26, సెప్టెంబర్ 2009, శనివారం
ఆడుకుందాం....రా !
మన తెలుగువాళ్ళ తొలితొలి పూర్వీకులు గొప్ప మహర్షులూ, యోగులూ అయ్యుండాలి. (విశ్వామిత్రుడి కుమారుడైన ఆంధ్రుడి సంతానం అని పురాణాల్లో రాశారు) ఎందుకంటే తెలుగుభాషలో ప్రతి క్రియాపదమూ ఆటగా భావించబడుతుంది. వెతుకులాట, మాటలాట, పోటులాట, నవ్వులాట మొ||
భగవంతుడి లక్షణాల్లో ఒకటి లీలావిలాసం. అనగా ఆడుకోవడం. ఎందుకంటే ఆయన నిరంతర ఆనందస్వరూపుడు. ఆయనా, ఆవిడా ఎల్లప్పుడూ ఆడుకుంటూనే ఉంటారు. వాళ్ళిద్దఱూ శాశ్వతంగా చిన్నపిల్లలే కనుక వాళ్ళకి ఏ గొడవలూ రావు. అందుచేత ఆడుకునే స్వభావం ఉన్నవారందఱిలోను భగవత్తత్వం ఎక్కువ ప్రకాశమానమవుతుంది. ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, కవులు, రచయితలు, కళాకారులు, క్రీడాకారులు మొదలైనవారన్నమాట. ఈ సందర్భంగా చిన్నపిల్లల గుఱించి ఒక మాట. ఏయే పిల్లల జాతకాల్లో గురుగ్రహం బలంగా ఉంటుందో ఆ పిల్లలందఱికీ ఆటల పిచ్చి చాలా ఎక్కువ. అలాగే సప్తమస్థానం గురుగ్రహం చేత ప్రభావితమైన వారందఱికీ శృంగారాభిముఖ్యం ఎక్కువ. ఎందుకంటే శృంగారం కూడా ఒక ఆటే. ఇక్కడ గురుగ్రహ ప్రస్తావన ఎందుకు ? అనడిగితే - గురుగ్రహం పరమాత్మకి ప్రతిబింబమని ప్రశ్నశాస్త్రంలో చెప్పారు. కనుక ఆ గ్రహప్రభావం ఎక్కువగా ఉన్న జాతకాల్లో పరమాత్మతత్త్వం ఎక్కువగా వ్యక్తమవుతుంది.
నిజానికి అందఱమూ చిన్నపిల్లలుగానే జన్మించాం. ఆడుకుంటూనే పుట్టాం. ఆనంద స్వరూపులుగానే పుట్టాం. కానీ వయసు మీదపడేకొద్దీ ఇలా శోకమూర్తులుగా ఎలా పరిణమించాం ? దీనిక్కారణం - మనం ఆడుకోవడం మానేశాం. జీవితాన్ని ఆటగా చూడ్డం మానేశాం. చుట్టూ జఱిగేవాటిని చూసి నవ్వడం మానేశాం. దాన్ని గంభీరంగా తీసుకుంటూ, అవసరమైనదానికంటే గంభీరంగా తీసుకుంటూ మానసికంగా అదే మనంగా పరిణమించి క్రమంగా దుఃఖసాగరంలో మునిగిపోతున్నాం. అందుచేత మన ఆయుర్దాయాలు కూడా తగ్గిపోతున్నాయి. పూర్వీకులు నాలుగొందలేళ్ళు బతికేవారని పురాణాల్లో రాస్తే అవి పుక్కిటి పురాణాలంటున్నాం. నాకది ఆశ్చర్యం కలిగించదు. మానవుడి కున్నట్లే మానవజాతి క్కూడా ఒక బాల్యం ఉంది. వాళ్ళు దేన్నీ గంభీరంగా తీసుకోని స్థితిలో ఎక్కువకాలం బతికే అవకాశం ఉంది. ఇప్పుడు మన సగటు ఆయుర్దాయం అఱవయ్యేళ్ళకి, డెబ్భయ్యేళ్ళకి పడిపోయిందంటే, డెబ్భై దాటి బతికినవాణ్ణి మనం అదృష్టవంతుడుగా చూసే స్థితికి వచ్చామంటే మనం ఎన్నిరెట్లుగా ఆనందానికి దూరమయ్యామో, ఎన్నిరెట్లుగా నవ్వుల్ని కోల్పోయామో, ఎన్నిరెట్లు గంభీరంగా జీవితాన్ని తీసుకుంటున్నామో ఆలోచించాలి. మనం మళ్ళీ పూర్వపు ఆనంద స్వరూపులుగా మారాలంటే మళ్ళీ ఆడుకోవడం మొదలుపెట్టాలి. అలా చెయ్యాలంటే చదువుల ద్వారా, సంపాదన ద్వారా, సంఘజీవితం ద్వారా మనం దేనికైతే గుఱిచేయబడ్డామో ఆ సుదీర్ఘమైన de-sportivization ప్రక్రియని విదిలించుకొని బయటపడాలి. జీవితం పట్లను, మనుషుల పట్లను, ప్రపంచం పట్లను ఈ అతిగంభీర వైఖరిని, ఈ అంకిత భావాన్ని ఉజ్జగించాలి. మనిషి తనలోని పసిబిడ్డ బతికున్నంతకాలమే ప్రాణాలతో జీవించి ఉంటాడు. ఆ పసిబిడ్డ చనిపోతే అతను చనిపోతాడు. ఆ పసితనమే అతని Core personality. ఆ పసితనాన్ని నిలబెట్టడం, నిలబెట్టుకోవడం ఇది మనం చెయ్యాల్సినది.
అసలు భగవంతుడు ఈ ప్రపంచాన్ని చాలా అందంగానే సృష్టించాడు. ఆనందమయంగానే సృష్టించాడు. కానీ మనిషి దాన్ని పాడుచేసి "ఏంటో ఈ ప్రపంచం అందంగా లే" దంటున్నాడు. మనిషిని కూడా భగవంతుడు తనలాంటి ఆనందస్వరూపుడుగానే సృష్టించాడు. కానీ మనిషి ఆడుకోవడం మానేసి తోటి మనుషుల్ని దుర్మార్గులుగా, రాక్షసులుగా అభివర్ణించి తన మనసు పాడుచేసుకుని "జీవితం దుఃఖభాజనం" అని ఆరోపిస్తూ ఇలాంటి ప్రపంచాన్ని, జీవితాన్ని సృష్టించిన దేవుడు ఒక శాడిస్ట్ అయ్యుండాలంటున్నాడు. "కనుక అసలు దేవుడనేవాడే లేడు పొ"మ్మంటున్నాడు.
ఏం వెఱ్ఱితనం ! మనం ప్రతిదాన్ని ఒక ఆటగా తీసుకోవడం మొదలుపెట్టిన మఱుక్షణం, సంఘంలో ప్రతి ఆటని ఆ ఆట నియమాల ప్రకారం ఆడేసి మర్చిపోవడం నేర్చుకున్నాక దీని స్వరూపమే సమూలంగా మారిపోతుంది. దేవుడి సృష్టే కాదు, మనుషుల సృష్టి (వ్యవస్థలు) కూడా ఆనందం కోసమే సృష్టించబడింది. కానీ ఆటని ఆటగా చూడలేని గంటుమొహాల మూలాన అవి తమ ఆనంద స్వభావాన్ని కోల్పోయాయి. ఎంట్రన్స్ ఎగ్సాములు ఒక ఆట. ఉద్యోగాలు ఒక ఆట. డబ్బొక ఆట. పదవులొక ఆట. వీటిని ఆటలుగా పరిగణించడం మానేశాక, ఇతరుల దుర్బోధలు (వాళ్ళ దృష్టిలో అవి సద్బోధలు) విని మనం ప్రతిదాన్ని సీరియస్ గా తీసుకోవడం మొదలుపెట్టాక ప్రవేశించింది మన జీవితంలో దుఃఖం. కానీ మనం దాన్ని దుఃఖం అనుకోవడం లేదు. మనమేదో పెద్ద అనుభవ సంపన్నులమయ్యామనీ, ముదిరామనీ, ముగ్గామనీ, మాగామనీ భ్రమిస్తున్నాం. ఆటని ఆటగా చూడలేనివాళ్ళు ఎదిగినట్లు కాదు. యోగసాధనకి విధించిన నియమాల్లో ఒకటి - ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడం. అన్నీ వదులుకుని ఆనందంగా ఎలా ఉంటాం ? అనడుగుతారు. మనం సాధారణంగా ఎవరిని ఇష్టపడతాం ? అచ్చంగా మనలాంటి స్వభావం గలవారినే కదా ? దేవుడైనా అంతే. ఆయన ఎప్పుడూ ఆనందంగా ఆడుకుంటూ ఉంటాడు. తనలా ఆడుకునేవాళ్ళ కోసం, తృప్తిగా ఆనందంగా ఉండేవాళ్ళకోసం ఆయన ఎదురుచూస్తూంటాడు.
మనిషి ఒకటి కావాలి అనుకుంటే దాన్ని ఇంకా పొందకుండానే దాన్ని పొందినట్లుగా ప్రవర్తించడం మొదలుపెడతాడు. బ్రహ్మానందం అనేదేదో ఒకటుందని వేదాంత గ్రంథాల్లో చదివి "అది మనకి లభించడంలేదే ?" అని చింతాక్రాంతులవుతారు. ఇప్పుడు ఆనందంగా ఉండం నేర్చుకుంటే బ్రహ్మానందం కాలక్రమంలో దానంతట అదే సిద్ధిస్తుంది. కర్మయోగమంటే ప్రతిపనినీ ఒక పసిబిడ్డలా, ఆనందాన్ని తప్ప ఇంకేమీ ఆశించకుండా ఆటలా చెయ్యడం. నియమాల ప్రకారం ఆడేస్తూ అదే సమయంలో దాంట్లో తాదాత్మ్యం చెందకపోవడం. మనం వినే గొప్పగొప్ప ఆదర్శాలూ, వ్యక్తిత్వ వికాసాలూ గట్రా అన్నీ మనలోని పాత పసిబిడ్డని తిరిగి బతికించడానికి ఉద్దేశించినవే. అవి ఇప్పటికే నీలో ఉన్నాయి. కొత్తగా పూసుకోవాల్సిందేమీ లేదు. ఉన్నది పాడు చేసుకోకుండా ఉంటే చాలు.
నవదుర్గాస్తుతి
శ్రీ శైలాత్మజ ! నీదు దివ్య తపమున్ శ్రీ శంభుడే మెచ్చి, తా
నాశించెన్ నిను. పెండ్లి యాడె. తను నిన్నర్థాంగిగాఁ బొందె. మా
యాశల్ తీర్చగ నీకు మ్రొక్క, నతడు న్నర్థించు మాబోంట్ల తా
క్లేశంబొందగనీక కాచును గదా ! లీలన్ ! కృపాంభోనిధీ !
మ:-
మనమున్ భక్తి ప్రమోద భావమమరం బ్రహ్మంబునే బ్రహ్మచా
రిణి ! గాంచన్ సుకరంబె యయ్యె తమకున్. శ్రేయంబులన్ గూర్చు నీ
మణిమన్ మందిర ద్వీపమంద మనముల్ మళ్ళించు సద్భక్తులన్
గని, కావంగ నుపేక్ష యేల? విలసత్ కారుణ్య మాహేశ్వరీ !
శా:-
భక్తిన్ మ్రొక్కెద, చంద్రఘంట ! కరుణా భాస్వన్మనోజ్ఞాకృతీ !
శక్తిన్ గొల్పుమ నిన్ను మాదు మదులన్ సౌమ్యంబుగా నిల్ప! దు
శ్శక్తుల్ మాయఁగఁ జేయఁ జేయుమ ! కృపన్. చాంచల్య భావంబులన్
యుక్తిన్ బాపుమ ! సద్గుణంబు లిడుమా ! యుక్త్యుక్తులం జేయుమా !
శా:-
శ్రీ కూష్మాండ శుభాఖ్య ! మాదు ప్రణతుల్ చేకొమ్మ ! జీవాళిలో
నీకాంతుల్ ప్రసరింప, వెల్గు నిలపై. నీ ధ్యాస లేకున్నచో
శోకాగ్నుల్ మము చుట్ట ముట్టు. కరుణా జ్యోత్స్నళి నీ నుండియే
చేకొన్నన్ శుభ సంహతుల్ గలుగు. సుశ్రేయంబులున్ గల్గెడున్.
మ:-
కన రావా ! మము స్కందమాత ! విలసద్గాంభీర్య సద్రూపిణీ !
కనులన్ మమ్ములఁ బెట్టి గాంచ తగదో ! కారుణ్య భావోజ్వలా !
తను హృద్భాషల నిన్ను భక్తిఁ గొలువన్, తత్వజ్ఞతన్ గల్గి, నిన్
మనమందెప్పుడు గాంచు భాగ్య మిడుమా ! మమ్మున్ గృపన్ జూడుమా !
శా:-
ఓ కాత్యాయని ! యో సు పూజిత పదా ! ఓ దుష్ట సంహారిణీ !
శ్రీ కాత్యాయన సన్మునీశ్వర సుతా ! శ్రీ చక్ర సంచారిణీ !
నీ కారుణ్యమె మాకు జీవనముగా ! నిన్ గొల్చు సద్భాగ్యముల్
లోకంబందున మాకుఁగొల్పి, కృపతో లోలాక్షి ! కాపాడుమా !
ఉ:-
శ్రీ కర కాళ రాత్రి ! నిను చిత్త సరోజము నందు నిల్పి, నీ
భీకరమైన రూపమును ప్రీతిగ చూడగ నిచ్చగించెదన్.
నీకరవాల మీ ధరణి నింగికిఁ బంపును దుష్ట సంహతిన్.
ప్రాకటమొప్పఁ గాచెదవు భక్తుల పాలిటి కల్పవల్లివై.
మ:-
కరుణా సాంద్ర ప్ర పూరితా ! వర మహా గౌరీ ! శివాణీ ! మమున్
దరిఁ జేర్చన్ నిను మించు వారు కలరే ! దాక్షిణ్య మొప్పారగా
ధరపై దుష్ట జనాళి నుండి మములన్ దప్పించి కాపాడుమా !
వరమై నీ మహనీయ నామ మెదలో వర్ధిల్లగా జేయుమా !
మ:-
పరమేశానివి, సిద్ధి ధాత్రి ! కృపతో భక్తాళి నెల్లప్పుడున్
పరమేశుండును, నీవు కూడి, కనుచున్, భక్తిన్ ప్రవర్ధింపుచున్,
వరమై తోడుగ నుండుడీ! సుజనులన్ వర్ధిల్లగా జేయుచున్
దురితంబుల్ పొనరింపకుండ కనుడీ! దుష్టాత్ములన్ బాపుడీ!
ఇట్లు
భగవద్భక్త దాసుడు,
చింతా రామకృష్ణా రావు
21, సెప్టెంబర్ 2009, సోమవారం
నైవేద్య పద్ధతి
మనం రోజూ తినే తిండి అనేక సంక్లిష్ట దశాభేదాల్ని దాటుకొని అంతిమంగా మన నోట్లోకొచ్చిపడుతున్నది. ఆ యావత్తు దశాభేదాల్లోను మనిషి చేసే కృషికి అడుగడుగునా సహకరిస్తున్న భగవల్లీలావిశేషం ఉంది. ఆ లీలావిశేషమే లేకపోతే మనం దున్నినా విత్తలేం. విత్తినా మొక్కలు రావు. వచ్చినా ధాన్యం పండదు. పండినా దాన్ని ఇంటికి తెచ్చుకోలేం. తెచ్చుకున్నా తినలేం. ఇలా అడుగడుగునా మనం అత్యంత ప్రాథమికమైన తిండి అవసరాల కోసం భగవత్కృప మీద ఆధారపడి ఉన్నాం. అందుచేత ఆ ఆహారద్రవ్యాల్ని ఆహారరూపంలోకి మార్చుకోగలిగిన తరువాత భగవంతుణ్ణి విధివిధానంగా పూజించి వండినవాటిని భగవంతుడి సన్నిధిలో పెట్టి "హే భగవాన్ ! ఇది నీ దయామృతవర్షం. మమ్మల్ని బతికించడం కోసమే నువ్వు దీన్ని సృష్టించావు. నీ ప్రసాదం కావడం చేత ఇది పరమ పవిత్రమైనది." అని కృతజ్ఞతలు చెప్పుకొని దాన్ని భుజించడం ఉత్తమం. ఈ విధమైన స్తోత్రం చేత ఆయన మిక్కిలి సంతోషిస్తాడు. వారికి ఈ జన్మలోనే కాక రాబోయే జన్మల్లో కూడా ఆహారాదులకు లోపం లేకుండా చూసుకుంటాడు. వారి వంశంలో కూడా ఏ విధమైన లోటూ ఉండదు.
ఈ విధమైన హృదయపూర్వక భగవన్నివేదనకి హిందూధర్మంలో నైవేద్య సమర్పణ అని పేరు. నైవేద్య సమర్పణలో కొన్ని సంప్రదాయాలున్నాయి. ముఖ్యంగా--
౧. ఇంట్లో నైవేద్యంగా సమర్పించబడే ఆహారపదార్థాలు శాకాహారమైనా కావచ్చు. మాంసాహారమైనా కావచ్చు. మొత్తమ్మీద మనం తినేదే పెట్టాలి. శాకాహారమే అయి ఉండాలనే నియమమేమీ లేదు. అయితే కొందఱు మాంసాహారాన్ని ఎందుకు వద్దంటారంటే - మాంసాహారాన్ని సమర్పించేవారు సాధారణంగా అబ్రాహ్మణులై ఉంటారు. మనం భగవంతుడికి ఏది సమర్పిస్తే అదే మనకి వచ్చే జన్మలో వందరెట్లుగా సంప్రాప్తమౌతుంది. కనుక వారు వచ్చే జన్మలో కూడా మాంసాహార కుటుంబాలలోనే జన్మించాల్సి వస్తుంది. అతిమాంసాహార వ్యసనం వల్ల మరుజన్మలో జాతకంలో సర్పదోషాలు ప్రవేశిస్తాయి. ఆధ్యాత్మిక పురోగతికి అదొక పెద్ద ఆటంకమని పూర్వీకులు భావించారు. కాని భవిష్యపురాణాది గ్రంథాల్లో చెప్పిన ప్రకారం - కలియుగంలో బ్రాహ్మణుల్లో కంటే అబ్రాహ్మణుల్లోనే ఎక్కువమంది ఆధ్యాత్మిక మహాపురుషులు జన్మిస్తారు. (జన్మించారు) కనుక యుగధర్మాన్ని బట్టి అదొక లోపంగా భావించనక్కఱలేదు.
౨. ద్రవ్యశుద్ధి చాలా ముఖ్యమైన విషయం. అంటే ఏ విధమైన ధనంతో ఆ ఆహారాన్ని సిద్ధం చేశారు ? అది అక్రమార్జితమా ? సక్రమార్జితమా ? హింసార్జితమా ? అహింసార్జితమా ? ద్రవ్యశుద్ధి లోపించిన నైవేద్యాల్ని భగవంతుడు తిరస్కరిస్తాడు.
౩. అలాగే తమకి మధుమేహం ఉంది గదా అని దేవుడికి తీపిలేని వంటలూ, లేదా తమకి రక్తపోటు ఉంది గదా అని ఆయనకి ఉప్పువెయ్యని వంటలూ నైవేద్యంగా సమర్పిస్తూంటారు. అది అవాంఛనీయం. ఇందాక చెప్పిన సూత్రం ప్రకారం మనం దేన్ని సమర్పిస్తామో దాన్నే ఆయన వందరెట్లుగా మనకి తిరిగిస్తాడు కనుక అవే మధుమేహం, రక్తపోటూ మనకి మఱుజన్మలో కూడా సంప్రాప్తమౌతాయి. మళ్ళీ అదే చప్పిడి తిండి మనకి వందరెట్లుగా ప్రత్యక్షం.
౪. దేవుడికి ఏది పెట్టినా, ఎంత పెట్టినా ఫర్వాలేదనే అపోహలో చాలామంది హిందువులు బతుకుతున్నారు. అందుచేత ఏదైనా దైవకార్యం వచ్చినప్పుడు వారు వంటకాల్లో తగినన్ని సంబారాలు వెయ్యకుండా మానవమాత్రుడెవడూ నోట్లో వేసుకోలేని విధంగా పదార్థాలు వండి వాటినే ఇంట్లోను, దేవాలయాల్లోను సమర్పిస్తున్నారు. దేవుడికి ఏం పెడతామనేది, ఎంత పెట్టాలనేది మన స్థితిగతుల్ని బట్టి నిర్ణయమైపోయే ఉంటుంది. మనం సమాజంలో తగుమాత్రపు హోదాలో బతుకుతున్నప్పుడు దేవుడి చేత dieting చేయించడం అన్యాయం. మన స్థితి నిజంగా బాలేకపోతే ఆయనే సర్దుకుపోతాడు. కిందటేడాది హైదరాబాదు బోనాల్లో అమ్మవారు పూనినప్పుడు "నీకేం కావాలి తల్లీ ?" అని భక్తులడిగారు. "నాకీమధ్య మాంసం పెట్టడం మానేశారేంట్రా ?" అనడిగారు అమ్మవారు. "జీవాల్ని బలివ్వడం మీద ప్రభుత్వం నిషేధం విధించింది తల్లీ ! శాకాహారంతో తృప్తిచెంది మమ్మల్ని కాపాడవమ్మా !" అని వేడుకున్నారు భక్తులు. అమ్మవారు శాంతించి "సరే ! అలాగే కానివ్వండ్రా" అన్నారు.
౫. "శ్రియా దేయమ్, హ్రియా దేయమ్, భియా దేయమ్, సంవిదా దేయమ్" అన్నారు వేదఋషులు. అంటే కలిగినంతలో పెట్టాలి. ఎక్కడైనా పొఱపాటు జఱుగుతుందేమోననే జాగ్రత్తతో పెట్టాలి. భయభక్తులతో పెట్టాలి. ఆలోచించి పెట్టాలి అని అర్థం. భగవంతుడు బాల్యప్రియుడు. అమ్మవారికి ఎనిమిదేండ్ల పిల్లగా దర్శనమివ్వడం అభిమతమైనట్లే అయ్యవారికి ఆఱేళ్ళ పిల్లగాడుగా దర్శనమివ్వడం మిక్కిలి ఇష్టం. కీ.శే. జిడ్డు కృష్ణమూర్తిగారు తాను అమ్మ (అనీబీసెంట్) తో కలిసి వైకుంఠానికి వెళ్ళినప్పుడు అక్కడికి ఒక ఆఱేళ్ళ పిల్లవాడు వచ్చాడని "ఆయనే భగవంతుడు. నమస్కారం చేసుకో" మని వెంటనున్న ఋషులు హెచ్చఱించారనీ వ్రాశారు At the Feet of the Master అనే గ్రంథంలో ! అందుచేత ఒక చిన్నపిల్లవాణ్ణి ఎలా ముద్దుచేసి, బతిమాలి, వెంటపడి అన్నం తినిపిస్తామో అలాగే, అంతటి తత్పరతతోనే భగవంతుడికి నైవేద్యం పెట్టాలి.
౬. బయట కొన్న వంటకాల్ని నైవేద్యం పెట్టకూడదు. అవి వ్యాపారనిమిత్తం అనేక రకాలైన అశౌచాలకి గుఱై ఉంటాయి కనుక ఎట్టి పరిస్థితుల్లోను అవి పనికిరావు.
౭. నిలవ ఉన్నవీ, పులిసిపోయినవీ అయిన పదార్థాల్ని ఇంట్లో వండినా సరే నైవేద్యానికి పనికిరావు. అయితే సంతోషీమాత తప్ప మిహతా అందఱు దేవతల విషయంలోను కొత్తపెరుగుకు మినహాయింపు ఉంది. గ్రామదేవతలకైతే చద్దెన్నం మహాప్రీతికరం.
౮. తమ సొంత యింట్లోను, తమ సొంత ఆఫీసులోను నైవేద్యాన్ని తాము (గృహిణి, గృహస్థుడు/ యజమానుడు, యజమానురాలు) స్వయంగా గానీ, తాము నియమించిన వేదబ్రాహ్మణుడు గానీ సమర్పించాలి. ఇతరులు పనికిరారు.
౯. నైవేద్యంలో బెల్లం ముక్క, నేతి అభిఘారమూ తప్పనిసరి.
౧౦. హారతి ఇచ్చాకనే నైవేద్యం.
౧౧. నైవేద్యం పెట్టేటప్పుడు ఆహార పదార్థాల చుట్టూ కుడిచేత్తో నీళ్ళు చిలకరించి సంబంధిత దేవతాస్తోత్రం చదవాలి. ఏ దేవుడికైనా, దేవతకైనా పనికొచ్చే సర్వదేవతోపయోగి శ్లోకం :
శ్లో|| బ్రహ్మార్పణమ్ బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ |
బ్రహ్మైవ తేన గన్తవ్యమ్ బ్రహ్మకర్మసమాధినా ||
విష్ణుమూర్తికీ, ఆయన అవతారాలకూ అయితే--
శ్లో|| పత్రమ్ పుష్పమ్ ఫలం తోయం యస్తే భక్త్యా ప్రయచ్ఛతి |
తద్భవాన్ భక్త్యుపహృతమ్ అశ్నాతి ప్రయతాత్మనః ||
శ్లో|| యత్కరోమి యదశ్నామి యజ్జుహోమి దదామి యత్ |
యత్ తపస్యామి గోవింద తత్కరోమి త్వదర్పణమ్ ||
శ్లో|| కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాఽఽత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |
కరోమి యద్యత్ సకలమ్ పరస్మై
నారాయణేతి సమర్పయామి ||
ఏ కులస్థులైనా సరే, ఏ దేవీదేవతలకైనా నైవేద్యం పెట్టేటప్పుడు --
ఓం సత్యమ్ చిత్తేన పరిషించామి | అమృతమస్తు | అమృతోపస్తరణమసి స్వాహా |
అని నైవేద్యం చుట్టూ నీటి బిందువుల్ని చిలకరించాలి. తరువాత--
ఓమ్ ప్రాణాయ స్వాహా ! ఓం వ్యానాయ సాహా | ఓమ్ ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా | ఓమ్ బ్రహ్మణే స్వాహా |
అని కుడిచేత్తో ఆహారపదార్థాల్ని దేవుడికి/ దేవతకు చూపించాలి.
మధ్యేమధ్యే పానీయం సమర్పయామి
అని నైవేద్యం మీద మళ్లీ నీటిబిందువుల్ని ప్రోక్షించాలి.
నమస్కరోమి అని సాష్టాంగం చేసి లేవాలి.
౧౨. దేవుడికి దిష్టి తగలకుండా ఆ కాసేపు గది తలుపు మూసెయ్యాలి. లేకపోతే భోజనప్రియత్వం గలవారు ఆ ఆహారపదార్థాల వంక కుతూహలంగా, సాభిప్రాయంగా చూసినప్పుడు వాటిల్లో రంధ్రాలేర్పడడం, రంగుమారడం జఱుగుతుంది. ఆ మార్పుల్ని యోగులు మాత్రమే తెలుసుకోగలరు. ఒకటి-రెండు నిమిషాల తరువాత లోపలికెళ్ళి మళ్ళీ దేవుడికి నమస్కారం చేసుకొని ఆహార పదార్థాల్ని తీసుకురావాలి.
8, సెప్టెంబర్ 2009, మంగళవారం
అల్లాహ్ ఎవరు ? మక్కా అంటే ఏమిటి ?
అది నిర్మించడానికి చాలా సంవత్సరాలు పట్టింది. గమనించాల్సిన విషయమేంటంటే ఇది ఊహ కాదు. దీనికి పురావస్తు సాక్ష్యం (Archaeological evidence) ఉంది. అరబ్బీ భాషలో ఈ విషయం తెలియజేస్తూ అక్కడ చంద్రగుప్త విక్రమాదిత్యుడు వేయించిన శిలాశాసనమే ఇందుకు నిదర్శనం. ఆ దేవాలయం అతిత్వరలోనే యావత్తు అరబ్బీ దేశపు హిందువులకీ కేంద్రస్థానంగా, శైవ పీఠాధిపత్యంగా మారింది. ఇప్పుడు మక్కా వెళ్ళే హజ్ యాత్రికులంతా దర్శించేది ఆ మహాకాళీ ఆలయాన్నే. దాన్ని స్వాధీనం చేసుకోవడం కోసమే ఆఱో శతాబ్దంలో ప్రవక్త మహ్మదుగారు తతిమ్మా అరబ్బీ తెగలతో (శైవులతో) హోరాహోరీ పోరాడాడు. ఆయన విగ్రహారాధకులతో పోరాడాడని కొరాన్ లో వ్రాశారు.
ఆ ఆలయంలో కాబా అని పిలిచే నల్లఱాయి (అదే అల్లాహ్ అంటారు వాళ్ళు) ఒక గోడలో తాపడం చేసి ఉంటుంది. శివలింగం లేని పానవట్టాన్ని ఒకసారి ఊహించుకోండి. అది సరిగ్గా అలా ఉంటుంది. లింగం స్థానంలో లోతుకు పోయిన ఖాళీసొట్ట కూడా ఉంటుంది. పానవట్టం పార్వతీస్వరూపమని కదా హిందూ సంప్రదాయం. హజ్ యాత్రికులు దాన్ని తాకడం కోసం ఎగబడుతూంటారు. కాబా దగ్గఱ దాన్ని పూజించే ముస్లిమ్ ఇమామ్ లు అచ్చం మన శైవపూజారుల తరహాలో బోడిగుండ్లు, పంచెలు, ఉత్తరీయాలూ ధరించి ఉంటారు. భక్తులు కూడా అసలు అదే వేషంలో కాబాని దర్శించాలని నియమం ఉందట.
ఆ నల్లఱాయి ఇస్లామ్ ఆవిర్భవించక ముందునుంచే అక్కడ ఒక పూజనీయవస్తువుగా ఉండేదని చారిత్రిక ఆధారాల వల్ల తెలుస్తున్నది. ఈ క్రింది ఉటంకింపుల్ని గమనించండి :
Edward Gibbon writes about the Ka'bah and its existence before the Christian era in his book:
"..... of blind mythology of barbarians - of the local deities, of the stars, the air, and the earth, of their sex or titles, their attributes or subordination. Each tribe, each family, each independent worrier, created and changed the rites and the object of this fantastic worship; but the nation, in every age, has bowed to the religion as well as to the language of Mecca. The genuine antiquity of Caaba ascends beyond the Christian era: in describing the coast of the Red sea the Greek historian Diodorus has remarked, between the Thamudites and the Sabeans, a famous temple, whose superior sanctity was revered by all the Arabians; the linen of silken veil, which is annually renewed by the Turkish emperor, was first offered by the Homerites, who reigned seven hundred years before the time of Mohammad."
Diodorus Siculus was a Greek historian of 1st century BC who wrote Bibliotheca Historica, a book describing various parts of the discovered world. The following lines are the English translation of Greek quoted by Gibbon from the book of Diodorus Siculus (Diodorus of Sicily) describing the 'temple' considered to be the the holiest in the whole of Arabia.
"....And a temple has been set-up there, which is very holy and exceedingly revered by all Arabians...."
చాలా దశాబ్దాల క్రితం - అంటే అరేబియా పాశ్చాత్యుల అధీనంలో ఉన్నప్పుడు ఒక తెల్లవాడు ఆ ఆలయప్రాంగణంలో ఎల్లప్పుడూ మూసిపెట్టి ఉంచే ఒక గదిని తెఱిపించి చూశాడట. లోపల త్రిశూలాలు, శివలింగాలూ, సర్పాకార శిల్పాలు చాలా చూశానని, అలాంటివి ఇండియాలో తప్ప ఇంకెక్కడా ఉండవని రాశాడు. ఆ గదిని ఎవరూ చూడకూడదనే నియమాన్ని ఇప్పుడు మాత్రం కట్టుదిట్టంగా అమలు జఱుపుతున్నారు.
అసలు విషయమేమంటే - అల్లా అంటే సంస్కృతంలో అమ్మ అని అర్థం.
కలికాలజ దోష తుషార సంహతి-1
"స్వామీ ! అన్ని దేశాల్లోను, ఖండాల్లోను యజ్ఞయాగాదులతో, అఖండ ధర్మాచరణతో నిరతాగ్నిహోత్రంలా వెలిగిపోతున్న భూమికి నేనెలా వెళ్ళేది ? నాకేమో యజ్ఞయాగాలంటే చచ్చేంత భయం. దేవుడి పేరు వింటే గుండెపోటు. శుచి అన్నా శుభ్రత అన్నా అసహ్యం. నియమనిష్ఠలంటే వొళ్ళుమంట. శాస్త్రాల పేరు చెబితే కంపరం. బ్రాహ్మణుల ఉనికే భరించలేను. నా పేరే కలి ( కలహం). ప్రజలు ఐకమత్యంతో ఉంటే నాకు నిద్రపట్టదు. అబద్ధాలకోరులూ, తడిగుడ్డలతో గొంతులు కోసేవాళ్ళు, నరహంతకులు, గురుద్రోహులు, దైవద్రోహులు, పతితస్త్రీలు, జారులూ, చోరులూ, వ్యభిచారులూ, దొంగభక్తులు, బందిపోటు దొంగల్లా ప్రవర్తించే రాజులూ, కనిపించిన ప్రతిదీ అమ్ముకుని బతికేవాళ్ళు, వావివరుసలు లేనివాళ్ళు, నాస్తికులు నాకు మిక్కిలి ప్రీతిపాత్రులు. కొట్టుకుచచ్చే దేశాలు, కూలిపోయిన కుటుంబాలు, పాడుపడ్డ కొంపలు, ఎండిపోయిన బీళ్ళు, వట్టిపోయిన నదులు, రక్తధారలు, మాంసపు ముద్దలు, అనాథలై వలసపోయే ప్రజలు, భోరున ఏడుస్తున్న స్త్రీలు, విధవరాళ్ళు - ఇవీ నా మనస్సుని పరవశింపజేసి మత్తెక్కించే సుందర దృశ్యాలు. అలాంటి నన్నేనా తమరు పరమ పవిత్రమైన భూలోకానికి వెళ్ళమంటున్నది ? ఇది కలా ? నిజమా ? నేను రాజ్యం చెయ్యడానికి అనుకూలమైన పరిస్థితులక్కడ లేవు గద స్వామీ ?" అని అడిగాడు.
బ్రహ్మదేవుడు చిఱునవ్వు నవ్వి "నాయనా ! కలీ ! ఇహ నీ వంతొచ్చింది. కనుక నువ్వక్కడికి వెళ్ళకా తప్పదు. రాజ్యపాలన చెయ్యకా తప్పదు. ప్రస్తుతం నీ ఏల్బడికి తగిన పరిస్థితులక్కడ లేవన్నమాట నిజమే. కానీ అలాంటివి క్రమక్రమంగా ఏర్పడతాయి. వైదిక ధర్మాచరణ గలవారిని, గురుభక్తుల్ని నువ్వేమీ చెయ్యలేవు. కానీ మిహతావారిలోని అధర్మాన్ని ఆసరాగా చేసుకొని వారిని నువ్వు వశం చేసుకోవచ్చు. అలా నీ ధర్మాన్ని భూమండలమంతా వ్యాపింపజేయవచ్చు." అని సముదాయించి ధైర్యం చెప్పి పంపాడు.
"సరే" నని కలిపురుషుడు ఎలాగో మనసు చిక్కబట్టుకొని పీచుపీచుమంటున్న గుండెతో భయం భయంగా భూమండలానికి దిగివచ్చే సమయానికి ప్రపంచాన్ని పాండవుల పౌత్రుడైన పరీక్షిన్ మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయన మెత్తని మనసు గలవాడని విన్నాడు కలి. "అయితే నన్నేం చెయ్యలే"డనుకొని ధైర్యం తెచ్చుకున్నాడు. ఒకసారి ఆ మహారాజు వస్తున్నదారిలో ఒక శూద్రుడి రూపాన్ని ధరించి ఒక గోమిథునాన్ని (ఒక ఆవు, ఒక ఎద్దు) హింసించడం మొదలుపెట్టాడు. ఎద్దు కాళ్ళు మూడు విఱగ్గొట్టాడు. పరీక్షిన్ మహారాజు అక్కడికొచ్చి చూసేసరికి వీడు ఇంకా వాటిని చావగొడుతూనే ఉన్నాడు.
"ఎవడ్రా నువ్వు దుర్మార్గుడా ? సాక్షాత్తు నా రాజ్యంలోనే గోహింసకి పాల్పడుతున్నావ్ ?" అని గద్దించి అడిగాడు పరీక్షిత్తు.
"నువ్వెవడివోయ్ అడగడానికి ? నీ పని నువ్వు చూసుకో ! ఇది నాయిష్టం. నేను వీటిని కొడతాను, చంపుతాను." అని మొండిగా సమాధానమిచ్చాడు కలి, సరిగ్గా ఇఱవయ్యో శతాబ్దపు మనిషిలా.
ఆ మాటతో పరీక్షిత్తుకు అఱికాలిమంట నెత్తికెక్కింది. ప్రచండ ఆగ్రహోదగ్రుడై వెంటనే రథం నుంచి కిందికి దూకి వాడి జుట్టుపట్టుకున్నాడు. ఇహ చంపడమే తరువాయి. మహాపుణ్యాత్ముడైన పరీక్షిత్తు ముందు తన మాయలు పనిచేయకపోవడం గమనించి వాడు భయకంపితుడయ్యాడు. తప్పించుకోవడానికి సాధ్యం కాక ఆ మహారాజు సామాన్యుడు కాడని తెలుసుకొని దీనంగా ఆయన కాళ్ళు పట్టుకొని శరణువేడాడు.
"మహారాజా ! నేను కలిపురుషుణ్ణి. ఈ గోమిథునం భూదేవి మఱియు ధర్మదేవుడు. భూలోకంలో నా ధర్మాన్ని ప్రవర్తింపజేయమని సాక్షాత్తు పితామహు డాదేశించిన ప్రకారమే నేను చేస్తున్నాను. నన్ను దయదల్చి వదిలిపెట్టండి మహాప్రభో !" అని ఆక్రోశించాడు.
"అలా అయితే నేనూ, నా వంశస్థులూ పరిపాలిస్తున్నంతకాలం నువ్వీ భూమండలం మీద కనిపించడానికే వీల్లేదు" అన్నాడు పరీక్షిత్తు.
"మఱి పితామహులాజ్ఞ ఎలా ఉల్లంఘించేది మహారాజా ?" అని నసిగాడు కలి.
"అయితే నువ్వు అప్పటిదాకా పశ్చిమభూములకి పారిపో !" అని సెలవిచ్చాడు పరీక్షిత్తు.
వాడు "బతుకుజీవుడా ! "అనుకుంటూ భరతఖండం నుంచి పశ్చిమానికి పారిపోయాడు. వాడికి నేరుగా భరతఖండాన్ని వశం చేసుకోవడం కుదఱలేదు కనుక అట్నుంచి నఱుక్కురావడం మేలని భావించాడు. ఆ ప్రకారమే పశ్చిమద్వీపాల నుంచి, పశ్చిమదేశాల నుంచి తన జైత్రయాత్ర ప్రారంభించాడు. ఆ పశ్చిమదేశాల్లో ఈజిప్టు, ఇస్రాయేల్, యూరోపు, అరేబియా, ఇంగ్లండు ఉన్నాయి - ఇప్పటిదాకా గడిచిన చరిత్ర ప్రకారం చూస్తే !
మఱికొంత తరువాత.....
7, సెప్టెంబర్ 2009, సోమవారం
సత్యమే ధైర్యము
అంతే కాదు, ఆ సత్యాన్ని అనుసరించేవారూ, దాన్ని కనుగొనేవారూ, దాన్ని మాట్లాడేవారూ, దాన్ని ఒప్పుకునేవారూ. సమర్థించేవారు కూడా భగవత్ స్వరూపులే. సత్యం మిగతా అన్ని ధర్మసూత్రాల్నీ తనలో ఇమిడించుకొన్న మహా ధర్మసూత్రం. అంటే ఒక్క సత్యాన్ని మాత్రమే అవలంబించినా చాలు, మిగతా అన్ని మంచి లక్షణాలూ నెమ్మదిగా వాటంతట అవే అలవడతాయి. అదే విధంగా, ఒక్క సత్యాన్ని వదిలిపెడితే చాలు, మిగతా అన్ని ధర్మాలూ మనిషిని వదిలిపోతాయి. అందుకే "దేన్నయినా త్యాగం చేస్తాను గానీ, నాలోని సత్యాన్ని మాత్రం త్యాగం చెయ్యలే"నన్నాడట అంగదేశపు రాజైన కర్ణుడు. ఎందుకంటే సత్యాన్ని త్యాగం చెయ్యడం వల్ల అంతకు ముందు చేసిన త్యాగాలన్నీ అబద్ధమైపోతాయని అతని భయం. ఒక్క సత్యమనే కాదు, సద్గుణాలైనా, దుర్గుణాలైనా అన్నీ కలసికట్టుగానే వస్తాయి. కలసికట్టుగానే పోతాయి.
అలా, సత్యం ద్వారా అలవడే సద్గుణాల్లో ధైర్యం కూడా ఒకటి. ధైర్యమంటే 'ఇతరులతో యుద్ధం చెయ్యడం' అని చాలామంది అనుకుంటారు. కానీ ధీరత్వమే ధైర్యం. ధీరత్వమంటే చలించకుండా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండడం. నిజాలు తెలిసినవారికి, నిజాలు మాట్లాడేవారికీ మాత్రమే అది సాధ్యం. అసత్యవాదులు నెమ్మదిగా ప్రశాంతంగా ఉండలేరు. అందుచేత ధైర్యమంటే ఇతరులకు హాని చేయడం కాదు. సత్యాన్ని సత్యంగా గ్రహించి, నిజాయితీగా దాన్ని ఒప్పుకుని, దాన్నుంచి పారిపోకుండా, దాని పర్యవసానాల్ని తెలివితేటలతో ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధం కావడంలోనే నిజమైన ధైర్యం ఇమిడి ఉంటుంది.
చిన్నప్పుడు నేనొక కథ విన్నాను.
పూర్వం హిరణ్య రాష్ట్రం (కడప జిల్లా) లో ఒక నదీతీరంలో శంఖుడు, లిఖితుడు అని ఇద్దరు అన్నదమ్ములు చెఱొక ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఒకసారి అన్న అయిన శంఖుడు తన ఆశ్రమ బాధ్యతని కూడా తమ్ముడికప్పగించి పక్క గ్రామానికి వెళ్ళాడు. మర్నాడు లిఖితుడు పూజ కోసం పూలు కోయాలనుకుని తన ఆశ్రమంలో పూలు పూయకపోవడం చేత అన్నగారి ఆశ్రమంలో పూచిన పూలు కోసుకుని పూజ చేశాడు. ఆ తరువాత అతనికి జ్ఞాపకం వచ్చింది - తాను అన్నగారి అనుమతి లేకుండానే ఆయనకు చెందిన పూలని వాడుకున్నానని. చాలా బాధపడ్డాడు. మర్నాడు అన్నగారు రాగానే ఏమీ దాచకుండా నిజం చెప్పాడు. దొంగతనం చేసినందుకు తనకు తగిన శిక్ష విధించమని కోరాడు. అది చాలా చిన్న విషయమనీ, అయినా తనతో నిజం చెప్పి ఒప్పుకున్నాడు కనుక అతని దోషం పోయిందనీ శంఖుడు ఎంత నచ్చజెప్పినా లిఖితుడు వినలేదు. అప్పుడు శంఖుడు అతనితో " శిక్షలు విధించే అధికారం దేశాన్ని పాలించే రాజుకు మాత్రమే ఉంది. కాబట్టి నువ్వు ఆయన దగ్గఱికే వెళ్ళి నీ అపరాధాన్ని వివరించి ఆయన నీకు ఏ శిక్ష విధిస్తే దాన్ని అనుభవించు" అన్నాడు. "సరే"నని లిఖితుడు రాజుగారి దగ్గఱికి వెళ్ళి తన అపరాధాన్ని వెల్లడించాడు. దొంగతనానికి ఆ రోజుల్లో చేతులు నఱకడమే శిక్ష. ఒక తపస్విని అంత చిన్న అపరాధానికి అలా శిక్షించేందుకు మొదట రాజు కూడా ఇష్టపడలేదు. కాని లిఖితుడు చాలాసేపు ఆయనతో వాదించి పట్టుపట్టిన మీదట ఆయన అతని చేతులు నఱకవలసిందిగా ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ ననుసరించి ఆయన భటులు లిఖితుడి చేతుల్ని నఱికేశారు. చేతుల్లేకుండా ఆశ్రమానికి తిరిగి వచ్చిన తమ్ముణ్ణి చూసి శంఖుడు సంతృప్తి చెంది " తమ్ముడూ ! ఇప్పుడు నువ్వు పవిత్రుడివయ్యావు. వెళ్ళి నదిలో స్నానం చేసి రా !" అన్నాడు. "అలాగే అన్నయ్యా !" అని లిఖితుడు నదికి వెళ్ళి మూడు మునకలు వేసి లేవగానే అతని చేతులు యథాపూర్వంగా తిరిగి వచ్చాయట. లిఖితుడు సంతోషంతో అన్నగారి ఆశ్రమానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన చేతుల్ని చూపించగా ఆయన ఆనందంతో అతన్ని కౌగలించుకుని "తమ్ముడూ ! నీ సత్యనిష్ఠకు మెచ్చి ఆ నదీమతల్లి నీకు ప్రసాదించిన వరమే ఇది. ఆమె బాహుదా" అన్నాడట. అప్పటినుంచి ఆమెకు 'బాహుదానది' (బాహువులు - అనగా చేతులిచ్చిన నది, లేక 'చెయ్యేఱు') అని పేరు వచ్చిందట. అంతకు ముందు దాన్ని ఏమని పిలిచేవారో తెలియదు.
ఆ విధంగా, ఎంత చిన్నదైనా కానీ, తప్పు చేశాననే సత్యాన్ని ఒప్పుకుని అందుకు శిక్ష అనుభవించడానికి మన:స్ఫూర్తిగా సిద్ధపడ్డ లిఖితుడి ధైర్యమే మనకందఱికీ ఆదర్శం కావాలి.
అమ్మవారిని దూషించకుండా జాగ్రత్తపడదాం !
ఈ తరహా సంభాషణలు అప్పుడప్పుడు మన చెవిన పడుతూంటాయి. "వెధవ" డబ్బట ! డబ్బు లేకపోతే మన నడ్డి లేవడం అసాధ్యం అని తెలిసీ కొంతమంది దానిమీద ఇలా నోరు పారేసుకుంటూ ఉంటారు. "అయ్యా ! డబ్బు సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీ దేవి, దాన్ని దూషించడం మహాపచారం మొఱ్ఱో !" అని మన పూర్వులు నెత్తీనోరూ కొట్టుకున్నా మనవాళ్ళకిదే ధోరణి. అందుకే ఇలా అమ్మవారిని పరోక్షంగా దూషించీ, దూషించీ మన దేశం దరిద్రదేశం అయిందేమోనని మనసులో నాకొక మూలనచింత.
డబ్బు దేవత ఎలా అయింది ? అనడిగితే, దాన్తో మనం ప్రకృతివనర్లని స్వాధీనం చేసుకుని అనుభవిస్తాం కనుక. ప్రకృతివనర్లే డబ్బుగా రూపాంతరం చెందుతాయి గనుక. "ప్రకృతిం వికృతిం విద్యామ్..." అంటుంది శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం. ఆ స్తోత్రంలో అమ్మవారికున్న మొట్టమొదటి పేరే "ప్రకృతి" అని చెప్పబడింది అంటే ఆలోచించండి.
"వెధవ" అనేది మొదట్లో దూషణ (abuse) కాకపోయినా తరువాతి కాలంలో దూషణగా మారింది. వెధవ అంటే నిజానికి వితంతువు అని అర్థం. ఆ రోజుల్లో యౌవనవితంతువులకి పునర్వివాహ అవకాశం లేక బలవంతపు బ్రహ్మచర్యాలు పాటించడం చేతకాక కంటికి నచ్చినవాడితో పారిపోయేవారు. అందుకని వాళ్ళని సమాజం ఇలా దూషించేది. ఇప్పుడు మగవాళ్ళని కూడా ఆ పదంతోనే దూషిస్తున్నారనుకోండి. అదే వేఱే విషయం. ఆ పదాన్ని డబ్బుకి - నిత్యసుమంగళి, శాశ్వతసౌభాగ్యవతి, పరమపతివ్రతాశిరోమణియైన అమ్మవారికి అన్వయించడం భావ్యం కాదు గదా !
6, సెప్టెంబర్ 2009, ఆదివారం
వేదమంత్రాభ్యాసం పురుషులకే విహితం
ఇందులోకి ఆధునిక రాజకీయ సిద్ధాంతాలైన సమానత్వం, స్త్రీల హక్కులు, అణచివేత మొదలైన గాడిదగత్తర లాక్కురావడం మిక్కిలి అసమంజసమని నా అభిప్రాయం. ఆ మాటకొస్తే మతంలోకి మతేతర కాన్సెప్టుల్ని లాక్కురావడం ఎప్పుడైనా అభ్యంతరకరమే. మతానికి ఋషులే ప్రమాణం. ఇంకెవరూ ప్రమాణం కాదు. ఇంకెవరినీ మతావలంబులు అనుసరించాల్సిన అవసరం లేదు. మతానికి రాజకీయాల కంటే, చట్టాల కంటే సైన్సుకంటే వేఱుగా తనదంటూ ఒక సొంత దృక్పథం ఉంది. ఆ దృక్పథం నుంచే దాన్ని చూడాలి. మనక్కావాల్సింది ఈ కాలపు విదేశీ కాన్సెప్టుల కనుగుణంగా మన సంప్రదాయాన్ని వ్యాఖ్యానించుకోవడం కాదు. మన సంప్రదాయాన్ని దాని దృష్టితోనే చూడాలి. ఇతరదృష్టులు పనికి రావు. కష్టమైనా, నిష్ఠూరమైనా సత్యశోధనాదృష్టి కావాలి. మన పూర్వీకులు ఏం చెప్పారు ? ఆచరణలో ఏం చేశారు ? ఇవే మనక్కావాల్సినవి.
వేదాలు కాకపోతే వాటికి ప్రత్యామ్నాయభూతాలైన మతగ్రంథాలు చాలా ఉన్నాయి. ఈనాడు మన ఆధ్యాత్మిక జీవనానికి గానీ మతవిద్యకి గానీ వేదాలు తప్పనిసరి కాదు. అయితే ఈ రోజుల్లో స్త్రీలే కాక పురుషులు కూడా వేదాభ్యాసం మానేశారు కనుక ఇప్పుడీ చర్చ పెద్దగా ఉపయుక్తం కాదు. చినజీయర్ గారు దళితులకి వేదాలు బోధించడానికి సంసిద్ధత వ్యక్తం చేసి ఏడాదవుతున్నా ఇప్పటికీ ఒక్క దళితుడు కూడా వారి ఆశ్రమాల్లో చేఱలేదు. ఉన్న వాస్తవ పరిస్థితి ఇది. స్త్రీలకి వేదమంత్రాల శిక్షణని పూర్వులు వద్దన్నారా ? వద్దంటే ఎందుకు వద్దన్నారనేది ఈ వ్యాసంలో శోధిస్తున్నాము.
పాశ్చాత్యుల మాదిరి జ్ఞానాన్ని మన పూర్వీకులు కనిపించిన ప్రతివారికి (Mass education drive) ఉద్దేశించలేదు. ఇక్కడ యోగ్యతకే అగ్రతాంబూలం. భారతీయ విద్యావ్యవస్థలో గురువు శిష్యుల్ని పోగేసి డబ్బు సంపాదించుకోడు. శిష్యుడే జ్ఞానదాహంతో గురువును వెతుక్కుంటూ వెళ్ళాలి. అతని అర్హత, యోగ్యత, గురుభక్తి, శ్రద్ధ, శక్తి మొదలైన వాటిని సాకల్యంగా పరీక్షించి అతన్ని తన సేవలో నియోగించి చూచి, ఆ తరువాతనే అతనికి విద్యోపదేశం చెయ్యడం భారతీయ సంప్రదాయం. ఈ సంప్రదాయంలో స్త్రీల జీవితం ఇమడదు. వారు మగవారి వలె గురువుని వెతుక్కుంటూ ఇల్లు వదిలి వెళ్ళడం ఈ దేశంలో ఊహకందనిది. ఈ కాలపు పబ్లిక్ స్కూల్ తరహా బళ్ళు ప్రాచీనకాలంలో ఎఱగరు. దగ్గఱలో తెలిసిన గురువుల వద్ద చేఱాలన్నా మగపిల్లల వలె వారిని చిన్నవయసులోనే తల్లిదండ్రుల నుంచి వేఱుచేసి విద్య నిమిత్తం గురువుగారి ఆశ్రమంలోనే ఉండే విధంగా చెయ్యడం ఎక్కడా వినపడలేదు, కనపడలేదు. బ్రహ్మచారులు ముప్ఫయ్యో యేట విద్యాభ్యాసాన్ని ముగించి, బ్రహ్మచర్యాశ్రమాన్ని విడిచిపెట్టి వివాహం చేసుకోవాలని మనువు చెప్పాడు. అది ఆడపిల్లల విషయంలో సాధ్యం కాదనేది జగద్విదితమే. అదీ గాక ఆశ్రమధర్మాల్లో స్త్రీలకి బ్రహ్మచర్యం విధించబడలేదు. స్త్రీధర్మ ప్రకరణంలో కూడా వారికి బ్రహ్మచర్యాశ్రమం విధించబడలేదు. బ్రహ్మచర్య సంస్కారం లేకుండా వేదాధ్యయనం సాధ్యం కాదు (అనుమతించబడలేదు). స్త్రీల శిష్యఱికం వివాహంతోనే మొదలవుతుంది. వారికి భర్తే గురువు. ఆ గురువే ఆమెకి మంగళసూత్రధారణ చేస్తాడు. ఈ విషయమై మను మహారాజు తన ధర్మశాస్త్రంలో చెప్పినది గమనించండి :
శ్లో|| అమంత్రకా తు కార్యేయం స్త్రీణామావృదశేషతః |
సంస్కారార్థం శరీరస్య యథాకాలం యథాక్రమమ్ || (II-66)
తాత్పర్యము : శరీర సంస్కారము కొఱకు స్త్రీలకు చేయు జాతకర్మలను అమంత్రకముగా (వేదమంత్రములను ఉచ్చరించకుండ) సకాలమున శాస్త్రోక్తముగా చేయవలయును.
(స్త్రీలు వేదమంత్రాల్ని ఉచ్చరించకూడదని/ వినకూడదని మనువు ఇక్కడ స్పష్టంగా సూచించి ఉండడాన్ని గమనించవచ్చు)
శ్లో|| వైవాహికో విధిః స్త్రీణాం సంస్కారో వైదికః స్మృతః |
పతిసేవా గురౌ వాసో గృహార్థోఽగ్నిపరిక్రియా || (II-67)
తాత్పర్యము :- "స్త్రీలకు వివాహ సంస్కారమే అన్నివిధములైన వైదిక సంస్కారములున్ను అగును" అని పూర్వులచే చెప్పబడినది. పతిసేవయే వారికి గుర్వాశ్రమ వాసము. ఇంటి నిర్వహణ నిమిత్తము నిప్పు రాజవేయుట (వంట) యే వారికి అగ్నిహోత్రకార్యము.
వేదమంత్రాల ప్రధాన ప్రయోజనం హవ్యవాహనుడైన అగ్నిలో వ్రేల్చే హవిస్సుల ద్వారా ఇతరదేవతల్ని ప్రసన్నుల్ని చేసుకోవడం. కానీ స్త్రీలకి ఆ విధమైనఅగ్నికార్యమే పైన చెప్పిన విధంగా నిషేధించబడినప్పుడు వారికి వేదమంత్రాలతో ప్రయోజనం లేదనేది స్పష్టం. గృహంలో అవిచ్ఛిన్నమైన అగ్నికార్యం నిమిత్తంపురుషులకు పునర్వివాహం అనుమతించబడింది. (గృహస్థులే అగ్నికార్యం నిర్వర్తించాలి కనుక) కానీ స్త్రీలకి అనుమతించబడలేదు. దాన్ని బట్టి వారికి వేదాధ్యయనం లేదని మనకి ప్రస్ఫుటంగా తెలుస్తున్నది.
మనుధర్మశాస్త్రం ఎప్పటిది ? అంటే గ్రంథగత సాక్ష్యాల్ని బట్టి కనీసం అయిదువేల సంవత్సరాల నాటిది. ఎందుకంటే అందులో ప్రవహిస్తున్న సరస్వతీనది ప్రస్తావన ఉంది. కానీ సరస్వతీనది క్రీ.పూ.3000 నుంచి అప్పుడప్పుడు ఎండిపోవడం మొదలుపెట్టి క్రీ.పూ. 2000 నాటికి సంపూర్ణంగా అంతర్వాహిని అయిందని భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో తెలిసింది. ఆ వివరాలు ప్రస్తుతం నా దగ్గఱ లేవు. అంటే స్త్రీలకి వేదమంత్రాల నిషేధం ఈనాటిదీ కాదు. మధ్యలో వచ్చిపడినది అంతకంటే కాదు.
ఇందుకు పూర్వపక్షంగా కొందఱు ఉటంకించే వేదార్థాలు ఆ కాలంలో స్త్రీలు వేదాధ్యయనం చేసేవారనడానికి సాక్షీభూతంగా కనిపించడంలేదు. వైదికమతంలో ఉన్నవారు వేదాధ్యయనం చేసినా, చెయ్యకపోయినా వేదోక్తముల ననుసరించి తమ జీవితాల్ని గడుపుకోవలసిందే కదా. అందుకు స్త్రీలు మినహాయింపు కాదు కనుక అలా చెప్పబడింది. భర్త ఇంట్లో లేనప్పుడు ఆమె భర్త బదులు (అతని ప్రతినిధిగా, అతని అనుమతితో, ఆజ్ఞతో) నిత్యనైమిత్తికాలకి ప్రత్యవాయం లేకుండా సంధ్యోపాసననీ, అగ్నిహోత్రాన్ని నిలబెట్టాలని చెప్పబడింది. స్త్రీకి వివాహమే ఉపనయనం కనుక గురువైన భర్త యొక్క ఆజ్ఞతో ఆమె ఈ పనులు చెయ్యడానికి సాంకేతికంగా అభ్యంతరం లేదు. అయితే ఈ పనులు కూడా వేదమంత్రపూర్వకం కాదు. "భర్త లేనప్పుడు" అని నిర్దేశించడానికి కారణమేంటో మనవి చేస్తాను. ఆహితాగ్నులనే బ్రాహ్మణులున్నారు. వారు నిరతాగ్నిహోత్రులు. అంతే వారి యింట్లో హోమాగ్ని నిరంతరం రాత్రీ పగలూ ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది, ఉండాలి కూడా. ఆవిధంగా వారు దీక్ష తీసుకుంటారు. ఏ కారణం చేతనైనా ప్రజ్వరిల్లడం ఆగిపోతే మహాదోషం. ఆ అగ్నులు అతని మాంసానికి ఆశిస్తాయని చెప్పబడింది. కనుక ఆ దోషనివారణ కోసం భర్త గ్రామాంతరం ప్రవాసం వెళ్ళినప్పుడు ఆ అగ్నులు ఆరకుండా గృహిణి చూసుకోవాలని నిర్దేశించారు.
శ్రీ మహాభాగవతం లో శ్రీ వేదవ్యాస మహర్షులవారు వ్రాసిన మాట చూడండి :
స్త్రీశూద్రద్విజబంధూనాం త్రయీ న శ్రుతిగోచరా |
కర్మశ్రేయసి మూఢానాం శ్రేయ ఏవం భవేదిహ |
ఇతి భారతఖ్యానం కృపయా మునినా కృతమ్ ||
(శ్రీమన్మహాభాగవతమ్ - ప్రథమస్కంధః - చతుర్థోఽధ్యాయః - శ్లో.25)
తాత్పర్యము :- స్త్రీలును, శూద్రులును మఱియు ద్విజకులాల నుండి భ్రష్టులైనవారును వేదములను వినకూడదు కనుక ధర్మకర్మముల మర్మమెఱుగనివారికి ఈ మహాభారతము ద్వారా మేలు కలుగును గాక ! అని శ్రీ వేదవ్యాసమహర్షి కరుణతో యోచించి ఆ యితిహాసమును నిర్మించెను.
దీన్ని బట్టి గత అయిదువేల సంవత్సరాలకు పైబడిన చరిత్రలో స్త్రీలు వేదాలు చదవలేదని స్పష్టమవుతున్నది. మతేతర (secular) ఆధారాలు లభిస్తున్న చరిత్రలోను, సాహిత్యంలోను సైతం ఏ ద్విజకుల స్త్రీలకిని వేదపరిజ్ఞానం ఉన్నట్లుగా తెలియరావడంలేదు. దీనికి ఫెమినిస్టులూ, కమ్యూనిస్టులూ వక్రభాష్యం చెబుతున్నట్లు - స్త్రీలని అణగదొక్కే ఉద్దేశం కారణం కాకపోవచ్చు. ఆ మాటకొస్తే వేదం రాని పురుషులు కూడా అన్ని కాలాల్లోను విస్తారంగా ఉండేవారని మనకు పూర్వగ్రంథాల ద్వారా అవగతమవుతున్నది. వేదాల్ని ఆదిఋషులు దర్శించేనాటికి భూమండలం మీద మానవ జనాభా కొన్నివేలకు మించకపోవచ్చు. ఆ వాతావరణంలో ఎవరూ ఎవరినీ అణగదొక్కే ప్రస్తావన ఉండకపోవచ్చు.
"స్త్రీలు వేదమంత్రాలు చదవకూడదని మన పూర్వులు ఎందుకంత గట్టిగా చెప్పారు ?" అని నేను ఒకసారి ధ్యానంలో ఉన్నప్పుడు ఆలోచిస్తూండగా నాకు శ్రీ షిర్డీ సాయిబాబావారు స్ఫురింపజేసినది ఇక్కడ వ్రాస్తున్నాను. ఈ మాట ఏ శాస్త్రంలోను మీకు కనిపించదు. పురుషులు అగ్నితత్త్వ శరీరాలు కలిగినవారు. స్త్రీలు జలతత్త్వశరీరాలు కలిగినవారు. మంత్రాలు కూడా అగ్నితత్త్వం కలిగినవి. అందుచేత ఏ తత్త్వం గలవారు ఆ తత్త్వానికి సంబంధించిన అనుష్ఠానమే చెయ్యాలి. స్త్రీలు జపించిన (వేద) మంత్రాలు నిర్వీర్యమవుతాయని శ్రీ గురుచరిత్రలో దత్తాత్రేయస్వాములవారు స్వయంగా సెలవిచ్చారు. అందుక్కారణం - వారి భౌతిక ఉపాధి (శరీరం) జలతత్త్వం గలది కావడమూ, అందులో అగ్నితత్త్వం గల (వేద) మంత్రాలు ఇమడకపోవడమూ. అదీ గాక చాలామంది స్త్రీల ఆరోగ్యం బహు సున్నితమైనది కనుక స్థిరమైనది కాదు. తమకు తరువాతి మాసధర్మం ఎప్పుడొస్తుందో ఖచ్చితంగా చెప్పలేనివారి సంఖ్య చాలా ఎక్కువ. అందుచేత వారికి పవిత్రమైన వేదమంత్రాల్ని నేర్పడమూ, ఇతర మత కార్యక్రమాల్ని అప్పగించడమూ ఒక పెద్ద రిస్కుగా పూర్వీకులు భావించి ఉండవచ్చు. అందుకని వారికోసం కావ్యసంస్కృత భాషలో వివిధ స్తోత్రాల్ని, వ్రతాల్ని నిర్దేశించారు.
పురుషులు భార్య లేకుండా హిందూధార్మిక విధుల్ని నిర్వర్తించరాదనడాని క్కూడా వారి అగ్నితత్త్వ శరీరాలే కారణం. పురుషుడు అగ్ని. మంత్రం అగ్ని. హోమం అగ్ని. అనుష్ఠానం ద్వారా ఇన్ని అగ్నులు ఒకేసారి ప్రజ్వరిల్లితే అది ఇతరులకు ఉపద్రవంగా మారుతుంది. కనుక ఆ అగ్నుల్ని సమతూకం (balance) చెయ్యడం కోసం భార్య ఉండాలన్నారు.
రామాయణం సుందరకాండలో శ్రీ హనుమంతులవారు శ్రీ సీతా మహాదేవి కోసం వెతుకుతున్న సందర్భంలో లంకలో ఒక నదిని చూసి "సీతాదేవి ఈ లంకలో ఉన్న పక్షంలో సంధ్యోపాసన నిమిత్తం ఇక్కడికి తప్పకుండా రావచ్చు. అప్పుడామెని నేను గుర్తుపడతాను" అనుకుంటారు.
శ్లో|| సంధ్యాకాలమనాః శ్యామా ధ్రువమేష్యతి జానకీ |
నదీం చేమాం శివజలాం సంధ్యార్థే వరవర్ణినీ ||
అయితే అమ్మవారి సంధ్యోపాసన వేదమంత్రపూర్వకం కాకపోవచ్చు.
నీతి అనగా నిగ్రహమే సుమా !
గుణా గుణానుబంధిత్వాత్ తస్య సప్రసవా ఇవ ||
తెలిసినా మౌనం వహించడం, శక్తిసామర్థ్యాలు ఉండీ ఇతరుల తప్పుల్ని క్షమించడం, దానం చేశాక ఇహ దాన్ని గుఱించి చెప్పుకోకపోవడం - ఈ గుణాలు దిలీప మహారాజుకి పుట్టుకతోనే వచ్చాయంటాడు కవికుల గురువు శ్రీ కాళిదాసమహాకవి తన చిట్టచివఱి కావ్యమైన రఘువంశంలో !
నీతి (Ethics) అంటే ఏమిటి ? అని మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు కాళిదాసు చెప్పినట్లు శక్తి ఉండీ ఓర్పు వహించడమేనని సమాధానం వస్తుంది. ఇందులో రెండు విషయాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి నీతి, రెండోది శక్తి. నీతికావాలంటే శక్తి కూడా కావాలి. శక్తి కోరుకునేవాడు అదే సమయంలో క్షమాగుణాన్ని (నిగ్రహాన్ని, ఆత్మనిగ్రహాన్ని) కూడా కోరుకోవాలి. శక్తిహీనుడు నీతిమంతుడిలా కనిపిస్తున్నప్పటికీ అతను ఏ మాత్రం నీతిమంతుడో అతను శక్తిహీనుడుగా ఉన్నంతకాలం అది తెలుసుకునే అవకాశం మనకి ఉండదు. నపుంసకుడు స్త్రీల జోలికి వెళ్ళకుండా మంచిపేరు తెచ్చుకోవడం లాంటిదది. పిఱికివాడి శాంతికాముకత లాంటిదది.
తెలిసినా మౌనం వహించేవాడట దిలీపుడు. అదేంటి ? ఎందుకలా చేసేవాడు ? తెలిసింది తెలిసినట్లు మాట్లాడ్డానికి అభ్యంతరమేంటి ? అంటే, నిష్కల్మషంగా మాట్లాడే అలవాటున్న ప్రతివాడూ వాచాలుడనకూడదు గానీ "తెలిసింది గదా" అని ప్రతిదాని మీదా అసందర్భంగా ఎడాపెడా మాట్లాడెయ్యడం అనవసరమైన వాచాలతే అవుతుంది. మాట్లాడమని ఇతరులు మనల్ని అడగాలి. అలా అడిగే అవసరం వాళ్ళకి కలగాలి. ఆ క్షణం కోసం తెలిసినవాడు ఎదురుచూడాలంతే ! దీనికి ఇంకో కోణం ఏంటంటే - కొన్ని విషయాలు అడిగినా చెప్పడం అనవసరమంటాడు మనువు ఒకచోట ! "తెలిసినా చెప్పడం దండుగ. వినేవాడే తప్ప ఆచరించేవాడెవడూ లే" డంటాడు.
సరే, సందర్భం వచ్చినప్పుడే మనం నోరు విప్పాలి. బావుంది. కానీ ఆ క్షణం వచ్చేసిందని గుర్తుపట్టడం ఎలా ? అందుకు తెలివితేటలు కావాలి. "అరే ! ఇప్పటిదాకా నీతి అన్నారు. ఇప్పుడేమో తెలివితేటలంటున్నారు. అసలేంటి మీ ఉద్దేశం ?" అనడిగితే అదంతే ! అనాల్సొస్తుంది. సరైన తెలివితేటలు సరైన నీతిమయ జీవనానికి త్రోవ చూపిస్తాయన్నమాట. "A rogue is none but a roundabout fool" అన్నాడు ప్రముఖ ఆంగ్ల సాహితీకారుడు Coleridge. వెధవాయి అనగా ఎవరయ్యా ? అంటే, వాడు చుట్టుతిరుగుడు మార్గంలో ఉన్న మూర్ఖుడన్నాడు. అంటే వాడు పైకి తెలివిగలవాడిలా కనిపిస్తాడు. తన గుఱించి తానలా అనుకుంటాడు కూడా. కానీ సుదీర్ఘకాల దృష్ట్యా వాడొక వెఱ్ఱినాగన్న. కాలం చివఱికివాడినొక తెలివితక్కువవాడుగా నిరూపిస్తుందట.
తప్పులు చేసే అవకాశం ఉండీ చెయ్యకపోవడం నీతిమయ జీవనానికి గానీ, దానిమీద ఆధారపడి ఉన్న ఆధ్యాత్మిక జీవనానికి గానీ తొలిమెట్టు. తప్పులు చెయ్యడం మానుకోవాలంటే ఏం చెయ్యాలి ? అనడిగితే ముందస్తుగా ఒప్పులు చెయ్యడం కూడా మానెయ్యాలన్నదే నా సమాధానం. అదేంటి ? అనడిగితే, అసలు తప్పులెందుకు చేస్తారు మనుషులు ? అనే ప్రాథమికమైన ప్రశ్న వేసుకోవాలి. ఎక్కువ శాతం తప్పులు దిలీప మహారాజు గుణాలకి వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల జఱిగేవే. అంటే నిగ్రహం లేకపోవడం వల్ల జఱిగేవే. మనకి చెడ్డ విషయాల్లో ఏ విధంగా నైతే నిగ్రహం లేదో, మంచి విషయాల్లో కూడా అలాగే నిగ్రహం లేదు. మంచి విషయాల్లో అలా దూకుడుగా ప్రవర్తించడం అలవాటై చెడ్డ విషయాల్లో కూడా అలాగే ప్రవర్తిస్తున్నాం. ఉదాహరణకి - చేతిలో పెన్నో, పెన్సిలో ఉన్నవాడు ఊరికే కూర్చోకుండా అది పెట్టి ఏదో బరుకుతూనే ఉంటాడు. తన పేరో, తన ప్రియురాలి పేరో, మఱొకటో ! అదే మఱి నిగ్రహం లేకపోవడమంటే. తమ చేతుల్లో ఉన్నదాన్ని జనం వాడుకోకుండా ఉండలేరు. ఆ లక్షణాన్ని వదిలించుకున్నప్పుడు మన మాటల్నీ, చేష్టల్నీ ధర్మదేవత తన అదుపులోకి తీసుకుంటుంది. అంటే ఆ తరువాత మనం ఏం చేసినా అది నీతే అవుతుంది.
మనం ఏకాదశీ ఉపవాసాలు చేస్తే, అలా మన కడుపు మాడ్చుకుంటే విష్ణుమూర్తికి కలిగే ప్రసన్నత ఏంటి ? మనం ఆకల్తో అల్లాడితే ఆయనకొఱిగేదేమిటి ? కాశీలో ఏదో ఒక కాయగూరని వదిలిపెడితే విశ్వేశ్వరుడికి ఏంటి లాభం ? అనడిగితే -తినగలిగీ తినకపోవడం. అదొక నిగ్రహం. ఆ నిగ్రహం ఒక తపస్సు. అదీ ఆయనకి ఆనందాన్ని కలిగించేది. ఆ తపస్సు ద్వారా తన బిడ్డలు తనంతటి వాళ్ళవుతూంటే ఏ తండ్రికి సంతోషం కలగదు ? దేవుడి రాడార్ త్యాగాల సంకేతాల కోసంవెతుకుతూంటుంది. అందుచేత ఉపవాసానికి వర్తించేదే వివాహానికీ వర్తిస్తుంది. వివాహాన్ని ఆశీర్వదించే భగవంతుడు వ్యభిచారాన్ని, అక్రమ సంబంధాన్ని ఎందుకాశీర్వదించడు ? అక్కడ ఇక్కడా చేసేది ఒకటే అయినప్పుడు అది పుణ్యంఎందుకయింది ? ఇది పాపమెందుకయింది ? అనడిగితే, ఉన్న తేడా అల్లా వివాహం ప్రతిపాదించే నిగ్రహం కాన్సెప్టులో ఉంది. "ఈ స్త్రీని చేసుకున్నాను. ఇంకో స్త్రీ జోలికి పోను." ఇది, ఈ ప్రతిజ్ఞే భగవంతుడికి నచ్చేది. వివాహానికి వర్తించేదే వావివరుసలకీ వర్తిస్తుంది. అన్నీ కావాలనే పచ్చిస్వార్థం నుంచి బయటపడ్డం, కొన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డం - ఇది భగవంతుణ్ణి సంతుష్టుణ్ణి చేసేది. ఎంత కొద్దిపాటి త్యాగభావన, ఎంత చిన్నపాటి నిగ్రహమూ కనిపించినా ఆయన మనసు పరవశిస్తుంది.
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ | (భగవద్గీత)
ధర్మాన్ని ఎంత కొంచెం ఆచరించినా అది గొప్ప భయం నుంచి మానవాత్మను కాపాడుతుంది.
5, సెప్టెంబర్ 2009, శనివారం
Every Package comes with a Baggage
ప్రపంచంలో పనికిరాని పదార్థమంటూ ఏదీ లేదు. కనుక చెత్త కూడా ఏమీ లేదు. కాబట్టి మన శుభ్రతా నియమాలు వర్తించే దేశలాలాల పరిధి అతిసంకుచితం. "Dirt is not dirt, but only something in the wrong place" అన్నారు Lord Palmerston ఒక సందర్భంలో ! కనుక శుభ్రత కంటే శుచి ముఖ్యం. శుచి అంటే మానసిక శుభ్రత. మనం మాట్లాడే ప్రతి వంకరమాట వల్లా, మనం చేసే ఒక్కొక్క కుటిల చేష్ట వల్లా ఆత్మ తేజస్సు ఒక్కొక్క పొఱగా మఱుగున పడిపోతూ ఉంటుంది. అది అలా మఱుగున పడిపోవడానికే 'పాపం' అని పేరు. ఆత్మ అంటే ఎవరో కాదు,"అసలైన మనం". మాజీ దేవుళ్ళమైన మనం ఇలా జీవులుగా మారిపోవడానికి కారణం పాపం. మనిషికి పాపాలు మాత్రమే అంటుకుంటాయి. పుణ్యమంటూ ఏమీ లేదు. పుణ్యం పేరుతో మనం చేసే ప్రతి పనీ ఆత్మ చుట్టూ పేఱుకుపోయిన అవనసరపు పాప పదార్థపు పొఱల్ని తొలగించి వాటి కింద మఱుగున పడ్డ ఆ స్వకీయ (original) తేజస్సుని వెలికి తేవడానికే.
శ్లో|| అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా |
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచి : ||
పుండరీకాక్ష ! పుండరీకాక్ష !! పుండరీకాక్ష !!!
తా|| పాపాత్ముడైనా, పుణ్యాత్ముడైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా, పుండరీకాక్షుని తలచినవాడు లోపలా, బయటా కూడా శుచియే అవుతాడు. (పుండరీకాక్ష ! అని ముమ్మారు బిగ్గఱగా పలుకు)
అతిశుభ్రత వల్ల ఆరోగ్యాన్ని, అనుగ్రహాన్ని కోల్పోతాం. కొన్ని దేవాలయాల్లో విపరీతంగా ఉక్కపోస్తుంది. అలాగని అలాంటి గుళ్ళకు వెళ్ళొచ్చాక స్నానం చెయ్యడం గాని ఒళ్ళు కడుక్కోవడం గాని చెయ్యకూడదు. ఆ గుడిలోని దేవుడి అనుగ్రహ దృష్టి మన శరీరాలకు తాకి ఉంటుంది గనుక వెంటనే స్నానం చెయ్యడమంటే ఆ అనుగ్రహాన్ని వదిలించుకోవడమే అవుతుంది.
అద్దె (కిరాయి) ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఆ యిల్లు కడక్కూడదని పెద్దలు చెబుతారు. కడిగితే ఆ యింటి యజమానికి దరిద్రం చుట్టుకుంటుం దంటారు. ఇంకొందఱు ఇంట్లో చెప్పులు వేసుకుని తిరుగుతారు. దేవాలయం ఎలాంటిదో మనయిల్లు కూడా అలాంటిదే. మన యింట్లో కూడా అదృశ్యంగా దేవతలు (వివిధ శక్తులు) సంచరిస్తారు. వాళ్ళు మనంపూజించినవాళ్ళు కాకపోయినా మన పూర్వీకులు పూజించినవాళ్ళయి ఉంటారు. చెప్పులు వేసుకుని తిరిగే యిళ్ళలోంచి వాళ్ళు నిష్క్రమిస్తారు. కొన్నిసార్లు ఒకే ఒక్క తరం లోపల అలాంటి యిళ్ళు దయనీయమైన దరిద్రాన్ని రుచిచూస్తాయి. "మాకు బయటికి వేసుకునే చెప్పులు వేఱు, ఇంట్లో వేసుకునే చెప్పులు వేఱు" అని కొందఱు సర్దుకో జూస్తారు. కాని అటువంటి తేడా ఉన్నట్లు పెద్దలు చెప్పలేదు.
కడిగిందే కడగడం, తుడిచిందే తుడవడం, పనిమనుషులతో కూడా అలా చెప్పి చేయించడం- ఇవన్నీ పనివాళ్ళ శాపాలకు కారణమౌతాయి. అతిశుభ్రతని పాటించే స్త్రీలు సంతాన గోపాలస్వామి శాపానిక్కూడా గుఱవుతారు. వారు సాధారణంగా పరమ పిసినిగొట్లయి ఉంటారు. వారికి బొత్తిగా సంతానం లేకపోవడమో, లేదా ఒక్క సంతానమే మిగలడమో జఱుగుతుంది. మఱికొందఱు, తినే అన్నాన్ని అసహ్యించుకుంటారు. దాన్ని ఎంగిలిగా, అంటుగా భావిస్తారు. అందుకని అన్నం చేతికి అంటకుండా బిరుసుగా వండమని వంటచేసేవారిని హెచ్చఱిస్తారు. అలా వండకపోతే రాద్ధాంతానికి దిగుతారు. వారు ఒక గ్లాసెడు నీళ్ళు దగ్గఱ పెట్టుకుని అన్నాన్ని తాకినప్పుడల్లా ఆ చేతిని ఆ గ్లాసులో ముంచుతూంటారు. ఆ విధంగా అన్నాన్ని అసహ్యించుకోవడం ద్వారా వాళ్ళు అన్నపూర్ణాదేవి శాపానికి గుఱవుతారు.
అతిశుభ్రస్థులు యావత్‌ప్రపంచాన్నీ ఒక మహా బ్యాక్టీరియాగాను, బృహద్ వైరస్‌గాను విలోకిస్తారు. ఇది తోటి మనుషుల్ని సైతం అకారణంగా అసహ్యించుకోవడానికి దారితీస్తుంది. ఆఖరికి మనిషి స్పర్శే, మనిషి పొడే కిట్టకుండా పోయే పరిస్థితి వస్తుంది. వాళ్ళందఱి శాపాలూ తప్పనిసరిగా తగుల్తాయి.
విశ్వం (Universe) అంతా అమ్మవారి స్వరూపం. ఆహారరూపంలో అందఱమూ భూమిలో నుంచే వచ్చాం. మళ్ళీ అందులోకే వెళ్ళిపోతాం. చనిపోయాక ఇతరులకు ఆహారంగా మారతాం.
"అహమన్నాదో అహమన్నాదో అహమన్నాద: !
అహమన్నమ్ అహమన్నమ్ అహమన్నమ్." (తైత్తిరీయోపనిషత్తు)
తా|| 'అన్నం తినేవాణ్ణీ నేనే. (ఇతర జీవులకు) అన్నాన్నీ నేనే' అంటున్నాడొక ఋషి.
ప్రపంచాన్ని అసహ్యించుకోవడం అమ్మవారినే అసహ్యించుకోవడం కిందికొస్తుంది. అలాగే మనుషుల్నిఅసహ్యించుకోవడం ఆమె భర్త అయిన సర్వాంతర్యామిని (పరమాత్ముణ్ణి) అసహ్యించుకోవడం కిందికొస్తుంది. వారి శాపాల నుంచితప్పించుకోలేరు. ప్రపంచంలో సంపద ఉన్న చోటల్లా ముఱికి కూడా ఉంటుంది. మనకు శుభ్రతే ముఖ్యమైతేఎడార్లు చాలా శుభ్రంగా ఉంటాయి. అక్కడికి పోయి బతకొచ్చు. ఇల్లు కట్టే చోట ఇసుకా, సిమెంటూ చెల్లాచెదఱుగా పడి ఉంటాయి. పంటలు పండే భూములు బుఱద బుఱదగా ఉంటాయి.
మానసికంగా ఆస్పత్రిలో జీవించడం మానేద్దాం. రోగాల్ని, డాక్టర్లనీ, వైరసులనీ కాసేపు మర్చిపోదాం. ప్రపంచాన్ని ప్రేమిద్దాం. జీవుల్ని ప్రేమిద్దాం. తోటి మనుషుల్ని ప్రేమిద్దాం.
2, సెప్టెంబర్ 2009, బుధవారం
హిందూధర్మసంగ్రహనిర్మాణం ఒక చారిత్రిక ఆవశ్యకత - 4 (సమాప్తమ్)
హిందూధర్మసంగ్రహాన్ని ఎవరు వ్రాయాలి ?
ధర్మసంగ్రహాన్ని మనం ప్రత్యేకంగా అపూర్వ సృజనాత్మక శక్తితో వ్రాసేదేమీ లేదు. మేటర్ అంతా వివిధ పాతగ్రంథాల్లో సిద్ధంగా, సిద్ధాన్నంలా ఉంది. మనం దాన్ని తెలుగులో ఎత్తిరాయడమే. తప్పేమీ లేదు. ఎందుకంటే వాటిల్లో లేని కొత్త విషయాలేవీ వ్రాసే హక్కు మనకి లేదు, మనం ద్రష్టలం (ఋషులం) కాము గనుక, సామాన్య మానవులమే కనుక ! అయితే పాతగ్రంథాల్లో దర్శనమిచ్చే పరస్పర వ్యాఘాతాలు (mutual contradictions) మన ఎత్తిరాతల్లోను, చూచిరాతల్లోను చోటు చేసుకోకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక దేవాలయాన్ని ఒక్క మనిషో, కుటుంబమో కాకుండా ఊళ్ళోవాళ్ళంతా కలిసి కడితే మంచిదంటారు. అలాగే ఇలాంటి పవిత్రమైన సంగ్రహగ్రంథ నిర్మాణంలో ధార్మికులందఱి హస్తవాసీ పడాలని మన తాపత్రయం. అలా సిద్ధం చేసిన గ్రంథానికి ఎక్కువ మాన్యత లభిస్తుంది.
అందుచేత ఇదివఱకు పేర్కొన్న ఏడెనిమిది భాగాల్లో ఒక్కొక్కదాని కోసం ఒక్కొక్క రచయితల కమిటీ ఏర్పడాలి. ఒక్కొక్క కమిటీలో పదిమంది రచయితలకి తగ్గకుండా సభ్యులుండాలి. ఆ పదిమందిలో ఒకాయన/ ఒకావిడ Team Leader గా వ్యవహరించాలి. ఆ గ్రంథభాగానికి సంబంధించి ఒక్కొక్కఱికీ ఒక్కొక్క ప్రస్తావన మీద భోగట్టా (Data) సేకరించి వ్రాసే పని అప్పజెప్పాలి. ఇలా పూనుకుంటే తొందఱగా పనవుతుంది. ఏమో, ఒకసారి మొదలుపెట్టినాక వాళ్ళవాళ్ళ ఉత్సాహాన్ని బట్టి బహుశా కేవలం ఆఱునెలల్లోనే హిందూధర్మసంగ్రహం బయటికొచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు.
ఏ శైలిలో వ్రాయాలి ?
ముందస్తుగా దీన్ని తెలుగులో వ్రాసి ప్రచురించాలి. దీనికి తెలుగువారిలో లభించిన ప్రాచుర్యాన్ని బట్టి, అందుబాటులో ఉన్న నిధుల్ని బట్టి అనంతరం ఇతర భాషల్లో వెలువఱించే ప్రయత్నం చెయ్యవచ్చు. తెలుగులో వ్రాసినప్పుడు సరళ గ్రాంథికంలో వ్రాస్తే బావుంటుంది. గ్రాంథికం అంటే ఇక్కడ జటిల సంస్కృత సమాసాలూ, చాంతాడంత వాక్యాలూ, అర్థం కాని పాత తెలుగుపదాలు, గసడదవాదేశ సంధులూ, సరళాదేశ సంధులూ, నాటకీయ ఫక్కి అని అపార్థం చేసుకోకూడదు. సరళ గ్రాంథికమంటే నేననేది తేలికైన గ్రాంథికమని ! అంటే పదాలన్నీ ఆధునికమైనవే ఉంటాయి. క్రియాపదాల్లో మాత్రం కొంచెం గ్రాంథికం వాడతాం. ఉదాహరణకి :-
"హిందూధర్మము చాలా ప్రాచీనమైన ధర్మము. దీనిని వైదికధర్మమని, సనాతన ధర్మమని కూడా పిలిచెదరు. ఇది మొదట వేదముల ద్వారా ప్రకటితమైనది....."
ఇలాగన్నమాట. ఈ శైలి ఎవరికీ అర్థం కాకపోవడం జఱగదనుకుంటా.
ఉపదేశాత్మకమైన పవిత్ర మతగ్రంథాలకి వ్యావహారికం నప్పదు. ఎంత శిష్టవ్యావహారికంలో వ్రాసినా వాడుకభాషన్నాక అందులో కొంత మోటుదనం ఉన్నమాట నిజం. అందులో తటస్థతా ధ్వని (neutrality) తక్కువ. వాడుకభాషలో చేసే ఉద్ఘాటనలు (స్టేట్ మెంట్లు) గొడవలకి దారితీయడం సర్వసాధారణం. మన బ్లాగావరణంలో గొడవలకి సగం కారణం వ్యావహారికశైలే అని నా అభిప్రాయం.అందుకని వద్దంటున్నాను. ఆపైన జనం ఇష్టం.
ఏమని పేరు పెట్టాలి ?
ఈ టపాల పరంపరలో ప్రతిపాదిత గ్రంథపు స్వభావరీత్యా దాన్ని నేను హిందూధర్మసంగ్రహం అని పేర్కొన్నాను. కానీ అదే సమయంలో నా మనసులో వేఱే పేర్లు మెదుల్తున్నాయి. ఉదాహరణకి "బాలసంహిత" - (బాలవ్యాకరణం లాగా !) బాలుడు అంటే సంస్కృతంలో పిల్లవాడనే కాక ఇతర అర్థాలు కూడా ఉన్నాయి. తెలియనివాడు, ప్రాథమికదశలో ఉన్నవాడు (beginner) అని కూడా అర్థం. సంహిత అంటే సంధానం (కలపడం) చెయ్యబడినది అని అర్థం. అనేక విషయాలు కలిపి కూర్చిన గ్రంథం సంహిత. వయసులో ఎంత పెద్దయినా హిందూధర్మం గుఱించి ఏమీ తెలియనివాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. వాళ్ళంతా బాలురే (beginners). పుస్తకానికి "బాల...." అని పేరుపెట్టినంతమాత్రాన మన శ్రమని మనం కించపఱచుకుంటున్నట్లు కాదు. ఆ మాటకొస్తే బాలవ్యాకరణం పేరుకే బాలవ్యాకరణం. దానికి ఈరోజు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లే అర్థం చెప్పలేక తలకిందులవుతూంటారు. మన ఉద్దేశమల్లా - ఈ సంగ్రహాన్ని మించిన గ్రంథాలున్నాయని, ఇది కేవలం ప్రాథమిక శిక్షేననీ సూచించడం.
ఎంత వ్రాయాలి ?
ఒక్కొక్క భాగం ఎంత ఉంటుందో ఇంకా పనిలోకి దిగకముందే ఊహించుకోవడం సాధ్యపడదు. కానీ మొత్తం పుస్తకమంతా కలిపి A4 సైజులో 600 పుటలకి మించకుండా చూసుకోవడం అవసరం (నా వ్యక్తిగత అభిమతం - 400 పుటలు)
ఎలా వెలువరించాలి ?
దీన్ని ముందుగా అంతర్జాలంలో వహణీయ పత్ర సంప్రకారం (PDF) గా వెలువరించాలి. దీనివల్ల మనకు ప్రపంచం నలుమూలలా ఉన్న హైందవాభిమానులందఱి feedback లభిస్తుంది. వారిచ్చే సలహా, సూచనల్ని బట్టి భవిష్యత్ ముద్రిత పాఠాంతరం (future version in print) యొక్క స్వరూప స్వభావాలెలా ఉండాలనేదాని మీద అందఱమూ కలిసి పునరాలోచన చెయ్యవచ్చు. జాలంలో గానీ, బయట గానీ రచయితల పేర్లు రచయితలుగా కాక సంపాదకవర్గ సభ్యులు (Members of the Editorial Board) గా మాత్రమే దర్శనమివ్వాలి. తొలి ప్రచురణల్లో మనం కాపీరైట్ క్లెయిమ్ చేసినప్పటికీ మలిప్రచురణల దశలో మాత్రం Open License గా మార్చాలి. అప్పుడు ఎక్కువమంది ప్రచురణకర్తలు దీన్ని ప్రచురిస్తారు. ఎక్కువమంది హిందువులకి అందుబాటులోకి వస్తుంది.
ప్రస్తుతానికింతే ! ఇంకా ఏమైనా మంచి ఆలోచనలుంటే దయచేసి తెలుపగలరు.
హిందూధర్మసంగ్రహనిర్మాణం ఒక చారిత్రిక ఆవశ్యకత - 3
౧. ఉపాసనా భాగము (Actual prayer and worship) :- ఇందులో ప్రార్థనలూ, స్తోత్రాలూ, భజనగీతాలు, పూజావిధానాలు ఉండాలి. హిందువులు ఎక్కువగా పూజించే దేవీదేవులకి సంబంధించిన సమాచారమే ఉండాలి. స్థానిక దేవతల ప్రస్తావన అవసరం లేదు. హిందువులు సాధారణంగా--
1. విష్ణు-అవతారాలైన శ్రీరామచంద్రమూర్తిని
2. శ్రీకృష్ణ భగవానులను
3. శ్రీ వెంకటేశ్వరస్వామిని
4. శ్రీనరసింహస్వామివారిని
5. శ్రీసత్యనారాయణస్వామివారిని
6. శ్రీరామచంద్రుల ప్రియభక్తుడైన శ్రీ ఆంజనేయస్వామివారిని
7. శ్రీ లక్ష్మీ అమ్మవారిని, ఆవిడ అవతారాలను
8. సదాశివ భగవానుని
9. సదాశివుని అర్ధాంగి అయిన శ్రీ పార్వతీదేవిని, ఆవిడ ధరించిన వివిధ
అవతారాలను
10. సదాశివుని కుమారులైన శ్రీవిఘ్నేశ్వరులవారిని
11. శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారిని
12. శ్రీ అయ్యప్పస్వామివారిని
13. సద్గురువైన శ్రీదత్తాత్రేయస్వామివారిని
14. దత్తావతారమైన శ్రీ షిరిడీ సాయిబాబాగారిని
15. మఱో దత్తావతారమైన శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర ప్రభువులను
16. ఇంకొక దత్తావతారమైన శ్రీ వీరబ్రహ్మేంద్రులను
17. సూర్యభగవానుని
పూజిస్తారు. ఉపాసనాభాగంలోని విషయాల్ని వీరికి పరిమితం చేస్తే సరిపోతుంది. ఇందులో విష్ణుసహస్రనామస్తోత్రాన్ని కూడా చేర్చాలి.
౨. వేదాంతభాగము :- ఇందులో ఇంతకుముందు తెలియజేసిన మూలసూత్రాలన్నింటి గూర్చిన వివరణలూ గట్రా అన్నీ ఇవ్వాలి. భగవద్గీత మీద ఆధారపడి ఈ భాగాన్ని నిర్మిస్తే బావుంటుంది. ఇందులో ఆధునిక అవతారపురుషుల సూక్తుల్ని కూడా చేర్చాలి.
౩. సాధనభాగము : ఇందులో భక్తి, కర్మ, జ్ఞాన, యోగమార్గాల్ని వేఱువేఱుగా వివరించాలి.
౪. క్రియాభాగము :- ఇందులో జాతకర్మ, నామకరణం, ఉపనయనం, వివాహం, గర్భాధానం, గృహప్రవేశం, అంత్యక్రియలు, వివిధశాంతులు మొదలైనవాటి ప్రక్రియని కేవలం వర్ణించాలి. మంత్రాలు మాత్రం ఇవ్వకూడదు. గ్రంథం అనవసరంగా విస్తారమైపోతుంది. ఆ గొడవేదో పురోహితులకి వదిలిపెడితే మేలు.
౫. ధర్మశాస్త్ర భాగము :- ఈ విషయమై కొన్ని సలహాలూ, సూచనలూ చేయదల్చుకున్నాను. సహృదయంతో అర్థం చేసుకోగలరని ప్రార్థన. దీన్ని కూర్చడానికి మను, పరాశర, యాజ్ఞవల్క్య స్మృతుల్లోంచి విషయాల్ని సంగ్రహించవచ్చు. ఆపస్తంబ, బోధాయన, ఆశ్వలాయన ధర్మసూత్రాలు మొదలైన గ్రంథాల్ని కూడా సంప్రదించాల్సి ఉంటుంది.
పాత ధర్మశాస్త్రాల్లో కులపరమైన ఆదేశాలూ, సూచనలూ చాలా ఎక్కువ. మారిన దేశకాల పరిస్థితుల దృష్ట్యా మన హిందూధర్మసంగ్రహంలో మాత్రం కులప్రస్తావన సబబు కాదు. అదే విధంగా ర్యాడికల్ ఫెమినిస్టులు ప్రతి చిన్నవిషయం మీదా రాద్ధాంతం చేసి మతం మీదా, సంస్కృతి మీదా అసహ్యంగా బుఱద జల్లుతున్న దృష్ట్యా రెండు, మూడు అంశాలు మినహాయించి పూర్వీకులు చెప్పిన స్త్రీధర్మాల్లో ఎక్కువభాగం మీద సంగ్రహకర్తలు మౌనం వహించడం శ్రేయస్కరం. అయితే విడాకులకూ, విచ్చలవిడి తిరుగుళ్ళకు, స్త్రీపునర్వివాహాలకు అనుకూలంగా ఒక్కముక్క కూడా ఎక్కడా వ్రాయకూడదు. ఎందుకంటే చట్టం అంగీకరించినప్పటికీ హిందూధర్మం విడాకుల్ని, స్త్రీపునర్వివాహాన్నీ అంగీకరించదు. ఈ మతం యొక్క మూలసిద్ధాంతాలకి అది విరుద్ధం కావడమే అసలు కారణం. చట్టం అంగీకరించిన ప్రతిదానికీ మతం ఆమోదముద్ర వెయ్యదు. ప్రభుత్వమూ, దాన్ని నడిపే రాజకీయ నాయకులూ మతానికి ప్రమాణం కాదు. వాళ్ళు "స్వలింగసంపర్కం చట్టబద్ధం, లేదా incest చట్టబద్ధం" అంటే ఇక్కడ అందు కనుకూలంగా ధర్మశాస్త్రాలు మారవు, మారకూడదు.
అదే విధంగా భౌతిక దృగ్విషయాల్ని సైతం మతం చూసే విధానం వేఱు. సైన్సు చూసే విధానం వేఱు. సైన్సు దృక్పథం, మతానికి ప్రమాణం కాదు. మతానికి పూర్వఋషులే పరమప్రమాణం. సైన్సు కనుగుణంగా ఇక్కడ ఒక్కముక్క కూడా మారదు, మారకూడదు. "మనుషులందరూ మాంసాలు, నదులు కేవలం నీళ్ళు" అంటుంది సైన్సు. "కాదు, నది దేవత" అంటుంది మతం. అందుచేత ధర్మసంగ్రహాన్ని కూర్చేటప్పుడు మతాని కనుగుణంగా లేని అన్ని దృక్పథాల్నీ నిర్మొహమాటంగా త్రోసిపుచ్చడమే మన పాలసీ కావాలి. సైన్సు క్షేత్రం సైన్సుది. మతక్షేత్రం మతానిది. రెండూ కలిపి పిసికి పిండి చేసి కలగాపులగం చెయ్యకూడదు.
ధర్మశాస్త్రభాగంలో హిందూపండుగల నేపథ్యమూ, వాటిని ఎలా జఱుపుకోవాలి మొ|| వివరాలు కూడా ఇవ్వాలి.
౬. ప్రామాణిక భాగము :- ఇందులో హిందూమతానికి ప్రామాణికమైన యావత్తు గ్రంథాల వర్ణనా ఇవ్వాలి. ధర్మసంగ్రహాన్ని దాటి పురోగత అధ్యయనానికి (Advanced Study) వెళ్ళదల్చుకున్నవారికి అది ఆసక్తికరంగా ఉంటుంది.
౭. ఋషికీర్తన :- ఇందులో మన దేశంలో జన్మించిన మహర్షుల, మహనీయుల వివరాలు ఒక్కొక్కటి ఒక్కొక్క పుట, లేదా అఱపుట మించకుండా ఇవ్వాలి.
౮. స్థలపురాణభాగము :- దేశంలోని ప్రముఖతీర్థక్షేత్రాల పుట్టుపూర్వోత్తరాల వర్ణన.
నాకు స్ఫురించినవి ఇవి. ఇంకా ఏమేం చేర్చవచ్చునో సోదర సభ్యులు దయచేసి సూచించగలరు.
హిందూధర్మసంగ్రహనిర్మాణం ఒక చారిత్రిక ఆవశ్యకత - 2
మతం అనేది కొన్ని సజాతీయమైన (homogenous) స్వయంపోషకమైన (self-sustained) సమగ్ర విశ్వాసాల వ్యవస్థ (integrated belief system). అందుచేత పురాణకథలు ఆ విశ్వాసాలకి ఉపబలకాలే (supportive) తప్ప అవే మతసర్వస్వం కాదు. పురాణకథలు జఱక్కముందు కూడా హిందూధర్మం ఉంది. కనుక మన ప్రజలకి కావాల్సింది ఆ మౌలిక హిందూమతమే. అసలు ఏ విధమైన విశ్వాసాలు ఉంటే వాడు హిందువవుతాడు ? ఇన్ని లక్షల శ్లోకాల ద్వారా మన పూర్వీకులు మనకి బోధించ నుద్దేశించినదాని సారాంశమేంటి ?
౧. భగవంతుడు ఉన్నాడు.
౨, ఆయన భార్య మఱియు మన జగన్మాత అయిన భగవతి ఉంది. (అమ్మవారు లేరని, అయ్యవారు మాత్రమే ఉన్నారని వాదించేవాడు ఎట్టి పరిస్థితుల్లోను హిందువు కాడు)
౩. సర్వాంతర్యామిత్వం, సర్వశక్తిమత్త్వం, సర్వజ్ఞత్వం, శాశ్వతత్వం, సర్వేశ్వరత్వం, సృష్టిస్థితిలయకారకత్వం, స్తోత్రప్రియత్వం, భక్తసులభత, పవిత్రత, పాప నిరాసకత్వం వారి లక్షణాలు.
౪. భగవంతుడు మఱియు భగవతి ఏకకాలంలో ఏకులూ, అనేకులూ కూడా అయి ఉన్నారు.
౫. అలాగే వారు ఏకకాలంలో సాకారులూ (సగుణులూ), నిరాకారులూ (నిర్గుణులూ) అయి ఉన్నారు.
౫. భగవంతుడు దుష్టశిక్షార్థము, శిష్టరక్షణార్థము భూలోకంలో మానవశరీరంతో అప్పుడప్పుడు జన్మిస్తాడు
౬. ఆయన అవతారాలు అనంతం. అనగా చిట్టచివఱి అవతారమంటూ ఏమీ లేదు.
౭. భగవంతుడు ప్రపంచాన్ని సృష్టించాడు అంటే ఆయన తానే ప్రపంచ స్వరూపాన్ని ధరించాడని భావం.
౮. కనుక ప్రతి స్థావర-జంగమ స్వరూపంలోను భగవంతుడున్నాడు.
౯. కనుక ప్రకృతిలో కనిపించే శక్తులన్నీ దేవతామూర్తులే.
౧౦. ఆ విధంగానే ప్రతిజీవిలోను దేవుడున్నాడు కనుక ప్రతిజీవికీ తనదంటూ ఒక జీవాత్మ ఉంటుంది.
౧౧. అందుచేత భగవంతుడికి ఏ పేరు పెట్టినా, ఏ రూపంలో కొలిచినా, ఆయనతో ఏ విధమైన అనుబంధాన్ని ఏర్పఱచుకున్నా ఆ ఆరాధన ఆయనకే చెందుతుంది.
౧౨. కనుక విగ్రహారాధన కూడా భగవదారాధనే.
౧౩. కనుక అన్ని ఆరాధనామార్గాలూ సత్యమే.
౧౪. భక్తి, కర్మ, జ్ఞానము, యోగము అనే నాలుగు మార్గాల్లో భగవంతుణ్ణి చేఱుకోవచ్చు.
౧౪. కొత్తదేదీ రాదు. ఉన్నదేదీ పోదు. (నాఽసతే విద్యతేఽభావో నాఽభావో విద్యతే సతః) కనుక భగవంతునిలో లేని గుణాలేవీ జీవుల్లో లేవు. కనుక జీవుల జీవగుణాలు భగవంతునికి అసహ్యించుకోదగినవి కావు.
౧౫. కనుక ఆయన జీవులన్నింటినీ సమానంగా ప్రేమిస్తాడు.
౧౬. మంచిపనైనా, చెడ్డపనైనా ప్రతిపనికీ ఫలితం ఉంది. దానికి కర్మఫలం అని పేరు. మంచిపనులకి మంచి ఫలితమూ, చెడ్డపనులకి చెడ్డఫలితమూ ఎవరైనా అనుభవించాల్సిందే.
౧౭. ఈ జన్మలో చేసిన పనుల ఫలితాన్ని ఈ జన్మలోనే అనుభవించడం కుదఱదు కనుక ప్రతి మనిషీ చనిపోయాక ఈ లోకంలో గానీ, ఇతరలోకాల్లో గానీ జన్మిస్తాడు.
౧౮. కర్మఫలాన్ని అనుభవించే నిమిత్తం ఎవరు ఎవరుగా అయినా, ఏదిగా అయినా పుట్టవచ్చు, ఆడవారు మగవారుగా, జంతువులు మనుషులుగా, మనుషులు జంతువులుగా, స్వదేశీయులు పరదేశీయులుగా కూడా జన్మించవచ్చు.
౧౯. వ్యక్తిగత కర్మలకి వ్యక్తిగత ఫలం, సామూహిక కర్మలకి సామూహిక ఫలం లభిస్తాయి.
౨౦. ఈ కర్మల చక్రం నుంచి భక్తి, కర్మ, జ్ఞాన, యోగ పద్ధతుల సహాయంతో బయటపడ్డమే మానవజన్మ పరమార్థం.
౨౧. ఈ పద్ధతుల్ని మనకందించేవారు తల్లి-తండ్రి-గురువు. కనుక వీరు భగవంతునితో సమానులు.
౨౨. ఈ పద్ధతుల్ని అవలంబించాలంటే ఈ గురువుల సహాయంతో బ్రహ్మచర్య, గార్హపత్య, వానప్రస్థ, సన్న్యాసాశ్రమాల్లో ఏదో ఒకటి స్వీకరించాలి.
నాకు స్ఫురించిన అత్యంత ప్రాథమిక హిందూ ధర్మసిద్ధాంతాలివి. ఇంకా ఏమైనా మీకు అదనంగా స్ఫురిస్తే జతచేర్చండి. ప్రతిపాదించిన హిందూధర్మసంగ్రహం ద్వారా ఈ ప్రాథమికాల్ని జనం బుఱ్ఱలకి ఎక్కించాలి. "మీ మతసారాంశం ఏంటి ?" అని బయటివాడెవడైనా అడిగితే సమాధానం చెప్పే స్థితిలో సామాన్య హిందువు ఉండాలి. ఆ పుస్తకం ప్రతిహిందువునీ ఆ స్థాయికి తీసుకురావాలి.
హిందూధర్మసంగ్రహనిర్మాణం ఒక చారిత్రిక ఆవశ్యకత - 1
మన హిందూధర్మం అతివిశాలమైనది. ఎంతగా అంటే - ప్రపంచంలో స్వతంత్ర మతాలని చెప్పబడేవి సైతం తత్త్వచింతనా పరిణతిలో కనీసం దీని శాఖలక్కూడా సాటిరావంటే అతిశయోక్తి లేదు. అలాంటి మహోన్నత సంప్రదాయానికి భౌతిక వారసులమైన మనకు ఇది గర్వకారణం కావచ్చు. కానీ అదే సమయంలో ఈ పరిస్థితి మనకి కొంచెం ఇబ్బందికరం కూడా ! కారణం - మన మతగ్రంథాలు సంఖ్యలోను, పరిమాణంలోను అతిపెద్దవి. వందలాది సూక్తాలూ, వందలాది మంత్రాలూ గల నాలుగు వేదాలు, అంతూపొంతూ అంతుపట్టని ఆఱు వేదాంగాలు, లక్ష శ్లోకాల మహాభారతం, 24,000 శ్లోకాల రామాయణం, 108 ఉపనిషత్తులు, బ్రాహ్మణాలూ, ఆరణ్యకగ్రంథాలూ, తంత్రాలు, వివిధయోగశాస్త్రాలూ, ఛప్పన్న ధర్మశాస్త్రాలు, 18 పురాణాలూ, ఇంకో 18 ఉపపురాణాలూ. (వీటిల్లో 88,000 శ్లోకాల స్కాందపురాణం లాంటివి చాలా ఉన్నాయి) మళ్లీ వీటన్నింటిమీదా పండితుల/ పీఠాధిపతుల వ్యాఖ్యానాలూ, భాష్యాలూ. ఇది ఒక ఈదరాని మహాసముద్రం. ఒకరు ఒక జీవితకాలమంతా వెచ్చించినా వీటన్నింటినీ పుర్తిగా చదివి బోధపఱచుకోవడం గానీ గుర్తుంచుకోవడం గానీ సాధ్యం కాదు. అందుచేత ఎవరైనా తాను హిందూమతంలో expert ననీ, Authority ననీ చెప్పుకుంటే అది ఈ సహస్రాబ్దపు పచ్చి అబద్ధం (millenium bluff) అవుతుంది. అందుచేత మనలో మహామేధావులైనవారు కూడా తమతమ అనూచాన శాఖలకే పరిమితమవుతున్నారు, శాఖాపరమైన సంకుచితత్వం వల్ల కాదు, అంతకంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయత వల్ల !
"శబ్దజాలమ్ మహారణ్యం చిత్తభ్రమణ కారణమ్" అన్నారు ఆదిశంకరులు. గ్రంథజాలం కూడా అలాంటిదే. మనకి పుస్తకాలెక్కువై, పుస్తకాలతో పాటు వాటి రచయితలూ, తోకల్లా ప్రక్షిప్తకారులూ మితిమీఱి, ఒక పుస్తకంలో చెప్పేదానికీ, ఇంకో పుస్తకంలో చెప్పేదానికీ పొత్తు కుదఱక "అసలు మొత్తం హిందూధర్మమే బోగస్" అనే ఒక శ్రేణి నాస్తికజనం ఉత్పత్తి కావడానికి సైతం కారకులమయ్యాం. ఈ గ్రంథబాహుళ్యం మన మతాభివృద్ధికి ఇంకో రకంగా కూడా ఆటంకంగా పరిణమించింది. మనం మతాన్ని ఇతరదేశాల్లో వ్యాప్తి చెయ్యాలంటే ఏ గ్రంథాన్ని అక్కడివాళ్ళకి బోధించాలి ? మన మతగ్రంథాలు ఎంతటి clear-cut specialization తో కూడుకొన్నవంటే, ఏ ఒక్క పుస్తకమూ హిందూధర్మం మొత్తాన్ని కనీసం క్ఌప్తంగా కూడా ప్రతిబింబించదు. ఎంతసేపూ అదేంచెప్పదల్చుకుందో అదే చెబుతుంది. (భగవద్గీత ఒక్కటే కొంచెం మినహాయింపనుకుంటా) చచ్చినట్లు ఇతర ఉద్గ్రంథాల్ని సంప్రదించి తీఱాల్సిందే. పుస్తకాలు చదవడం, తలలు పట్టుకోవడం మేధావుల కాలక్షేపం. సామాన్య మానవుడి కవన్నీ ఎందుకు ? "నాకు కాస్త ప్రేయర్ నేర్పు చా"లంటాడతను. మతాన్ని వ్యాపింపజేయాంటే అది నిత్యజీవితానికి పనికొచ్చే మతమై ఉండాలి. ఊరికే ఆకాశ వేదాంతాలతో, లేని అంతరార్థాలతో, పిచ్చిపిచ్చి శబ్దవ్యుత్పత్తులతో జనాన్ని ఎడాపెడా చావగొట్టడం వల్ల ప్రయోజనం లేదు. మతగ్రంథం సామాన్యమానవుడికి అందుబాటులో, అతని అవగాహనకి సరిపోయే స్థాయిలో, అతని టైమ్ తినెయ్యని విధంగా ఉండాలి. ప్రతి చిన్నవిషయానికీ పురోహితులనో, పౌరాణికులనో అడిగే పనిలేకుండా అతను తనంతట తాను రిఫర్ చేసుకొని తెలుసుకోవడానికి వీలయ్యే సైజులో ఒకే ఒక మతగ్రంథం ఉండాలి.
మఱోపక్క విదేశాలకి వెళ్ళిన హిందువులు కూడా తమ పిల్లలకి హిందూధర్మాన్ని ఎలా పరిచయం చెయ్యాలో ఏమని వివరించాలో, ఎక్కణ్ణుంచి మొదలుపెట్టాలో అర్థం కాక అంతర్గతంగా సతమతమవుతున్నారు. వాళ్ళు ఇంగ్లీషులో ముద్రించిన రామాయణ భారతాది గ్రంథాల్ని పిల్లల చేతుల్లో పెడుతున్నారు. ఇందువల్ల మేలు కంటే కీడే ఎక్కువ జఱుగుతోంది. అది వాళ్ళ తప్పు కాదు. మతాన్ని సామాన్యమానవుల అవగాహనకి దగ్గఱగా తీసుకురావడం కోసం మన పూర్వీకులు హిందూమతాన్ని పూర్తిగా పురాణకథల మీద, పురాణపురుషుల వ్యక్తిగత ప్రవర్తన మీద ఆధారపడ్డ మతంగా మార్చేశారు. ఆ పురాణపురుషుల్లో వ్యక్తిగత లోపాలుంటే "అసలు మతమంతా బూతే" ననే ప్రచారం జరుగుతోంది. ఆ రూట్ లో ఈ మధ్య చాలామంది నాస్తికులయ్యారు, అవుతున్నారు. ఆ ఇతిహాసాల్లో వివరించబడ్డ ధర్మాలు పిల్లల స్థాయిలో అర్థమయ్యేవి కావు. ఆ తరువాతి దశల్లో వాళ్ళు ఆ పరిజ్ఞానాన్ని కుతర్కం కోసం దుర్వినియోగం చేసే సావకాశం హెచ్చు. కనుక ముందు కావాల్సినవి పురాణకథలు కావు. మతసిద్ధాంతాల్లోను, బోధనల్లోను బలమైన పునాదులు. వాటినేర్పఱిచే మతగ్రంథం మన కత్యవసరంగా కావాలి.
సవాళ్ళు ఎన్నో - సమాధానం ఒక్కటే !
తల్లి-తండ్రి-గురువు-దైవం (मां - बाप - गुरु और भगवान)
తల్లి ద్వారా తండ్రిని, తండ్రి ద్వారా గురువుని, గురువు ద్వారా భగవంతుణ్ణి తెలుసుకోవాలి. వీరిలో మొదటి ముగ్గుఱి పారంపర్యాన్ని గౌరవించి అనుసరించడమే హిందూధర్మ సారాంశం. ఇదే ఇహముందు మన (హిందువుల) వాదం, నినాదం అవ్వాలి. స్వాతంత్ర్యోద్యమంలో "వందేమాతరం" లా ఇదే ఇహముందు మనల్ని నడిపే పవిత్ర అష్టాక్షరీమంత్రం అవ్వాలి.
౧. అయ్యవారే తప్ప అమ్మవారు లేరనే మతాలవారికి ఇదే మన సమాధానం.
౨. జంతువుల్లో మాదిరి మనుషుల్లో కూడా అమ్మ తప్ప అయ్య అవసరం లేదనే ర్యాడికల్ ఫెమినిస్టులకి ఇదే సమాధానం.
౩. గురువు స్థానాన్ని దిగజార్చి విద్యని వ్యాపారంగా మార్చిన విద్యావ్యాపారులకి ఇదే సమాధానం.
౪. గురువుని అందఱిలాంటి జీతబత్తేల ఉద్యోగిగా, బంట్రోతుగా మార్చిన నీచప్రభుత్వాలకి ఇదే సమాధానం.
౫. మాతాపితృ భావనకి విరుద్ధమైన (హోమోసెక్స్ లాంటి) అసహజ సంబంధాల్ని ప్రోత్సహించేవారికి ఇదే సమాధానం.
౬. ఒకపక్క తల్లిదండ్రుల ద్వారా పరిచితమైన జాతీయత మీద ఆధారపడి బతుకుతూనే మఱోపక్క ఆ తల్లిదండ్రుల్నే విడగొట్టేందుకు అవసరమైన పరమచండాల చట్టాలు చేస్తూ కుటుంబవిషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటూ అలా కుటుంబాలపై తన అధికారాల్ని అక్రమంగా విస్తరించుకుంటూ పోతున్న భ్రష్ట ప్రభుత్వాల దుష్ట నిరంకుశత్వానికి ఇదే మన సమాధానం.
("అయ్యా ! మీ అధికారం తల్లికంటే, తండ్రి కంటే, గురువు కంటే దైవం కంటే మాకు గొప్పది కాదు" అని ముక్కు గుద్ది ప్రభుత్వాలకి చెప్పాల్సిన రోజులు వచ్చాయి. చెప్పితీఱతాం)
ఇహముందు ఏ ఉత్తరం వ్రాసినా, ఏ పుస్తకం వ్రాసినా, ప్రచురించినా "జై శ్రీరామ్" లాంటి ఇష్టదైవ నామాలతో పాటు కొంచెం శ్రమ తీసుకొని "తల్లి-తండ్రి-గురువు-దైవం" అని కూడా వ్రాయడం అలవాటు చేసుకుందాం. ఆ విధంగా మన హిందూధర్మ మూలసిద్ధాంతాన్ని అందఱికీ చాటి చెబుదాం. ప్రతి హిందూ పండుగలోను, ఉత్సవంలోను, ఊరేగింపులోను ఈ నినాదాన్ని బిగ్గఱగా పలుకుదాం, అందఱిచేతా పలికిద్దాం.
ఇంట్లో ఈగల మోత - బయట పల్లకీల మోత
"ఔరా ! పుట్టుకతో హిందువులమైనా మనకు వేదం ముక్క తెలియదు, తెలిసినవాళ్ళని దూషించడం తప్ప ! హిందూమతం పుచ్చుకున్న ఈ చెక్ దేశపు తెల్లవాళ్ళు మనకంటే చాలా నయంలా ఉన్నారే. " అనుకుంటూ నేను మ్రాన్పడిపోయాను చాలాసేపు. కృతయుగంలో మాదిరి మళ్ళీ ప్రపంచమంతా హైందవమైతే ఎలా ఉంటుందో ఈ కుఱ్ఱాళ్ళు మచ్చుకు రుచి చూపిస్తున్నారనిపించింది. ఇక్కడ కంటే చెకొస్లొవేకియాలో హిందువుగా పుడితే మజాగా ఉంటుందనిపించింది.
ఈమధ్య అమెరికన్ చట్టసభల్లో క్రైస్తవప్రార్థనలతో పాటు హిందూప్రార్థనల్ని కూడా అనుమతించారని విన్నప్పుడూ ఇదే అనుభూతి కలిగింది. కానీ హిందూస్తాన్ అని పేరు గల ఈ దేశంలో మటుకు హిందూధర్మం అడుగడుగునా ఎలా అరణ్యవాసాలకీ అజ్ఞాతవాసాలకీ ఘోరావమానాలకీ గుఱవుతున్నదో తల్చుకుంటే ఎంతటి శాంతమూర్తికైనా పట్టరాని ఆగ్రహం కలుగుతుంది. నిన్నటి వినాయక చవితే తీసుకుందాం. భారత నౌకాదళంలో పనిచేస్తున్న కాపుమిత్రుడినుంచి సమాచారం అందింది. ఇండియన్ నేవీలో నిన్న ఏ ఓడలోను వినాయక చవితి జఱుపుకోలేదట. పండుగరోజున మాంసాహారం నిషిద్ధమని హిందూ ఆఫీసర్లు మొత్తుకుంటున్నా వినకుండా బలవంతంగా అదే వండి అందఱికీ తినిపించారట.
ఏమిటీ కుహనా సెక్యులర్ నిరంకుశత్వం మనమీద ? హిందూధర్మం హిందూస్తాన్ లో ఇలా నిషేధానికి గుఱవుతోంది ఎందుచేత ? మన దేవుడి విగ్రహాల్ని మన దేశంలో స్థాపించుకోవడానికి పరాయిమతాలవారి అనుమతి కావాలి. దేవుడి ఊరేగింపులకి మలేషియాలాంటి విదేశీ ప్రభుత్వంలో మాదిరి పోలీసుల అనుమతి తీసుకోవాలి. రంజాన్ ఉపవాసాల కోసం, శుక్రవారం ప్రార్థనల కోసం ఇతరులకి ఉదారంగా అనుమతులిచ్చే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు మన అయ్యప్పల మీద మాత్రం "గెడ్డం పెంచొద్దు, ఆ డ్రెస్ లో రావొద్దు" అంటూ క్రూరంగా జులుమ్ ప్రదర్శిస్తాయి. ఎవరికొచ్చింది స్వాతంత్ర్యం ? మైనారిటీలకి, కుహనా సెక్యులర్ వాదులకి. అంతే ! హిందువులు మాత్రం మఱో స్వాతంత్ర్యపోరాటాన్ని సాగించాల్సిన పరిస్థితిలోనే మిగిలిపోయారు.
అడుగడుగున గుడి ఉంది - అందఱిలో గుడి ఉంది...
"దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనాతనః"
సాధారణంగా గుళ్ళనుంచి, గుళ్ళ పూజారుల నుంచి మనం చాలా గొప్ప పవిత్రతని ఆశిస్తూంటాం. అవి/ వారు మన ఆశంసల (expectations) కి అనుగుణంగా లేనప్పుడు పదునైన విమర్శలకి సైతం దిగుతూంటాం. కానీ హిందూధర్మంలో గుడికున్న ప్రాధాన్యం తక్కువ. ప్రాచీనకాలంలో గుళ్ళు మతకేంద్రాలుగా కంటే పంచాయితీ కార్యాలయాలుగా, ఆడిటోరియములుగా ఎక్కువ ఉపయోగపడుతూండేవి. సంఘం నుంచి వెలివేయబడినవారిని గుడికి రావద్దనడంలో ఉన్న అంతరార్థమదే. హిందూధర్మంలో అసలు ప్రాధాన్యమంతా వ్యక్తిగత సాధనకే. గుళ్ళకీ, పూజారులకీ కాదు. ఇదే మన ధర్మానికీ, ఇతర ధర్మాలకీ ఉన్న ప్రధానమైన తేడా. ఏళ్ళ తరబడి గుడికి పోకపోయినా ఈ ధర్మంలో ప్రత్యవాయం సిద్ధించదు. ఏ పాపమూ రాదు. తన యింట్లో తన కుటుంబ సంప్రదాయానికి ఆదిగురువులైనవారు చెప్పిన నియమనిష్ఠలు పాటిస్తున్నంత కాలమూ పూజారి చెప్పినట్లు వినకపోయినా నష్టమేమీ లేదు.
దానికంటే శరీరాన్ని, మనస్సునీ శుచిగాను, పవిత్రంగాను ఉంచుకోవడానికి మన పూర్వులు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. శరీరం కూడా ఇల్లే. ఇంట్లో ఉన్నట్లే దీనికి ఒక వంటిల్లు (పొట్ట), బాత్ రూము (మర్మాంగాలు) గట్రా ఉన్నాయి. దీని హృదయస్థానం (పూజగది) లో అంగుష్ఠమాత్రుడైన పరమపురుషుడు మన పుణ్యపాప తలంపుల స్పందనల్ని వింటూ నిత్యనివాసం చేస్తున్నాడు. ఆ విధంగా చూస్తే దేవుడెక్కడనో లేడు. దేహంలోనే ఉన్నాడు. కనుక దేహమే దేవాలయమని తెలియజేశారు. మనశ్శరీరాల శౌచాలు పరస్పరం ఆధారితమై ఉంటాయి. మనస్సు మలినమైతే శరీరం మలినమవుతుంది. శరీరం మలినమైతే మనస్సు కూడా మలినమవుతుంది. ఎందుకంటే శరీరం స్థూలశరీరం. మనస్సు సూక్ష్మశరీరం. కాబట్టి యోగుల వలె అంతర్ముఖులై మనశ్శౌచాన్ని సాధించలేనివారు కనీసం పెద్దలు సూచించిన పవిత్రవస్తువుల ధారణని మంత్రపూర్వకంగా అనుష్ఠించడం ద్వారా కూడా దాన్ని సాధించవచ్చు. కనుక శిరోముండనం చేయించుకోవడం, విభూతి, నామాలు పెట్టుకోవడం, తిలకధారణ, రుద్రాక్షధారణ, తులసీమాలాధారణ, యజ్నోపవీతధారణ, చక్రాంకితాలు వేసుకోవడం మొదలైనవి ఆ భగవంతుని నిరంతరరాయంగా గుర్తుచేసుకొని పాపకర్మాచరణ నుంచి. దోషభూయిష్ఠమైన తలపుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి దోహదిస్తాయి. ఈ దివ్యత్వ చిహ్నాలు మన శరీరం మీద భగవత్ సాన్నిధ్యాన్ని కల్పిస్తాయి. తద్ద్వారా దేహాన్ని దేవాలయంగా మారుస్తాయి. మన దేహాలు దేవుని వాహనాలుగా మారతాయి. వీటి నిజమైన అంతరార్థాన్ని గ్రహించనివారి మూలాన కాలక్రమంలో ఇవి వట్టి వేషధారణగా మారడం విచారకరం. కానీ అంతరార్థాన్ని తెలుసుకొని అనుష్ఠించినవారికి ఆ ఫలితం తప్పకుండా కనిపిస్తుంది. అందుచేత శాస్త్రోక్తమైన వీటిని కేవలం వేషధారణగా భావించడం సరికాదు. "సర్వసంగపరిత్యాగికి కాషాయవస్త్రాలు మాత్రం అవసరమా ?" అని అడిగిన ఒక శిష్యుడితో శ్రీ వివేకానందస్వాములవారు ఆశ్రమధర్మాన్ని ఖచ్చితంగా పాటించి తీఱవలసిందేనని తెలియజేశారు. అంతేకాక ఆ ఆశ్రమనిర్వహణకు బాహ్యవేషం తప్పకుండా తోడ్పడుతుందని సైతం వాక్రుచ్చారు.
అదే విధంగా గృహాన్ని కూడా దేవాలయంగా మార్చుకోవడం అవసరం. దేవాలయంలో ఏ విధంగా నైతే మంచి తలంపులు కలిగి ఉంటామో, గొడవలు పడకుండా, వెధవ పనులు చెయ్యకుండా, అవాచ్యాలూ, అశ్లీలాలూ మాట్లాడకుండా జాగ్రత్త పడతామో అలాగే ఇంట్లో కూడా అలాంటివాటికి దూరంగా ఉంటే ఇల్లే దేవాలయంగా మారిపోతుంది. ఈ మధ్య మా యింటికొక శివభక్తుడు వచ్చాడు. ఆయన మా పూజగదిలో కాసేపు కూర్చొని ధ్యానం చేసుకున్నాడు. ఎవరో తన తలమీద రెండు చేతులూ పెట్టి ఆశీర్వదించినట్లు అనుభూతి కలిగింది. ఆ తరువాత అతను బయటికి వచ్చి "మీ యింట్లో ఏదో మహాశక్తి ఉంది. ఎక్కడా కలగని అనుభూతి కలిగింది" అని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. భగవంతుడు మా పూజలకి ప్రీతుడై మా యింట్లోనే ఉన్నాడని తెలుసుకొని మిక్కిలి సంతోషపడ్డాము. ఈ జాగ్రత్తలు ఈ తరంవారు పాటించక అనేక గృహాలు సినిమాహాళ్ళుగా, తాగుడుబార్లుగా, దొమ్మీల నిలయాలుగా, గొడవలకీ, అశాంతికీ కేంద్రాలుగా మారాయి.
మన మతాన్ని మనం సమీచీనంగా అర్థం చేసుకొని సాకల్యంగా అనుష్ఠించడం వల్ల మనమెప్పుడూ చెడిపోలేదు. అర్థం చేసుకోకపోవడం వల్లా, పాటించకపోవడం వల్లా మాత్రమే చెడిపోయాము. సంప్రదాయం మీద బుఱద జల్లేవారికి ఈ విషయంలో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది.
హైందవ సాహిత్యాన్ని భండారించాలి (Archiving)
మన తెలుగు సాహిత్యమే తీసుకుంటే గత వెయ్యేళ్ళలో వ్రాయబడ్డ అనేక గ్రంథాలు మాయమయ్యాయి. అన్నీ పోగా ఈరోజు మనకి కేవలం 1, 400 (పధ్నాలుగొందలు) ప్రాచీన తెలుగు టైటిల్స్ (కలిశకం 4100 - క.శ. 4900 మధ్యకాలానివి) లభిస్తున్నాయి. అన్నమాచార్యులనే ఒక తెలుగు మహాకవి ఉన్నట్లు గుఱజాడకి గానీ, వీరేశలింగం పంతులుగారికి గానీ తెలియదు. మన తరానికి మాత్రమే తెలిసింది. ఎందుకంటే వారి కాలానికి అన్నమయ్య కీర్తనలు బయట పడలేదు. తొలిసారిగా వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఆ కీర్తనల్ని కనుగొన్నారు. అయితే అన్నమయ్య కీర్తనలు మొత్తం 30,000 (ముప్ఫైవేలు) అని ఆ కీర్తనలు వ్రాసి ఉన్న రాగిఱేకుల మీద పేర్కొనగా మనకి వాస్తవంగా దొఱికినవి మాత్రం 12,000 (పన్నెండువేలు) మాత్రమే. మిగతావి ఏమయ్యాయో తెలియదు. మహాకవి క్షేత్రయ్య వ్రాసిన కీర్తనలు కొన్ని వేలున్నాయంటారు. మనకి వాస్తవంగా దొఱుకుతున్నవి 300 మాత్రమే. కాలజ్ఞానం మూడులక్షల గ్రంథం వ్రాశామని బ్రహ్మంగారు పేర్కొన్నారు. (గ్రంథం అంటే 32 అక్షరాలు) కానీ లభ్యమవుతున్న కాలజ్ఞానం అంత విస్తారంగా లేదు.
ఇలా మన ప్రాలుమాలిక కారణంగా ఉజ్జ్వలమైన హిందూసాహిత్యం - ప్రపంచదేశాల మధ్య మనల్ని తలెత్తుకు తిరిగేలా చెయ్యగల సాహిత్యం రోజురోజుకీ నశించిపోతున్నది. ఎన్నో వేదసంహితలు నశించిపోయాయి. ఉపవేదాలన్నీ దాదాపుగా నశించినట్లే. మనకి లభిస్తున్న చతుర్వేదాలు పైకి దిండ్ల (pillows - తలగడల్లా) కనిపిస్తున్నప్పటికిన్ని అవి అసలు వేదాల పరిమాణంతో పోలిస్తే బహుచిన్నవి.
అన్నమయ్య కీర్తనలైనా - రాగిఱేకులమీద వ్రాసి తిరుమలకొండపై ఒక గూట్లో భద్రపఱచబట్టి కనీసం 500 ఏళ్ళ తరువాతైనా వాటిని కనుక్కోగలిగాం. మనం ఈరోజు పుస్తకాల్ని ముద్రిస్తున్న కాయితాలనబడే పదార్థం బొత్తిగా ఆధారపడదగనిది. సీడీల్ని, ఇంటర్నెట్ నీ అసలు నమ్మడానికి లేదు. కాయితాలు కాకుండా రాగిఱేకుల్లాంటి ఇంకేదైనా భౌతిక సామగ్రి మీద మన యావత్తు హిందూసాహిత్యాన్ని భద్రపఱచాల్సి ఉంది. అలా భద్రపఱిచేటప్పుడు ఒక చోట కాకుండా దేశంలో అనేక చోట్ల - అంటే కనీసం ఒక రెండొందల ప్రదేశాల్లో భద్రపఱచాలి. అంటే ఒక్కొక్క గ్రంథానికీ 200 ప్రతులు తయారు చేయించాలి. ఇది చాలా బృహత్కార్యం అని, కనీసం రెండు మూడు తరాల చేపట్టు (project) అనీ నాకు తెలుసు. అయితే ఒక ఏకాభిప్రాయమూ, ఒక ముందస్తు ఆలోచనా అవసరమనే ఉద్దేశంతో మీ ముందు పెడుతున్నాను.