2, సెప్టెంబర్ 2009, బుధవారం

ఇంట్లో ఈగల మోత - బయట పల్లకీల మోత

కొద్ది సంవత్సరాల క్రితం తిరుపతిలో ISKCON వారి పుస్తకాల కొట్టు దగ్గఱ నిలబడి చూస్తున్నాను. ఈ లోపల ముగ్గుఱు యువబ్రాహ్మణోత్తములు అక్కడికి వచ్చారు. వారు బహుతెల్లగా ఉన్నారు. నున్నని గుండ్లతో, తిన్నని పిలకలతో, తెలతెల్లని యజ్ఞోపవీతాలతో, చక్కని సాంప్రదాయికమైన పంచెకట్టుతో ఉజ్జ్వలమైన ఊర్ధ్వపుండ్రాలు ధరించి పవిత్రమైన "ఓమ్ నమో వేంకటేశాయ" మంత్రాన్ని బృందగానంలా జపిస్తూ కాలినడకన కొండెక్కడం కోసం అలిపిరి వైపు నడుస్తున్నారు. శరీరాల మీద చొక్కాలు లేవు. ఈ పుస్తకాల కొట్టు చూసి నాలాగే కొద్దినిమిషాలు అక్కడ ఆగారు. ఏవో పుస్తకాల గుఱించి కొట్టుఆసామిని ఇంగ్లీషులో అడిగారు. ఆ తరువాత కొట్టుఆసామి వారినడిగాడు "భోం చేశారా ?" అని. "నిన్న ఏకాదశీ ఉపవాసం. ఈరోజు ద్వాదశి ఘడియలొచ్చాకనే తినడం" అని సమాధానం చెప్పి వారు మళ్ళీ మంత్రజపం చేసుకుంటూ ముందుకు సాగిపోయారు. అప్పుడనుమానం వచ్చింది. వారు వెళ్ళిపోయాక ఆసామి నడిగాను. "ఎవరయ్యా ఈ కుఱ్ఱాళ్ళు ?" అని ! "వారు చెకొస్లొవేకియా వైష్ణవులు. వేదవేత్తలు. ప్రతిసంవత్సరం వస్తూంటారు." అని సమాధానం చెప్పాడతను.


"ఔరా ! పుట్టుకతో హిందువులమైనా మనకు వేదం ముక్క తెలియదు, తెలిసినవాళ్ళని దూషించడం తప్ప ! హిందూమతం పుచ్చుకున్న ఈ చెక్ దేశపు తెల్లవాళ్ళు మనకంటే చాలా నయంలా ఉన్నారే. " అనుకుంటూ నేను మ్రాన్పడిపోయాను చాలాసేపు. కృతయుగంలో మాదిరి మళ్ళీ ప్రపంచమంతా హైందవమైతే ఎలా ఉంటుందో ఈ కుఱ్ఱాళ్ళు మచ్చుకు రుచి చూపిస్తున్నారనిపించింది. ఇక్కడ కంటే చెకొస్లొవేకియాలో హిందువుగా పుడితే మజాగా ఉంటుందనిపించింది.


ఈమధ్య అమెరికన్ చట్టసభల్లో క్రైస్తవప్రార్థనలతో పాటు హిందూప్రార్థనల్ని కూడా అనుమతించారని విన్నప్పుడూ ఇదే అనుభూతి కలిగింది. కానీ హిందూస్తాన్ అని పేరు గల ఈ దేశంలో మటుకు హిందూధర్మం అడుగడుగునా ఎలా అరణ్యవాసాలకీ అజ్ఞాతవాసాలకీ ఘోరావమానాలకీ గుఱవుతున్నదో తల్చుకుంటే ఎంతటి శాంతమూర్తికైనా పట్టరాని ఆగ్రహం కలుగుతుంది. నిన్నటి వినాయక చవితే తీసుకుందాం. భారత నౌకాదళంలో పనిచేస్తున్న కాపుమిత్రుడినుంచి సమాచారం అందింది. ఇండియన్ నేవీలో నిన్న ఏ ఓడలోను వినాయక చవితి జఱుపుకోలేదట. పండుగరోజున మాంసాహారం నిషిద్ధమని హిందూ ఆఫీసర్లు మొత్తుకుంటున్నా వినకుండా బలవంతంగా అదే వండి అందఱికీ తినిపించారట.


ఏమిటీ కుహనా సెక్యులర్ నిరంకుశత్వం మనమీద ? హిందూధర్మం హిందూస్తాన్ లో ఇలా నిషేధానికి గుఱవుతోంది ఎందుచేత ? మన దేవుడి విగ్రహాల్ని మన దేశంలో స్థాపించుకోవడానికి పరాయిమతాలవారి అనుమతి కావాలి. దేవుడి ఊరేగింపులకి మలేషియాలాంటి విదేశీ ప్రభుత్వంలో మాదిరి పోలీసుల అనుమతి తీసుకోవాలి. రంజాన్ ఉపవాసాల కోసం, శుక్రవారం ప్రార్థనల కోసం ఇతరులకి ఉదారంగా అనుమతులిచ్చే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు మన అయ్యప్పల మీద మాత్రం "గెడ్డం పెంచొద్దు, ఆ డ్రెస్ లో రావొద్దు" అంటూ క్రూరంగా జులుమ్ ప్రదర్శిస్తాయి. ఎవరికొచ్చింది స్వాతంత్ర్యం ? మైనారిటీలకి, కుహనా సెక్యులర్ వాదులకి. అంతే ! హిందువులు మాత్రం మఱో స్వాతంత్ర్యపోరాటాన్ని సాగించాల్సిన పరిస్థితిలోనే మిగిలిపోయారు.

కామెంట్‌లు లేవు:

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి