7, ఆగస్టు 2012, మంగళవారం

శ్రీ పరమశివతత్త్వం

శ్రీ గురుభ్యోనమః 
సభాయైనమః 

శ్రావణమాసంలో ఎన్నో వ్రతాలు, పూజలు, ఎన్నో వ్రతాలు ఈ మాసం నుండే ప్రారంభం. శ్రావణంలో ఎందరో దేవతలకి సంబంధించిన పూజలున్నా శ్రావణ మాసం సాంబశివుని పూజకు అత్యంత ఉత్కృష్టమైన కాలం. శ్రావణ మాసం తనకెంతో ప్రీతికరమైన మాసమని స్వయంగా సదాశివుడే సనత్కుమారునితో చెప్పారు. "శ్రావణంలో వ్రతము కాని రోజు లేదు" అని శివవాక్కు. సరే, కొన్ని కారణాల వల్ల ముందే పంపుదామనుకున్న కొన్ని విషయాలు సమయానికి పంపలేకపోయాను. ఈ వేళ శివతత్త్వం గురించి తెలుసుకున్నది చదువుకున్నది మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను..... శివాయ గురవే నమః 

పరమశివతత్త్వం విచిత్రంగా ఉంటుంది. ఆయనను కీర్తించే నామాలు, ఆయన గౌణాలూ సింహభాగం అమంగళ వస్తువులలాగా, అమంగళ పదాలలాగా ఉంటాయి. ఒక విధంగా అవి ఆయన సౌలభ్యాన్ని సూచించేవే ఐనా కొందరు అదే నిజమనుకుని శివతత్త్వం మీద అటువంటి వ్యాఖ్యలే చేస్తుంటారు.’యద్భావం తద్భవతి’ అన్నట్లు ఎలా ఆలోచించేవారికి, ఎలా కోరే వారికి అలానే కనపడి ఉద్ధరించే స్వరూపం ఆయనది. ఇదే విషయాన్ని అదే పరమాత్మ స్థితికారుడైన విష్ణు అంశలతో జగద్రక్షకుడుగా ఎవరు ఎలా కావాలనుక్కుంటే అలా వచ్చి ఉద్ధరించినట్లు మనం ఎన్ని వృత్తాంతాలలో చూడలేదు ? ’శివుడు’ అనగా శుభరూపుడు శుభకరుడు అని అర్థాలు. అలాంటి శివుణ్ణి స్మశానవాసిగా, పిశాచ సహచరునిగా, చితా భస్మం పూసుకునే శరీరం ఉన్నవాడిగా, నర కపాల మాలాధరునిగా చూసి ఆరాధిస్తారు. కొందరు "ఈ రూపమున్నవాడే శివుడు" అని తలచి ఆరాధిస్తారు కొందరు తత్త్వ సమన్వయం చేసుకుని సచ్చిదానంద విగ్రహం అని ఆరాధిస్తారు. మరికొందరు నిందచేస్తారు, వాటినీ వ్యాజస్తుతిలా స్వీకరించి అనుగ్రహిస్తాడు. 

శ్లో|| శ్మశానే ష్వాక్రీడా స్మరహర! పిశాచాః సహచరా 
శ్చితాభస్మాలేపః స్రగపి నృకరోటీపరికరః |
అమాంగల్యం శీలం తవ భవతునామైవ మఖిలం 
తథాపి స్మర్తౄణాం వరద! పరమం మంగళమసి ||

రూప సమన్వయము 
౧) అందరికీ ఆహ్లాదం కలిగించి మన్మథుని చంపినవాడా! నువ్వు శ్మశానములలో తిరుగువాడవు. పిశాచాదులు నీ తోటి స్నేహితులు నీతో తిరిగేవారు. పిశాచములు ప్రేతములతో కలిసి నువ్వు తిరుగుతావు. కాలిన శవముల బూడిదను గ్రహించి శరీరానికి పూసుకుంటూ ఉంటావు. నరులు చనిపోతే కాలిపోయిన వారి కపాలములతో గుచ్చిన మాల వేసుకుంటావు. ఇలా నీ అలవాట్లలో ఏది చూసినా శుభకరమైనది కానేకాదు. అయినా నిన్ను స్మరించే వారికి నువ్వెప్పుడూ మంగళస్వరూపుడవు. అత్యంత శుభకరుడవు. 

తత్త్వ సమన్వయము 

౨) ఇక్కడ స్మరహర అని సంబోధన 
స్మర= నిన్ను స్మరించు, ఉపాసించు 
హ= ఆకాశ సూచకము 
ర=అగ్ని సూచకము 
స్మర హర = నిన్ను ఉపాసించు వారి దహరాకాశమున అగ్నిబిందు రూపమున స్వయంజ్యోతిగా ప్రకాశించు శివా! 
శ్మశానేష్వాక్రీడా= శ్మశానేషు+ఆక్రీడా; 
శ్మ శానేషు = శమ శయనేషు = అంతర్ ఇంద్రియ నిరోధమునకు శయనము (శమ దమాది గుణములంటాము కదా) శమ దమాది సాధనాసంపత్తి/ శుద్ధ సత్త్వగుణమునకు శయనము అంటే ఆశ్రయము అగు ఉపాసకుల హృదయములందు. 
తవ = నీ 
ఆక్రీడా= విహరణము, తిరుగుట 
పిశాచాః=పిశా..శాః=అవయవములను తమవిగా అనుభవించెడి నాలుగు రకాల శరీరములు, 
పిశాచాః= స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ దేహములు 
తే=నీ 
సహ చరాః= ఉపాసనయందు నీతో కలిసి తిరుగునవి 
చితా భస్మ = ప్రణవ ఉపాసనచే సిద్ధమగు జ్ఞాన సిద్ధి /జ్ఞాన దీప్తి 
తే= నీ 
ఆలేపః =  వంటికి పూసుకునే ద్రవ్యం 
అపి = మరియు 
నృ కరోటీ పరికరః = జ్ఞాన సిద్ధికి మార్గం చూపే మాతృకలు/వర్ణముల కూర్పు 
తే=నీ 
స్రక్ = మాల 
వ ర ద;  వ = ప్రాపంచిక సుఖరూప శుభము  ర= మోక్షప్రద జ్ఞానప్రకాశము ద= ఇచ్చు వాడా 
ఏవం = ఈవిధముగా 
స్మర్తౄణాం = నిన్ను స్మరించు లేదా ఉపాసించు వారికి  
పరమం మంగళం =ఉత్తమమైన శుభము లేదా అత్యంత శుభకరము 
అసి = అగుచున్నావు 

తాత్పర్యము : 

తత్త్వజ్ఞులై అంతర్ముఖ అంతః కరణ వృత్తితో (సాధనా సంపత్తితో) ఉపాసించు ఉపాసకుల దహరాకాశములందు నివసించే దేవా ఓ శివా! నీవు బహిర్ అంతర్ ఇంద్రియముల నిగ్రహము కలవారి హృదయములలో నిలిచి ఉండేవాడవు. నీ తత్త్వములు విచారణ చేయుటకు వారికి వారి నాలుగు శరీరములైన స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరములు సహకరించును. నీ తత్త్వమునకు అవే సహచరములై ఉంటాయి. నిరంతరమూ వివేచనా దీప్తిచే సిద్ధించిన తత్త్వనిర్ణయమే జ్ఞాన సిద్ధియే నీ శరీరమునకు పూసుకున్న పూత. జ్ఞానానుభవమునకు త్రోవచూపు అకారాదిక్షకారాంత అక్ష (ర) మాలయే నీ తత్త్వరూపశరీరమునకు అలంకారమగు కంఠమాల. ఈ విధముగా శ్రుతి గురూపదేశ మార్గమున నిన్ను ఉపాసించు వారికి నీవు పరమ మంగళుడవు. 

ఇదే పరబ్రహ్మ తత్త్వం. సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. 

- శ్రీ అయ్యగారి సూర్యనాగేంద్ర కుమార్ శర్మ

కామెంట్‌లు లేవు:

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి