21, డిసెంబర్ 2011, బుధవారం

'మతమే' మారాలి!

15-11-2011 anshrajyothy daily

'మతమే' మారాలి!
హైందవంలో లోపాలూ మార్పిడికి ప్రేరణ
నిమ్న వర్గాలపై వివక్ష.. అవమానాలు
దేవుణ్ని దర్శించుకోవడానికీ డబ్బులే!

తన చుట్టూ ఉన్న సమాజంలో అత్యధిక సంఖ్యాకులు, తన పూర్వీకులు, కుటుంబీకులు అనుసరించే మతాన్ని కాకుండా మరో మతంలోకి వెళ్లాలని ఒక వ్యక్తి నిర్ణయించుకున్నాడంటే... అందుకు కొత్త మతంలోని ఆకర్షణ, కొత్తదనాన్ని వెతకాలన్న అన్వేషణతో పాటు, తానున్న మార్గంపై అసంతృప్తి కూడా ఎంతో కొంత కారణమవుతుంది. మత మార్పిడులు పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ తరుణంలో రెండో కోణాన్ని చర్చించకుండా ఉండడం అసంపూర్ణమే అవుతుంది. ఆ ప్రయత్నమే ఈ కథనం...

హిందూ మతంలోని కుల వ్యవస్థ, అంటరానితనం, అంతరాలకు వ్యతిరేకంగా, సమానత్వాన్ని వెతుక్కుంటూ దళితులు ప్రారంభించిన ప్రయాణం మతాంతరీకరణలో తొలి ఘట్టం. ఇది దేశంలో సంచలన కారకమే అయినా మతం మారినవారిని ఎవరూ తప్పుబట్టలేకపోయారు. అయితే ప్రస్తుతం ఆ వర్గాలే కాకుండా, అటువంటి ఇబ్బందులు లేని ఇతర కులాలవారు కూడా పెద్దఎత్తున మతం మారడానికి కారణాలు అన్వేషిస్తే ఆసక్తికర సమాధానాలు, దిద్దుకోవాల్సిన అంశాలు కనిపిస్తాయి.

"హిందూమతం చాలా సరళం (ఫ్లెక్సిబుల్). ఎవరైనా అనుసరించవచ్చు. మతంలోనే ఉండి అనుసరించకపోయినా అడిగేవారు లేరు. ఎలాంటి కట్టుబాట్లు, క్రమశిక్షణ లేవు. అందువల్లే పక్క చూపులు చూడడానికి అవకాశం ఎక్కువ'' అని చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు సౌందర్‌రాజన్ విశ్లేషించారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందినరామకృష్ణ.. "ప్రపంచంలోని ఏ ఇతర మత ప్రార్థన స్థలాల్లోనూ దర్శనాలకు, పూజలకు, సేవలకు టికెట్లు, రుసుములు లేవు. కానీ హిందూ మతంలో గుడికి వెళ్లాలంటే టికెట్, దర్శనం చేసుకోవాలంటే రుసుము. ఎక్కడ చూసినా వ్యాపారమే'' అని తప్పుబట్టారు.

"మిగతా మతాల్లో దేవుడి ముందు అందరూ సమానమే. కానీ, హిందూ మతంలో డబ్బు, పలుకుబడి, అధికారం ఉన్నవాడికి ఒక పూజ, లేనివాడికి మరో పూజ. గుళ్లలో వీఐపీలు వచ్చినప్పుడల్లా హారతులివ్వడం ఏమిటో ఇప్పటికీ అర్థం కాదు'' అని మహేశ్వరం ప్రాంత రైతు కిష్టారెడ్డి అన్నారు. హిందూమత గురువులు, పూజారుల తీరును సామాజిక విశ్లేషకుడు రామకృష్ణ తప్పుబట్టారు. "మనం చర్చికో, మసీదుకో వెళ్లినపుడు అక్కడి గురువులు ఆప్యాయంగా పలకరిస్తారు. హిందూమత గురువులు అలా ఉండరు'' అని అభిప్రాయపడ్డారు.

"మతం మారాలనుకున్నప్పుడు అసలు మన మతంలో ఏముందో, వేరే మతంలో ఏముందో తెలుసుకోవాలి కదా? మారేవాళ్లంతా ఏం అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటున్నారు? అసలు ఆ శక్తిసామర్థ్యాలు వారికున్నాయా? ఈ మౌలిక ప్రశ్నలకు జవాబు వెతకాల్సి ఉంది'' అని దేవాలయ ఆస్తుల పరిరక్షణ ఉద్యమ కమిటీ కన్వీనర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. "మత మార్పిడి ఎప్పటినుంచో ఉంది. అప్పుడు రాని వివాదం ఇప్పుడే ఎందుకు తలెత్తుతోంది? జైన, బౌద్ధ మతాలు హిందూ దేవుళ్లను కించపరచలేదు. కానీ మతం మారిన హిందువుల జాతీయతనే దూరం చేయడానికి, ఈ దేశ మూలాల మీదనే క్రైస్తవ సంస్థలు గురిపెట్టాయి'' అని వేద భారతి సంస్థ సమన్వయకర్త గౌరీభట్ల సుబ్రహ్మణ్యశర్మ పేర్కొన్నారు.

ఆలయ ప్రవేశం తప్పనిసరి
"మతమార్పిడులు అడ్డగోలుగా జరక్కూడదంటే దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలి'' మహబూబ్‌నగర్ జిల్లాలో మతం మారి తిరిగి వచ్చిన పలువురి మాట ఇది. "హిందువుల్లో మిగతా కులాలవారు దళితులను దూరం పెట్టొద్దు. మాకూ ఆలయ ప్రవేశం కల్పించాలి'' అని అడ్డాకులకు చెందిన ఎం.దానేలు ఆవేదన వ్యక్తం చేశారు. "దళిత వాడల్లో హైందవ సంస్థలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలి. వీహెచ్‌పీ తరపున పాత పాలమూరు దళితవాడలో ఏటా సీతారామకల్యాణం, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటివి కొనసాగిస్తే మతమార్పిడులకు ఆస్కారం ఉండదు'' అని వీహెచ్‌పీ నాయకుడు లక్ష్మీనారాయణ సూచించారు.

చట్టాలు అమలు చేయాలి
"హిందూమతంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్న కులాల వారెవరైనా క్రైస్తవం లేదా ఇస్లాం స్వీకరిస్తే వారు రిజర్వేషన్లు కోల్పోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వాలు కఠినంగా అమలుచేయాలి. హిందూమతంలో కులవివక్షను పోగొట్టడానికే ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమల్లోకి వచ్చింది. క్రైస్తవం, ఇస్లాం మతాల్లో కులాలు లేనందున వాటిని స్వీకరించే ఎస్సీ, ఎస్టీలు రిజర్వేషన్లను వదులుకోవాలి. కొన్ని మతాల అభివృద్ధికి ప్రభుత్వాలు నిధులు విడుదల చేయడాన్ని తక్షణం ఆపాలి.

మత ప్రచార నిషేధానికి జారీచేసిన 746, 747 జీవోలను అమలు చేయాలి. కానీ ఇవేవీ జరగట్లేదు. పార్టీల ఓటుబ్యాంకు రాజకీయాలే దీనికి కారణం'' అంటారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చల్లపల్లె నరసింహారెడ్డి. "హిందూ మతంలోని అట్టడుగువర్గాల పేదరికాన్ని, నిరక్షరాస్యతనూ అవకాశంగా తీసుకుని ప్రలోభపెట్టి మతం మార్చ డం అనైతికం. ఇలాంటి మతమార్పిడులకు పాల్పడటం నేరం. దీని పై ప్రభుత్వం చట్టాలను కఠినంగా అమలుచేయాలి'' అని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు.

ప్రత్యేక చట్టాలతోనే మతమార్పిడులకు అడ్డుకట్ట పడుతుందని చిత్తూరుజిల్లా లోక్‌సత్తా అధ్యక్షుడు జయకుమార్ అభిప్రాయం. "వాళ్లకు ఈ దేశం అంటే గౌరవంకానీ, ఇష్టం కానీ ఉండదు. రాముణ్ని, కృష్ణుణ్ని తిడతారు. శంకరాచార్యులను గౌరవించరు. వివేకానందుడిని అసహ్యించుకుంటారు. హిందువుల మనోభావాలను, ఆచారాలను ఇం తగా వ్యతిరేకించేవాళ్లు మనకి శాంతినీ, సమానత్వాన్నీ, నాగరికత ను నేర్పిస్తామనడం ఏమిటి?'' విజయవాడ సిద్ధార్థ కాలేజీ విద్యార్థి చైతన్య ఆవేదన ఇది. "ఒక వ్యక్తి చనిపోతే చూడటానికి వెళ్లటం మానవత్వానికి సంబంధించిన విషయం.

కానీ నా మరదలు చనిపోతే దహన సంస్కారాలకు వెళ్లొద్దన్నారు. క్రైస్తవంలోకి మారితే ఇలాంటివి ఉంటాయనే అవగాహన కల్పించే హిందూమత పెద్దలెవరూ లేరు. అలాంటివారుంటే బాగుంటుంది'' అని నల్గొండ జిల్లా వాసి రాజు వాపోయారు. "జనాభాలో 50 శాతం ఉన్న యువత కు ఆసక్తికలిగించేలా హిందూమతంలో మార్పులు రావాలి. మౌలిక సూత్రాలను మార్చమని ఎవరూ అడగరు. కానీ కాలంతోపాటు కొన్ని ఆచార వ్యవహారాలు చేరుతాయి. వాటిని తొలగిస్తే- అసలు నగిషీలు బయటకొస్తాయి. వాటిపై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఒక వ్యక్తికి తన మతం పూర్తిగా సంతృప్తి కలిగించిన రోజున మతమార్పిడి సమస్యలండవు'' అని సామాజిక శాస్త్రవేత్త వాసు అన్నారు.

వద్దన్న చోటనే వేద విద్య
అది 1930. మహారాష్ట్ర, నాసిక్‌లోని సుప్రసిద్ధ కాలారామ్ మందిరం బయట.. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో వేలాది మంది దళితులు ఆలయప్రవేశం కోరుతూ సత్యాగ్రహానికి దిగారు. గుడి పూజారి రామ్‌దాస్ మహరాజ్ సహా, ధర్మకర్తలు, స్థానిక అగ్రవర్ణాలవారెవ్వరికీ దళితులు ఆలయంలోకి ప్రవేశించడం ఇష్టంలేక, వారిని అడ్డుకున్నారు. ఐదేళ్లపాటు సత్యాగ్రహం చేసినా దళితులు ఆ గుడిలోకి ప్రవేశించలేకపోయారు!! దాదాపు 75 సంవత్సరాల తర్వాత.. 2005లో.. ఆ గుడిలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.

అందులో.. దళితులకు ప్రవేశాన్ని అడ్డుకున్న ఆనాటి సంఘటనకు.. ఆలయ పూజారి సుధీర్ మహరాజ్ క్షమాపణ చెప్పారు. 1930లో పూజారిగా ఉన్న రామదాస్ మహరాజ్ మనవడే సుధీర్ మహరాజ్.. "బాబా సాహెబ్‌ను ఆలయంలోకి రానివ్వకుండా మా తాతగారు చేసిన తప్పునకు నేను క్షమాపణ చెబుతున్నాను'' అని ఆయన ఆ కార్యక్రమంలో బహిరంగంగా ప్రకటించారు. దళితులను గుడిలోకి రానివ్వడమే కాదు, ఇప్పుడక్కడ వారికి వేదం కూడా నేర్పించే పనిలో ఉన్నారాయన.

మన లోపాలు దిద్దుకుంటేనే!
"ఒకప్పుడు హిందూ మతం చాలా పటిష్ఠమైనది. దానిలో ఉన్న కొన్ని బలహీనతలను ఎత్తిచూపి, వాటిని సంస్కరించే క్రమంలో బౌద్ధమతం అవతరించింది. బౌద్ధంలో ఒక మౌలికమైన క్రమశిక్షణ లేకపోవటం వల్ల తర్వాత ఆ మతం కూడా అంతరించిపోయింది. అనంతర కాలంలో హిందూ మతంలో కూడా అలాంటి పొరపాట్లే జరుగుతూ వచ్చాయి. ఒకప్పుడు హిందూ మతంలో క్రమశిక్షణ ఉండేది.

దాన్ని పాటించినంత కాలం మతానికి వచ్చిన సమస్యేమీ లేదు. ఎక్కడైతే క్రమశిక్షణ లోపిస్తుందో అక్కడ కొన్ని బలహీనతలు ఏర్పడతాయి. వాటిని ఉపయోగించుకొనేవారు కూడా అనేక మంది ఉంటారు. మత మార్పిడులు కూడా ఆ తరహాలోనివే. మౌలికంగా మనలో తప్పు పెట్టుకొని ఇతరులను నిందించి లాభం లేదు. ముందు మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటే సమస్యలు తీరిపోతాయి''
-ప్రొఫెసర్ సౌందర్‌రాజన్,
బాలాజీ ఆలయ ట్రస్టీ, చిలుకూరు.

ప్రతికూల ప్రచారం
"క్రైస్తవ మత సిద్ధాంతాలను, ఆచారవ్యవహారాలను ప్రచారం చేసుకోవటం వల్ల మనకు వచ్చిన సమస్యేమీ లేదు. అందరికీ తమ మతంలో ఉన్న గొప్పదనాన్ని తెలియజేసి.. వ్యక్తిత్వ సంస్కారం చేస్తే మనకు వచ్చిన ఇబ్బంది లేదు. మన దేశం నుంచి వెళ్లి హిందూ ధర్మ ప్రచార సంస్థలన్నీ చేస్తున్నది ఇదే. రామకృష్ణ మఠం బోధించే ధర్మాన్ని కొన్ని లక్షల మంది విదేశీయులు అనుసరిస్తారు. ఇస్కాన్‌కు కొన్ని లక్షల మంది విదేశీ ఫాలోయర్స్ ఉన్నారు. వీరు ఇతర మతాలవారిని హిందూ మతంలోకి చేరాలని ఎప్పుడూ అడగరు.

క్రీస్తు సరైన దేవుడు కాడని.. వారి మత గ్రంథాలు తప్పని చెప్పరు. కేవలం హిందూ మతంలో ఉన్న గొప్పదనాన్ని వివరిస్తారు. కానీ ఈ మధ్య కాలంలో క్రైస్తవ మత ప్రచారం పేరిట జరుగుతున్న వ్యవహారాలు ఇందుకు పూర్తి విరుద్ధం. హిందు దేవుళ్లను విరోధులుగా చూపించటం, హిందు ధర్మాన్ని, ఆచారాల్ని అనాగరికమైనవిగా ప్రచారం చేయటం.. సంప్రదాయాలను పాటించవద్దని ప్రోత్సహించడం ఇవేవీ సరైనవి కావు''
-స్వామి పరిపూర్ణానంద

అమెరికాలో హిందూయిజం
 
ఒకవైపు.. భారతదేశంలో క్రైస్తవంలోకి మారుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతుంటే, అంతర్జాతీయంగా హిందూయిజం వైపు ఆకర్షితులవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ప్ర త్యేకించి.. అమెరికన్లలో చాలామంది ఇప్పుడు 'పునర్జన్మ' సిద్ధాంతాన్ని, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. 2009లో లీసా మిల్లర్ అనే రచయిత్రి అమెరికన్ పత్రిక న్యూస్‌వీక్‌లో 'వుయ్ ఆర్ ఆల్ హిందూస్ నౌ' అనే వ్యాసాన్ని రాశారు. అందులో ఆమె... 2008 నాటికి అమెరికాలో 76శాతం మంది క్రైస్తవులు ఉన్నారని, అది ఆ దేశ చరిత్రలోనే అతి తక్కువ శాతమని పేర్కొన్నారు.

"దేవుణ్ని చేరుకోవడానికి అనేక మార్గాలుంటాయని ఒక హిందువు విశ్వసిస్తాడు. అందులో జీసస్ ఒక మార్గం, ఖురాన్ మరొక మార్గం. యోగసాధన ఇంకొక మార్గం. ఏదీ ఒకదానికంటే ఎక్కువ కాదు. అన్నీ సమానమే. కానీ.. అత్యంత సంప్రదాయబద్ధమైన క్రైస్తవులు ఇంతవరకూ ఇలా ఆలోచించడం నేర్చుకోలేదు. వారు తమ మతమే సత్యమని, ఇతర మతాలన్నీ అసత్యాలనీ నేర్చుకుంటారు'' అని పేర్కొన్నారు. 2008 హ్యారిస్ పోల్ ప్రకారం 24 శాతం మంది అమెరికన్లు హిందూ పునర్జన్మ సిద్ధాంతం మీద తమకు నమ్మకం ఉందని స్పష్టం చేశారు.

మారాల్సింది ఎవరు?
 
రాష్ట్రంలో మత మార్పిడుల పర్వంపై 'ఆంధ్రజ్యోతి' గత ఆరు రోజులుగా ప్రచురించిన కథనాలకు రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది స్పందించారు. ఇరు మతాలకు చెందినవారి నుంచి, సామాజిక విశ్లేషకుల నుంచి, కుల సంఘాల నేతల నుంచి వందలాది ఫోన్ కాల్స్, ఈ మెయిల్స్ మా కార్యాలయానికి వెల్లువెత్తాయి. ప్రశంసలు, పరిశీలనలు, అభ్యంతరాలు, ఆరోపణలను పక్కనబెడితే.. సమాజంలో చాపకింద నీరులా సాగిపోతున్న, అనర్థాలకు, అంతరార్థాలకు కారణమవుతున్న ఒక దృగ్విషయంలోని అన్ని కోణాలను ప్రజల ముందు పెట్టి చర్చనీయాంశం చేయడమే ఈ కథనాల లక్ష్యం.

'రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ.. ప్రచారం' ముసుగులో, ప్రలోభాల ప్రయత్నాలతో జరుగుతున్న బలవంతపు మత మార్పిడులు వ్యక్తుల మనసులపై, కుటుంబ సంబంధాలపై, సామాజిక సమీకరణలపై, రాజకీయ పరిణామాలపై చూపుతున్న ప్రభావాన్ని ప్రజల దృష్టికి తేవడమే ఈ కథనాల ఉద్దేశం. 'మనిషి మతం మారినంత మాత్రాన ప్రయోజనం లేదు. అభిమతాలు మారనంత వరకు ఎన్ని మతాలు మారినా.. అవే కతలు, గాథలు తప్పవు.

హిందూ మతంలో వివక్షకు వ్యతిరేకంగా మతం మారిన దళితులు పేర్లతో సహా మారి కొత్త మతంలో మమేకమైపోతుంటే, అగ్ర వర్ణాల వారు.. పేరు తోకను అలాగే తగిలించుకుని ఉండడం, తరాలు మారినా కులాల గోలలు, లీలలు ఇంగువ కట్టిన గుడ్డలా అక్కడా కనిపిస్తుండడం గమనించాల్సిన విచిత్రం. 'నువ్వు దేవుని సేవ కోసమే పుట్టావు. దేవుని పుత్రికవు' అని వస్తున్న సందేశాలకు స్పందించి, చెప్పాపెట్టకుండా మతం మారుతున్న పిల్లలు, తమ ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నారన్న సంగతిని మరచిపోతుండడం మరో విషాదం.

సమస్య ఉందనో, అవసరం తీరుతుందనో, ఆర్థికంగా ఆదుకుంటారనో, ఆరోగ్యం చేకూరుతుందనో.. చిన్నచిన్న కారణాలకు మతం మారే వారు.. అది ఏ మతంలోంచి ఏ మతంలోకైనా.. విలువల పట్ల, విశ్వాసాల పట్ల, జాతీయత పట్ల ఏం నిబద్ధత చూపించగలరన్నది.. మారే వారు, మార్చే వారు వేసుకోవాల్సిన ప్రశ్న! 'మార్పిడి' అవసరం లేకుండా, అవకాశమివ్వకుండా మతాలే మారాలి, మనుషులూ మారాలి, మనసులూ మారాలన్నదే ఆంధ్రజ్యోతి ఉద్దేశం, సందేశం!

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

Every Hindu must treat every other Hindu as his/her equal. I am not talking about financial equality or intellectual equality. But as a human being every one must be equal. We have to educate Caste Hindus about this fact.

As long as Caste based inequalities are there, it is very difficult to unite Hindus.

And then bring the unity. Then all other problems go away one after another.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి