2, సెప్టెంబర్ 2009, బుధవారం

హైందవ సాహిత్యాన్ని భండారించాలి (Archiving)

లిఖిత సాహిత్యం లేని సంస్కృతిని జానపదం అంటారు. అందుచేత సంప్రదాయమూ, సంస్కృతీ ఎంత ముఖ్యమో అందుకు సంబంధించిన లిఖిత సాహిత్యమూ అంతే ముఖ్యం. మనకి ఈ రోజున ముద్రితరూపంలో లభిస్తున్న హైందవ సాహిత్యం - ఎంతో ఎంతెంతో ఇంకెంతో నశించిపోగా భగవదనుగ్రహం చేత మిగిలి బతికొచ్చి మనదాకా చేఱినటువంటిది. పండిత కుటుంబాలు నిస్సంతుగా నిర్వంశమై అంతరించడం, కరువుల వల్ల వలసపోవడం, యుద్ధాల్లో కూలిపోయిన, కాలిపోయిన ఇళ్ళతో పాటు తాటాకు గ్రంథాలు కూడా కాలిపోయి పరశురామప్రీతి కావడం మొదలైన అనేక కారణాల మూలంగా ఎంతో హిందూవిజ్ఞానం కాలగర్భంలో కలిసిపోయింది.

మన తెలుగు సాహిత్యమే తీసుకుంటే గత వెయ్యేళ్ళలో వ్రాయబడ్డ అనేక గ్రంథాలు మాయమయ్యాయి. అన్నీ పోగా ఈరోజు మనకి కేవలం 1, 400 (పధ్నాలుగొందలు) ప్రాచీన తెలుగు టైటిల్స్ (కలిశకం 4100 - క.శ. 4900 మధ్యకాలానివి) లభిస్తున్నాయి. అన్నమాచార్యులనే ఒక తెలుగు మహాకవి ఉన్నట్లు గుఱజాడకి గానీ, వీరేశలింగం పంతులుగారికి గానీ తెలియదు. మన తరానికి మాత్రమే తెలిసింది. ఎందుకంటే వారి కాలానికి అన్నమయ్య కీర్తనలు బయట పడలేదు. తొలిసారిగా వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఆ కీర్తనల్ని కనుగొన్నారు. అయితే అన్నమయ్య కీర్తనలు మొత్తం 30,000 (ముప్ఫైవేలు) అని ఆ కీర్తనలు వ్రాసి ఉన్న రాగిఱేకుల మీద పేర్కొనగా మనకి వాస్తవంగా దొఱికినవి మాత్రం 12,000 (పన్నెండువేలు) మాత్రమే. మిగతావి ఏమయ్యాయో తెలియదు. మహాకవి క్షేత్రయ్య వ్రాసిన కీర్తనలు కొన్ని వేలున్నాయంటారు. మనకి వాస్తవంగా దొఱుకుతున్నవి 300 మాత్రమే. కాలజ్ఞానం మూడులక్షల గ్రంథం వ్రాశామని బ్రహ్మంగారు పేర్కొన్నారు. (గ్రంథం అంటే 32 అక్షరాలు) కానీ లభ్యమవుతున్న కాలజ్ఞానం అంత విస్తారంగా లేదు.



ఇలా మన ప్రాలుమాలిక కారణంగా ఉజ్జ్వలమైన హిందూసాహిత్యం - ప్రపంచదేశాల మధ్య మనల్ని తలెత్తుకు తిరిగేలా చెయ్యగల సాహిత్యం రోజురోజుకీ నశించిపోతున్నది. ఎన్నో వేదసంహితలు నశించిపోయాయి. ఉపవేదాలన్నీ దాదాపుగా నశించినట్లే. మనకి లభిస్తున్న చతుర్వేదాలు పైకి దిండ్ల (pillows - తలగడల్లా) కనిపిస్తున్నప్పటికిన్ని అవి అసలు వేదాల పరిమాణంతో పోలిస్తే బహుచిన్నవి.



అన్నమయ్య కీర్తనలైనా - రాగిఱేకులమీద వ్రాసి తిరుమలకొండపై ఒక గూట్లో భద్రపఱచబట్టి కనీసం 500 ఏళ్ళ తరువాతైనా వాటిని కనుక్కోగలిగాం. మనం ఈరోజు పుస్తకాల్ని ముద్రిస్తున్న కాయితాలనబడే పదార్థం బొత్తిగా ఆధారపడదగనిది. సీడీల్ని, ఇంటర్నెట్ నీ అసలు నమ్మడానికి లేదు. కాయితాలు కాకుండా రాగిఱేకుల్లాంటి ఇంకేదైనా భౌతిక సామగ్రి మీద మన యావత్తు హిందూసాహిత్యాన్ని భద్రపఱచాల్సి ఉంది. అలా భద్రపఱిచేటప్పుడు ఒక చోట కాకుండా దేశంలో అనేక చోట్ల - అంటే కనీసం ఒక రెండొందల ప్రదేశాల్లో భద్రపఱచాలి. అంటే ఒక్కొక్క గ్రంథానికీ 200 ప్రతులు తయారు చేయించాలి. ఇది చాలా బృహత్కార్యం అని, కనీసం రెండు మూడు తరాల చేపట్టు (project) అనీ నాకు తెలుసు. అయితే ఒక ఏకాభిప్రాయమూ, ఒక ముందస్తు ఆలోచనా అవసరమనే ఉద్దేశంతో మీ ముందు పెడుతున్నాను.

కామెంట్‌లు లేవు:

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి