30, జనవరి 2012, సోమవారం

పురాతన ఈజిప్టులో శ్రీకృష్ణుణ్ణి కొలిచేవారా ?-4 (సమాప్తం)

మూడో సభ్యుడు :


....గారూ ! మీ పాయింట్ నాకర్థమయింది. కానీ నా పాయింటే మీకర్థం కాలేదు.
మన సంస్కృతి పూర్తిగా బయటినుంచి వచ్చినదని నేనసలు అనలేదు. నేనలా అంటే నాకూ రోమిలా ధాపర్ లాంటి మార్క్సిస్టులకీ తేడా ఉండదు. నేనన్నది - ఈసంస్కృతి లేదా మతం ఒకప్పుడు అంతర్జాతీయ జీవనవిధానం గనుక ఇది ఒకప్పుడు ఒక అంతర్జాతీయ co-operative effort కావచ్చునంటున్నాను. ఈరోజు అనేక నాగరికతల సమాచారం క్రమక్రమంగా వెలుగులోకి వస్తున్నది. దక్షిణ మఱియు మధ్య అమెరికాలలో బయటపడ్డ వాస్తూ, శిల్పాలూ పోల్చిచూసి మాయా, ఇన్కా నాగరికతలు కొంపదీసి హైందవం కాదు గదా ? అనే సందేహానికి పరిశోధకులు లోనవుతున్నారు. న్యూజీలాండ్ లోని మయొరి తెగవారు పూజించే నూకాల్ అనే దేవత పేరుని బట్టి వీరికీ నూకాలమ్మని పూజించే తెలుగువాళ్ళకీ ప్రాచీనకాలంలో ఏమైనా సంబంధం ఉందా ? అని కూడా అనుమానిస్తున్నారు. అలాగే ఆఫ్రికాలో Blacks మాట్లాడే ఒలంగ్ భాష ప్రాచీన తెలుగే కావచ్చునని కూడా సందేహిస్తున్నారు.



అంటే సంస్కృతులూ, నాగరికతలూ తామిప్పుడు ఎక్కడ ఉన్నాయో పూర్వకాలంలో కూడా అదే చిరునామాలోనివసించేవి అని ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పలేం. ఎక్కడో ఇజ్రాయేల్ లో పుట్టిన ఓల్డ్ టెస్టమెంట్ ని జపాన్ లో క్రైస్తవుడు చదువుతాడు. ఒకవేళ భవిష్యత్తులో ఇజ్రాయేల్ లో జనమంతా ఓల్డ్ టెస్టమెంట్ ని మర్చిపోయిన తరువాత కూడా జపాన్ లో దాని పారాయణ కొనసాగుతుంది. ఆ తరువాత "ఓల్డ్ టెస్టమెంట్ కి జన్మస్థానం జపానే" అని జనం అనుకోవడం మొదలు పెడతారు. హిందూమతాన్ని అనుసరించే బాలిద్వీపం (ఇండోనీశియా) లో బ్రహ్మపురాణం తప్ప వేఱే పురాణం తెలీదు. ఇండియాలో బ్రహ్మపురాణం పేరు తెలుసు గానీ దాన్ని చదివేవాళ్ళెవఱూ లేరు. అంతమాత్రాన బ్రహ్మపురాణానికి బాలిద్వీపమే మూలస్థానం అనుకోలేం కదా ?



అందుచేత జనంలాగే సంస్కృతులు కూడా వలసపోతాయి. జనంతో పనిలేకుండా, ఒంటరిగా కూడా వలసపోతాయి. జాతులు సంపూర్ణంగా అంతరించిపోయినాక కూడా వారి సంస్కృతి ఇంకో జాతి ద్వారా కొనసాగించబడుతుంది. సంస్కృతం మాట్లాడిన ఆర్యులు ఈరోజు లేకపోయినా వారి సంస్కృతిని మనం భుజాన వేసుకున్నట్లే. అయితే ఆ ఆర్యులసంస్కృతి కూడా పూర్తిగా వారి స్వామ్యమే కాకపోవచ్చు. వారికి పూర్వం వారి సాంస్కృతిక పితలు వేఱే ఎవఱైనా ఉండి ఉండొచ్చు. అలాగే ఈ జాతి కొనసాగకపోయినా, దీని సంస్కృతిని ఇంకో దేశమేదైనా భుజాన వేసుకుంటుంది.



ఇది ఒకప్పుడు అంతర్జాతీయ జీవనవిధానం గనుకనే ఏ ఇతర దేశాల మతాల్లో గానీ,
సంస్కృతిలో గానీ గోచరించని భావసహిష్ణుత, వాదసహిష్ణుత, విశాలదృక్పథం ఈ మతంలో కనిపిస్తున్నాయని నేను నమ్ముతున్నాను. అలా కాక ఇది ఇతర మతాల్లా మొదట్లో ఒక స్థానిక భూఖండానికి పరిమితమైన నమ్మకం అయితే వాటిలాగే ఇది కూడా పరమ సంకుచితంగా, ద్వేషమయంగా ఉండి ఉండేది.


తొమ్మిదో సభ్యుడు :


నా పరిశోధనలో నాకు మొట్టమొదటి అడ్డంకి సంస్కృతము తెలియకపోవడం. ఆంగ్ల అనువాదాల మీదా, తెలుగు/హిందీ అనువాదాల మీద ఆధారపడటం. ఎవరైనా నా ఈ సమస్యను తీరిస్తే/నేర్పిస్తే నేను మఱింత శొధించగలను. పైగా PIE సిధ్ధాంతం ఎలాగో వాదనలో ఉంది. దీని వలన మఱింత అడ్డంకి.



ఐతే నా పరిశోధనలకి నేను ఎంచుకునే అంశాలు కూడా ఉన్నాయి.



1. జెనెటిక్ స్టడీస్


2. ఆర్కియాలాజికల్ స్టడీస్


3. సాంస్కృతిక పరంపర


4. ఋగ్వేదం లోని ముఖ్యమైన అంశాలు


5. సంస్కృతము (భాష ప్రయుక్త పరిశోధన)


6. భౌగోళిక జ్ఞానం


7. పరంపరాగతంగా వస్తున్న కథలు, చరిత్రలు



మీ పాయింటు నాకు అర్థమయింది. కాకపోతే నేను చెప్పబోయే అంశాలు పై వ్యాసం అంతా రాయకపోతే సరిగ్గా చెప్పలేనేమో అని ఇంత విషయం చెప్పాల్సి వచ్చింది నాకు. మీ పాయింటుకే వస్తున్నాను నా తదుపరి వేగులో.



మీరన్నట్టు అంతర్జాతీయ సహకార యత్నమే అయినప్పటికి దాని వలన ఉపయోగం ఏముంది ? నష్టముందో లేదో నాకు తెలీదు కాని హైందవ సిధ్ధాంతాలని పరిరక్షించుకోవాలంటే, దీని ఆనవాళ్ళు ఇతర చోట్ల ఉన్నాయి అన్న వాదనను తోసిపుచ్చాలి. నేనోసారి ఒక పాకిస్తానీయుడితో సంభాషించాను. మన ఆలయాలపై జరిగిన దాడి గురించిచర్చిస్తున్నప్పుడు అతని సమర్థింపు నాకు నచ్చలేదు కాని అతను చెప్పిన విషయం మాత్రం నాకు నచ్చింది ఎందుకంటే అది అతని తరపు వాదన. అందులో నిజాన్ని నిర్దాక్షిణ్యంగా త్యజించాడు. (నేను అతనిలా కాదు లేండి. మీరన్నట్టు తెఱుపుడు మనసుతోనే అంగీకరిస్తున్నాను పరిశోధిస్తున్నాను). కాబట్టి నేను అటువైపుగా (మీ పాయింటు వైపు) అంత దృష్టి సారించలేదు కాని కొంత హింట్ నా దగ్గఱ ఉంది.



నేను భాష ప్రయుక్త పరిశోధన మీద ఎక్కువ మక్కువ చూపించలేదు. ఎందుకంటే దీని వలన ఎన్నో సమాధానాలు దొరకని సవాళ్ళు వెళ్ళడవుతాయి. వాటన్నికి తర్కం లేని అనుకోలు జోడించాల్సి వస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్పుకుందాం. వేదయుక్తమైన సంస్కృతము ఇప్పుడు చూస్తున్న సంస్కృతం యొక్క పూర్వ రూపం. వేద సంస్కృతము రూపాంతరం చెందిన (క్లాసికల్) సంస్కృతానికి సమకాలీనం కావచ్చు. ఈ మాట అనడానికి ఒక కారణం ఉంది.



పాణిని తన నిర్మాణాత్మక సంస్కృత వ్యాకరణ రచనలో వేదసంస్కృతానికి ప్రత్యేకభాగాన్ని ఏర్పఱిచినారు. వేదంలోని మంత్రాల కొఱకు ప్రత్యేకంగా వేదసంస్కృతాన్ని తయారు జేసినారు. ఈ వేదసంస్కృతానికి ప్రత్యేక వ్యాకరణం ఉంది. ఇది క్లాసికల్ సంస్కృతము కాదు. ఇంతకు మించి నేను భాషాప్రయుక్త పరిశోధన చేయదలచుకోలేదు. ఇష్టమూ లేదు. ఎందుకంటే ఇందులో అనుకోళ్ళు (assumptions) ఎక్కువగా ఉంటాయి. అవన్నీ మళ్ళీ దారి దొఱకని ఇతర వాదనలకి దారి తీస్తున్నాయి. భాష మీద పట్టు లేకపోవడం వలన నేను దీనిని ఆధారం చేసుకుని మిగతా విషయాలు చూస్తున్నాను. సంస్కృతము గుఱించే నేను చేయలేదు. ఐతే ఇప్పుడు దీని గుఱించి కూడా నా పట్టికలో పెట్టుకుంటాను. తా.....గారూ, మీకు ధన్యవాదములు.



మూడో సభ్యుడు :



మీరన్నది నిజమే. భాషాపరిశోధన ఎక్కువభాగం అనిరూపిత అనుకోళ్ళ (unsubstantiated assumptions) మీద ఆధారపడి ఉంటుంది. దాని బదులు మీరాశ్రయించిన జన్యుపరమైన, పురావస్తుపరమైన లేదా సాంస్కృతిక ఆధారాల మీద ఊనుకోవడం ఎక్కువ సమంజసం.



చరిత్రపూర్వయుగంలో మానవజాతికంతటికీ కలిపి ఒకే మతం, ఒకే ఆధికారిక భాష ఉండేవని Eric von Daniken కూడా అన్నాడు. ఆ మతం సనాతన ధర్మమేననీ, ఆ భాష సంస్కృతమేననీ మనం మొదట్నుంచీ చెబుతూ వస్తున్నాం. అవి ఈరోజున ఈ భూమితో, ఈ జనజాతితో ఐడెంటిఫై చేయబడుతున్న మాట వాస్తవం.



తొమ్మిదో సభ్యుడు :



.....గారూ ! మీ ప్రశ్న కి జవాబు చెప్పడానికి కొంచెం జంకుతున్నాను. .....గారు అన్నట్టు ప్రతీసారి పురాణాలని శాస్త్రీయంగా విశ్లేషించి మన ఋషులను బోనెక్కించాల్సిన అవసరం లేదు. "ఎవరన్నా అడిగితే ఏం చెప్తాం ?" అని మీరు అన్నందుకు ఆలోచించి ఈ ప్రత్యుత్తరం ఇస్తున్నాను. పెద్దలు ఎవరైనా నా విశ్లేషణని సవరించండి, తప్పులుంటే.



1. నా ఉద్దేశంలో మత్స్య, కూర్మ, వరాహ, వామన అవతారాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. వామన పురాణం కూడా ఎన్నో వామన అవతారాలను కూడా పేర్కొంది. అందుకే ప్రహ్లాదుడు వామనుడిని దర్శించి పుజించాడని అందులోనే ఉంది.



2. అవతారాల వరుస గుఱించి చెప్పాలంటే, ఇంతకు ముందు గడిచిపోయిన మనువులను కూడా కలుపుకుని భగవంతుడు యే విధంగా సర్వకాల సర్వావస్థలయందూ ఈ భూమి మీద తన కర్తవ్యాన్ని పాలన చేసాడో అని చెప్పడం ఒక కారణం కావచ్చు అందుకే అవి అటు ఇటుగా కనిపిస్తాయి మనకి పురాణాలలో.



3. ఐతే ప్రత్యేకంగా చెప్పబడిన మత్స్య, కూర్మ, వరాహ అవతారాలు మాత్రం cosmic లేదా ప్రకృతి సంబంధిత అవతారాలు కావచ్చు. అవి పెద్ద పెట్టున జఱిగి ఉండచ్చు. ఇప్పుడు నడుస్తున్న శ్వేతవరాహకల్పప్రారంభంలో లేదా గత కల్ప అంత్యప్రళయకాలం నుండి మొదలయి ఉండచ్చు. ఇది నేటి నుంచి కొంచెం పూర్వ దూర కాలపు చరిత్ర గానే పరిగణించాల్సి వస్తుంది. (దీని బట్టి నా వఱకు నా అనుకోలు ఏంటంటే మనం చరిత్రని శ్వేతవరాహకల్పప్రారంభం నుంచి మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి అని స్పష్టమవుతుంది.)



4. శ్వేతవరాహకల్పం అంటే బహుశా మహా యుగచక్ర క్రమగమనం వద్ద జఱిగిన వరాహ అవతారమని కదా స్పష్టమవుతోంది. ఇంకొంచెం హేతుబద్ధ శోధన అవసరం ఇక్కడ.



5. మన ప్రభుత్వ భూమినిర్మాణశాస్త్ర అధ్యయనసంస్థ ప్రకారం హిమాలయాల శిఖరాల పైన సముద్ర సంబంధిత శిలా/జీవధాతువుల అవశేషాలు లభించాయి. నాకనిపించింది ఏంటంటే ఒకప్పుడు మన ఉత్తరప్రాంతమంతా సముద్రగర్భంలో మునిగి ఉండేది, హిమాలయాలు ప్రకృతిసహజంగా పైకెత్తబడక ముందు.



హిమాలయాలు నీటిలో మునిగి ఉన్నప్పుడు మత్య్సావతారము. ఇక్కడ నుండి జలప్రాణులు ఉద్భవించినవి కాబోలు (మత్స్య అనేది అర్ధమైంది) . వందల కోట్ల సంవత్సారల క్రితం ఉత్తర హిమాలయాల దగ్గఱ Tectonic upliftment జరిగిందని అంతర్జాతీయ భౌగోళిక పరిశోధన ధ్రువపఱిచింది. ఇది కూర్మావతారం కావచ్చు. అవి సముద్రగర్భం నుండి పైకెత్తబడినప్పుడు వరాహావతారము అంటే ప్రళయం నుండి తిరిగి భూమి ఉద్భవించి కొత్త కల్పానికి నాంది పలకడం. అందుకే శ్వేతవరాహకల్పే అని కదా సంకల్పం చెప్పుకుంటాం. (ఇంతకీ నా విశ్లేషణ ఈ సంకల్పశ్లోకాలతోనే మొదలయి ఈ విధంగా చెప్పగలిగాను).



తెలియాల్సినవి :



1. కూర్మం అని ఎందుకు?


2. వరాహమని ఎందుకు?



మూడో సభ్యుడు :


కొన్ని అవతారాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవి కావు. అవి కల్పాంతం దాకా
దేవాలయాలలో అర్చామూర్తుల రూపంలో కొనసాగుతాయి. ఆ రకంగా ప్రహ్లాదుడు వామనుణ్ణి దర్శించే సంభావ్యత ఉంది. ఒక అవతారాన్ని ధరించిన దేవుడు ఆ అవతారం ఇంకా భూమ్మీద ఉండగానే వేఱొక అవతారాన్ని కూడా ఏకకాలంలో ధరించే వెసులుబాటు ఉంది. ఉదాహరణకి - పరశురాముడు - అయోధ్యారాముడు. వేదవ్యాసుడు - శ్రీకృష్ణుడు. అలాగే వరాహమూర్తి - వేంకటేశ్వరుడు.


ఏడో సభ్యుడు :



మన ఋషులను బోనెక్కించడమని కాదు , నా ఉద్దేశ్యమేమంటే, చాలామంది అవతారక్రమాన్ని
జీవపరిణామ క్రమంతో పోల్చి చూడటం చేత, "నాకు మత్స్యావతారం (నీటిలో మొదటి జీవం ), కూర్మ (నీరు-భూమి ఉభయచరం ), వరాహ (భూమిపై మొదటి జీవం ), నారసింహ (మనిషి జంతువు ), వామన (పొట్టిమనిషి ), పరశురామ (మనుషుల్లో మృగరూప క్రూరత్వాన్ని ఉన్నవారందఱిని నాశనం చేసినవాడు ), రామ (పరిపూర్ణ మనిషి ), కృష్ణ (మనిషికి సామాజికజీవనంలో ఎలా జీవించాలో మార్గదర్శనం) ఇలా పరిణామక్రియలన్నీ మనవాళ్ళు వివరించారు అని అనిపిస్తోంది.


"అదే సరైన క్రమం" అని చాలామంది నిర్ధారించేసుకుంటున్నారు, దానికి భిన్నంగా ఱేపు ఎవఱైనా కొంత ఆలోచన ఉన్నవాడు, నేను చెప్పిన విషయాన్నే ఉదాహరణగా చూపించి, "ఇదంతా అబద్దం, ఇది బ్రాహ్మణులు చేసిన అతుకుల బొంత" అంటే సమాధానం చెప్పగల ప్రామాణిక పరిశోధన కావాలి అని.


మీరన్న విషయాన్నే తీసుకుందాం,



ఏ కల్పం అయినా వరాహమూర్తి మాత్రమే భూమిని ఉద్ధరిస్తారు,అంటే ప్రతీసారీ ఒక కొత్త వరాహకల్పం మొదలౌతుందా? అన్ని కల్పాలు వరాహ కల్పాలేనా(వామన పురాణం కూడా ఎన్నో వామన అవతారాలను కూడా పేర్కొంది. అందుకే ప్రహ్లాదుడు వామనుడిని దర్శించి పుజించాడని అందులోనే ఉంది. ) ప్రహ్లాదులవారు వామనుడిని దర్శించడంలో తర్కం ఉంది, మానవసంబంధాల ప్రకారం కూడా అది ఒప్పుకోవచ్చు, ప్రహ్లాదుడు, బలికి తాత కాబట్టీ, వామనావతారం బలిని కడతేర్చడానికి వచ్చింది కాబట్టీ.



మఱి ఇదే క్రమంలో ఆలోచిస్తే, మత్స్యం,వరాహ, నారసింహ,కూర్మ, వామన .... ఇలా వస్తుంది వరుస..... అప్పుడు మీరు చెప్పిన వివరణ దీనికి అతకదు.

ఎరిక్ వాన్ డానికెన్ రాసిన Chariots of Gods అనే పుస్తకాన్ని మీరు పరిశీలించినట్లైతే చాలా మతాల్లో ఒకే రకమైన కధలూ , పాత్రలూ కనపడతాయి, ఏ రకమైన సంబంధమూ లేకుండా ఇంతింత దూరాల్లో ఉన్న ప్రదేశాల్లో ఒకే రకమైన గాధలు ప్రచారంలో ఉన్నాయంటే ఆలోచించాల్సిన విషయమే కదా. ఎవఱైనా ధ్యానంలో ఈ విషయాన్ని గమనించగలవారెవఱన్నా ఉంటే ప్రయత్నించి తెలుపగలరు....



తొమ్మిదో సభ్యుడు :



మీరు చెప్పేది డార్విన్ సిధ్ధాంతానికి సరిపోతుంది కాని మన పురాణ చరిత్రకి అతకడం లేదు. మానవులు మంచు యుగానికే ఉన్నారు అంతకు పూర్వం కూడా ఉన్నారు. మంచు యుగం 13 వేల సంవత్సరాల క్రితం అంతరించింది. మళ్ళీ భవిషత్తులో వస్తుంది.



"వామనావతారం పొట్టిమనిషి, పరశురాముడు అడవిజాతి లక్షణాలు, రాముడు పరిపూర్ణమనిషి" అంటే వాళ్ళ సమకాలీనుల్ని ఏ విధంగా విశ్లేషిస్తారు? ఇదొక్కటి కొంచెం చెప్పండి చాలు.



(సమాప్తం)

కామెంట్‌లు లేవు:

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి