మన హిందూధర్మం అతివిశాలమైనది. ఎంతగా అంటే - ప్రపంచంలో స్వతంత్ర మతాలని చెప్పబడేవి సైతం తత్త్వచింతనా పరిణతిలో కనీసం దీని శాఖలక్కూడా సాటిరావంటే అతిశయోక్తి లేదు. అలాంటి మహోన్నత సంప్రదాయానికి భౌతిక వారసులమైన మనకు ఇది గర్వకారణం కావచ్చు. కానీ అదే సమయంలో ఈ పరిస్థితి మనకి కొంచెం ఇబ్బందికరం కూడా ! కారణం - మన మతగ్రంథాలు సంఖ్యలోను, పరిమాణంలోను అతిపెద్దవి. వందలాది సూక్తాలూ, వందలాది మంత్రాలూ గల నాలుగు వేదాలు, అంతూపొంతూ అంతుపట్టని ఆఱు వేదాంగాలు, లక్ష శ్లోకాల మహాభారతం, 24,000 శ్లోకాల రామాయణం, 108 ఉపనిషత్తులు, బ్రాహ్మణాలూ, ఆరణ్యకగ్రంథాలూ, తంత్రాలు, వివిధయోగశాస్త్రాలూ, ఛప్పన్న ధర్మశాస్త్రాలు, 18 పురాణాలూ, ఇంకో 18 ఉపపురాణాలూ. (వీటిల్లో 88,000 శ్లోకాల స్కాందపురాణం లాంటివి చాలా ఉన్నాయి) మళ్లీ వీటన్నింటిమీదా పండితుల/ పీఠాధిపతుల వ్యాఖ్యానాలూ, భాష్యాలూ. ఇది ఒక ఈదరాని మహాసముద్రం. ఒకరు ఒక జీవితకాలమంతా వెచ్చించినా వీటన్నింటినీ పుర్తిగా చదివి బోధపఱచుకోవడం గానీ గుర్తుంచుకోవడం గానీ సాధ్యం కాదు. అందుచేత ఎవరైనా తాను హిందూమతంలో expert ననీ, Authority ననీ చెప్పుకుంటే అది ఈ సహస్రాబ్దపు పచ్చి అబద్ధం (millenium bluff) అవుతుంది. అందుచేత మనలో మహామేధావులైనవారు కూడా తమతమ అనూచాన శాఖలకే పరిమితమవుతున్నారు, శాఖాపరమైన సంకుచితత్వం వల్ల కాదు, అంతకంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయత వల్ల !
"శబ్దజాలమ్ మహారణ్యం చిత్తభ్రమణ కారణమ్" అన్నారు ఆదిశంకరులు. గ్రంథజాలం కూడా అలాంటిదే. మనకి పుస్తకాలెక్కువై, పుస్తకాలతో పాటు వాటి రచయితలూ, తోకల్లా ప్రక్షిప్తకారులూ మితిమీఱి, ఒక పుస్తకంలో చెప్పేదానికీ, ఇంకో పుస్తకంలో చెప్పేదానికీ పొత్తు కుదఱక "అసలు మొత్తం హిందూధర్మమే బోగస్" అనే ఒక శ్రేణి నాస్తికజనం ఉత్పత్తి కావడానికి సైతం కారకులమయ్యాం. ఈ గ్రంథబాహుళ్యం మన మతాభివృద్ధికి ఇంకో రకంగా కూడా ఆటంకంగా పరిణమించింది. మనం మతాన్ని ఇతరదేశాల్లో వ్యాప్తి చెయ్యాలంటే ఏ గ్రంథాన్ని అక్కడివాళ్ళకి బోధించాలి ? మన మతగ్రంథాలు ఎంతటి clear-cut specialization తో కూడుకొన్నవంటే, ఏ ఒక్క పుస్తకమూ హిందూధర్మం మొత్తాన్ని కనీసం క్ఌప్తంగా కూడా ప్రతిబింబించదు. ఎంతసేపూ అదేంచెప్పదల్చుకుందో అదే చెబుతుంది. (భగవద్గీత ఒక్కటే కొంచెం మినహాయింపనుకుంటా) చచ్చినట్లు ఇతర ఉద్గ్రంథాల్ని సంప్రదించి తీఱాల్సిందే. పుస్తకాలు చదవడం, తలలు పట్టుకోవడం మేధావుల కాలక్షేపం. సామాన్య మానవుడి కవన్నీ ఎందుకు ? "నాకు కాస్త ప్రేయర్ నేర్పు చా"లంటాడతను. మతాన్ని వ్యాపింపజేయాంటే అది నిత్యజీవితానికి పనికొచ్చే మతమై ఉండాలి. ఊరికే ఆకాశ వేదాంతాలతో, లేని అంతరార్థాలతో, పిచ్చిపిచ్చి శబ్దవ్యుత్పత్తులతో జనాన్ని ఎడాపెడా చావగొట్టడం వల్ల ప్రయోజనం లేదు. మతగ్రంథం సామాన్యమానవుడికి అందుబాటులో, అతని అవగాహనకి సరిపోయే స్థాయిలో, అతని టైమ్ తినెయ్యని విధంగా ఉండాలి. ప్రతి చిన్నవిషయానికీ పురోహితులనో, పౌరాణికులనో అడిగే పనిలేకుండా అతను తనంతట తాను రిఫర్ చేసుకొని తెలుసుకోవడానికి వీలయ్యే సైజులో ఒకే ఒక మతగ్రంథం ఉండాలి.
మఱోపక్క విదేశాలకి వెళ్ళిన హిందువులు కూడా తమ పిల్లలకి హిందూధర్మాన్ని ఎలా పరిచయం చెయ్యాలో ఏమని వివరించాలో, ఎక్కణ్ణుంచి మొదలుపెట్టాలో అర్థం కాక అంతర్గతంగా సతమతమవుతున్నారు. వాళ్ళు ఇంగ్లీషులో ముద్రించిన రామాయణ భారతాది గ్రంథాల్ని పిల్లల చేతుల్లో పెడుతున్నారు. ఇందువల్ల మేలు కంటే కీడే ఎక్కువ జఱుగుతోంది. అది వాళ్ళ తప్పు కాదు. మతాన్ని సామాన్యమానవుల అవగాహనకి దగ్గఱగా తీసుకురావడం కోసం మన పూర్వీకులు హిందూమతాన్ని పూర్తిగా పురాణకథల మీద, పురాణపురుషుల వ్యక్తిగత ప్రవర్తన మీద ఆధారపడ్డ మతంగా మార్చేశారు. ఆ పురాణపురుషుల్లో వ్యక్తిగత లోపాలుంటే "అసలు మతమంతా బూతే" ననే ప్రచారం జరుగుతోంది. ఆ రూట్ లో ఈ మధ్య చాలామంది నాస్తికులయ్యారు, అవుతున్నారు. ఆ ఇతిహాసాల్లో వివరించబడ్డ ధర్మాలు పిల్లల స్థాయిలో అర్థమయ్యేవి కావు. ఆ తరువాతి దశల్లో వాళ్ళు ఆ పరిజ్ఞానాన్ని కుతర్కం కోసం దుర్వినియోగం చేసే సావకాశం హెచ్చు. కనుక ముందు కావాల్సినవి పురాణకథలు కావు. మతసిద్ధాంతాల్లోను, బోధనల్లోను బలమైన పునాదులు. వాటినేర్పఱిచే మతగ్రంథం మన కత్యవసరంగా కావాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి