ఒక పాతబ్లాగునుండి యథాతథ పునః ప్రదర్శన
SUNDAY, DECEMBER 23, 2007
Is astrology scientific? -scietific method continued
తన పరిధిలో పరిశీలనకు వచ్చిన వాస్తవాలను సంతృప్తికరంగా వివరించకపోతే వైజ్ఞానిక సిద్ధాంతం ఏదీ కూడా అట్టేకాలం నిలబడదు. కాని విజ్ఞాన చరిత్ర నిండా ఉత్తరోత్తరా దోషాలని రుజువైన సిద్ధాంతాలు లేకపోలేదు. న్యూటన్ పేర్కొన్న వెలుగుకణ సిద్ధాంతం ఇందులో ఒకటి. ఇంత మాత్రానే విజ్ఞాన స్థాయికి భంగం వాటిల్లదు. మనో విశ్లేషణవంటి అన్వేషణారంగాలనేకం ఉన్నాయి. వాటిలో సర్వసాధారణంగా ఆమోదించే వైజ్ఞానిక సిద్ధాంతం ఇంకా రావలసి ఉంది. అంటే మనో విశ్లేషణ ఉబుసుపోక అనుకోరాదు. చాలా ఆసక్తికరమైన, ఉపయోకరమైనకృషి ఈ రంగంలో జరిగింది. అనేక సందర్భాలలో ఈ పద్ధతి ప్రయోగించే చికిత్సా విధానాలను చూస్తుంటే దీనిని తేలికగా కొట్టిపారేయడానికి వీల్లేదు. అయినప్పటికీ ఆ సిద్ధాంతంగా పేర్కొన్న దానిలో అద్భుతమైన అంతర్ దృష్టి కనిపిస్తున్నదేగాని, కీలకమైన పరీక్షకు గురికాలేదు. విజ్ఞాన సిద్ధాంతంగా ఆవిర్భవించడానికి మనో విశ్లేషణ అన్వయించే పద్ధతులు, ఉద్దేశాలు ఉన్నాయికూడా. దీనికి వ్యతిరేకంగా వ్యవస్థాపితమైఉన్న సిద్ధాంతం ఏదీ లేదు. అందు వల్లనే, మనో విశ్లేషణ రానురాను విజ్ఞాన సిద్ధాంతంగా పెంపొందవచ్చు. ఆ లక్ష్యం చేరుకోడానికి ఎంతో దూరం పయనించవలసి రావచ్చు.
మరో విధమైన సిద్ధాంతాలు కూడా ఇక్కడ చర్చించబోతున్నాం. వాటిలో పరిమితంగా ప్రాపంచికానుభవ సత్యం కొంతమేరకు ఉన్న సందర్భాలు లేకపోలేదు. అయినా అవి విజ్ఞానపరంగా లేవు. ఈ సిద్ధాంతాలు ప్రతిపాదించే వాటిననుసరించి, అందులో ఇమిడి ఉన్నవాటిని పరోక్షంగానైనా రుజువుపరచవీల్లేదు. అదే రంగంలో విజయవంతంగా పనిచేస్తున్న వైజ్ఞానిక సిద్ధాంతాలలో పెసగకుండా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. పైగా అటువంటి విజ్ఞాన-విజ్ఞానేతర సిద్ధాంతాలను (ఒకే రంగంలో) కొన్నింటిని చూద్దాం.
ఖగోళం-జ్యోతిష్యం
ఈ రెండూ మానవుడు చిరకాలంగా పరిశీలిస్తున్న ఆకాశానికి చెందినవే. ఆకాశంలో ఒకే తీరుగా చలిస్తున్నవాటిని, అందుకు సంబంధించిన భౌతిక సంఘటనలను మానవుడు పరిశీలిస్తున్నాడు. ఆధునిక విజ్ఞానం ఆవిర్భవించేటంత వరకూ జ్యోతిష్యం-ఖగోళ శాస్త్రం భిన్నమైనవని భావించనేలేదు. మానవ వ్యవహారాలకు ఖగోళ విషయాలను అన్వయిస్తే జ్యోతిష్యం అవుతుంది. మానవుడి వ్యవహారాలకు ఖగోళ విషయాలను అన్వయిస్తే జ్యోతిష్యం అవుతుంది. ప్రతి నక్షత్రం, ప్రతి గ్రహానికి కూడా ఒక దేవత ఉంటుందనీ, ఆ దేవత మానవుడి వ్యవహారాలలో ఆసక్తి చూపడమేగాక, ప్రభావితం చేస్తుందని భావించారు. గ్రహాల చలన నియమాలను కనుక్కొన్న కెప్లర్ సైతం జ్యోతిష్యంలో నమ్మకం గలవాడే. అతడి సమకాలీనులకు ఈ ధోరణిలో దోషం కనిపించలేదు. ఆకాశంలోని ఈ నక్షత్రాలు, గ్రహాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకున్న తరవాత, సామాజిక సంస్థలు పనిచేసే తీరు, మానవుడి శారీరక మానసిక రీతుల గురించి తగినంతగా తెలిసిన అనంతరం, గడ్డినుంచి గింజలు వేరు చేయడానికి వీలుచిక్కింది. ఖగోళశాస్త్రం విజ్ఞాన సిద్ధాంతంగా పెంపొందింది. మానవుడిపై గ్రహాల, నక్షత్రాల ప్రభావం ఉంటుందనే జ్యోతిష్యం విజ్ఞానపరంగా అపఖ్యాతి పాలైంది. ఇది అవగాహన చేసుకోవడం సులభమే. ప్రతిపాదన చేసిరాబట్టే నిర్మాణం ఖగోళంలో ఉంది. అనేక పరిశీలనాంశాలకు స్పష్టమైన వివరణలను ఖగోళ శాస్త్రం ఇస్తోంది. పరీక్షకు తట్టుకొనే ప్రమాణానికి నిలబడకలుగుతోంది. ఇందుకు భిన్నంగా, జ్యోతిష్యంలోని మూల సూత్రం దోషపూరితమైంది. నక్షత్రాలకు, గ్రహాలకు అంటి పెట్టుకొని దేవతలు అనేవారెవరూ లేరు. ఆకాశంలోగాని భూమిపైన గాని ఎక్కడా అలాంటి వారు లేరు కనక వారు మానవుడి వ్యవహారంలో ఆసక్తి చూపే ప్రశ్నేరాదు. జ్యోతిష్యం అశాస్త్రీయం. మనకు గల ప్రత్యక్షజ్ఞానానికి, వ్యవస్థాపిత సిద్ధాంతాలకు పొసగకుండా జ్యోతిషం ఉంది. జ్యోతిష్యం అశాస్త్రీయమే కాదు. విజ్ఞాన వ్యతిరేకం కూడా, జ్యోతిష్యంలో లాగే, యోగసిద్ధాంతం వంటి వాటిల్లోనూ ఇలాంటి విజ్ఞాన వ్యతిరేక ధోరణి ఉంది. విజ్ఞానం రుజువు పరచిన నియమాలను పాటించకుండా, గతం, వర్తమానం, భవిష్యత్తుకు సంబంధించి జ్ఞానాన్ని మానవుడు యోగం ద్వారా సిద్ధింపజేసుకోవచ్చుననటం వాస్తవ వ్యతిరేకమే.
Next-Is ayurveda scientific?
14 COMMENTS:
గత కొద్ది శతాబ్దాలుగా బాగా ప్రచారంలోకి వచ్చిన భావాలనే మీరూ రాశారు. కొత్తదనమేమీ లేదు. జ్యోతిష్యం అన్ని శాస్త్రాల వంటిదే. అంటే-ఏ శాస్త్రసత్యాలనైనా దాన్ని నేర్చుకుని ప్రయోగించి అన్వయించుకుని సాక్షాత్కరించుకోవలసినదే. జ్యోతిష్యమైనా అంతే. ఒక శాస్త్రం మీకు రానప్పుడు మీరందులో ప్రయోగాలు చెయ్యనప్పుడు మీకు దాన్ని గుఱించి మాట్లాడే అర్హత లేదు. మీకెందులో నైనా నోబెల్ బహుమతి వచ్చినా సరే ! నాకు న్యూక్లియర్ ఫిజిక్సు రాదు. అంతమాత్రాన న్యూక్లియర్ ఫిజిక్సు మొత్తం అబద్ధమైపోదు.
ఒక శాస్త్రపు సూత్రాలని ఇంకో శాస్త్రపు పరిభాష (terminology)తో వివరించబూనుకోవడం నిష్ప్రయోజనం. అజ్ఞానపూర్వకం కూడా. Mathematics పరిభాషతో గాని దాని ప్రయోగసరణితో గానీ మీరు Zoology, biology principles ని వివరించజాలరు. విషయాల్ని వివరించడానికి ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క పద్ధతినీ ఒక్కొక్క పరిభాషనీ ఆశ్రయిస్తుంది. అంతే కాక ఒక శాస్త్రపు conclusions ఆధారంగా ఇంకో శాస్త్రపు conclusions ని త్రోసిపుచ్చడం మూర్ఖత్వం. కారణం-దృశ్యమాన జగత్తులో ప్రతివస్తువుకూ విషయానికీ అనేక Dimensions, aspects ఉంటాయి. శాస్త్రాలనబడేవి వాటిని కల్పించిన మానవుల అవగాహనా పరిధికి కోణానికీ ప్రతిబింబాలు కనుక వారి వ్యక్తిత్వపు లోపాల్ని అవి కూడా జీర్ణించుకుని బాధపడుతూంటాయి. అవి మన ముందు project చెయ్యబడే విధానంలో వారి వ్యక్తిత్వపు లొసుగుల్ని సైతం ప్రతిబింబిస్తూ ఉంటాయి. కాబట్టి అవి పూర్తి సత్యాలు కావు.
ఉదాహరణకు- మీఱొక పుస్తకాన్ని బల్ల మీద పెడితే-ఒక పిల్లవాడు దాన్ని చూసి అందులో రంగుల బొమ్మలున్నాయేమో వెతుక్కుంటాడు. ఒక పాతపేపర్ల వ్యాపారి చూస్తే దాని బరువుని బట్టి దానికి ఎంత రద్దు-సామాను విలువ పలుకుతుందో అంచనా వేసుకుంటాడు. ఒక DTP operator చూసి అందులో ఏ మాత్రం Graphics నైపుణ్యం ఉందో పరిశీలిస్తాడు. ఒక రచయిత దానిలో Chapterization లాంటివి ఎంత బాగా చేశారా అని ఆలోచిస్తాడు. ఒక విద్యార్థి చూస్తే latest model paper కి పనికొచ్చే సమాధానాల కోసం అన్వేషిస్తాడు. మీరు చెప్పే శాస్త్రాలూ శాస్త్రీయ దృష్టులూ వీళ్ళవంటివే. మనకు పనికొచ్చే విషయాలకు మనం శాస్త్రాలని పేరుపెడతాం. మనకు పనికిరానివి మన దృష్టికే ఆనవు.అందవు.అర్థం కావు. ఆ విషయంలో మనం బౌద్ధిక లిల్లీపుట్లం.
గ్రహాలకు అనేక ఇతర ప్రాకృతిక దృగ్విషయాలకూ ఇలాగే అనేకమైన dimensions, aspects ఉంటాయి. వాటిల్లో కొన్ని పంచేంద్రియాలకు కనిపిస్తాయి. కొన్ని కనిపించవు. కారణం-అవి తమను తాము స్వయంగా వ్యక్తీకరించుకుంటేనే తప్ప మనం వాటి స్వరూపాన్ని తెలుసుకోలేము. అవి మీరు భావిస్తున్నట్లు ప్రాణం లేనివీ, చైతన్యం లేనివీ, వెఱ్ఱిమొఱ్ఱివీ కావు. పాత, కొత్త శాస్త్రాలు చెప్పే aspects, dimensions అన్నీ ఏకకాలంలో సత్యాలే. ఒక వ్యక్తి పొట్టివాడు అనే సత్యం అతడు బలవంతుడు అనే సత్యాన్ని ఆటోమేటిగ్గా ఖండించదు. అలాంటివే, పైకి ఘర్షిస్తున్నట్లు కనిపించే ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాల conclusions కూడా.
ఇహపోతే "శాస్త్రీయం".
ఇది ఈమధ్యకాలంలో చాలా దుర్వినియోగానికి గురౌతున్న పదం. A highly vulgarizerd term as well. శాస్త్రీయమంటే- ఈ కాలంలో ఒకటే అర్థం -"నాకు తెలిసిన పదజాలాన్నే నువ్వు వాడాలి. వేఱే పదజాలం వాడితే నేను భరించలేను. ఈ ప్రపంచంలో అన్ని విషయాల వివరణా నేను నేర్చుకున్న సైన్సు కోడిలో, నా టెక్నాలజీ కుంపట్లో ఇమడాలి. అలా ఇమడకపోతే నువ్వు చెప్పే విషయానికి నేను unscientific అని బ్రాండు వేస్తాను." ఇది భాష గుఱించిన తగవు మాత్రమే. ఇది తెలుసులేక కొంతమంది సంప్రదాయవాదులు కూడా ప్రాచీన శాస్త్ర సూక్తులకు ఆధునికుల్ని ఒప్పించాలనే వ్యర్థమైన పట్టుదలతో కోడి-కుంపటి భాష్యాలు చెప్పడం మొదలుపెట్టారు.
వాస్తవం చెప్పాలంటే-ఇప్పుడు సైన్సు పేరుతో, శాస్త్రీయత పేరుతో చెలామణి అవుతున్నది-తెల్లవాళ్ళు ప్రపంచాన్ని చూసే విధానం. వాళ్ళు విషయాల్ని అర్థం చేసుకోవడానికి దూఱిన ఒక సంకుచిత గూభ్యం.అది మనం కూడా అంగీకరిస్తే మనం మంచివాళ్ళం. లేకపోతే పిచ్చివాళ్ళం.
లలితా సుబ్రహ్మణ్యం గారితో నేను ఏకీభవిస్తున్నాను. ఒకప్పుడు విశ్వం ఒక్కటే అనే వారు. విశ్వం అంచులు ఎక్కడి వరకూ ఉన్నయో ఎవరైనా చెప్పగలరా? ఆ అంచుల అవతల ఏమైనా ఉన్నయేమో చెప్పగలరా? పైగా ఈ మధ్య రీసెర్చిలో అనేక విశ్వాలు ఉన్నాయని చెపుతున్నారు. దీనంతటికీ మూలకారణుడు లేక కారణురాలు యెవరు? యెవరైనా చెప్పగలరా? కొన్నిటికి సమాధానాలు ఉండవు.
వాదనలో తిమ్మిని బమ్మిని చేయడానికి కాకుండా జ్యోతిష్కాన్ని ఎందుకు నమ్మాలో ఓ ఐదు ఉదాహరణలు చెప్పగలరా?
ఎందుకు నమ్మకూడదో చెప్పడానికి చాలా ఉదాహరణలు కళ్ళ ముందే కన్పిస్తున్నాయి.
1. మన పత్రికల్లో వచ్చే దినవారఫలాలు
2. మన ఉగాది పంచాంగ శ్రవణంలో వర్షాల రాకపోకలు
3. నాడీ జ్యోతిష్క్యం
...
ఇలా కోకొల్లలుగా చెప్పవచ్చు
జ్యోతిష్కం ఓ బలహీనత/ బలహీనతను మాపుకొనె సాధనం తప్ప మరేమీ కాదు!
I understand your reactions and comments.
Let us see the position from positive side.
Take astrology in India. It depends on nine planets.
Rahu and Ketu are non existent. So the count is seven.
Moon is not planet. It is satellite to earth.
The count becomes six.
Sun is not planet. It is self luminous body. It is star. The count remains five only.
If the major premises is wrong, naturally conclusions cannot become right.
There must be some connection between persons and planets. What is that connection? Without knowing the verified connection how can it possible to predict?
Let us think and proceed in stead of hastily come to comments.
Stars mentioned in astrology are not available for test.
The constellations are shapes mentioned by our people which are not verifiable.They are not in existence.
Think and proceed carefully before come to comments
ఎవరు చెప్పినదీ ఎవరూ నమ్మాల్సిన పని లేదు. మీరు జ్యోతిష్యాన్ని ఖండించే ముందు దాన్ని నేర్చుకుని ఫలితాలు సరిచూచుకుని ఖండించండి. జ్యోతిష్కులమని చెప్పుకునేవాళ్ళ వ్యక్తిగత లోపాలకు ఒక శాస్త్రాన్ని నిందించకండి. అలా నిందించాల్సి వస్తే ప్రపంచవ్యాప్తంగా అల్లోపతీ చికిత్స తీసుకుని మఱీ చనిపోతున్న కోట్లాదిమంది శవాల సాక్షిగా అల్లోపతీ వైద్యవిధానాన్ని కూడా నిందించాల్సి వస్తుంది. వాతావరణ శాస్త్రజ్ఞుల weather forecasts ని కూడా నిందించాల్సి వస్తుంది. ఏ శాస్త్రంలో నైనా సిద్ధాంతభాగం ఉన్నంత ఖచ్చితంగా ఫలితభాగం ఉండదు.
ఇహపోతే, రాహుకేతువుల సంగతి. భూమి orbit చంద్రుడి orbit తో సమద్విఖండన చేసే బిందువుల మధ్య కుడియెడమల దూరాలకు మన పూర్వీకులు రాహుకేతువులని పేరుపెట్టారు. వాటి వల్ల భవిష్యత్ ఫలితాల్లో తేడా వస్తున్నట్లు గ్రహించడం వల్ల వాటిని కూడా గ్రహాలన్నారు. గ్రహాలంటే planets అనుకోకండి. జ్యోతిశ్శాస్త్రం చెప్పే గ్రహాలు planets గుఱించి మాత్రమే కాదు, జాతకం మీద ప్రభావం కలిగించే యావత్తు జ్యోతిస్సుల (Luminary bodies) గుఱించి. మీరు జ్యోతిశ్శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేస్తే ఇలాంటివన్నీ బోధపడతాయి. ఇలా కూర్చుంటే ఏమీ తెలియదు.
ప్రస్తుతం scientific పేరుతో చెలామణీ అవుతున్నది ఒక గూభ్యాలోచన విధానం. ఈ విధానంలో ఏ పదార్థానికా పదార్థం, ఏ వస్తువుకా వస్తువు ఇతర పదార్థాలతోను వస్తువులతోను సంబంధం లేనిదిగా భావించబడుతూ అపార్థం చేసుకోబడుతూ ఉంటుంది. వాస్తవానికి ప్రకృతి ఆ విధంగా నిర్మించబడలేదు. ప్రకృతిలో ప్రతిదానికీ ఇంకో విషయంతో గొలుసుకట్టు సంబంధాలున్నాయి. మనకు తెలియనంత కాలం ఏమీ లేదనుకుంటాము. ఇప్పుడు scientific అని భావించబడుతున్న అనేక విషయాల గుఱించి గతంలో అలాగే అనుకున్నాం. అయితే జ్యోతిష్యం మన పూర్వులు మనకంటే ముందే ఆలోచించినది కావడం వల్ల దాని క్లెయిములు, అన్నీ తెలుసుననుకుంటున్న మన అహంకారానికి గొడ్డలిపెట్టులా ఉన్నాయి. ఒకటి ఒప్పుకుంటే అన్నీ ఒప్పుకోవాల్సి వస్తుందనే భయంతో అన్నిటినీ ఊచమట్టుగా త్రోసిపుచ్చడానికి ఆధునిక మానవుడు అలవాటు పడ్డాడు. కాని నిజం నిప్పులాంటిది. ఒకప్పుడు మానవ నాగరికతలో జ్యోతిష్యం లేదు. తరువాత కొన్ని వందల సంవత్సరాల పరిశోధనా పరిశీలనా ఫలితంగా ఆ శాస్త్రం ఆవిర్భవించింది. ఇప్పుడు మీరు "కాదు" అంటే తాత్కాలికంగా విజయం మీదే. కాని మానవ కుతూహలం "కాదు, కూడదు"ల దగ్గర ఆగిపోదు. కుతూహలాన్ని ఎవరూ నిషేధించలేరు. అది మళ్ళీ ఆవిర్భవిస్తుంది. మీరు ఆకాశాని కెత్తుతున్న so-called scientific people నుంచే పునర్జన్మ ఎత్తుతుంది.
"నాకు తెలియదు" అని ఒప్పుకోవడం ఒకప్పటి మర్యాద. "నేను నమ్మను" అనడం ఈనాటి ఫ్యాషన్. మన:స్థితి మాత్రం ఒకటే.
"అది వాడి రక్తంలోనే ఉందిరా !" అని వెనకటి తరం వాళ్ళు అంటే, మొన్నమొన్నటి దాకా నవ్వారు-రక్తంలోనే అన్నీ ఉంటాయా ? అంటూ ! ఇప్పుడు ప్రతిదానికీ జీన్సుతో ముడిపెట్టి మాట్లాడుతున్నారు. ఎవరు గెలిచారు ?
అందుచేత, మన పూర్వీకుల్ని వఠ్ఠి వెధవాయిలుగా శుంఠలుగా త్రోసిపుచ్చకండి. మీరు అనుకుంటున్నట్లు కాదు. మీకు సంస్కృతం రాకపోవడం, ప్రాచీన గ్రంథాలు చదవకపోవడం-ఇలాంటి పొఱపాటు అభిప్రాయాలకు కారణం. ప్రతి వృద్ధుడూ ఒకప్పుడు మనలాంటి యువకుడేనని అర్థం చేసుకోండి.
నేను తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారితో ఏకిభవిస్తున్నాను. జ్యోతిష్యశాస్త్రము కూడా ఒక సైన్సు వంటిది.
Scientific method follows self correction. Never claimed omniscience, omnipotence. That is essential difference between belief and research.Blind belief in the old systems and ancient people is not monopoly of east, it is similar in west too.
Astrology is not proved scientific anywhere. But some astrologers claimed it as scientific to get respectability.
James Randi put 5 crores of rupees in the trust and offered to give to anyone who establishes the scientific nature of astrology.
please go and see website at:
www.randi.org and find details.
The burden of proof always remains with those who claim scientific status to astrology.If some one says-come what may- I blindly adhere to my belief, there cannot be argument and reason
వాదనతో తిమ్మిని బమ్మిని చేయడానికి యిది చదువురానోళ్ళ చోటు కాదు. చదువుకున్నోళ్ళుండే చోటు. ఇక్కడ వాదనకి సరైన ప్రతివాదన చూపి వాళ్ళ వాదన తిప్పికొట్టడం జరిగి తీరుతుంది. అసలు తాడేపల్లి గారి వాదన ఒక base మీద నిలబడినట్టు, వాదనకి ఒక stand ఉన్నట్టు అన్పించదు. ఉదాహరణకి ఇది చూడండి. "ప్రకృతిలో ప్రతిదానికీ ఇంకో విషయంతో గొలుసుకట్టు సంబంధాలున్నాయి" అన్నారీ వ్యాఖ్యలలోనే. అదే విధంగా "ఒక శాస్త్రపు సూత్రాలని ఇంకో శాస్త్రపు పరిభాష (terminology)తో వివరించబూనుకోవడం నిష్ప్రయోజనం. అజ్ఞానపూర్వకం కూడా. Mathematics పరిభాషతో గాని దాని ప్రయోగసరణితో గానీ మీరు Zoology, biology principles ని వివరించజాలరు." ఇలా అనడం వైరుధ్యం కాదా. ప్రకృతితో అంతటికీ గొలుసు కట్టు వున్నప్పుడు లెక్కలకీ, జువాలజీ కీ గొలుసుండదా? సృష్టినంతటినీ ఏక సూత్రబద్ధం (ఒకే గొలుసుతో కలపబూనడం)చేయబూనిన ఐన్ స్టీన్ లెక్కల్లో సాపేక్ష సిద్ధాంతం (భౌతిక శాస్త్రం) చెప్పలేదా? ఈ మాట చూడండి. ఇది Science గురించి తెలిసిన ఏ వ్యక్తీ అనకూడని మాట. "ఏ పదార్థానికా పదార్థం, ఏ వస్తువుకా వస్తువు ఇతర పదార్థాలతోను వస్తువులతోను సంబంధం లేనిదిగా భావించబడుతూ అపార్థం చేసుకోబడుతూ ఉంటుంది." ఐన్ స్టీన్ దగ్గర నుండీ ఏ బుర్రున్న శాస్త్రవేత్తా "ఏ పదార్ధానికా పదార్థం" భావనలో వుండడు.ఐన్ స్టీన్ దాకా ఎందుకు mathematics తో నేను నా http://abhinayani.blogspot.com లో 'ఇంటి పేరు పురుషుడిదే' వ్యాసంలో లెక్కల మూలాలతో జీన్స్ నీ, జీన్స్ తో 'ఇంటిపేరు'నీ వివరించగలిగితిని కదా. జీన్స్ Zoology, biology ల్లో భాగం కాదా? చేతనయితే ఆ విషయం ఎవరైనా పూర్వపక్ష చేసి చూపండి. అయినా ఇప్పటి వరకూ ప్రామాణికం లేదనుకున్నప్పుడూ, ప్రస్తుతానికి సైన్సుదే విజయం అనుకున్నప్పుడూ, ఎప్పుడో నిరూపణకి రాబోయే వ్యక్తిగత విశ్వాసాల్ని జనాల నెత్తిన రుద్దబూనడం ఎంత వరకూ సమంజసం?
ఇంతకు ముందు నేనొక వ్యాఖ్య రాయడం జరిగింది. అందులో జ్యోతిష్యాన్ని వకాల్తా పుచ్చుకున్న వ్యక్తి వ్యాఖ్యానం లోని లోపాల్ని బహిర్గతం చేయడం జరిగింది.
ఇప్పుడు బ్లాగ్విషయం గురించి. జ్యోతష్యశాస్త్రం శాస్త్రీయమో కాదో నాకు తెలీదు. కానీ నా వ్యక్తిగతంగా మాత్రం చాలా ఆశ్చర్యకరమైన విషయాలే వున్నాయి. మచ్చుకి రెండు చెపుతాను. నాకు 1993 మార్చి 10 వ తేదీతో రాహు మహాదశ పూర్తయి, గురు మహాదశ మొదలైంది. నా అపాయింట్ ఆర్ఢరు 17-03-1993 న టైపు అయింది. నేను 30వ తేదీన ఉద్యోగంలో జాయిన్ అవడం జరిగింది. అలాగే మా బాబు పుట్టే సమయానికి వాడికి సింహరాశిలో కేతు మహాదశ నాల్గవపాదంలో(ఈ కేతు నాల్గవ పాదం లోనే యన్.టీ.ఆర్ మరణించింది) యిక రెండు రోజులే మిగిలివున్నాయి. విచిత్రంగా ఆ రెండు రోజులూ బాబుకి గ్యారంటీ యివ్వలేమన్నారు డాక్టర్లు. ఎలాగో ఇంటెన్సివ్ కేర్ లోనే ఆ రెండ్రోజులూ గడిచాయి. ఇక వాడికి శుక్ర మహాదశ ప్రారంభమయింది.ఆ తర్వాత అంతా శుభమేననుకోండి. అలా చెప్పాలంటే చాలానే వున్నాయి. అయినా నా వ్యక్తిగత నమ్మకాన్ని నేను శాస్త్రబద్ధం చేయబోను. అలాగే జరగనివి కూడా చాలా వున్నాయి. హిట్లర్ జాతకంలో కుజుడి స్వస్థానాలైన మేష, వృచ్ఛికాల్లో ఏదో ఒక దాన్లోనే కుజుడున్నాట్ట. అందుకే అతడు లోక కంటకుడయ్యారంటారు. కానీ, నేను మేషంలో కుజుడున్న వ్యక్తుల్ని ఇద్దర్ని చూసాను. వాళ్ళు చాలా మంచి వ్యక్తులూ, ముఖ్యంగా కోప స్వభావం లేని వారూనూ.
ఇక మీరు యోగ సిద్ధాంతం కూడా విజ్ఞాన వ్యతిరేక వాదం అన్నారు. ఒక మాటనుకుందాం. విజ్ఞానం అనంతమైనది. అదెప్పుడూ అనంతంగా తెలుసుకుంటూ పోవాల్సిన విషయం. ఇక మనిషి జీవిత కాలం పరిమితమైనది. అలా విజ్ఞానాన్ని తెలుసుకుంటూ పోవడంలోనే మనిషి మరణించడమూ జరిగిపోతుంది. ఇక మానవజీవితానికి పరమార్థం యేమిటనే ప్రశ్న అలాగే మిగిలిపోతుంది. అందుకే పెద్దలు మనం మనసులో పోగు చేసి పెట్టుకున్న విజ్ఞానం (ఇది పరిమితమైనది)గతం రూపంలో వుండి, అది వర్తమానాన్ని ప్రభావితం చేస్తూ భవిష్యత్తుని కలుషితం చేస్తున్నదంటారు. గతం లోంచి మనం సృజించిందేదైనా అది పాతదైన గతానికి మరో రూపమే కానీ అసలైన సృజనాత్మకం కాదంటారు. అసలైన సృజనాత్మక శక్తి మనసు గతంతో నిండిపోకుండా ఖాళీగా వున్నప్పుడే కొత్తది అందులోకి ప్రవేశించడానికి వీలుంటుందంటారు. అది తెలుసుకోడానికి మనం వర్తమానాన్ని గతంతో నింపకుండా ఋజువు చేసుకొని వ్యాఖ్యానించాలి గానీ, యిలా విజ్ఞానం ఋజువు పరచిన నియమాలను పాటించాలనడం భావ్యం కాదు గదా. ఆ నియమాలను పాటిస్తే అది మళ్ళీ మనం గతాన్ని practice లేదా exercise చేస్తున్నట్టే అవుతుంది గదా. అందుచేత యోగసిద్ధాంతం అనేది ఒక పేపర్ మీద పెట్టగలిగిన map కాదనీ, అది beyond thought అనావరణంగా వున్న మనసులో మాత్రమే చొరబడడానికి వీలుండే సృజనాత్మకమైనదనీ, దాన్ని వ్యక్తి తనంతట తాను ఋజువు చేసుకోవాల్సివుంటుందనీ, అంతా సైన్సుకి అణుగుణంగానే వుండాలను కోవడమూ తప్పేనేమోననీ విన్నవించుకుంటున్నాను.
నా వాదనలో లేని లోపాల్ని కనుగొని బహిర్గతం చేసిన వింజమూరిగారికి నెనర్లు.
1. ప్రకృతిలో ఒక విషయానికి మఱో విషయంతో గొలుసుకట్టు సంబంధం ఉండడం.
2. ఒక శాస్త్రపు పరిభాషతో ఇంకో శాస్త్రాన్ని వివరించబూనుకోవడం.
ఈ రెండూ ఒకటేనా ? మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. లోపం ఎవరి వాదనలో ఉందో మీకే అర్థమౌతుంది.
మీకర్థం కాకపోతే నేనే చెబుతాను.
ప్రకృతి ఏ శాస్త్రాలూ లేనిది. మానవుడు ఎన్నో శాస్త్రాలు ఉన్నవాడు. మానవుడి శాస్త్రాలన్ని తనకు అర్థమయ్యే విధంగాను తనకర్థమైనదాన్ని ఇతరులకు బోధపఱిచే విధంగాను ఏర్పఱచుకున్న సంకేతావళితో కూడుకొన్నవి. ఒక శాస్త్రపు సంకేతాలు ఇంకో శాస్త్రానికి వర్తించవు. ఒక శాస్త్రంలో నిజనిర్ధారణకు వాడే ప్రయోగసరణి ఇంకో శాస్త్రానికి అన్వయించదు.
ఈ ప్రస్తావన ఏ సందర్భంలో వచ్చిందో గమనించండి. గ్రహాలకూ మనిషి జీవితానికీ సంబంధం ఉందని నేను చెప్పిన సందర్భంలో వచ్చింది. ఇతర శాస్త్రాల ఆధారంగా జ్యోతిష్యం మీద తీర్పు చెప్పడం తప్పనీ జ్యోతిశ్శాస్త్రాన్ని దాని సొంత సూత్రాల మీదా దాని సొంత నిజనిర్ధారణపద్ధతి మీదా అర్థం చేసుకోవాలనీ చెప్పిన సందర్భంలో వచ్చింది.
ఒక ప్రక్క సోదాహరణంగా నా వాదనని బలపరుస్తూ మఱో ప్రక్క నా గుఱించి ప్రతికూల ప్రస్తావన తేవడం సందర్భోచితమేనా ? లేక దీనికేమైనా నేపథ్యం ఉందా ?
సరే ! కానివ్వండి. మీ ఇష్టం.
-ఇట్లు భవదీయుడు
(జ్యోతిష్యం తరఫున వకాల్తా పుచ్చుకున్న ఒక వ్యక్తి)
ఇన్నయ్యగారూ !
"జ్యోతిష్యం ఒక విశ్వాసం కాబట్టి అది అలా ! సైన్సు సైన్సే కాబట్టి ఇది ఇలా..." అంటూ చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. అభినందనలు.
నా ప్రశ్న ఏమిటంటే-సైన్సుగా చెలామణీ అవుతున్నదాంట్లో విశ్వాసాలకు స్థానమే లేదా ? సైన్సు అంటే సెల్ఫు కరెక్షన్ అని చెప్పారే ! జ్యోతిష్యం కూడా అంతేనని మీకు తెలియదు. ఇక్కడ సమస్య జ్యోతిష్యంతో కాదు. దానికి మూఢవిశ్వాసమని పేరుపెట్టి దాన్ని గ్రుడ్డిగా త్రోసిపుచ్చేవాళ్ళ గ్రుడ్డి-చెవిటి మనస్తత్వంతో ! దానికలా పేరుపెట్టి ఎప్పుడైతే కళ్ళు మూసేసుకున్నారో అప్పుడు దానిమీద ఇలా బురద జల్లుతూ శతాబ్దాల తరబడి వ్యాసాలూ బ్లాగులూ రాయాల్సి వస్తుంది. ఎందుకంటే జ్యోతిష్యం అబద్ధమని కొన్నివేల సంవత్సరాలుగా చాలామంది మొత్తుకుంటూనే ఉన్నారు. అయినా జ్యోతిష్యం చనిపోలేదు. దాని లెక్కలూ విశ్లేషణా జనానికి తమ వ్యక్తిగత జీవితాల్లో ఫలితాలు చూపిస్తున్నంతకాలం అది చనిపోదు. ఇతరుల అనుభవాల్ని త్రోసిపుచ్చినంత తేలిగ్గా ఎవరూ తమ వ్యక్తిగత అనుభవాల్ని త్రోసిపుచ్చలేరు.
సైన్సు చదువుతున్నవాళ్ళంతా అందులోనివన్నీ సత్యాలని అర్థమయ్యాక ఆ కోర్సుల్లో చేరారా ? లేక చేరాక అవి సత్యాలని తెలుసుకున్నారా ? మొదటిది నిజమైతే వాళ్ళు చేరాల్సిన అవసరం లేదు. రెండోది నిజమైతే సైన్సు సత్యమనే ప్రచారం వల్ల చేరారని చెప్పాల్సి ఉంటుంది. మఱి సైన్సు విషయంలో positive bias లేదని ఎలా అంటారు ? మఱి జ్యోతిష్యం దగ్గరికొచ్చేసరికి negative bias సృష్టించడానికి మీవంటివారు ఇతోధికంగా కృషి చేస్తున్నారు కదా ! ఇదేనా scientific method అంటే ?
నా వ్యక్తిగత విశ్వాసాల్ని జనం మీద రుద్దుతున్నానని వింజమూరిగారు అన్నారు. జ్యోతిష్యం నా ఒక్కడి వ్యక్తిగత విశ్వాసమైతే ఆ శాస్త్రాన్ని నేను సృష్టించి ఉండాలి. కాని నేను సృష్టించలేదని అందరికీ తెలుసు. ఒకవేళ జ్యోతిష్యం వ్యక్తిగత విశ్వాసమైతే అలాంటి వ్యక్తిగతవిశ్వాసం మీద దాడి చెయ్యడానికి ఎందుకిలా సర్వశక్తులూ ఒడ్డుతున్నారు ? "ఎవడి పిచ్చి వాడికానందం" అని వదిలెయ్యొచ్చు గదా ?
చర్చ్గ లొ వ్యక్తిగత దూషణ వలదు.
జ్యొతిశ్యం శాస్త్రం అయితే అంగీకరించడానికి సిధం.ఎలాగో చెపాలి.
గ్రహాలకు మనుషులకు సంబంధం చూపాలి.
తారలకు మనుషులకు సంబంధం తెలుపాలి.
లేని గ్రహాలు రాహు కే తు ఎలా మనుషులమీద ప్రభవం చూపుతాయి ?
శాస్త్ర పధతి లొ పెత్తనం వుందదు .రుజువు అవసరం. రుజువు కొరకు ఆగాలి. మన పెద్దలు చెప్పారు గనక రుజువు అదగరాదు అనదం శాస్త్రం కాజాలదు.