శా:-
శ్రీ శైలాత్మజ ! నీదు దివ్య తపమున్ శ్రీ శంభుడే మెచ్చి, తా
నాశించెన్ నిను. పెండ్లి యాడె. తను నిన్నర్థాంగిగాఁ బొందె. మా
యాశల్ తీర్చగ నీకు మ్రొక్క, నతడు న్నర్థించు మాబోంట్ల తా
క్లేశంబొందగనీక కాచును గదా ! లీలన్ ! కృపాంభోనిధీ !
మ:-
మనమున్ భక్తి ప్రమోద భావమమరం బ్రహ్మంబునే బ్రహ్మచా
రిణి ! గాంచన్ సుకరంబె యయ్యె తమకున్. శ్రేయంబులన్ గూర్చు నీ
మణిమన్ మందిర ద్వీపమంద మనముల్ మళ్ళించు సద్భక్తులన్
గని, కావంగ నుపేక్ష యేల? విలసత్ కారుణ్య మాహేశ్వరీ !
శా:-
భక్తిన్ మ్రొక్కెద, చంద్రఘంట ! కరుణా భాస్వన్మనోజ్ఞాకృతీ !
శక్తిన్ గొల్పుమ నిన్ను మాదు మదులన్ సౌమ్యంబుగా నిల్ప! దు
శ్శక్తుల్ మాయఁగఁ జేయఁ జేయుమ ! కృపన్. చాంచల్య భావంబులన్
యుక్తిన్ బాపుమ ! సద్గుణంబు లిడుమా ! యుక్త్యుక్తులం జేయుమా !
శా:-
శ్రీ కూష్మాండ శుభాఖ్య ! మాదు ప్రణతుల్ చేకొమ్మ ! జీవాళిలో
నీకాంతుల్ ప్రసరింప, వెల్గు నిలపై. నీ ధ్యాస లేకున్నచో
శోకాగ్నుల్ మము చుట్ట ముట్టు. కరుణా జ్యోత్స్నళి నీ నుండియే
చేకొన్నన్ శుభ సంహతుల్ గలుగు. సుశ్రేయంబులున్ గల్గెడున్.
మ:-
కన రావా ! మము స్కందమాత ! విలసద్గాంభీర్య సద్రూపిణీ !
కనులన్ మమ్ములఁ బెట్టి గాంచ తగదో ! కారుణ్య భావోజ్వలా !
తను హృద్భాషల నిన్ను భక్తిఁ గొలువన్, తత్వజ్ఞతన్ గల్గి, నిన్
మనమందెప్పుడు గాంచు భాగ్య మిడుమా ! మమ్మున్ గృపన్ జూడుమా !
శా:-
ఓ కాత్యాయని ! యో సు పూజిత పదా ! ఓ దుష్ట సంహారిణీ !
శ్రీ కాత్యాయన సన్మునీశ్వర సుతా ! శ్రీ చక్ర సంచారిణీ !
నీ కారుణ్యమె మాకు జీవనముగా ! నిన్ గొల్చు సద్భాగ్యముల్
లోకంబందున మాకుఁగొల్పి, కృపతో లోలాక్షి ! కాపాడుమా !
ఉ:-
శ్రీ కర కాళ రాత్రి ! నిను చిత్త సరోజము నందు నిల్పి, నీ
భీకరమైన రూపమును ప్రీతిగ చూడగ నిచ్చగించెదన్.
నీకరవాల మీ ధరణి నింగికిఁ బంపును దుష్ట సంహతిన్.
ప్రాకటమొప్పఁ గాచెదవు భక్తుల పాలిటి కల్పవల్లివై.
మ:-
కరుణా సాంద్ర ప్ర పూరితా ! వర మహా గౌరీ ! శివాణీ ! మమున్
దరిఁ జేర్చన్ నిను మించు వారు కలరే ! దాక్షిణ్య మొప్పారగా
ధరపై దుష్ట జనాళి నుండి మములన్ దప్పించి కాపాడుమా !
వరమై నీ మహనీయ నామ మెదలో వర్ధిల్లగా జేయుమా !
మ:-
పరమేశానివి, సిద్ధి ధాత్రి ! కృపతో భక్తాళి నెల్లప్పుడున్
పరమేశుండును, నీవు కూడి, కనుచున్, భక్తిన్ ప్రవర్ధింపుచున్,
వరమై తోడుగ నుండుడీ! సుజనులన్ వర్ధిల్లగా జేయుచున్
దురితంబుల్ పొనరింపకుండ కనుడీ! దుష్టాత్ములన్ బాపుడీ!
ఇట్లు
భగవద్భక్త దాసుడు,
చింతా రామకృష్ణా రావు