5, సెప్టెంబర్ 2009, శనివారం

Every Package comes with a Baggage

అనగనగా ఒక మంత్రాల చింతక్కకి ఇద్దఱు మనవరాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు చిన్నతనంలోనే కాలం చెయ్యడంతో శ్రీమతి చింతక్క అన్నీ తానే అయి వాళ్ళని పెంచింది. వాళ్ళలో చిన్నమ్మాయి పెంకె ఘటం.ఆమె ముసలమ్మ చెప్పిన మాటేదీవినేది కాదు. పెద్దమ్మాయి మాత్రం చింతక్క చెప్పినట్లే నడుచుకుని ఊళ్ళో మంచిపేరు తెచ్చుకుంది. ఒకసారి చింతక్క పెద్దమ్మాయిని, "నీ యింట్లో తీసినవస్తువు తీసినచోట ఉండదు. ఇంటినిండా ఎక్కడ పడితే అక్కడ అశుద్ధాలు ఉంటాయి.నీ యింట్లో ఎప్పుడూ ఏడుపులూ పెడబొబ్బలూ గోల..." అని ఆశీర్వదించింది. పెద్దమ్మాయి హతాశురాలైంది. ఇదేం ఆశీర్వాదమో అర్థం కాలేదు. అదే చింతక్క చిన్నమ్మాయిని "నీ యిల్లెప్పుడూ సర్దినది సర్దినట్లు అతిశుభ్రంగా ఉంటుంది. ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది." అని ఆశీర్వదించింది. చిన్నది ఆ ఆశీర్వాదానికి ఉబ్బి తబ్బిబ్బయింది. కొంతకాలం గడిచాక వాళ్ళిద్దఱికీ పెళ్ళిళ్ళయ్యాయి. చింతక్క చనిపోయింది. కాపురానికి వెళ్ళిన పెద్దమ్మాయికి వరుసగా ఆఱుగుఱు పిల్లలు పుట్టారు. వాళ్ళ ఏడుపులతో, పెడబొబ్బలతో, అల్లరితో ఆమె యిల్లంతా దద్దఱిల్లసాగింది. చిన్నమ్మాయికి పెళ్ళయి పదేళ్ళయినా పిల్లలు పుట్టలేదు. అందుచేత ఆమె యిల్లు ఎప్పుడూ అతిశుభ్రంగా, ప్రశాంతంగా ఉండేది. ఎక్కడి వస్తువులు అక్కడ కదలకుండా రూపు చెడకుండా ఉండేవి. అవ్వ ఆశీర్వాదాల్లోని అంతరార్థం అప్పుడు బోధపడింది అక్కాచెల్లెళ్ళకి.

ప్రపంచంలో పనికిరాని పదార్థమంటూ ఏదీ లేదు. కనుక చెత్త కూడా ఏమీ లేదు. కాబట్టి మన శుభ్రతా నియమాలు వర్తించే దేశలాలాల పరిధి అతిసంకుచితం. "Dirt is not dirt, but only something in the wrong place" అన్నారు Lord Palmerston ఒక సందర్భంలో ! కనుక శుభ్రత కంటే శుచి ముఖ్యం. శుచి అంటే మానసిక శుభ్రత. మనం మాట్లాడే ప్రతి వంకరమాట వల్లా, మనం చేసే ఒక్కొక్క కుటిల చేష్ట వల్లా ఆత్మ తేజస్సు ఒక్కొక్క పొఱగా మఱుగున పడిపోతూ ఉంటుంది. అది అలా మఱుగున పడిపోవడానికే 'పాపం' అని పేరు. ఆత్మ అంటే ఎవరో కాదు,"అసలైన మనం". మాజీ దేవుళ్ళమైన మనం ఇలా జీవులుగా మారిపోవడానికి కారణం పాపం. మనిషికి పాపాలు మాత్రమే అంటుకుంటాయి. పుణ్యమంటూ ఏమీ లేదు. పుణ్యం పేరుతో మనం చేసే ప్రతి పనీ ఆత్మ చుట్టూ పేఱుకుపోయిన అవనసరపు పాప పదార్థపు పొఱల్ని తొలగించి వాటి కింద మఱుగున పడ్డ ఆ స్వకీయ (original) తేజస్సుని వెలికి తేవడానికే.

శ్లో|| అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా |
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచి : ||

పుండరీకాక్ష ! పుండరీకాక్ష !! పుండరీకాక్ష !!!

తా|| పాపాత్ముడైనా, పుణ్యాత్ముడైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా, పుండరీకాక్షుని తలచినవాడు లోపలా, బయటా కూడా శుచియే అవుతాడు. (పుండరీకాక్ష ! అని ముమ్మారు బిగ్గఱగా పలుకు)

అతిశుభ్రత వల్ల ఆరోగ్యాన్ని, అనుగ్రహాన్ని కోల్పోతాం. కొన్ని దేవాలయాల్లో విపరీతంగా ఉక్కపోస్తుంది. అలాగని అలాంటి గుళ్ళకు వెళ్ళొచ్చాక స్నానం చెయ్యడం గాని ఒళ్ళు కడుక్కోవడం గాని చెయ్యకూడదు. ఆ గుడిలోని దేవుడి అనుగ్రహ దృష్టి మన శరీరాలకు తాకి ఉంటుంది గనుక వెంటనే స్నానం చెయ్యడమంటే ఆ అనుగ్రహాన్ని వదిలించుకోవడమే అవుతుంది.

అద్దె (కిరాయి) ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఆ యిల్లు కడక్కూడదని పెద్దలు చెబుతారు. కడిగితే ఆ యింటి యజమానికి దరిద్రం చుట్టుకుంటుం దంటారు. ఇంకొందఱు ఇంట్లో చెప్పులు వేసుకుని తిరుగుతారు. దేవాలయం ఎలాంటిదో మనయిల్లు కూడా అలాంటిదే. మన యింట్లో కూడా అదృశ్యంగా దేవతలు (వివిధ శక్తులు) సంచరిస్తారు. వాళ్ళు మనంపూజించినవాళ్ళు కాకపోయినా మన పూర్వీకులు పూజించినవాళ్ళయి ఉంటారు. చెప్పులు వేసుకుని తిరిగే యిళ్ళలోంచి వాళ్ళు నిష్క్రమిస్తారు. కొన్నిసార్లు ఒకే ఒక్క తరం లోపల అలాంటి యిళ్ళు దయనీయమైన దరిద్రాన్ని రుచిచూస్తాయి. "మాకు బయటికి వేసుకునే చెప్పులు వేఱు, ఇంట్లో వేసుకునే చెప్పులు వేఱు" అని కొందఱు సర్దుకో జూస్తారు. కాని అటువంటి తేడా ఉన్నట్లు పెద్దలు చెప్పలేదు.

కడిగిందే కడగడం, తుడిచిందే తుడవడం, పనిమనుషులతో కూడా అలా చెప్పి చేయించడం- ఇవన్నీ పనివాళ్ళ శాపాలకు కారణమౌతాయి. అతిశుభ్రతని పాటించే స్త్రీలు సంతాన గోపాలస్వామి శాపానిక్కూడా గుఱవుతారు. వారు సాధారణంగా పరమ పిసినిగొట్లయి ఉంటారు. వారికి బొత్తిగా సంతానం లేకపోవడమో, లేదా ఒక్క సంతానమే మిగలడమో జఱుగుతుంది. మఱికొందఱు, తినే అన్నాన్ని అసహ్యించుకుంటారు. దాన్ని ఎంగిలిగా, అంటుగా భావిస్తారు. అందుకని అన్నం చేతికి అంటకుండా బిరుసుగా వండమని వంటచేసేవారిని హెచ్చఱిస్తారు. అలా వండకపోతే రాద్ధాంతానికి దిగుతారు. వారు ఒక గ్లాసెడు నీళ్ళు దగ్గఱ పెట్టుకుని అన్నాన్ని తాకినప్పుడల్లా ఆ చేతిని ఆ గ్లాసులో ముంచుతూంటారు. ఆ విధంగా అన్నాన్ని అసహ్యించుకోవడం ద్వారా వాళ్ళు అన్నపూర్ణాదేవి శాపానికి గుఱవుతారు.

అతిశుభ్రస్థులు యావత్‌ప్రపంచాన్నీ ఒక మహా బ్యాక్టీరియాగాను, బృహద్ వైరస్‌గాను విలోకిస్తారు. ఇది తోటి మనుషుల్ని సైతం అకారణంగా అసహ్యించుకోవడానికి దారితీస్తుంది. ఆఖరికి మనిషి స్పర్శే, మనిషి పొడే కిట్టకుండా పోయే పరిస్థితి వస్తుంది. వాళ్ళందఱి శాపాలూ తప్పనిసరిగా తగుల్తాయి.

విశ్వం (Universe) అంతా అమ్మవారి స్వరూపం. ఆహారరూపంలో అందఱమూ భూమిలో నుంచే వచ్చాం. మళ్ళీ అందులోకే వెళ్ళిపోతాం. చనిపోయాక ఇతరులకు ఆహారంగా మారతాం.

"అహమన్నాదో అహమన్నాదో అహమన్నాద: !

అహమన్నమ్ అహమన్నమ్ అహమన్నమ్." (తైత్తిరీయోపనిషత్తు)

తా|| 'అన్నం తినేవాణ్ణీ నేనే. (ఇతర జీవులకు) అన్నాన్నీ నేనే' అంటున్నాడొక ఋషి.

ప్రపంచాన్ని అసహ్యించుకోవడం అమ్మవారినే అసహ్యించుకోవడం కిందికొస్తుంది. అలాగే మనుషుల్నిఅసహ్యించుకోవడం ఆమె భర్త అయిన సర్వాంతర్యామిని (పరమాత్ముణ్ణి) అసహ్యించుకోవడం కిందికొస్తుంది. వారి శాపాల నుంచితప్పించుకోలేరు. ప్రపంచంలో సంపద ఉన్న చోటల్లా ముఱికి కూడా ఉంటుంది. మనకు శుభ్రతే ముఖ్యమైతేఎడార్లు చాలా శుభ్రంగా ఉంటాయి. అక్కడికి పోయి బతకొచ్చు. ఇల్లు కట్టే చోట ఇసుకా, సిమెంటూ చెల్లాచెదఱుగా పడి ఉంటాయి. పంటలు పండే భూములు బుఱద బుఱదగా ఉంటాయి.

మానసికంగా ఆస్పత్రిలో జీవించడం మానేద్దాం. రోగాల్ని, డాక్టర్లనీ, వైరసులనీ కాసేపు మర్చిపోదాం. ప్రపంచాన్ని ప్రేమిద్దాం. జీవుల్ని ప్రేమిద్దాం. తోటి మనుషుల్ని ప్రేమిద్దాం.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి