8, సెప్టెంబర్ 2012, శనివారం

భారతీయ హిందువులతో అంతర్జాతీయ హిందువుల ఇబ్బందులు

ఈనాడు ప్రపంచంలో అనేకదేశాలవారు హిందూమతంలోకి సంపరివర్తితు లవుతున్నారు. ఏడాదికి కోటిమంది ప్రపంచ పౌరులు వివిధ హిందూ శాఖల్లోకి మారుతున్నట్లు చెబుతున్న ఒక అంచనా గుఱించి నేను చదివాను. అది ఎంతవఱకూ నిజమో నాకూ తెలీదు. క్రీ.శ. 2000 తరువాత ప్రపంచమంతా - గురువారాన్ని పవిత్రదినంగా భావించే ఒక మతంలోకి మారిపోతుందని ఫ్రెంచి బ్రహ్మం గారైన Nostradamus చెప్పిన జోస్యం నిజమవుతున్నట్లు కనిపిస్తోంది. 

కానీ అంతర్జాతీయ హిందువులు భారతీయ దేవాలయాలకి వెళ్ళినప్పుడు అక్కడి భక్తులూ, పూజారులూ వారిని లోపలికి ప్రవేశించనివ్వకుండా గొడవ చేసి తఱిమేస్తున్నారు. వారి చర్మపు రంగూ, ముఖ కవళికలూ, భాషా, వేషమూ ఏవీ భారతీయుల్లా అనిపించకపోవడమే అసలు కారణం. ఉదాహరణకి ఈమధ్య ఇండోనీషియా బాలిద్వీపం నుంచి వచ్చిన ప్రాచీన హిందువుల్ని ఒక దేవాలయంలోంచి తఱిమేశారు. అదే విధంగా అనేకమంది యూరోపియన్, అమెరికన్ తెల్ల హిందువులు ఇండియాలో ఇలాంటి అవమానాల్ని ఎదుర్కుని నిరాశగా స్వదేశాలకి తిరిగి వెళుతున్నారు. ఇది ఆఖరికి ఒక Racism లా పరిణమించింది. ఒకప్పుడు దళితుల్ని ఏ విధంగానైతే దేవాలయాల్లోకి రాకుండా చేసి ఆ తరువాత వాళ్ళందఱినీ క్రైస్తవులకి అప్పజెప్పారో ఇప్పుడు కూడా హిందువులు అదే విధంగా తమ మతంలోకి వస్తామని ఉత్సాహంగా దూకుతున్నవాళ్ళని ఈ Racism తో మతం నుంచి తఱిమేస్తున్నారు. చారిత్రిక అనుభవాలతో మనకి బుద్ధి రాలేదు. 


భారతీయుల్ని మాత్రమే హిందువులుగా పరిగణించాలా ? భారతీయ ముఖ కవళికలూ, బ్రౌన్ తోలూ ఉంటేనే మనిషి హిందువవుతాడా ? భారతీయ పౌరసత్వం లేనివాళ్ళు హిందువులుగా బ్రతక్కూడదా ? హిందూమతం ఇంక ఏమాత్రమూ ఇండియాకి పరిమితమైన Local religion కాదని భారతీయ హిందువులంతా, ముఖ్యంగా బ్రాహ్మణులు గుర్తించాలి. ఈనాడు ఆఫ్రికాలో కూడా వేలాదిమంది బ్లాక్స్ హిందూమతం పుచ్చుకుంటున్నారు. అక్కడి హిందూ దేవాలయాల్లో Black పూజారులు పనిచేస్తున్నారు. ఘనాదేశంలో ఒక Local Black స్వాములవారు శైవ పీఠాధిపతిగా ఉన్నారు. ఈ రకంగా ఈరోజున ఇది ఒక అంతర్జాతీయ మతం కనుక దీని హోదాకి అనుగుణంగా మన బుద్ధులూ, చుట్టుచూపూ మార్చుకోవాలి. మార్చుకుని తీఱాలి. గత్యంతరం లేదు. 

ఒక ఆచరణాత్మక సమస్య ఏంటంటే - హిందూమతంలోకి సంపరివర్తిల్లడానికి మంత్రపూర్వకమైన క్రియాకలాపమూ, సంపరివర్తన (conversion) చెందినట్లు నిరూపించే certificates వ్యవస్థ గానీ ఏదీ లేకపోవడం. మారుతున్న హిందూమత స్వభావమూ, అంతర్జాతీయ హోదాల దృష్ట్యా అబ్రహామిక (సెమిటిక్) మతాల వలెనె హిందూమతానిక్కూడా ఇలాంటివి కల్పించాల్సిన అవసరముంది. అలాగే దేవాలయాలకి భౌగోళిక పరిధి కల్పించి వాటికి వచ్చే (ఆ పరిధిలో నివసించే) భక్తుల్ని సభ్యులుగా నమోదు చేసుకునే వ్యవస్థ కూడా రావాలి.

కామెంట్‌లు లేవు:

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి