22, మార్చి 2013, శుక్రవారం

ఈపూజలు,జపాలు, దీక్షలు ...అసలు ఇవన్నీ అవసరమా ??

ఓ భక్తుని ఆవేదన 
-----------------
అనేక సంవత్సరాలుగా నన్ను ఒక ప్రశ్న బాధిస్తున్నది. దయచేసి నాకు వికుక్తి కలిగించమని వేడుకుంటున్నాను.
ఇట్లా కనకధారా స్తోత్రం హనుమాన్ చాలీసా, సాయి భజన, అయ్యప్ప మాల భజన, ___ పాప పరిహార పూజ, ___ గురు భజన, నవగ్రహ స్తోత్రం, లక్ష కుంకుమార్చన, కోటి ___అర్చన, నాగ పూజ, ఐశ్వర్య మంత్ర పఠన, ___ యంత్రాలు, ___Powerfulతాయిత్తు  .... ఇట్లా ఇవన్నీ అవసరమా?
మనపేర్లమీద పూజలు అవసరమా?
దేవుడికి మొక్కులు / proposals అవసరమా? 
ఎవరో కష్టపడి పూజలు చేసుకుంటుంటే నాపేరు కుడా చెప్పండి... అవసరమా?
మనిషై పుట్టినందుకు 'నా' గురించి పైనంవి తెలియచెయ్యవు కదా.  నా గమ్యము ఏమిటి అది చేరుకోవటానికి నేను ఏమి చెయ్యాలి  అని ఎందుకు ఆలోచించను?
ఆ దేవదేవుని చేరుకోవడానికి కావలసిన వాటిని గురించి నేను ఎందుకు తొందర పడట్లేదు?  పైవన్నీ నా సమయాన్ని, శక్తిని వృధా చేస్తూ, నా గమ్యాన్నించి నన్ను దూరం చేస్తున్నాయి.  ఇది నాకు ఎందుకు స్పురించదు ? 
ఒక్క నిముషము లో గమ్యాన్ని మరిచిపోతున్నానెందుకు?
అమ్మ అయ్య నుంచి దూరం కాకుండా నన్ను ఎవరైనా లాగి చెంప పగలగోట్టరా?
ఇది భగవత్ భక్తి నుంచి దూరం చేసే లేఖ అని deleteచెయ్యకండి.  ఏమి చెయ్యలేక పోతున్నాను. అంత్యకాలం దగ్గర పడుతోంది.  ఎన్నో జన్మల పూజ ఫలితంగా ఈ జన్మ దొరికింది.  ఇది గూడా కరిగి పోతోంది.  వాడి దగ్గరికి ఎట్లా చేరాలో తెలిసేలోపే తెల్లారిపోతే ఇంకా ఎట్లా?  ముందరే goal చేరాలి. ఓడిపోవటానికి వీలు లేదు.  ఆ ఛాన్స్ లేదు.  ఎట్లా?
క్షమించండి.  ఇది ఎవ్వర్నీ బాధ పెట్టాలని కాదు.  ఇది నా బాధ.
దాసుడు
----------------------------------------------------------
మొదటి సభ్యుని సమాధానం

అదే మీ ఉద్దేశ్యం అవుతే ప్రపంచాన్ని మరిచి పోయి ధ్యాన ముద్రలో కి వెళ్లి సో హం
అంటూ ధ్యానం చేస్తే ఆత్మ దర్సనమవుతున్దనీ అదే పరమాత్మను తెలుసుకోవడమనీ విజ్ఞులు సెలవిస్తారు.
నా మటుకు నాకు రెండు నిముషములు కదలిక లేకుండా కూర్చోవడము చాత కాదు.
---------------------------------------------------------------------------------
రెండవ సభ్యులు

అవసరమా అని అడిగితే, ఏమని  సమాధానం ఇవ్వాలి?? సమాధానం  ఇవ్వటానికి ఇంకో రెండు ప్రశ్నలు ఎదురవుతాయి. 

ఎవరికి అవరరమా అని అడుగుతున్నారు? ఏ వయస్సులోవారికి? ఏ ఆశ్రమంలోని వారికి? ఏ పక్వతలో, ఏ స్థిలోని  వారికి? ఎట్టి గురువును ఆశ్రయించినవారికి?  
ఎందుకు అవరరమట, (కిమర్థం ఇతి)??

అంటే ఏది సాధించటానికి, ఏది ప్రాప్తమవటానికి  ఉపాయంగా అవసరమా కాదా అని అడుగుతున్నారు? ఏ ప్రురుషార్థం సాధించటానికి ఉపాయంగా అవసరమా కాదా అని అడుగుతున్నారు??

ఇవి అందరికీ ఒకేలాగ కాక -  వ్యక్తిగతంగాను, అవస్థానుగుణంగాను, కాలానుగుణంగాను, స్థిత్యనుగుణంగాను -  నిర్ణయించవలసినది కాబట్టి,  వారి వారికి అవసరమా కాదా అని వారి వారి గురువులు, వారి సమగ్ర  పుగామానికి బాధ్యత వహించినవారు నిర్దేశించాలి అని నా ఉద్దేశ్యం.   


శ్రీరమణార్పణమస్తు
---------------------------------------------
మూడవ సభ్యులు

నమస్తే,

అయ్యా!! శ్రీభరద్వాజ గారు చెప్పినట్లుగా ఈ ప్రశ్న ఒక వ్యక్తి ఉన్న స్థాయిని బట్టి ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం వ్రాసే ముందు పూజ్య గురువు గారు బ్రహ్మశ్రీచాగంటికోటేశ్వర రావు గారు ప్రవచనములలో చెప్పిన రెండు ఉదాహరణలనే ఇక్కడ ఉటంకిస్తున్నాను. నేను వ్రాయడంలో ఏమైనా తప్పులుంటే క్షమించండి.


మొదటి ఉదాహరణ, తిరుమల ఆనంద నిలయంలో కొలువై ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి రోజూ కొన్ని వేల మంది/లక్షల మంది ఆర్తితో వెడుతూ ఉంటారు (ము..) కదా. ఒకసారి గురువు గారన్నారు, మనందరికీ లఘు దర్శనము/మహాలఘుదర్శనము అని ఒక్క నిమిషంలో రెక్క పట్టుకుని ఆలయ నిర్వాహకులు బయటికి లాగేస్తున్నారు కాబట్టి పర్వాలేదు కానీ, అదే ఈ రోజు వచ్చినవాళ్ళందరిని ఉదయం స్వామి వారి సుప్రభాత సేవ దగ్గర నుంచి రాత్రి పవళింపు సేవ వరకు ఇక్కడే ఉంచేస్తారు అని చెప్పారు అనుకోండి. ఇక అప్పుడు మొదలవుతుంది అసలు అల్లరి అంతా... "ఏమండీ మధ్యలో ఏమైనా ప్రసాదం పెడతారా? మధ్యలో ఒకసారి కాఫీ గట్రా ఏమైనా ఇస్తారేంటి?............." ఇలా ఎవరెవరికి ఏ ఏ ఇంద్రియ లౌల్యాలు ఉంటే దానికి తగ్గ ప్రశ్నలు, మనసులో ఇబ్బంది మొదలవుతాయి. ఈ మాట వేంకటేశ్వరస్వామి వారి మీద జనాలకి భక్తి లేదని నిరూపించడానికి కాదు. భక్తి ఉన్నా, ఒక త్యాగరాజస్వామి వారిలాగా, ఒక భగవాన్ రమణులలా సర్వము మర్చిపోయి, తండ్రీ నన్ను నీ చెంతనే కూర్చోపెట్టుకున్నావా!! అని సంబరపడిపోయి, నిద్రాహారాలు లేకున్నా ఒక రోజేమిటి ఎన్ని నెలలయినా తపస్సమాధిలో కూర్చోగలిగే ఆధ్యాత్మిక బలం కలిగిన మహాపురుషులు వారు. కానీ నాబోటి గాడికి నిజంగా జన్మానికి ఎప్పుడో ఒకసారి అలాంటి మహత్తర అవకాశం ఇస్తే ఏమో కానీ, ఎప్పుడు తిరుమల వెళ్ళినా, వెళ్ళిన వారిని కనీసం లోపల పన్నెండు గంతలు అంతరాలయంలో ఉంచేస్తారుట అంటే ఎంత మంది ఉత్సాహంతో వెడతారు?
ఇంకొక మాట చెప్తున్నాను, ఎవరైనా లేదు లేదు... నాకు చాలా భక్తి ఉంది నేను వెడతాను అనుకున్నా.. అది కూడా మళ్ళీ బయటకి వచ్చి అలా స్వామి ఇచ్చిన అంతరాలయ దీర్ఘ దర్శనమును కూడా నలుగురు మిత్రులతో చెప్పుకుని ఆనందపడడానికే ప్రథమ ప్రయోజనం అవుతుంది. తప్ప బయటకి వచ్చేసినా ఇంకా ఆ తన్మయం నుంచి బయటపడలేక, భార్యాపిల్లలు పలకరిస్తున్నా మాట్లాడలేని ఉన్మత్తావస్థలోకి మనలో ఎంత మందిమి వెళ్ళగలము? 


ఇక రెండవ ఉదారణ, పూజ్య గురువు గారు చెప్పినదే...."ఒక పెద్దాయన బాగా ఆధ్యాత్మిక ప్రవచనములు చెబుతూ ఉంటారు, సరే ఆ ప్రవచనాలకు ఆయన భార్య యొక్క చిన్న తమ్ముడు, వయసులో బాగా చిన్నవాడు, వాడు కూడా రోజూ బావ గారు చెప్పే ప్రవచనాలు వినడానికి వేళ్తూ ఉంటాడు, ఒక రోజు, ఆ పెద్దాయన భార్య ఆయనకి భోజనం పెడుతూ అంటుంది, "ఏమండీ మీరు చెప్పే ఆధ్యాత్మికోపన్యాసలకు మా తమ్ముడు మరీ భక్తితో పిచ్చి పట్టేట్లా ఉన్నాడు, కాస్త వాడికి ఇవన్నీ చెప్పకండీ... వాడికి చిన్న వయసులోనే మరీ వైరాగ్యం వచ్చేస్తే, పెళ్ళి చేసుకోనని.. మారాం చేస్తాడేమోనని భయంగా ఉంది......" అంటూ ఆ తల్లి తమ్ముడి గురించి చెబుతూ ఉంటుంది. ఇవన్నీ వింటున్న ఆ పెద్దాయన ఒక్కసారి లేచి, ఒంటి మీద ఉత్తరీయం దులుపుకుని, ఉన్నపళంగా లేచి ఇంట్లోంచి బయటకి వెళ్ళిపోయారుట. ఇక ఆయన ఎన్నడూ తిరిగి రాలేదు, ఎందుకంటే ఆయనకి సాంసారిక జీవితం పైన "నిజమైన వైరాగ్యం" కలిగిందిట. 

పై రెండు ఉదాహరణలు చూడగా, ఇంకా పెద్దల నుంచి విన్నది, గ్రంధాలలో చదివినదాని ప్రకారం, నాకు అర్ధం అయ్యింది ఏమిటంటే, 
"వైరాగ్యం అనేది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది మన చేతిలో ఉండదు. ధర్మ బద్ధమైన అర్ధము, ధర్మబద్ధమైన కామము పట్టుకుని జీవనం సాగిస్తూ ఉంటే, ఒకనాడు దానంతట అదే వైరాగ్యం కలుగుతుంది.... సుఖము సుఖము అనుకున్నది ఇది సుఖమా... అని. వైరాగ్యం ఎప్పుడూ తెచ్చిపెట్టుకోకూడదు. తెచ్చిపెట్టుకున్న వైరాగ్యం మనల్ని ఆధ్యాత్మికంగా క్రిందకి పడేస్తుంది. వైరాగ్యం కావాలి అని కోరుకోవడం తప్పుకాదు, కానీ బలవంతముగా కాదు. 
ఇక ఇలా ఎప్పుడూ ధర్మబద్ధమైన అర్ధము, ధర్మబద్ధమైన కామము అనుకుంటూ, ఎన్ని జన్మలు ఇలా భోగాలు, సుఖాలు, వాటితో పాటు కొన్ని కష్టాలు అనుభవించాలి? అమ్మ అయ్యలలో ఐక్యం అయ్యేది ఎప్పుడు? అనే విషయానికి వస్తే, మనం పూర్వ జన్మలలో (భగవంతుడిని నుంచి విడివడ్డాక ఎన్ని కోట్ల జన్మలు ఎత్తామో....), అందునా మానవ ఉపాధిలో, ఎవరెవరికి ఏ వాగ్ధానాలు చేశామో, ఎవరెవరికి  మాట ఇచ్చామో, మనం ఏ ఏ కోరికలను అనుభవించాలని ఆశపడ్డామో, ఎవరెవరికి ఎంత ఋణపడ్డామో,..... ఇలా ఎన్నో ఋణానుభంధాలు, కర్మలు విశేషంగా పేరుకున్నాయి. అవన్నీ తీరితే తప్ప (పాప కర్మలయినా + పుణ్య కర్మలయినా) మోక్షం అనే స్థితికి దగ్గరగా కూడా వెళ్లలేము.

సరే ఆ ఋణానుబంధములు, కర్మ శేషం ఎప్పటికి తీరేను అంటే.... భగవాన్ రమణుల తల్లి గారంతటి వారికి, భగవాన్ కొన్ని గంటల పాటు, అమ్మ గుండెలపై చెయ్యి వుంచి, అమ్మకి ఎన్నో జన్మల కర్మశేషం అనుభవింపచేశారు అని చెప్పారు. అలాంటిది, నాలాంటి వాడికి ఎన్ని జన్మలున్నాయో.. 

అందుకనే జగద్గురువులు ఆదిశంకరులు నాలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని, కారుణ్యంతో అంత వాఙ్మయం ఇచ్చారు. "ఒరేయ్ ఎన్ని జన్మలో ఎన్ని జన్మలో అని బెంగపడకురా... ఏ జన్మ ఎత్తినా స్వామీ నాకు నీయందు భక్తి ఉండాలి, నేను ఎప్పుడూ ఏ జన్మలో అయినా నీ నామం చెప్పేలా అనుగ్రహించు అని శివానందలహరిలో ....

నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననమ్
సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ
విహారాసక్తం చేధృదయ మిహ కిం తేన వపుషా II శివానందలహరి 10 వ శ్లోకం II

అని చెప్పారు. 
 
అలాగే అందరూ సాధారణంగా అనుకున్నట్లు కనకధారాస్తోత్రం పఠించడం వల్ల, కేవలం ఎప్పుడూ డబ్బుకట్టలు/బంగారు కాసులు వచ్చి పడిపోవాలని ఒక్కటే కాదు. మన ఋషులు, గురుపరంపరలోని పెద్దలు ఎప్పుడు ఏది చెప్పినా, ఏ స్తోత్రం ఇచ్చినా, ఏ క్రతువు ఇచ్చినా, అది స్థూలముగా ఒక కామ్య కర్మ కోసమే అనిపించినా, అంతర్లీనంగా, ఆ కర్మని నెరవేర్చడంలోనూ, ఆయా స్తోత్రాదులను పఠించడంలోనూ మనం ఈశ్వరుని పాదములను చేరుకునే దిశగానే పయనిస్తాము. అది మన ఋషుల/జగద్గురువుల వైభవం. 

ఉదాహరణకి, శ్రీరుద్ర నమకంలో మంత్రములను, అవి కామ్యము కోసం (యజ్ఞంలో) వాడే మంత్రములు అని భావించేవారున్నారు. కానీ యథార్ధానికి రుద్రం ఒక ఉపనిషత్తు. ఉపనిషత్తులు వేదాంతాన్ని బోధిస్తాయి. అంటే శ్రీరుద్రం వేదాంతమే. కానీ ఒక సాధకుడు ఉన్న స్థితిని బట్టీ, అతను ప్రథమంలో రుద్రాన్ని కామ్య కర్మలకొరకు, యజ్ఞం కొరకు, అనుసంధానం చేసినా, అంతర్లీనముగా ఆ మంత్ర పఠన, శ్రవణ ఫలముగా రాబోవు రోజులలో అతనికి ఆత్మ సాక్షాత్కారం వైపు వెళ్ళేట్లుగా కర్మ క్షయం అవుతూ, వైరాగ్యం కలిగి, ఆఖరికి మోక్షం పొందగలరు. అని పెద్దల వాక్కు.

చివరిగా ఒకే ఒక్క విషయం నేను మననం చేసేది. ఈ విశ్వం అంతా విష్ణువే అయినప్పుడు, నాకు పరమపదం లభించడం,. ఆ పరమపదం పొందినప్పుడు ఒక్కటే ఆనందం కాదు, ఆ చేరుకోవడంలో ఈ దారి అంతా కూడా మన ఆనందముగా మనకి కనబడాలి అంటే, గురువులు/ఋషులు ఇచ్చిన కర్మకాండ ఆచరించడం వల్ల మాత్రమే సాధ్యం.

ఇంతకు పూర్వపు జన్మలలో ఏ పాపాలు చేశానో, ఈ జన్మలోనాకు కొన్ని నవ గ్రహ దోషాలు ఉన్నాయి, కానీ ఋషులు కారుణ్యంతో ఆ పాపకర్మలన్నిటికీ "అనుభవిస్తేనే" తీరతాయి అని నిర్బంధించకుండా, పరిహారాలు, నవగ్రహపూజలు, నాగప్రతిష్టలూ, కనధారాస్తోత్రాలు, కుంకుమార్చనలు, రుద్రాభిషేకాలు, నాగపూజలు, అయ్యప్ప మాల, భజనలు, హనుమాన్ చాలీసా, యంత్రాలు........................................ వగైరా వగైరా ఇచ్చారు. కానీ ఇవన్నీ ఆచరించడం వల్ల ఎప్పుడూ ఆ కామ్యం పొందడం ఒక్కటే మనకి జరిగే ప్రయోజనం కాదు. అంతర్లీనంగా మనం ఆత్మోద్ధరణ వైపుకి కూడా ఈ కర్మలు ఆచరించడం వల్ల పయనిస్తూ ఉంటాము.

ఎక్కువగాగానీ, అసంబద్ధముగానీ, తప్పుగాగానీ వ్రాసి ఉంటే, పెద్దలు క్షమించి, సరిదిద్దగలరు.

సర్వం శ్రీమన్నారాయణార్పణమస్తు.
------------------------------------------------------------------------------------------
ాలుగభ్యులివ

స్తోత్రాదుల పఠనం, పూజలు వ్రతాలు దీక్షలు అన్నీ కర్మానుష్ఠానం కిందకే వస్తాయి. మన మనసులు కుదురుగా నిలవడానికి చిత్తశుద్ధి కలగడానికే. భక్తితో కూడిన కర్మాచరణం వల్ల జ్ఞానం సిద్ధించి నిశ్చలంగా నిలుస్తుంది. పాలు పోయడానికి శుభ్రమైన పాత్ర ఎంత అవసరమో పరమ జ్ఞానం పొందడానికి చిత్తశుద్ధి అంతే అవసరం. చిత్తశుద్ధికి దోహదపడేవే ఇతర కర్మాచరణములన్నీ... అని గురువుల, పెద్దలైన వారి  వాక్కు.

డాక్టరుగారు చెప్పినట్లు వర్ణ ఆశ్రమ బేధాలతోపాటు, సాధనలో స్థాయీ బేధాల ననుసరించి, ఏ పురుషార్థం గురించి ఎంతవరకు కర్మానుష్ఠానము చేయాలి? ఏది ఎంత వరకు అవసరమనేది స్వగురువులు/ఆచార్యుడు తత్తుల్యులు మాత్రమే సామర్థ్యాన్ని, కాలాన్నీ ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకొని లెక్కకట్టి చెప్పగలరు. అవతలి వ్యక్తి యొక్క సాధన గురించి, ఆయన ఎంత అల్పుడుగా బయటికి కనబడ్డా ఆయన యందు ఎంత భగవత్సంబంధ బరువు పెంపొందినది ఉన్నది అలాగే , డాంబికుడుగా కనబడ్డా అది పైపై విషయమా నిజమైన బరువా..అన్న విషయం అందరికీ తెలియదు కేవలం దానిని కూడా కనిపెట్టి సరిదిద్దుకునే అవకాశం ఇంకా కర్మానుష్ఠానం ఎంతమేర చేయాలి వంటివి చెప్పగలిగేది గురువు/ఆచార్యుడు మాత్రమే. కాబట్టి గుర్వాజ్ఞమేర మనం భక్తి పూర్వక కర్మానుష్ఠానం చేస్తూ ఉండాలి అని పెద్దల సాంగత్యం వల్ల బోధపడింది.

2 కామెంట్‌లు:

astrojoyd చెప్పారు...

మంచి ప్రశ్న ఇది.దేహం అనారోగ్యం బారిన పడినపుడు వైద్యులు రాసే రకరకాల టెస్ట్లు-పరీక్షలు తెల అవసరమో అదే విధంగా మానవ జీవితంలోని పలురకాల మనో కాలుశ్యాలనుంచి విముక్తులు కావడానికి ఈ పూజాలు-జపాలు-దీక్షలు అనేవి తప్పక అవసరమని మన పెద్దలు గుర్తించారు.అయితే వ్యక్తి స్థాయి,పూర్వ పుణ్య వాసనలను అనుసరించి వీటిని ఆచరించాలి గానీ గొర్రెల మంద చందాన చేయరాదు.అసలు ఆధ్యతిమికత అనేది పూర్వ వాసనా బలం వాళ్ళ ఈ జన్మలో కలుగుతోంది అని గీతలో కృష్ణ పరమాత్మ ఆనాడే చెప్పారు కదా?.మిగిలిన వివరణను కరెంటు వచ్చిన తర్వాత ఇస్తాను.

astrojoyd చెప్పారు...

నేను నా రెండోవ సుదీఘ వాఖ్యను పోస్ట్ చేయగా ఎర్రర్ చూపిన కారణంగా దానిని తిరిగి టైపు చేసే వోపికలేదు.సదరు వ్యక్తి నేరుగా నాకు కాల్ చేస్తే సందేహ నివ్రుత్త్హిని చేయగలను.durgeswar gaari vadda nunchi naa cell no pondhavachhunu

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి