2, సెప్టెంబర్ 2009, బుధవారం

మచ్చుతునకలు (Samples) కాదు, అసలుదే కావాలి !

భగవంతుని యందు పరాభక్తిని, పరమప్రేమను పొందడమే మానవ జీవిత పరమార్థం. లోకంలోని ఇతర విధాలైన చిఱుచిఱు ప్రేమలు దాని కమ్మదనాన్ని మచ్చు (sample) కు రుచి చూపించేవి మాత్రమే. వాటి పాత్ర అంతవఱకే. ఒక తోటలో అనేక మధుర ఫలాలున్నాయి. మనం ఆ తోట బయట నడిచి వెళుతున్నప్పుడు ఒక చెట్టు నుంచి ఒక పండు రాలి మన సంచిలోకొచ్చి పడుతుంది. మనం అది తిని "ఆహా ! ఎంత మధురంగా ఉంది ! ఈ తోటలోకి నేను ప్రవేశించగలిగితే బావుంటుంది. దీనికి నేను యజమానినైతే బావుంటుంది. ఇందులోని పళ్ళన్నీ రుచిచూస్తే బావుంటుంది" అనుకుంటాం. భగవత్ ప్రేమ అటువంటి తోట. పితృప్రేమ, మాతృప్రేమ, పుత్రప్రేమ, భార్యాప్రేమ, భర్తృప్రేమ, కులాభిమానం, హీరో వర్షిప్, దేశభక్తి - ఇవన్నీ ఆ తోటలోని ఒక్కొక్క చెట్టుకు కాచిన ఒక్కొక్క కాయ మాత్రమే. గాలివాటుకి అలవోకగా ఎగిరొచ్చి మన సంచిలో పడ్డ ఈ కాయల్నే మనం యావత్తు ఫలసాయంగా భ్రమిస్తున్నాం. వాస్తవానికి మనమే ఆ తోటకి యజమానులం. కానీ ఆ సంగతి మర్చిపోయి ఎప్పటికీ ఇలాగే తోట బయట నిలబడి లేకిగా నాలుకలు చప్పరిస్తున్నాం. ఆఖరికి లౌకికమైన పచ్చి శృంగార కార్యకలాపం కూడా "నాయనా ! నువ్వు నీ చుట్టూ ఉన్నదానికంటే వేఱు కావు. ఈ యావత్తు దృశ్యమాన జగత్తులో భాగానివి, నువ్వు ఏదో విధంగా మళ్ళీ దాన్తో కలిసి పోవాల్సిందే సుమా !" అని అన్యాపదేశంగా గుర్తు చేస్తుంది.

మన సంకుచితత్వానికి కారణం - అన్ని జీవుల్లోను మన ప్రేమాస్పదుల్ని మనం దర్శించలేకపోవడమే. అలా దర్శించగలిగినప్పుడు మన ప్రేమాస్పదుల రూపంలో జీవులకు అంతర్యామి వ్రాసిన ప్రేమలేఖ గోచరిస్తుంది. మనం దీన్ని అధిగమించాలంటే - ప్రతి పిల్లవాడిలోను తన అబ్బాయే కనిపించాలి. ఎందుకంటే జీవితంలో పెక్కు విషయాలకి పరిచాయక ప్రాధాన్యం (introductory value) మాత్రమే ఉంది. ఒక తరగతికి పాఠ్యపుస్తకాల్ని నిర్దేశించారంటే జీవితానికి కావాల్సిందంతా వాటిల్లోనే ఉందనీ, అది సరిపోతుందనీ కాదు. అటువంటివి ఇంకో పదో ఇఱవయ్యో అదనంగా చదవాలని మాత్రమే. అలాగే, మనకొక తల్లి, తండ్రి, అన్న, చెల్లి, భార్య, బిడ్డ ఉన్నారంటే మనల్ని వారికి పరిమితం చేసుకోమని కాదు భగవంతుని ఉద్దేశం. వారిద్వారా ఆయా విధాలైన ప్రేమల్నిముందు అనుభూతం చేసుకోమనీ, ఆ ప్రేమానుభూతిని ఇతరుల్లో కూడా చూడమనీ !

ఇంగ్లీషులో hitch-hiking అనే మాట ఒకటుంది. ఒకదాని తరువాత ఒకటిగా నానా రవాణా సాధనాల నుపయోగించి మొత్తం మీద గమ్యం చేరుకోవడానికి hitch-hiking అని పేరు. భగవంతుని యందు పరాభక్తిని చేఱుకునే క్రమంలో కుటుంబ సంబంధాలూ, మానవ సంబంధాలనే రవాణా సాధనాలు ఇతోఽధికంగా సహకరిస్తాయి. కానీ మనం ఒక రవాణా సాధనం తరువాత మరొక సాధనాన్ని ఎక్కుతూ, దిగుతూ చిన్నపిల్లల్లా ఈ hitch-hinking ని ఆస్వాదిస్తున్నామే తప్ప మన అంతిమగమ్యం సంగతి ఆలోచించడంలేదు.   

ప్రతి మనిషిలోను దేవుడున్నాడు. అందుచేత ప్రతి మానవ సంబంధమూ పవిత్ర దైవసంబంధమే. అందుచేత తోటి మానవుల్ని చేసే ప్రతి మోసమూ, ప్రతి దూషణా, వారితో ఆడే ప్రతి అసత్యమూ దైవద్రోహమే. దేవుడు మనలో లేకపోతే ఇంకెక్కడా లేడు. మనలో లేని దేవుడి గుఱించి, ఏదో లోకంలో సింహాసనం మీద కూర్చుని హుక్కా పీల్చే దేవుడి గుఱించి మనం ఆలోచించడం శుద్ధ దండుగ, వృథా కాలహరణం. ఈ ప్రపంచం, ఈ దేవుడనే భావన (concept) అన్నీ మనల్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటివి. మనం ఉంటే ఇవి ఉంటాయి. మనం పోతే ఇవి పోతాయి. "నేను" అని మన గుఱించి మనం అనుకుంటున్నది మన హృదయాంతరాళంలో ఉన్న సూక్ష్మ భగవంతుని "కుయ్యో మొఱ్ఱో" మాత్రమే. ఈ "కుయ్యో మొఱ్ఱో" వ్యక్తీకరణ గుఱించే అందఱమూ పొద్దున్నే లేచి కష్ట పడుతూంటాం. "కుయ్యో మొఱ్ఱో" యొక్క సంకుచిత వ్యక్తిత్వం గుఱించి, దానికి లభించాల్సిన గౌరవాల గుఱించి, సమాజంలో దాని స్థానం గుఱించి ఇనుమిక్కిలిగా ఆందోళన చెందుతూంటాం. ఈ "కుయ్యో మొఱ్ఱో" కి మూలస్థానమేది ? ఇది ఎక్కణ్ణుంచి విని పిస్తున్నది ? మనలో ఉండి ఈ శబ్దం చేస్తున్నదెవరు ? అని మనం సావధానంగా గమనిస్తే "వాడే వీడు" అని తెలుస్తుంది. 

జనంలో విస్తారంగా ప్రాచుర్యం (popularity) పొందడానికి దైవ విషయాల మీద సానుకూలంగా ప్రసంగించడం ఈ రోజుల్లో రాంగ్ రూటు. అధిక సంఖ్యాకులు ఆస్తికులమని చెప్పుకుంటున్నప్పటికీ ఇహలోకంలో భగవంతుని విషయాలకి ప్రాధాన్యం చాలా తక్కువ. దేవుడి పేరు చెబితేనే నీరసం వస్తుంది చాలామందికి. మనమీద ఇంకొకడున్నాడనే భావనే దుర్భరంగా ఉంటుంది కొంతమందికి. మనకి తెలిసినదంతా ఉన్న పళాన రద్దు చేసి తన యిష్టాన్ని మన మీద రుద్దగల నిరంకుశ మహా శక్తి ఒకటి ఉందంటే మనసులో తిరుగుబాటు భావం బయలుదేఱుతుంది మఱికొంతమందికి. నెఱవేఱిన అభీష్టాలన్నీ తమ ప్రతిభ అనీ, తమ ఆత్మవిశ్వాసమనీ, తమ పాజిటివ్ థింకింగ్ అనీ, లేదా తమ విజయం వెనక ఒక స్త్రీ ఉందనీ, తల్లిదండ్రులున్నారనీ జనం చెబుతారు. కానీ తమ అపజయాలన్నిటికీ దేవుడు కారణమని ఆరోపిస్తారు. దేవుడు తమ బాగు చూసి ఓర్వలేకపోయాడంటారు. దేవుడు తమ కన్యాయం చేశాడంటారు. కానీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చూస్తే దేవుడికి కనీస దీపారాధనా, బెల్లం ముక్క నైవేద్యం పెట్టే రివాజూ కూడా కనపడవు. తమ జీవితంలో ఏ విషయంలోనూ స్థానం లేని దేవుడికి తమ దురదృష్టాల్లో మాత్రం చాలా పెద్ద బాధ్యత అప్పగిస్తారు. 

ఒకసారి షిరిడీలో ఎవరో " దేవుడికి ఇంకా మామీద దయ రాలేదు" అని మాట్లాడుకోవడం విని బాబా భక్తులతో ఇలా అన్నారు "నేనేమీ చెయ్యకపోయినా అన్నీ నేనే చేస్తున్నానంటారు. నిజానికి ఎవరి కర్మఫలాన్ని వారు అనుభవిస్తున్నా రంతే" అందుచేత మన నెత్తిమీద రుద్దబడుతున్నవి భగవంతుని ఇష్టానిష్టాలు కావు, సాక్షాత్తు మన ఇష్టానిష్టాలే. అయితే అవి పూర్వజన్మలో మనం కలలు గన్న ఇష్టానిష్టాలు కావచ్చు. లేదా ఇతరులకి జఱగాలని బలంగా మనం కోరుకున్నవి కావచ్చు. మానసిక కర్మ కూడా కర్మే కదా ! ఎంతటి నేరం చేసినవాణ్ణయినా "నీ ఆఖరి కోరిక ఏంటి ?" అనడుగుతారు మానవ ప్రభువులు. ఆపాటి ఔదార్యం ఆ దివ్యప్రభువుకి ఉండదా ? మనం చనిపోయే ముందు మన తీఱని కోరికలన్నింటినీ ఆయన జాగ్రత్తగా నమోదు చేసుకుంటాడు. వాటిని తరువాతి జన్మల్లో/ యుగాల్లో తప్పకుండా తీఱుస్తాడు, అవి ఎంత అభ్యంతరకరమైనవైనా సరే ! అందుకోసం ఆయన కర్మఫల ప్రదాతగా తనకున్న విశేషాధికారాల్ని ఉపయోగించి మన పుణ్యఫలాల ఖాతాలోంచి మన అనుమతి లేకుండానే తీసి ఖర్చు పెడతాడు. అయితే అలా తన కోరికల్ని తీర్చుకోవడం వల్ల ఉప్పతిల్లే అనంతర పరిణామాల్ని జీవుడే అనుభవించాల్సి ఉంటుంది. కనుక జీవితం ముగిసే లోపల కోరికల్ని, రాగద్వేషాల్ని అదుపులో పెట్టుకోవడం మన బాధ్యత. 

ఎందుకు చెబుతున్నానంటే, మన పట్లా, భగవంతుని పట్లా మనం ఏర్పఱచుకొన్న తప్పుడు భావనలు ఆయన యందు సానుకూల వైఖరిని, పరాభక్తిని, నిర్మల ప్రేమను పొందడానికి గల ప్రధాన ఆటంకం. భగవన్నామం మనలో ఏ విధమైన పారవశ్యాన్నీ కలిగించలేక పోతున్నదంటే, ఆధ్యాత్మిక జీవనం మనకి "బోర్ గా, డల్ గా, స్టుపిడ్ గా" కనిపిస్తున్నదంటే దానిక్కారణం జన్మజన్మల దుష్టసంస్కారాలే. అంతకంటే ముఖ్యంగా మనమే ప్రధానమనీ, దేవుడు అప్రధానమనీ తలంచడం మనం పడుతున్న గుంటలకీ, గోతులకీ, అఖాతాలకీ అసలు కారణం. "హే భగవాన్ ! నువ్వే ఉన్నావు. నేను లేను. నువ్వు నిజం, నేను అబద్ధం. నువ్వు శాశ్వతం, నేను అశాశ్వతం. నువ్వు చాలా గొప్పవాడివి. నేను చాలా అల్పుణ్ణి" గీతా, బైబిలూ, కొరానూ చదవలేక పోయినా ఈ ఎనిమిది వాక్యాల్ని మాత్రం మర్చిపోకుండా నిరంతరం స్మరించాలి. మన మనస్సులు నానారకాల దుష్ట సంస్కారాల, దుష్టవాంఛల ధూమంతో దుమ్ము గొట్టుకుని ఉన్నాయి. లోలోపల ఉన్న పసిబిడ్డలాంటి సున్నితమైన సూక్ష్మ భగవంతుడు వాటి దెబ్బకి ఊపిరాడక అతలాకుతలమై సొమ్మసిల్లి పడిపోతున్నాడు. "కుయ్యోమొఱ్ఱో" అనే ఓపిక కూడా ఆయనకి లేకుండా చేస్తున్నాం. లోపల్నుంచి ఏ శబ్దమూ లేదు. కనుక ఆయన లేడని వాదించడం ఈ కాలంలో చాలా సులభమై పోయింది. 

ఈ లోకం ఒక బడి. ఇక్కడ అందఱమూ నిత్యవిద్యార్థులమే. ఇక్కడి గురువు ఇంటర్మీడియట్ బోర్డు కంటే కూడా చాలా దయామయుడు. ఎందుకంటే ఇక్కడ పరీక్ష తప్పినవాళ్ళు మళ్ళీ మళ్ళీ అనంతంగా అందుకోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది. కానీ ఎప్పటికప్పుడు కోరికల పేరుతో మనం పరీక్ష తప్పడానికే మొగ్గు చూపుతున్నాం. అందుచేత స్వయంగా భగవంతుడే నడుపుతున్నదైనప్పటికీ ఈ బళ్లో ఉత్తీర్ణతా శాతం (pass percentage) మిక్కిలి అధమస్థాయిలో ఉంది. "మీరసలు ఫీజు కట్టొద్దు. పరీక్షలు రాయొద్దు. నన్ను ప్రేమించండి చాలు, ఉత్తీర్ణం చేస్తాను" అని ఆయన ప్రతి సంవత్సరం మొత్తుకుంటున్నాడు. అది విని కనీసం గురువుగారి పరువు కాపాడాలనే ధోరణి అయినా మనలో లేకపోవడం శోచనీయం.

కామెంట్‌లు లేవు:

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి