21, ఆగస్టు 2012, మంగళవారం

శ్రీమద్రామాయణంలో శబరి, సంపాతి ఇచ్చే అమూల్య సందేశాలు

జై శ్రీరాం, 
శ్రీరామదూతం శిరసా నమామి! 

హరికధా సుధార్ణవ అని బిరుదు గాంచిన ప్రసిద్ధులు, శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి గారు  ఒకచోట హరికధ చెప్తూ ఈ కీర్తన పాడారు. 

రామా కోదండరామా, రామా కళ్యాణరామా! 
రామా సీతాపతీ, రామా నీవేగతి రామా! 
రామా నీకొక మాట, రామా నాకొక మూట! 
రామా నీ బాటే బాట, రామా నీ మాటే మాట! 
                       (రామా) 
రామ నామమే చాలు, రామ చింతనే మేలు(౨) 
నామమే చాలు చింతనే మేలు 
------------ 

ఎంత అద్భుతమైన భావన. రామనామమే చాలు, రామచింతనే మేలు. నిజమేకదా మరి. రామనామం తోడుగా ఉంటే చాలు, ఇంకేం కావాలి? ఆ చల్లని తండ్రి గురించి చింతిస్తే చాలు అదే మనకు మేలు. ఎప్పుడో రాముడొస్తాడని ఎదురుచూస్తూ కూర్చున్న వారు రామాయణంలో చాలామంది ఉన్నారు. వారిలో ఋషులు కానటువంటి ఇద్దరి గురించి ఇప్పుడు విషయం. ఒకరు శబరి మరొకరు సంపాతి. కేవలం తనగురువుగారు చెప్పారంతే రాముడొస్తాడు, అప్పుడు మన ఆశ్రమం బోసిపోయినట్టు ఉంటే బాగోదు. నువ్వుండి ఆయనకి ఆతిధ్యం ఇచ్చి రా, అని. అంతే మరేమీ ప్రశ్నించలేదు, ఉండిపోయింది. నిర్దిష్టంగా సమయానికి అని కూడా చెప్పలేదు. కానీ ఎదురుచూసింది. ఇప్పటి తరానికి వేచి ఉండటం అంటే ఏమిటో తెలియచేసేలా ! తొందరపాటుతో సంబంధాలను కూడా జారవిడుచుకునే సంకుచిత మనస్తత్వం కలిగిన మనలాంటివారికి హెచ్చరికగా, ఓపిక అనే గుణం ఎంత గొప్పదో తెలియచేసేలా ఎదురుచూసింది. 

ఇప్పటి నా తరానికి ఓ పెద్దాయన కొంచెం నిదానంగా నడిస్తే అసహనం. అనుకున్న పని సమయానికి అవ్వకపోతే అసహనం. విచక్షణ కోల్పోయి పెద్దా చిన్నా  లేకుండా మాట్లాడటం. వీటన్నిటికీ చెంపదెబ్బ లాంటి సమాధానం, వ్య్యక్తిత్వం తల్లి శబరి సొంతం. ఈ రోజు ఈ ఒక్క గుణం లేక ఏదైనా చిన్న తప్పు జరిగితే సంబంధాన్ని తెంచుకునేదాకా పోతున్నాం. లోకంలో ఏ సంబంధమైనా ఎంత క్షీణదశలో ఉన్నా ఉద్ధరించడం సాధ్యమే. దానికి కావాల్సింది నమ్మకం,ఓర్పు. మన పెద్దవాళ్ళకి పెళ్ళైన  కొత్తళ్ళో సమస్యలు లేవా? ఉన్నాయి? కానీ వారు ఓర్చుకున్నారు. ఓపిక పట్టారు ఫలితంగా ఈ రోజు సమాజంలో తలెత్తుకుని నిలబడే స్థితిలో ఉన్నారు. నాకు అక్క వరసయ్యే ఆమె పదిహేనేళ్ళు తాగుబోతు అయిన మొగుడితో సర్దుకుని కాపురం చేసింది. ఎన్ని కష్టాలు వచ్చినా మంచిరోజులు వస్తాయని మొగుడు మారతాడని నమ్మి ఎదురుచూసింది. ఈ రోజున అతను తాగుడు మానేసాడు. వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా ఉంది. కూతురికి మంచి సంబంధం చూసి పెళ్ళి కూడా చేసాడు. సమాజంలో గౌరవం సంపాదించుకున్నాడు. అందుకే ఆ తల్లి శబరికి నా శతకోటి ప్రణామాలు. నా తరానికి నీ గుణాన్ని కొంచెం వరంగా ఇవ్వు తల్లీ....... 

శబరి లాంటి వారే మరొకరు సంపాతి గ్రద్ద. నిశాకర మహర్షి చెప్పారు,"రాముడి పని మీద వానరులొస్తారు,వారికి సాయం చెయ్యి" అని. అందుకే కూర్చున్నాడు సముద్రం ఒడ్డున. ఆ నమ్మకం ఇప్పుడు కావాలి నా తరానికి. దైవానికి, భౌతిక ప్రపంచానికి మధ్య ఊగిసలాడే నా తరం భగవంతుడిచ్చే ధైర్యాన్నిపొందాలంటే ముందు నమ్మకం కావాలి. ఆ నమ్మకానికి నిలువెత్తు ప్రమాణమే సంపాతి. ఒకరకంగా సంపాతిని చూస్తే, అనుభవశాలి అయిన  ఒక శతవృద్ధుడు కనిపిస్తాడు. ఆయన అనుభవంతో చాలా కష్టాలు గట్టెక్కించగలడు. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళున్న వారికి ఇది అనుభవమే. అలాంటిది మనం వారిని భారంగా చూస్తున్నాం. సంపాదించే సత్తువ పోయినా కొడుకు పంచన ఉండాలని తండ్రి కోరుకునేది అలాంటి సాయం చెయ్యడానికే. ఆయన వల్ల మనం సంతోషపడితే మళ్ళీ ఱెక్కలొచ్చినంత ఆనంద పడతాడు. మనం కూడా ఆ రాముని పట్ల నమ్మకాన్ని, ఓర్పుని అలవర్చుకుని జీవితాన్ని నందనవనంలా తీర్చిదిద్దుకుందాం. 

బోలో శ్రీ రామచంద్ర మహరాజ్ కీ జై 
సీతా మాయికి  జై 
పవనసుత హనుమాన్ కి జై............ 
సర్వం శ్రీసీతారామచంద్ర పరదేవతా పరబ్రహ్మార్పణమస్తు. 


ఏమైనా  తప్పుగా రాసి ఉంటే పెద్దలు మన్నించి నన్ను సరి చెయ్యగలరు. 


భవదీయుడు, 
మనోహర్ చెనికల....

(వ్యాసరచయిత TCS లో సాఫ్టువేరు ఎంజినీరుగా పనిచేస్తున్నారు)

2 కామెంట్‌లు:

VJ చెప్పారు...

క్షమించాలి,

చివర్లో వ్యాసరచయిత TCS లో సాఫ్టువేరు ఎంజినీరు అని ప్రస్తావన ఎందుకు?

anrd చెప్పారు...

చక్కగా వివరించారండి.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి