదు దశాబ్దాల అనుభవం ఆయన సొంతం. రంగస్థల నటుడిగా కూడా ఆయన కళాభిమానులకు సుపరిచితులే. ఆయనే నెమలికంటి తారక రామారావు. రామాయణ కావ్యంలో మనకు తెలియని కొత్త కోణాలను ఆవిష్కరిస్తూ ఆయన తాజాగా రచించిన 'కోదండపాణి' నాటకం ఇటీవల భాగ్యనగరిలో మూడు రోజుల ప్రదర్శనలు జరుపుకుంది. రామాయణం విశిష్టతను, ఆ మహాకావ్యంపై ఉన్న అపోహలు, అనుమానాలను నివృత్తి చేయడమే తమ నాటక ప్రధాన ఉద్దేశమంటున్న తారకరామారావుతో కాసేపు...

మాట పుట్టినపుడే రామాయణం పుట్టింది. వాల్మీకి నోట నుంచి రామాయణం వెలువడినపుడు బ్రహ్మాండమైన వెలుగు వ్యాపించినట్లు మహాకవి కాళిదాసు పేర్కొన్నాడు. రామాయణం ఒక పౌరాణిక గ్రంథం మాత్రమే కాదు. మనిషి ఎలా జీవించాలో నేర్పింది..మనిషికి ఉండాల్సిన సద్గుణాలకు శ్రీరాముడే ఆదర్శనీయుడు. ఆడిన మాట తప్పనివాడు, పితృ వాక్యపరిపాలకుడు, ఏకపత్నివ్రతుడు వంటి పరమోత్తమ గుణ సంపన్నుడైన శ్రీరాముడి ధర్మప్రవృత్తిని ఆధునిక సమాజానికి అర్థమయ్యే రీతిలో వివరించే ప్రయత్నం ఈ 'కోదండపాణి' నాటకంలో చేశాను.

మానవ విలువలు పతనావస్థకు దిగజారిన ఈ కాలంలో రామాయణ మహాకావ్యాన్ని నాటకంగా ప్రజలకు చేరువ చేయాలన్న ఆలోచనతో ఈ రచనకు పూనుకున్నాను. భ్రమర కీటక న్యాయం, మార్జాల కిశోర న్యాయం, మర్కట కిశోర న్యాయం వంటివి రామాయణ గా«థకు అన్వయించాను. తెలిసిన రామాయణ గా«థను, తెలియని ఎన్నో విషయాలను విశ్లేషిస్తూ ఈ నాటకం సాగుతుంది. రామాయణం గురించి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. వాలిని చెట్టు చాటు నుంచి దొంగచాటుగా రాముడు వధించడం సబబు కాదు కదా వంటి అనుమానాలు చాలామందిలో ఉన్నాయి.

ఇలాంటి సందేహాలను నివృత్తి చేయడంతోపాటు రామాయణంలోని రహస్యాల పరమార్థాన్ని కూడా ఈ నాటకం ద్వారా వివరించే ప్రయత్నం చేయాలన్నది నా ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం ఇలపావులూరి పాండురంగారావు రచించిన 'రామాయణంలో స్త్రీ పాత్రలు', శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచించిన వాల్మీకి రామాయణం, మొల్ల రామాయణం, డాక్టర్ గుండి వెంకటాచార్యులు రచించిన 'వాల్మీకి, రంగనాథ రామాయణాల తులనాత్మక పరిశీలన', విశ్వనాథ అచ్యుత దేవరాయలు రచించిన 'సీత' నవల తదితర అనేక పరిశోధనా గ్రంథాలను పరిశీలించి ఈ 'కోదండపాణి' నాటకాన్ని తయారుచేయడం జరిగింది.

రాముడు 'కోదండపాణే'
రామాయణంలో ధనుస్సుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా మూడు ధనుస్సుల ప్రస్తావన రామాయణంలో వస్తుంది. సీతా కల్యాణంలో శ్రీరాముడు శివధనుస్సును విరిచి సీతను పరిణయమాడతాడు. పరశురాముడి దగ్గర ఉన్నది విష్ణుధనుస్సు. అది కూడా రాముడు సంధించాడు. అధర్వణ వేదంలోని మంత్రాలన్నీ కోదండంలో నిక్షిప్తమై ఉంటాయి. అందుకే కోదండం ధరించిన వాడు మహాబలవంతుడై ఉండాలి. సూర్యవంశంలో మొట్టమొదటిసారి కోదండం ధరించిన వాడు శ్రీరాముడు ఒక్కడే కాబట్టే కోదండపాణి అయ్యాడు. రాముడిని మనం ఎన్నిపేర్లతో పిలిచినా ఆయన అసలు పేరు మాత్రం కోదండపాణే.

పాయసం పంపకం
రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల జననానికి సంబంధించి కూడా ఆసక్తికర ఘట్టం ఉంది. దశరధుడు తనకు పుత్రకామేష్టి యాగం ద్వారా లభించిన దివ్యపాయసాన్ని తన ముగ్గురు భార్యలకు సమానంగా పంచడు. రాముడు పూర్ణాంశంలో సగం. అందుకే పెద్దభార్య కౌసల్యకు పాయసంలో సగం అందచేస్తాడు. మిగిలిన పాయసాన్ని మూడు భాగాలు చేసి అందులో రెండుభాగాలను సుమిత్రకు, ఒక భాగాన్ని కైకేయికి ఇస్తాడు. అందుకే సుమిత్రకు కవలలు-లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మిస్తారు. ఇందులో ఒకడు రాముడి వెంట, ఒకడు భరతుడి వెంట ఉంటారు.

నరుడు కాదు నారాయణుడు
సమస్త సంపదలను, సౌభాగ్యాన్ని లంకలో పొదుపుకున్న రావణుడు మర్కట బుద్ధి కలవాడు కావడంతో సర్వనాశనాన్ని కోరి తెచ్చుకున్నాడు. రాముడు మనకు ఆదర్శనీయుడు. మనం ఇలా ఉండకూడదు అని రావణుడిని చూసి నేర్చుకోవాలి. అయోధ్య నుంచి లంకకు వచ్చి తనపై యుద్ధానికి సిద్ధమైన రాముడి గొప్పతనాన్ని రావణుడు చివరిలో గ్రహిస్తాడు. వచ్చిన వాడు నరుడు కాదు నారాయణుడని తెలుసుకుని అతని చేతిలో తనకు మరణం తధ్యమని నిశ్చయించుకుంటాడు. తన భర్తను సంహరించడానికి వచ్చిన రాముడిని చూడాలనుకుంటుంది అతని భార్య మండోదరి. అలాగే యుద్ధానికి ముందు రోజు రాత్రి రాముడిని కలుసుకుంటుంది.

శని పాత్ర ప్రత్యేకత
అలాగే ఈ నాటకంలో మరో విశిష్టపాత్ర శనిదేవుడిది. అడవిలో వేటకు వెళ్లిన దశరథుడు సంధించిన శబ్దభేదికి మునికుమారుడు మరణించగా అతని తండ్రి నీకూ పుత్రశోకం లభిస్తుందని శాపం ఇవ్వడం కూడా శని ప్రభావం వల్లనే. వాల్మీకి- మానిషాద శ్లోక ఆవిర్భావం నుంచి ప్రారంభమయ్యే నాటకంలో దశావతారాల విశిష్టత, సీతారాములకల్యాణం, వనవాసంలో సీతారాముల జీవితం, వనవాసంలో తార రాముడికి శాపం ఇవ్వడం వంటివి కొత్త కోణంలో చూపాము. రావణబ్రహ్మ మందిరంలో శని పాత్రతో నాటకం ముగించడం కూడా ఓ కొత్త ప్రయోగం.

విస్తృత ప్రదర్శనలకు సన్నాహాలు
శ్రీకళానికేతన్, హైదరాబాద్ ఆధ్వర్యంలో డిఎస్ఎన్ మూర్తి దర్శకత్వం వహించిన 'కోదండపాణి' నాటకంలో మొత్తం 26 పాత్రలు ఉంటాయి. నాటకం నిడివి 2.30 గంటలు. 14 మంది సాంకేతిక నిపుణులు, ఓ డజను మంది నృత్య కళాకారులు పనిచేశారు. ఈ నాటక ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆర్థిక సహాయంతో రాష్ట్ర రాజధానిలో మూడు రోజుల ప్రదర్శన ఇచ్చాము. భద్రాచలం దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు, సౌత్ జోన్ కల్చరల్ సెంటర్(తంజావూరు), సౌత్ సెంట్రల్ కల్చరల్ జోన్(నాగపూర్)లను ఈ నాటక ప్రదర్శనకు సంబంధించి సంప్రదింపులు జరుపుతున్నాం.

ఢిల్లీకి చెందిన భారత రంగ మహోత్సవ్ (నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా) వారు ప్రతి ఏటా జనవరిలో 14 రోజుల పాటు నిర్వహించే జాతీయ నాటక మహోత్సవాల కోసం సంప్రదింపులు జరుగుతున్నాయి. మన రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక మండలి కూడా ప్రోత్సాహం అందిస్తే రాష్ట్రవ్యాప్తంగా 'కోదండపాణి' నాటక ప్రదర్శనలు ఇవ్వడానికి మేము సిద్ధం. 040-23833878 ఫోన్ నెంబర్‌లో నన్ను సంప్రదించి కళాభిమానులు తమ సూచనలు, ప్రోత్సాహం అందచేయవచ్చు.

తెలిసిన రామాయణ గాథను, తెలియని ఎన్నో విషయాలను విశ్లేషిస్తూ ఈ నాటకం సాగుతుంది. రామాయణం గురించి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. వాలిని చెట్టు చాటు నుంచి దొంగచాటుగా రాముడు వధించడం సబబు కాదు కదా వంటి అనుమానాలు చాలామందిలో ఉన్నాయి.ఇలాంటి సందేహాలను నివృత్తి చేయడంతోపాటు రామాయణంలోని రహస్యాల పరమార్థాన్ని కూడా ఈ నాటకం ద్వారా వివరించే ప్రయత్నం చేయాలన్నది నా ముఖ్య ఉద్దేశం.

కామెంట్‌లు లేవు:

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి