ప్రపంచానికి తండ్రే కాదు, తల్లి కూడా ఉందని చెప్పే ఏకైక మతం హిందూమతం. ఇతర ధర్మాలలో స్త్రీదేవతల్ని పూజించడాన్ని పాషండ సంప్రదాయంగానూ, witchcraft గానూ భావిస్తారు. కానీ మనకి స్త్రీదేవతలందఱూ పరమపురుషుడి భార్యగా అభివర్ణించబడిన జగన్మాత యొక్క అంశలే, అవతారాలే. ఎవఱీ జగన్మాత ? అనడిగితే, ఈ చరాచరవిశ్వమూ, ప్రకృతీ అంతా జగన్మాతే. ఈ ప్రపంచం చైతన్యరహితమైనది కాదు. ఇది మనలాగే ప్రాణం కలిగినది. ఇది చాలా తెలివైనది. అలాంటి ఈ విశ్వమే జగన్మాత. "ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదామ్" అని అభివర్ణించారు లక్ష్మీ అష్టోత్తర శతనామస్తోత్రపు మొట్టమొదటి శ్లోకంలో ఆవిణ్ణి ! సంపదలన్నీ ప్రకృతి (natural resources) నుంచి సంప్రాప్తించాల్సిందే కనుక లక్ష్మీదేవికి గల మొట్టమొదటి నామం ప్రకృతి అని పూర్వీకులు తెలియజేశారు.
అలాంటి ఈ ప్రకృతి యొక్క సత్యస్వరూపాన్ని తెలుసుకోలేక జనం భ్రమలో ఉన్నారు. దాన్ని నిర్జీవంగా భావిస్తున్నారు. అయితే ఎలా భావిస్తే ఆ ఫలితమే వస్తుంది. మన దేహంలో నివసించే బ్యాక్టీరియా, వైరస్సులక్కూడా తామొక చైతన్యస్వరూపమైన మానవదేహంలో ఉన్నామని తెలీదు. మన పరిస్థితీ అదే. ఆమెలోంచే మనమంతా ప్రభవించాం. ఆమెలో భాగంగా జీవిస్తున్నాం. చివఱికి ఆమెలోనే కలిసిపోతాం. ఈ జీవం, ఈ ప్రాణం, ఈ దేహం, దీనిక్కావాల్సిన ఆహారం ఆమెలోంచి ప్రభవించాయి. ఆమె పరమపురుషుడి యొక్క మానసస్వరూపం, ఆయన యొక్క సంకల్పం కావడం వల్ల మనక్కూడా మనస్సునీ, సంకల్పాల్నీ కలిగిస్తున్నది ఆమే. Science and technology ఇత్యాది పేర్లతోనూ, Nuclear energy, Laws of nature, ప్రభృతినామాలతోనూ మనం ఈ కాలంలో అధ్యయనం చేస్తున్నది అమ్మవారినే. అదే సమయంలో అమ్మవారు వీటన్నింటినీ మించినవారు కూడాను. అంటే అమ్మవారికి ఈ శాస్త్రాల రూపంగా కొన్ని నియమాలు (rules) ఉన్నాయి. అయ్యవారికి అవి లేవు. కానీ ఏ విధంగానైతే అయ్యవారిలో దివ్యాంశలూ, రాక్షసాంశలూ రెండూ ఉన్నాయో అలాగే అమ్మవారిలో సైతం అవి అంతే స్థాయిలో ఉన్నాయి.
అమ్మవారు అయ్యవారి మానసస్వరూపం కావడం వల్ల ఆమెకీ, ఆయనకీ అంతర్గతంగా భేదం లేదు. "వారిది భార్యాభర్తల సంబంధం" అని హిందూపురాణాలు వర్ణిస్తున్నప్పటికీ ఈ రెండు మహోన్నత, అత్యున్నత శక్తుల (Supreme powers) మధ్య ఉన్న అసలు సంబంధం ఏంటనేది ఇంకా మనకి అవగాహన కావాల్సి ఉంది. అయితే వారిద్దఱూ ఖచ్చితంగా ఉన్నారనేది మాత్రం హిందూ ఋషులు కొన్నివేలసార్లు ప్రత్యక్షంగా అనుభూతి పొంది దర్శించిన సత్యం. కనుక వారి వాక్యానుసారంగా మనం ఆ సత్యాన్ని నమ్మి ఆ ప్రకారంగా ఉపాసించక తప్పదు.
"పరమపురుషుడి భార్య అయిన జగన్మాతని ఎందుకు ముందు పూజించాలి ? సాధారణంగా భార్యాభర్తల సంబంధంలో భర్తకే అగ్రతాంబూలం కదా ? ఆ రకంగా చూసినప్పుడు ముందు పూజించాల్సింది భర్తనే (పరమపురుషుణ్ణే) కదా ?" అనడిగితే, ఆ దృష్టితో ఈ ఉపదేశాన్ని చూడకూడదని మనవి. అదే విధంగా Female first లాంటి ఆధునిక ఫెమినిస్టు ధోరణిలోంచి కూడా దీన్ని చూడకూడదు. లోకరీతి రివాజుల ననుసరించి పై ప్రశ్న సహేతుకమే. కానీ అదే లోకరీతి ప్రకారం - ఏ బిడ్డడికైనా తండ్రి ఉన్నాడనే సత్యం ముందు తల్లి ద్వారానే తెలుస్తుంది. అంటే "తల్లే సత్యం, తండ్రి అసత్యం’ అని కాదిక్కడ అర్థం. తల్లి అనే పరిభావన (concept) అంతకంటే ఉచ్చతరమైన తండ్రి అనే పరిభావనని (higher concept) జాడమాత్రంగా సూచిస్తూ, ఆయన దగ్గఱికి త్రోవచూపేదే తప్ప దానికదే ఏకైక పరిభావన కాదు. అక్కడితో ఆగిపోయేవారు మూర్ఖులు.
ఇక్కడ మన ఆధ్యాత్మిక జీవనంలో కూడా ప్రకృతే మన చుట్టూ కనిపిస్తున్నది. ఈ ప్రకృతి అనే దృశ్యమానస్వరూపం (visible concept) వెనక ఆమె భర్త అయిన పరమపురుషుడు అనే అదృశ్య సమున్నత స్వరూపం (invisible higher concept) దాగున్నాడు. ఈ ప్రకృతిని అధిగమిస్తే తప్ప ఆ పరమపురుషుణ్ణి చేఱుకోలేం. ఈ ప్రకృతికే మాయాశక్తి అని పేరు. ఎందుకంటే ఈమె భగవంతుడి మాయాశక్తి. ఈ మాయాశక్తి వలన మన జ్ఞానం కప్పబడుతున్నది. అలా కప్పబడడం వల్ల మనం అజ్ఞానులమనీ, అల్పజీవులమనీ, మనకేమీ తెలీదనీ, చేతకాదనీ అనుకుంటున్నాం. ఆ జ్ఞానం తిరిగి వెలికివస్తే మనమే భగవత్ స్వరూపులమనీ, మానవాత్మ పరమాత్మకే చిన్నప్రతిబింబం (miniature) అనీ గ్రహిస్తాం. అలా జ్ఞానం తిరిగి ప్రకాశమానం కావాలంటే ఈ మాయాశక్తి కప్పిన ఆచ్ఛాదనని తొలగించుకోవాలి. మనంతట మనం తొలగించుకోలేం. మనకా శక్తి లేదు. ఏ తల్లి ఈ ఆచ్ఛాదనని మనమీద కప్పిందో ఆవిడే దయదల్చి దీన్ని తొలగించి "అరుగో మీ నాన్నగారు" అని చూపాల్సి ఉంది. అందుకే ముందు ఆవిణ్ణి ప్రసన్నురాలిని చేసుకోవాలనడం.
ఆమె మన యెడ ప్రసన్నురాలైతే మనకి తగిన సద్గురువుని తప్పకుండా చూపించి ఆయన ద్వారా మనకి పరమాత్మదర్శనం చేయిస్తుంది. శ్రీరామకృష్ణపరమహంసగారి జీవితంలో ఇలాగే జఱిగింది. శ్రీ వైష్ణవులు కూడా అందుకే ముందు లక్ష్మీపూజ చేసినాకనే విష్ణుపూజ చేస్తారు.
1, ఫిబ్రవరి 2012, బుధవారం
ముందు అమ్మవారు, తరువాతే అయ్యవారు !
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
శ్రీమాత్రేనమః
కామెంట్‌ను పోస్ట్ చేయండి