2, సెప్టెంబర్ 2009, బుధవారం

అడుగడుగున గుడి ఉంది - అందఱిలో గుడి ఉంది...

"దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనాతనః"


సాధారణంగా గుళ్ళనుంచి, గుళ్ళ పూజారుల నుంచి మనం చాలా గొప్ప పవిత్రతని ఆశిస్తూంటాం. అవి/ వారు మన ఆశంసల (expectations) కి అనుగుణంగా లేనప్పుడు పదునైన విమర్శలకి సైతం దిగుతూంటాం. కానీ హిందూధర్మంలో గుడికున్న ప్రాధాన్యం తక్కువ. ప్రాచీనకాలంలో గుళ్ళు మతకేంద్రాలుగా కంటే పంచాయితీ కార్యాలయాలుగా, ఆడిటోరియములుగా ఎక్కువ ఉపయోగపడుతూండేవి. సంఘం నుంచి వెలివేయబడినవారిని గుడికి రావద్దనడంలో ఉన్న అంతరార్థమదే. హిందూధర్మంలో అసలు ప్రాధాన్యమంతా వ్యక్తిగత సాధనకే. గుళ్ళకీ, పూజారులకీ కాదు. ఇదే మన ధర్మానికీ, ఇతర ధర్మాలకీ ఉన్న ప్రధానమైన తేడా. ఏళ్ళ తరబడి గుడికి పోకపోయినా ఈ ధర్మంలో ప్రత్యవాయం సిద్ధించదు. ఏ పాపమూ రాదు. తన యింట్లో తన కుటుంబ సంప్రదాయానికి ఆదిగురువులైనవారు చెప్పిన నియమనిష్ఠలు పాటిస్తున్నంత కాలమూ పూజారి చెప్పినట్లు వినకపోయినా నష్టమేమీ లేదు.


దానికంటే శరీరాన్ని, మనస్సునీ శుచిగాను, పవిత్రంగాను ఉంచుకోవడానికి మన పూర్వులు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. శరీరం కూడా ఇల్లే. ఇంట్లో ఉన్నట్లే దీనికి ఒక వంటిల్లు (పొట్ట), బాత్ రూము (మర్మాంగాలు) గట్రా ఉన్నాయి. దీని హృదయస్థానం (పూజగది) లో అంగుష్ఠమాత్రుడైన పరమపురుషుడు మన పుణ్యపాప తలంపుల స్పందనల్ని వింటూ నిత్యనివాసం చేస్తున్నాడు. ఆ విధంగా చూస్తే దేవుడెక్కడనో లేడు. దేహంలోనే ఉన్నాడు. కనుక దేహమే దేవాలయమని తెలియజేశారు. మనశ్శరీరాల శౌచాలు పరస్పరం ఆధారితమై ఉంటాయి. మనస్సు మలినమైతే శరీరం మలినమవుతుంది. శరీరం మలినమైతే మనస్సు కూడా మలినమవుతుంది. ఎందుకంటే శరీరం స్థూలశరీరం. మనస్సు సూక్ష్మశరీరం. కాబట్టి యోగుల వలె అంతర్ముఖులై మనశ్శౌచాన్ని సాధించలేనివారు కనీసం పెద్దలు సూచించిన పవిత్రవస్తువుల ధారణని మంత్రపూర్వకంగా అనుష్ఠించడం ద్వారా కూడా దాన్ని సాధించవచ్చు. కనుక శిరోముండనం చేయించుకోవడం, విభూతి, నామాలు పెట్టుకోవడం, తిలకధారణ, రుద్రాక్షధారణ, తులసీమాలాధారణ, యజ్నోపవీతధారణ, చక్రాంకితాలు వేసుకోవడం మొదలైనవి ఆ భగవంతుని నిరంతరరాయంగా గుర్తుచేసుకొని పాపకర్మాచరణ నుంచి. దోషభూయిష్ఠమైన తలపుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి దోహదిస్తాయి. ఈ దివ్యత్వ చిహ్నాలు మన శరీరం మీద భగవత్ సాన్నిధ్యాన్ని కల్పిస్తాయి. తద్ద్వారా దేహాన్ని దేవాలయంగా మారుస్తాయి. మన దేహాలు దేవుని వాహనాలుగా మారతాయి. వీటి నిజమైన అంతరార్థాన్ని గ్రహించనివారి మూలాన కాలక్రమంలో ఇవి వట్టి వేషధారణగా మారడం విచారకరం. కానీ అంతరార్థాన్ని తెలుసుకొని అనుష్ఠించినవారికి ఆ ఫలితం తప్పకుండా కనిపిస్తుంది. అందుచేత శాస్త్రోక్తమైన వీటిని కేవలం వేషధారణగా భావించడం సరికాదు. "సర్వసంగపరిత్యాగికి కాషాయవస్త్రాలు మాత్రం అవసరమా ?" అని అడిగిన ఒక శిష్యుడితో శ్రీ వివేకానందస్వాములవారు ఆశ్రమధర్మాన్ని ఖచ్చితంగా పాటించి తీఱవలసిందేనని తెలియజేశారు. అంతేకాక ఆ ఆశ్రమనిర్వహణకు బాహ్యవేషం తప్పకుండా తోడ్పడుతుందని సైతం వాక్రుచ్చారు.


అదే విధంగా గృహాన్ని కూడా దేవాలయంగా మార్చుకోవడం అవసరం. దేవాలయంలో ఏ విధంగా నైతే మంచి తలంపులు కలిగి ఉంటామో, గొడవలు పడకుండా, వెధవ పనులు చెయ్యకుండా, అవాచ్యాలూ, అశ్లీలాలూ మాట్లాడకుండా జాగ్రత్త పడతామో అలాగే ఇంట్లో కూడా అలాంటివాటికి దూరంగా ఉంటే ఇల్లే దేవాలయంగా మారిపోతుంది. ఈ మధ్య మా యింటికొక శివభక్తుడు వచ్చాడు. ఆయన మా పూజగదిలో కాసేపు కూర్చొని ధ్యానం చేసుకున్నాడు. ఎవరో తన తలమీద రెండు చేతులూ పెట్టి ఆశీర్వదించినట్లు అనుభూతి కలిగింది. ఆ తరువాత అతను బయటికి వచ్చి "మీ యింట్లో ఏదో మహాశక్తి ఉంది. ఎక్కడా కలగని అనుభూతి కలిగింది" అని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. భగవంతుడు మా పూజలకి ప్రీతుడై మా యింట్లోనే ఉన్నాడని తెలుసుకొని మిక్కిలి సంతోషపడ్డాము. ఈ జాగ్రత్తలు ఈ తరంవారు పాటించక అనేక గృహాలు సినిమాహాళ్ళుగా, తాగుడుబార్లుగా, దొమ్మీల నిలయాలుగా, గొడవలకీ, అశాంతికీ కేంద్రాలుగా మారాయి.


మన మతాన్ని మనం సమీచీనంగా అర్థం చేసుకొని సాకల్యంగా అనుష్ఠించడం వల్ల మనమెప్పుడూ చెడిపోలేదు. అర్థం చేసుకోకపోవడం వల్లా, పాటించకపోవడం వల్లా మాత్రమే చెడిపోయాము. సంప్రదాయం మీద బుఱద జల్లేవారికి ఈ విషయంలో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

చక్కగా వివరించారండి.

Gautham Ugaatha చెప్పారు...

చాలా బాగా వివరించారు. ఇంకా ఇలాంటివి రాయండి. ఇలాంటివి అవసరం, అలాగే దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనాతనః అని వదిలేశారు. ఈ శ్లోకం ఆది శంకారాచార్యుల వారు చెప్పినదని ఒక పుస్తకంలో చదివాను. అవునో కాదో నాకు తెలియదు. అయితే మీరు ఆ శ్లోకాన్ని పూర్తిగా రాసి దాని అర్ధాన్ని, దయచేసి వివరిస్తారని ఆశిస్తున్నాను.
.... గౌతమ్ ఉగాథ.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి