7, సెప్టెంబర్ 2009, సోమవారం

సత్యమే ధైర్యము

ఒకసారి స్వర్గలోకంలో దేవతలందఱూ సమావేశమైనప్పుడు "అన్ని ధర్మాల కంటే గొప్పది ఏది ?" అని చర్చ జఱిగిందట. అప్పుడు సత్యాన్ని ఒక తక్కెడలోను, మిగతా అన్ని ధర్మాల్నీ రెండో తక్కెడలోను పెట్టి తూయగా, సత్యమే ఎక్కువ బరువు తూగిందని మహాభారతం చెబుతున్నది. సంస్కృత భాషలో 'సత్' అంటే 'నశించకుండా ఎల్లప్పుడూ ఉండేది' అని అర్థం. 'మంచిది' అని కూడా మఱొక అర్థం ఉంది. ప్రపంచంలో నాశనం చెందకుండా ఎల్లప్పుడూ ఉండేవాడూ, అందఱికీ మంచి చేయగలవాడూ భగవంతుడొక్కడే. ఆ 'సత్' కి సంబంధించినదే సత్యము. అంటే నిజమైనదీ, అందఱికీ శ్రేయస్సు చేకూర్చేదీ అని అర్థం. అందుచేత సత్యం భగవత్ స్వరూపమే.

అంతే కాదు, ఆ సత్యాన్ని అనుసరించేవారూ, దాన్ని కనుగొనేవారూ, దాన్ని మాట్లాడేవారూ, దాన్ని ఒప్పుకునేవారూ. సమర్థించేవారు కూడా భగవత్ స్వరూపులే. సత్యం మిగతా అన్ని ధర్మసూత్రాల్నీ తనలో ఇమిడించుకొన్న మహా ధర్మసూత్రం. అంటే ఒక్క సత్యాన్ని మాత్రమే అవలంబించినా చాలు, మిగతా అన్ని మంచి లక్షణాలూ నెమ్మదిగా వాటంతట అవే అలవడతాయి. అదే విధంగా, ఒక్క సత్యాన్ని వదిలిపెడితే చాలు, మిగతా అన్ని ధర్మాలూ మనిషిని వదిలిపోతాయి. అందుకే "దేన్నయినా త్యాగం చేస్తాను గానీ, నాలోని సత్యాన్ని మాత్రం త్యాగం చెయ్యలే"నన్నాడట అంగదేశపు రాజైన కర్ణుడు. ఎందుకంటే సత్యాన్ని త్యాగం చెయ్యడం వల్ల అంతకు ముందు చేసిన త్యాగాలన్నీ అబద్ధమైపోతాయని అతని భయం. ఒక్క సత్యమనే కాదు, సద్గుణాలైనా, దుర్గుణాలైనా అన్నీ కలసికట్టుగానే వస్తాయి. కలసికట్టుగానే పోతాయి.

అలా, సత్యం ద్వారా అలవడే సద్గుణాల్లో ధైర్యం కూడా ఒకటి. ధైర్యమంటే 'ఇతరులతో యుద్ధం చెయ్యడం' అని చాలామంది అనుకుంటారు. కానీ ధీరత్వమే ధైర్యం. ధీరత్వమంటే చలించకుండా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండడం. నిజాలు తెలిసినవారికి, నిజాలు మాట్లాడేవారికీ మాత్రమే అది సాధ్యం. అసత్యవాదులు నెమ్మదిగా ప్రశాంతంగా ఉండలేరు. అందుచేత ధైర్యమంటే ఇతరులకు హాని చేయడం కాదు. సత్యాన్ని సత్యంగా గ్రహించి, నిజాయితీగా దాన్ని ఒప్పుకుని, దాన్నుంచి పారిపోకుండా, దాని పర్యవసానాల్ని తెలివితేటలతో ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధం కావడంలోనే నిజమైన ధైర్యం ఇమిడి ఉంటుంది.

చిన్నప్పుడు నేనొక కథ విన్నాను.

పూర్వం హిరణ్య రాష్ట్రం (కడప జిల్లా) లో ఒక నదీతీరంలో శంఖుడు, లిఖితుడు అని ఇద్దరు అన్నదమ్ములు చెఱొక ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఒకసారి అన్న అయిన శంఖుడు తన ఆశ్రమ బాధ్యతని కూడా తమ్ముడికప్పగించి పక్క గ్రామానికి వెళ్ళాడు. మర్నాడు లిఖితుడు పూజ కోసం పూలు కోయాలనుకుని తన ఆశ్రమంలో పూలు పూయకపోవడం చేత అన్నగారి ఆశ్రమంలో పూచిన పూలు కోసుకుని పూజ చేశాడు. ఆ తరువాత అతనికి జ్ఞాపకం వచ్చింది - తాను అన్నగారి అనుమతి లేకుండానే ఆయనకు చెందిన పూలని వాడుకున్నానని. చాలా బాధపడ్డాడు. మర్నాడు అన్నగారు రాగానే ఏమీ దాచకుండా నిజం చెప్పాడు. దొంగతనం చేసినందుకు తనకు తగిన శిక్ష విధించమని కోరాడు. అది చాలా చిన్న విషయమనీ, అయినా తనతో నిజం చెప్పి ఒప్పుకున్నాడు కనుక అతని దోషం పోయిందనీ శంఖుడు ఎంత నచ్చజెప్పినా లిఖితుడు వినలేదు. అప్పుడు శంఖుడు అతనితో " శిక్షలు విధించే అధికారం దేశాన్ని పాలించే రాజుకు మాత్రమే ఉంది. కాబట్టి నువ్వు ఆయన దగ్గఱికే వెళ్ళి నీ అపరాధాన్ని వివరించి ఆయన నీకు ఏ శిక్ష విధిస్తే దాన్ని అనుభవించు" అన్నాడు. "సరే"నని లిఖితుడు రాజుగారి దగ్గఱికి వెళ్ళి తన అపరాధాన్ని వెల్లడించాడు. దొంగతనానికి ఆ రోజుల్లో చేతులు నఱకడమే శిక్ష. ఒక తపస్విని అంత చిన్న అపరాధానికి అలా శిక్షించేందుకు మొదట రాజు కూడా ఇష్టపడలేదు. కాని లిఖితుడు చాలాసేపు ఆయనతో వాదించి పట్టుపట్టిన మీదట ఆయన అతని చేతులు నఱకవలసిందిగా ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ ననుసరించి ఆయన భటులు లిఖితుడి చేతుల్ని నఱికేశారు. చేతుల్లేకుండా ఆశ్రమానికి తిరిగి వచ్చిన తమ్ముణ్ణి చూసి శంఖుడు సంతృప్తి చెంది " తమ్ముడూ ! ఇప్పుడు నువ్వు పవిత్రుడివయ్యావు. వెళ్ళి నదిలో స్నానం చేసి రా !" అన్నాడు. "అలాగే అన్నయ్యా !" అని లిఖితుడు నదికి వెళ్ళి మూడు మునకలు వేసి లేవగానే అతని చేతులు యథాపూర్వంగా తిరిగి వచ్చాయట. లిఖితుడు సంతోషంతో అన్నగారి ఆశ్రమానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన చేతుల్ని చూపించగా ఆయన ఆనందంతో అతన్ని కౌగలించుకుని "తమ్ముడూ ! నీ సత్యనిష్ఠకు మెచ్చి ఆ నదీమతల్లి నీకు ప్రసాదించిన వరమే ఇది. ఆమె బాహుదా" అన్నాడట. అప్పటినుంచి ఆమెకు 'బాహుదానది' (బాహువులు - అనగా చేతులిచ్చిన నది, లేక 'చెయ్యేఱు') అని పేరు వచ్చిందట. అంతకు ముందు దాన్ని ఏమని పిలిచేవారో తెలియదు.

ఆ విధంగా, ఎంత చిన్నదైనా కానీ, తప్పు చేశాననే సత్యాన్ని ఒప్పుకుని అందుకు శిక్ష అనుభవించడానికి మన:స్ఫూర్తిగా సిద్ధపడ్డ లిఖితుడి ధైర్యమే మనకందఱికీ ఆదర్శం కావాలి.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి