వేదాలు కొన్నివేల సంవత్సరాల క్రితమే జనానికి అర్థం కావడం మానేశాయి. అయిదువేల సంవత్సరాల క్రితం సంస్కృతం జీవద్ భాష (living language) గానే ఉండేది. కోట్లాదిమందికి రోజువారీ కష్టసుఖాలు చర్చించుకునే మాతృభాషగా ఉండేది. అయినా అప్పటి జనానికే అవి సరిగా అర్థమయ్యేవి కావని తెలుస్తున్నది. వేదపదజాలానికి యాస్కుడు నిఘంటువు వ్రాయడం, పాణిని వ్యాకరణం రాయడం, శిక్ష పేరుతో వేదాల ఉచ్చారణపద్ధతి మీద పుస్తకాలు బయలుదేఱడం, వేదాల్లోని ధర్మవిషయాల మీద ప్రత్యేకంగా స్మృతులూ, సూత్రాలూ వ్రాయబడ్డం - ఈ మొదలైన ఆధారాల్ని దృష్టిలో పెట్టుకుంటే !! ఇప్పటికీ వేదాల్లో సుమారు 1,000 పదాలు అర్థం కాకుండానే మిగిలిపోయాయని కొందఱు భాషాశాస్త్రవేత్తలు చెప్పగా చదివినట్లు గుర్తు. అది చాలా సహజం అనిపిస్తుంది. మనం ఈ రోజు మాట్లాడుతున్న తెలుగుభాషే ఇంకో అయిదాఱువేల సంవత్సరాల దాకా భద్రపఱచబడినా కూడా - ఇందులో కొన్ని పదాలు అప్పటి పండితులకి సైతం అర్థం కాకుండా నిగూఢం (mystery) గా మిగిలిపోతాయి.
వేదాల్ని మానవజాతికి ఆదిపురుషులైన ఋషులు దర్శించడం వల్ల అవి భారతజాతికి పరమ పవిత్రాలు. అన్నిదేశాల సారస్వతాల కంటే ముందస్తువి కావడం చేత చారిత్రికంగా చరిత్ర పరిశోధకులకు అమూల్యాలు. అవి శక్తిమంతమైన, మహిమాన్వితమైన మంత్రసంహితలు కావడం చేత పూజనీయాలు. కానీ వాటి ఉపాసనా పద్ధతులు ప్రస్తుతం సామాన్యజనానికి అందుబాటులో లేకపోవడం చేత, అర్థం కాకపోవడం చేత అవి ఈనాడు చాలావఱకు అనుపయుక్తాలు. ఈ రోజు మనం వేదాలు అందఱూ చదవొచ్చుని చెప్పినా "అహా ఓహో" అనుకుంటూ వాటిని ఉత్సాహంగా చదవడానికి ఉపక్రమించేవారెవరూ లేరు. "దళితులకి వేదాలు నేర్పడానికి మా సంస్థ సిద్ధం" అని చినజీయర్ గారు బహిరంగంగా ప్రకటించి ఏడాదవుతున్నది. కానీ ఒక్క దళితుడు కూడా వారి సంస్థలో ఇంతవఱకు చేఱలేదు. ఎవరైనా వాటిని చదివినా ఈనాడు ఆ మంత్రాలు వారికి ఫలించవు, వంశపారంపర్యమైన ఆ ఉపాసనాపద్ధతులు ప్రాచీన బ్రాహ్మణ వంశాలతో పాటు అంతరించిపోయి ఉండడం వల్ల. ముఖ్యంగా బ్రహ్మర్షిదేశమని మనుధర్మశాస్త్రంలో పేర్కొనబడ్డ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాలు మొత్తం ఇస్లామ్ వ్యాప్తితో నిండిపోవడం వల్ల ఆ వంశాలు అంతరించి ఉండవచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో మనం వేదాలు, పురాణాలూ కాకుండా ఇంకేదైనా ప్రత్యామ్నాయరూపమైన, సకలహిందూమత సారాంశ రూపమైన ధర్మసంహిత పారాయణాన్ని హిందూ మతవిద్యగా మన దేశానికి చెందిన స్త్రీపురుషులకు, బాలబాలికలకు prescribe చెయ్యాల్సి ఉంది. అది వారి మాతృభాషలోనే ఉంటే ఎక్కువ ప్రయోజనకరం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి