14, ఫిబ్రవరి 2012, మంగళవారం

శ్రీరామరాజ్యం చలనచిత్రం యొక్క ఆర్థిక పరాజయం

ఇటీవల ఒక గూగుల్ గుంపులో జఱిగిన చర్చ

ఒక సభ్యుడు

మిత్రులారా ! నేను సర్వదా ఆధ్యాత్మిక/ పౌరాణిక చలనచిత్రాల విజయాన్ని కోరుకుంటాను. కానీ నేను శ్రీరామరాజ్యం చూడలేదు. కొన్నిరోజులు పోయినాక ఎలాగూ CDs వస్తాయి గదా ! ఇంట్లోనే చూసుకుందామని ! అయితే ఆ సినిమా ఎక్కువ ప్రదర్శనాకేంద్రాల్లో బాగా ఆడలేదని వార్తలొచ్చాయి. దాని నిర్మాత నష్టాల్లో ఉన్నాడని కూడా చెబుతున్నారు. ఇది విన్నాక ఒక రామభక్తుడుగా నాకు బాధ కలిగింది, "ఇలా ఎందుకు జఱిగిందా ?" అని ! 

౧. బాపులాంటి దర్శకేంద్రుడు, నందమూరి బాలకృష్ణలాంటి జనరంజక కథానాయకుడూ పనిచేసిన ఈ చలనచిత్రం ఎందుకిలా అంచనాలు తప్పింది ? వయోవృద్ధత్వం వల్ల బాపుగారిలో దర్శకత్వపటిమ మందగించిందా ? లేదా అదే కారణం చేత బాలకృష్ణ ఆ పాత్రకి సరిపోలేదా ? లేక బాలకృష్ణ మూర్తిమత్త్వానికి (image) ఆ పాత్ర సరిపడలేదా ? లేక ప్రజలు "లవకుశ" రామారావుగారితో బాలకృష్ణని పోల్చుకొని తిరస్కరించారా ? 

౨. అంతకంటే ముఖ్యంగా ప్రజల్లో ఆధ్యాత్మిక, హిందూవాసనలు తగ్గిపోతున్నాయా ? ఆద్యంతమూ కుసంస్కారభూయిష్ఠమై, ఒక సాధారణ మగవాణ్ణి భగవంతుడిలాంటి సర్వశక్తిమంతుడిలా చూపిస్తూ తప్పుడు సందేశాలిచ్చే దూకుడు, బిజినెస్‌మాన్‌లాంటి చెత్తాగ్రేసరాలకి రోజుకు రు.50 లక్షలూ, కోటి, రెండుకోట్ల చొప్పున వసూళ్ళు కావడమేంటి ? మన నిజమైన సాంస్కృతిక మహాపురుషుల జీవితచరిత్రలు ఇలా బోల్తాపడడమేంటి ? జనాల్లో ఆదర్శవాదం తగ్గిపోతోందా ? తప్పుడు నమూనాపాత్రల (false role models) వెంటపడుతూ సిసలైన ఆదర్శపురుషుల్ని బుట్టదాఖలా చేసే స్థాయికి వీళ్ళు దిగజాఱిపోయారా ? అంటే 'లవకుశ' కి అఖండవిజయాన్ని చేకూర్చిన అలనాటి ప్రేక్షకుల తరం దాటిపోయి ఇలాంటి అప్రయోజక తరం మనకి సంప్రాప్తమయిందా ? 

౩. ఏ సినిమాకైనా ప్రేక్షకురాళ్ళ ఆదరణ కీలకం. ఈ పరాజయం వెనుక భగవంతుడైన శ్రీరామచంద్రమూర్తి పాపులారిటీని దెబ్బకొట్టిన రంగనాయకమ్మ లాంటి మార్క్సిస్టు, ఫెమినిస్టు శక్తుల పాత్ర ఎంత ? వీళ్ళు మన అంచనాలకి మించి జనంలోకెళ్ళి విజయం సాధించారా ? వీళ్ళ విజయం ఈ సినిమా పరాజయం రూపంలో వ్యక్తమవుతోందా ? 

ఆలోచించండి.

రెండో సభ్యుడు 

ఒకటి - ఆధ్యాత్మిక భావాలు జనంలో సన్నగిల్లుతున్నాయి అనడానికి సందేహించనక్కరలేదు. గుంపులుగుంపులుగా కనపడుతున్న భక్తసందోహాలలో ఎక్కువగా భయమే తప్ప భక్తి కనిపించడం లేదు. మనసున భక్తి నిండివున్న నాటితరంలో లవకుశకున్న ఆదరణ నేడు లేకపోవడానికి ఇదొకకారణం. గతంలో మాస్ హీరోలుగా గుర్తింపున్న జూనియర్ ఎన్ టి ఆర్ , అల్లు అర్జున్ శక్తి, బద్రి  చిత్రాల పరాజయంలో  ఏదో హైందవవ్యతిరేకుల పాత్రకూడా ఉండవచ్చనిపించింది . ఎందుకంటే అవి హైందవభావాల ప్రచారంతో కూడుకుని ఉన్నాయి కనుక . ఇక రామాయణం లాంటి మహాకావ్యాన్ని తెఱకెక్కించేటప్పుడు నాడు ఉన్న నటులలో దైవభక్తి పరాయణులు మమేకమై నటించారు. నేడు కేవలం డబ్బుకు నటించే వారి వల్ల పవిత్రభావాలు పలికించటం దర్శకులకు వీలుకాలేదేమో ననే అనుమానం ఉంది.

మూడోసభ్యుడు

 జనం ఆధ్యాత్మిక భావాల్ని కేవలం గృహస్థానికే పరిమితం చేసుకున్నట్లుగా గోచరిస్తుందండి. చలనచిత్రాల విషయంలో ఐతే కుటుంబసమేతంగా వెళితే రూ500/ అంతకంటే ఎక్కువ అవుతుంది. చిత్రనిర్మాణవ్యయం కూడా ఆధ్యాత్మిక మఱియు చెత్తాగ్రేసరాలకి  చాల వ్యత్యాసం ఉండటం , టికెట్ ఖరీదు మఱియు నమూనానటుల పారితోషికాలు  తగ్గితేనే కానీ పౌరాణిక చిత్రాలకూ , కుటుంబకథాచిత్రాలకూ మళ్ళీ ఆదరణ రాదు. 

నాలుగో సభ్యుడు

బద్రి, శక్తి సినిమాల పరాజయానికి కారణం, బలహీనమైన కధ, అతి బలహీనమైన కధనం. ఇక శ్రీరామరాజ్యం సినిమాకి వచ్చేసరికి, చిత్ర నిర్మాణ వ్యయం బాగా ఎక్కువ అవడం వల్ల ఆర్ధికంగా పరాజయం పాలయ్యి ఉండవచ్చు. కానీ చాలా చోట్ల ౫౦ రోజులు దాటి ఆడింది. ప్రస్తుత మల్టీప్లెక్స్ థియేటర్ల కాలంలో ఒక తెలుగు సినిమా ౫౦ రోజులు ఆడిందంటే అది చాలా బాగున్నట్లే. మన తెలుగు సినిమాలలో భారీ చిత్రాలు విజయం సాధించాలంటే అందుకు తగ్గ స్టార్‌డమ్ ఉన్న కధానాయకులు కూడా ఆ సినిమాలకు అవసరం. "32 కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమాకు సరిపడా స్టార్‌డ‍మ్ బాలకృష్ణకు ఉందా ?" అంటే అనుమానమే!!!

ఐదో సభ్యుడు


ఇవన్నీ కాక, నాకు మఱొక కారణం కూడా కనబడుతోందండీ. అది, మనలాంటివారిలోనే (నాతో కలుపుకుని) తరువాత తీఱిగ్గా ఇంట్లో చూద్దాంలే అని సినిమాతెఱపై చూడకపోవటం.

ఆఱోసభ్యుడు

౧) మెటీరియలిజమ్ 
౨) విలువలు మారడము 
౩) సెక్యులరైజేషన్ ఆఫ్ హిందువులు 
౪) సెక్యులర్ ఎడ్యుకేషన్ 
౫) కొత్త జెనరేషన్స్ 
౬) Saturation of Entertainment Industry (Cinema, TV, Internet, YouTube,Smart Cell Phones, Texting, etc) 
౭) ఇతరములు 



ఏడో సభ్యుడు

"ఈ పరాజయం వెనుక భగవంతుడైన శ్రీరామచంద్రమూర్తి పాపులారిటీని దెబ్బకొట్టిన రంగనాయకమ్మలాంటి మార్క్సిస్టు, ఫెమినిస్టు శక్తుల పాత్ర ఎంత ?" అని ప్రశ్నిస్తున్నారు మీరు.

భగవంతునికి పాపులారిటీయా? దాన్ని మానవమాత్రులు దెబ్బకొట్టడమా?

మొదటి సభ్యుడు 

ఆర్యా !  ఫెమినిస్టులూ, కమ్యూనిస్టులూ గత దశాబ్దాల్లో భగవదవతారాల్లో ఒకదాని మీద విస్తారంగా దుష్ప్రచారం చేసిన మాట వాస్తవమే కదా ? ఆ ప్రచారానికి తలొగ్గి చాలామంది నాస్తికులై రాములవారిని పూజించడం మానేసిన మాట కూడా వాస్తవమే కదా ? ఒకప్పుడు రాష్ట్రమంతటా అత్యంత భక్తిశ్రద్ధలతో జఱపబడ్డ శ్రీరామనవమి, దాని కోసం వేసిన పందిళ్ళూ, ఆ 9  రోజుల కార్యక్ర్తమాలూ ఈనాడు సంపూర్ణంగా అదృశ్యమైపోవడానికి కారణం ఈ ప్రచారం కాదా ? ఈ ప్రచారంతో తెలుగుస్త్రీల మనసుల్ని కలుషితం చేయడం విజయవంతంగా జఱిగింది కదా ? ఎంత భగవంతుడైనా ఈ దుష్ప్రచారానికి రాములవారు గుఱయ్యారనేది స్పష్టంగా కనిపిస్తోంది కదా ?

ఎనిమిదో సభ్యుడు

నాకు మటుక్కు చిత్రం నచ్చిందండీ. చాల కాలం తరువాత ఆంగ్లాధ్రమిశ్రమ సంభాషణలు లేకుండా తీసిన చిత్రం కావడం ఒక పెద్దకారణం. నచ్చని చిన్నచిన్న విషయాలు కొన్ని ఉన్నాయి కానీ మొత్తం మీద మంచి చిత్రమే. అయితే ఆర్థికంగా విజయవంతం కాలేదంటే ఆశ్చర్యంగానే ఉంది.  బాగానే డబ్బు కూడబెట్టిందని ఎక్కడో చదివిన గుర్తు.

మొదటి సభ్యుడు

తొలిరోజు వసూళ్ళు బావున్నాయని నేనూ చదివాను. తొలిరోజున రూ.5 కోట్లు వసూలు చేసిందట. కానీ తరువాతి వారాల్లో అంత ఊపు కనిపించలేదని విన్నాను. కొన్ని ప్రదర్శనకేంద్రాల్లో బాగా ఆడినా ఎక్కువ చోట్ల సగటు-సరాసరిగా ఆడడం చేత లాభం మాత్రం రాలేదంటున్నారు. నష్టం వచ్చిందా ? లేదా ? వస్తే ఎంత ఎంత ? ఇలాంటి వివరాలు మనకి తెలీదు.

నాలుగోసభ్యుడు

శ్రీరామరాజ్యం పుస్తకంగా రాబోతుంది...

తొమ్మిదో సభ్యుడు

"మంచి ప్రారంభవసూళ్లు వచ్చాక కూడా నిలదొక్కుకోలేదు" అని అందఱూ చెపుతున్నదే. నా దృష్టిలో ప్రస్తుత స్థితికి కారణాలు-

 ౧. బాపు దర్శకత్వలోపమైతే కాదు. అది నిస్సందేహంగా ఒప్పుకోవల్సినదే. ప్రతీ ఫ్రేమూ ఎంతో అందంగా ఒక చిత్రకారుని కుంచె నుంచి వెలువడినట్లు ఉంది. చాలా సన్నివేశాల చిత్రీకరణ అత్యున్నత స్థాయిలో ఉంది. అద్భుతమైన గ్రాఫిక్సు వాడుకున్నారు.

౨. సినిమా చూసిన వారెవఱైనా వెంటనే చెప్పే విషయం ఈ సినిమా శ్రీరాముని రాజ్యం గుఱించి కాదు, సీతా దేవి వనవాసం గుఱించి అని. ఈ విషయంలో ప్రేక్షకులు నిరుత్సాహపడి ఉంటారని చెప్పగలను.

౩. బాలకృష్ణ గత చిత్రాలైన "పాండురంగడు" వంటి చిత్రాల ప్రభావం పడి ఉండవచ్చు.

౪. ఆఖరుకు దేవుని చిత్రంలో కూడా నందమూరి భజనను పక్కకు పెట్టకపోవటం ( ఒక సన్నివేశంలో రఘువంశ మహారాజులను చూపించే క్రమంలో రామారావును కూడా చూపించడం జఱిగింది. ఈ సన్నివేశానికి అనుకోని స్పందన కూడా లభించింది)

౫. అక్కినేని వారు వాల్మీకి పాత్రను అత్యద్భుతంగా పోషించారని అనేక వెబ్ సైట్ ఘనులు సెలవిచ్చినప్పటికి ప్రేక్షకులను రంజింప చెయ్యలేకపోయారు.

౬. ఎప్పుడైతే ప్రేక్షకులు సినిమా "ఇది శ్రీ రాముని రాజ్యం కాదు, సీతా వనవాసం" అని గ్రహించారో వెంటనే వద్దన్నా ఆనాటి లవకుశ గుర్తుకు వస్తుంది. వెనువెంటనే బాలకృష్ణను రామారావుతో, నయనతారను అంజలీ దేవితో మఱియు నాగయ్య గారితో నాగేశ్వరరావును పోల్చడం మొదలు పెట్టారు. అందువల్ల ప్రేక్షకులు నిండుభోజనం కాదు సగం భోజనమే తిన్నామన్న భావన వచ్చి ఉండవచ్చు.

౭. ఇక సంగీతం, ఇళయరాజా మంచి సంగీతాన్నే అందించినా, లవకుశ తో పోల్చినప్పుడు ఆ స్థాయిలో రంజింపచేయదు 
 
౮. ఇక, అన్నిటికన్నా ప్రధానం యువ ప్రేక్షకులకు హిందూ సినిమాల మీద ఆసక్తి సన్నగిల్లడం.

౯. ఎప్పుడైతే  ప్రేక్షకులు లవకుశ తో పోల్చారో వృద్ద మఱియు కుటుంబ ప్రేక్షకుల సంఖ్య హటాత్తుగా పడిపోతుంది. అదే  సమయంలో యువ ప్రేక్షకుల అనాసక్తి కూడా ఇతోఽధికంగా సాయం చేసింది.

౧౦. అలాగే గత దశాబ్దంలో  హిందూ భక్తి సినిమాల పేరుతో తీసిన సినిమాల (పాండురంగడు, రామదాసు వగైరా) వల్ల ఇకపై రాబోయే భక్తీ సినిమాల మీద అనాసక్తి పెరుగుతోంది. 

....గారు అనుకున్నట్టు "శక్తి, బద్రీ నాద' లాంటి సినిమాల పరాజయానికి బీజం సినిమా విడుదల అయ్యాక కాదు, ప్రారంభ దశలోనే పడిపోయింది. పిచ్చి పిచ్చి కధలు, దానికి తోడూ హీరో గాలిలోనే ఉండేలా పోరాటాలు చెయ్యడం.

ఈ సందర్భంగా నాదొక చిన్న సందేహం, ఉత్తర రామాయణం నిజంగా వాల్మీకి రాసినదేనా ? లేక చరిత్రలో పుట్టుకొచ్చినదా?

మొదటి సభ్యుడు

ఉత్తర రామాయణం (ఉత్తరకాండ) వాల్మీకిది కాదని కొందఱు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. నాదీ అదే అభిప్రాయం. ఇందుకు కొన్ని కారణాలున్నాయి.

౧. పూర్వరామాయణ శైలీ, ఉత్తరరామాయణశైలీ ఒకే విధంగా లేవు. వేఱువేఱు వ్యక్తులు వ్రాసినట్లు స్పష్టంగా తెలుస్తుంది, సంస్కృతభాషా జ్ఞానం ఉన్నవాళ్ళకి !

౨. ఉత్తరరామాయణం వాస్తవానికి రావణాయణం. ఎందుకంటే అందులో చాలా భాగాన్ని రావణాసురుడి గొప్పతనాన్ని వర్ణించడానికి వినియోగించాడు రెండో వాల్మీకి.

౩. ఏడో కాండని ప్రవేశపెట్టడానికి గల అసలు కారణం (motive) ఏమిటై ఉండొచ్చునంటే - శ్రీరామచంద్రమూర్తి అశ్వమేధయాగం చేసిన సమయానికి సీతమ్మవారు ఆయన దగ్గఱ లేదనే కథని కల్పించగోరడం. ఇలా కథని ట్విస్టు చేయబూనడానికి కారణం - అశ్వమేధయాగంలో పట్టపు రాణీ యాగాశ్వంతో సంభోగిస్తుందనే అపోహ. అంటే శ్రీరాములవారు అశ్వమేధయాగం చేశారంటే, అశ్వమేధయాగ నియమాల ప్రకారం సీతమ్మవారు కూడా ఇలాంటి పనేదో చేసి ఉండాలి కదా అని జనం ఊహించి ఆ తరువాత "హవ్వహవ్వ ఎట్టెట్టా" అని బుగ్గలు నొక్కుకుంటారనే భయం. సీతమ్మవారికి ప్రజల్లో ఉన్న ఇమేజిని చెడగొట్టి అసలు యావత్తు రామాయణాన్నే అసందర్భంగా, హాస్యాస్పదంగా మార్చిపారేయగలది ఈ అశ్వమేధయాగ ఘట్టం. "దీని గుఱించి ప్రజలకి ఏమని సంజాయిషీ ఇచ్చుకోవాలా ?" అని ఆలోచించి ఉత్తర రామాయణం పేరుతో ఈ "ఉత్తుత్తి" రామాయణాన్ని కల్పించాడు ఎవడో రామభక్తుడైన రెండో వాల్మీకి. కానీ ఈ ప్రయత్నంలో ఇతను (తన వ్యక్తిగత అపోహల కోణం నుంచి)  సీతమ్మవారి పరువు కాపాడాడు. కానీ తెలిసో తెలీకో శ్రీరాములవారి మీద మాత్రం చిక్కగా బుఱద చల్లేశాడు. ఫలితంగా అసలు రామాయణంలో వర్ణించబడ్డ రాములవారి గొప్పతనమంతా కొసఱు రామాయణంతో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది.

అసళ్ళ కంటే కొసర్లు డామినేట్ చేసేస్తూండడం కూడా కలియుగ లక్షణాల్లో ఒకటనుకోండి.


ఏడో సభ్యుడు

ఇక్కడ పట్టపు రాణీ అంటే *రాజు భార్య కాదు*, వేరే ఆడ గుఱ్ఱము. వైదిక సంస్కృతి చాలా advanced, ఇలాంటి పిచ్చి పని వాళ్ళు అనిమతించరు. అదీ ఒక రాజు మఱియు రాజు భార్య విషయములొ. అదీ ఒక public event లొ. ఇలా చూసించినవాళ్ళని రాజు ఖండఖండాలుగా నరుకుతాడేమో. మామూలు వ్యక్తే తన భార్యను ఇలాంటి పని చేయమనడు, అలాంటిది all powerful చక్రవర్తి ఎలా అంగీకరిస్తాడు!?. ఇది చీకటిలో చేసే ఏదో తాంత్రిక పద్ధతి కాదు కదా. 

ఈ అపోహ ఎలా వచ్చిందో, దీని వెనుక హిందువుల యొక్క శత్రువుల కుట్ర ఉండి ఉండవచ్చు. భారతములో ద్రౌపది ఈ పద్దతిలో పాల్గొన్నట్లు ఎక్కడా చెప్పబడలేదు. Some one twisted or mis-interpreted this. Probably during the colonial time by some crooked మిషనరి, with malicious intentions or lack of Sanskrit knowledge. 

హిందువులు  దీని (అశ్వమేధయాగం) మూలాలు గుర్తించవలసిన అవసరము ఉంది.

మొదటిసభ్యుడు

మీరు బాగా అర్థం చేసుకున్నారు. ఈ అశ్వమేధ ఘట్టాన్ని వర్ణించే శుక్ల యజుర్వేదం నా దగ్గఱుంది. రాజుగారి గుఱ్ఱాన్ని గుఱ్ఱాల రాజు అంటారు. రాజుగారి ఆడగుఱ్ఱాల్లో మేలుజాతి ఆడగుఱ్ఱాన్ని గుఱ్ఱాల రాణీ లేదా ఆశ్వమహిషి అంటారు. యజ్ఞంలో చనిపోయే ముందు ఆ అశ్వమహిషితో సంభోగించి తన వంశాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని ఆ గుఱ్ఱాల రాజుకు (మగగుఱ్ఱానికి) మంత్రపూర్వకంగా ఇస్తారు యాజకులు. ఇది ఒక చెట్టుని పడగొట్టినందుకు పరిహారంగా ఇంకో మొక్క నాటడంలాంటిది. కానీ చాలామంది స్వదేశీ సంస్కృత పండితులు కూడా ఇక్కడ సందర్భాన్ని అర్థం చేసుకోలేక పట్టమహిషి గుఱించి చెబుతున్నారనుకుని బోల్తాపడ్డారు. ఇలా బోల్తాపడ్డవాళ్ళలో ఎవఱో ఒకఱు ఈ ఉత్తర రామాయణాన్ని సృష్టించి శ్రీరామచంద్రులవారికీ, ఆయన భార్యాప్రేమకీ, కీర్తికీ తీఱని ద్రోహం చేశారు. నిజానికి అశ్వంతో మానవస్త్రీలకి సంభోగం సాధ్యం కాదు. అలాంటిదానిగ్గనక సాహసిస్తే వాళ్ళు fatal గా గాయపడే అవకాశా లున్నాయి. ఏ మతమూ ఇలాంటిది ప్రిస్క్రైబ్ చేయదు.

7 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

లవకుశ సినిమాతో ఈ శ్రీరామరాజయం సినిమాని పోల్చుకోవద్దని చెప్పటంలోనే లవకుశతో పోలదని ఒప్పుకోవటం జరిగిపోయింది. పైగా అదే కథని తీసి పోల్చవద్దనటానికి అర్థం లేదు. లవకుశ స్థాయిని యీ సినిమా అందుకోలేదని నా అభిప్రాయం. ఒక్క బాపు మీది అభిమానంతో యీ సినిమాని చూడగలరేమో గాని యేవిధంగానూ మహత్తర పొరాణికంగా తీర్చిదిద్దలేకపోయారు. కథనం, నటులు, సంగీతం, పాటలు యేవీ మెప్పించే స్థాయిలో లేవు. కేవలం బాపు పేరు కారణంగా ఆడినంత ఆడింది. అనేక మంది తమతమ ప్రోత్సాహకర విమర్శలతో ముందుకు తోసినా సగటు జనం పెదవి విరిచారనేదే వాస్తవం.

Indian Minerva చెప్పారు...

సినిమాలను కూడా ఈ మతకోణంలోచి చూడకూడదేమోనండీ. సినిమాలో కధ రంజింపచేయలేకపోయిందనీ, అందరూ మెచ్చుకుంటున్న graphicsకూడా కృత్రిమంగా అనిపించాయనీ విన్నాను. పౌరాణిక/జానపద సినిమాల్లో నటించగలస్థాయి మనకున్న నటుల్లో ఎవరికి ఏమాత్రం ఉంది అని మనం మర్చిపోతున్నాం మనం. చిత్ర పరాజయానికి (ఒకవేళ పరాజయమే చెందిఉంటే) అసలు కారణం అది.

ధర్మస్థలమ్ చెప్పారు...

Indyan Minerva !

ఆర్యా ! మీకు నచ్చకపోతే క్షమించండి. ప్రతి ఆధునిక/ ప్రాచీన విషయాన్నీ మతదృష్టితో చూడడమే ఈ బ్లాగు రచయితల లక్ష్యం. వీరు అన్నివిధాలా మతవాదులు.

Indian Minerva చెప్పారు...

క్షమించడాలూ అవీ ఎందుకులెండి. మీ దృక్కోణం మీది. Go ahead.

Madhav Kandalie చెప్పారు...

అశ్వమేధయాగం లో పట్టమహిషి కౌసల్యా దేవి యాగాశ్వాన్ని మూడు కత్తులతో చంపి, ఒక రాత్రి ఆ మృతాశ్వం తో నిద్రించడం వాల్మీకి మహర్షి బాల కాండ లో చెప్పారు. మీరు చెప్తున్నట్లు అది వక్రీకరించ బడ లేదు.

అజ్ఞాత చెప్పారు...

చనిపోయిన అశ్వం ఉన్నచోట నిద్రించడమూ, అశ్వంతో సంభోగించడమూ రెండూ ఒకటే అనుకుంటున్నారా ?

అజ్ఞాత చెప్పారు...

కొన్ని క్లిప్పింగులు చూశాక చూడదగ్గ చిత్రం అనిపించలేదు, చూడలేదు. ఇందులోని నటులకు(బాలకృష్ణ, నయనతార) ఆయా పురాణ పాత్రలను పోషించగల కేరక్టర్, హుందా తనము నిజజీవితంలో లేకపోవడం కొంతవరకూ చిత్ర పరాజయానికి కారణం అయివుంటుంది. అక్కినేని మరీ వృద్ధుడై పోయాడు, అతను ఎప్పుడూ పురాణపాత్రలలో రాణించిన దాఖలాలు లేవు.
బాపు గారి విషయానికి వస్తే.. ఆయన చిత్రాలు అలా కదలకుండా వుండి, మనసులో కదిలిన అనుభూతి అవి కదులుతుంటే కలగదు. బాపు చిత్రాల్లో వుండే గుండ్రని అవయవశౌష్టం, పాత్రధారులకు వుండదు. వేయి విషవృక్షాలు ఒకేసారి మొలిచి విషం చిమ్మినా, వేల ఏళ్ళ నుంచి ఖండాతరాల్లో వ్యాపించిన రామాయణం ఒక్క ఆకు తెగి పడదు ఎందుకంటే.. విషవృషంలో వున్న విమర్శలు ఆయా కాలప్రమాణాలకు అనుగుణగా లేక మూర్ఖంగా వుంటాయి, దాంతో వీళ్ళా మార్క్సిస్టులు అనిపించి, మార్క్స్ మీద తేలిక భావం కలుగుతుంది.
తమ గొప్పదనం ఏమో చెప్పుకోక, ఎదుటివాడి బలహీనతలు తమబలంగా చెప్పుకునే ఎలాంటి మతమైనా, ఇజమైనా తాత్కాలికంగా పైచేయి అనిపించినా ఎక్కువకాలం నిలదొక్కుకోలేవు. వేలఏళ్ళైనా చెక్కుచదరని ఆ ఇతిహాసాలపై ఆదరణకు, అది కూడా ఓ కారణం.
సినిమా కలెక్షన్లనుబట్టి మతవిశ్వాసాల ఆదరణ లెక్కలు వేసుకుంటే ... వై దిస్ కొలవరి పాట మహా భజన అనుకోవాల్సి వస్తుంది, గంగనం గుర్రపు డాన్స్ ఓ భరతనాట్యమో అనుకోవాల్సి వస్తుంది. :)) ఏమంటారు? ;

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి