8, జనవరి 2012, ఆదివారం

ఇవి హిందూ దేవాలయాలా ? ఇంగ్లీష్ చర్చిలా ?

ఈ రోజుల్లో ఏ హిందూ దేవాలయంలో చూసినా ఇంగ్లీషు రాజ్యమేలుతున్నట్లు కనిపిస్తున్నది. దేవాలయం గుమ్మం దగ్గఱ అడుగుపెడుతూనే Phalaanaa Swamy -Phalaanaa Ammavaarla Devasthaanam అని ఇంగ్లీషులో రాసున్న ఱెక్కమాను కనిపిస్తుంది. లోపలికి వెళ్ళాక Silence, Q (queue), No smoking అని కనిపిస్తాయి. దేవుడికి చేసే సేవల జాబితా ఇంగ్లీషులో రాసి గోడకి తగిలిస్తున్నారు. Ticket Counter అని రాసుండడమే కాక ఆ టిక్కెట్లూ, రశీదులూ, టోకెన్‌లూ అన్నీ ఇంగ్లీషులోనే ఉంటాయి. ఇహ భక్తులకి సంబంధం లేని కార్యాలయ సామగ్రి అయిన దేవాలయ చిట్టాలూ, లెక్కలూ, ఆవర్జాలూ, కవిలెలూ, ఉత్తర ప్రత్యుత్తర వ్యవహారాలూ అన్ని సర్వం సమస్తం ఇంగ్లీషులోనే ! ఇంకా శంకుస్థాపన ఫలకాలూ, దాతల పేర్లు కూడా ఇంగ్లీషులోనే !

ఈ మధ్య గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమంలో ఇంకో వైచిత్రి కూడా గమనించాను. అక్కడ పైన చెప్పిన విధంగా ఫలకాలూ, టిక్కెట్లూ ఉండడమే కాక మంత్రాల్ని ఇంగ్లీషులో ముద్రించిన శాలువాలు కప్పుకొని పూజారులు పూజలు చేయడం గోచరించింది. ఉండబట్టలేక అడిగేశాను : "మీరు హిందూదేవాలయంలో పనిచేస్తూ ఇలా ఇంగ్లీషులో రాసున్న శాలువాలతో పూజలు చేయొచ్చునా ? దీని బదులు జీన్ ప్యాంట్లేసుకొని పూజ చెయొచ్చు గదా ?" అని ! అతని పక్కనున్న కొంచెం పెద్ద పూజారి అందుకొని "భాష ఏదైనా ఆ స్వామినామం ఉంటే చాలని మా ఉద్దేశం" అని సమర్థించుకోబోయాడు. "బావుందండీ ! కానీ సంప్రదాయం సంప్రదాయమే కదా ? నా మనస్సు కలుక్కుమంది అందుకే అడిగాను" అన్నాను నేను. నా నోటిదాకా ఎన్నో మాటలొచ్చాయి. కానీ నేనక్కడికి వెళ్ళిన ప్రయోజనం అక్కడి పూజారులతో వాదించడం కాదు గనుక నోరు మూసుకొని పూజచేయించి బయటపడ్డాను. మంత్రాలయ రాఘవేంద్రస్వామి వారి ఆలయంలో కూడా సర్వేసర్వత్ర ఇదే తంతు. సేవ చేయించిన భక్తులకి స్వామినామాన్ని శ్లోకాన్ని ఇంగ్లీషులో ముద్రించిన సిల్కు శాలువా బహుకరిస్తారు. ఇంగ్లీషు అక్షరాల్లో మఠం పేరు చెక్కిన స్వామివిగ్రహాన్ని ఇస్తారు. ఇక్కడి వైచిత్రి ఇంకో రకంగా ఉంటుంది. భాష విషయంలో ఇంత సంప్రదాయ ఉల్లంఘన చేస్తున్న మంత్రాలయ మఠం వారు ప్యాంటూ, చొక్కా ధరించిన భక్తులకి భోజనం పెట్టరు. పరాయిభాషని ఆప్యాయంగా కౌగలించుకున్నవారు పరాయివేషాన్ని మాత్రం ఎందుకలా కౌగలించుకోలేక పోతున్నారో వారే చెప్పాలి. నా దృష్టిలో ఆ రెండూ మన మతానికి విసర్జనీయాలే.

ఇలా ఉన్నారు మతాచార్యులు, తాము చెడిపోయింది గాక తతిమ్మా హిందువులందఱినీ చెడగొడుతూ ! వీళ్ళని హిందువులు నమ్ముకున్నదొకదానికి. వీళ్ళు ఆచరణలో చేస్తున్నది మాత్రం ఇంకొకటి. వీళ్ళు మధ్వులో, వైష్ణవులో, శైవులో, స్మార్తులో ఎవరైతేనేంటి ? ఏ ఱాయైతేనేం పళ్ళూడగొట్టుకోవడానికి ? మఱి దేవాలయాల్లో క్రైస్తవుల్ని నియమిస్తే మనమెందుకు నెత్తీ నోరూ లబలబా కొట్టుకోవడం, ఇక్కడ పనిచేస్తున్న బ్రాహ్మలే ఇలా క్రమక్రమంగా మానసిక, అనుష్ఠాన క్రైస్తవులుగా మారిపోతున్నప్పుడు ?

నిజమేనా ? భాష ఏదైనా ఆ స్వామినామం ఉంటే చాలా ?

దీన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. మొదట్లో ఈ దేశంలో ఇంగ్లీషువారి సైనికస్థావరాలకే పరిమితమైన ఇంగ్లీషు, వారికి రాజకీయాధికారం దఖలుపడ్డాక కార్యాలయాల్లో ప్రవేశించింది. అటుపిమ్మట పాఠశాలల్లోకి ప్రవేశించింది. పిదప ఇళ్ళలోకి ప్రవేశించింది. ఇప్పుడు సంప్రదాయానికీ, సంస్కృతులకీ కాణాచిగా నిలవాల్సిన దేవాలయాల్ని సైతం సంపూర్ణంగా ఆక్రమించేసింది. ఇక్కడ నేర్చుకోవాల్సిన గుణపాఠం "ఏదీ అక్కడితో ఆగదు" అని ! ఈరోజు ఏ భాషయినా ఏ లిపైనా ఫర్వాలేదంటున్నవారు ఱేపు ఏ దేవుడైనా ఫర్వాలేదంటే ? వాళ్ళు అనేదేంటి ? వాళ్ళ బదులు భక్తులే అనేస్తారు. ఱేపు మంత్రాలు కూడా ఇంగ్లీషులోనే చదివే సంభావ్యతని నేను త్రోసిపుచ్చలేను. అలాగే ఇంగ్లీషు రామాయణాలూ, ఇంగ్లీషు గీతలూ మైకులు పెట్టి మఱీ వినిపిస్తారేమో తెలియదు. ఆ తరువాత వాటి స్థానంలో బైబిల్ వినబడుతుంది. మతానికీ, జాతీయతకీ, సంస్కృతికీ, భాషే ఆయువుపట్టు. భాష మారితే అన్నీ మారిపోతాయనే జ్ఞానం ఈ జాతికెప్పుడు కలుగుతుంది ? ఇంగ్లీషేమైనా భారతీయభాషా ? అదేమైనా మన మతానికి సంస్కృతంలా పవిత్రమైన భాషా ? ఇతరదేశాలవాళ్ళకి మన సంస్కృతిని పరిచయం చేయడం కోసం మాత్రమే ఇంగ్లీషు. మనలో మనకి ఇంగ్లీషు అవసరమా ? మన దేవాలయాల్లో ఇంగ్లీషు అవసరమా ? ఇతరదేశాలతో వ్యవహరించడం కోసం ఇంగ్లీషన్నారు. తలూపాము. సైన్సూ, టెక్నాలజీ ఇంగ్లీషులో ఉన్నాయన్నారు. సరేనన్నాము. కంప్యూటర్లకోసం ఇంగ్లీషన్నారు చేతులెత్తేశాము. ఇప్పుడు దేవాలయాల్లో కర్ణకఠోరంగా ఈ ఇంగ్లీషేంటి ? అది కనీసం మనల్ని ప్రేమగా చూసుకున్నవాళ్ళ భాషైనా కాదు.

మనం ఇలా మన భాషల స్థానంలో అవి ఎక్కడుంటే అక్కడల్లా వాటిని ఎత్తి అవతల పారేసి అతికినా అతక్కపోయినా ఇంగ్లీషుని ప్రతిష్ఠిస్తున్నాం. తద్ద్వారా మనం చరిత్రలో మన ఉనికినీ, మన పూర్వీకుల ఉనికినీ రద్దు చేసిపారేస్తున్నాం. తెల్లవాళ్ళ చేతుల్లో నశించిపోయిన ఎన్నో ఆఫ్రికన్, అమెరికన్ తెగల దారిలో మనం నడుస్తున్నాం, మహోజ్జ్వలమైన చరిత్రా, సంస్కృతీ ఉండీ కూడా ! ఇంతమందిమి ఉండీ మనం ఒక భాషాజాతిగా నిష్కారణంగా అనవసరంగా ఎవరూ మనల్ని చంపకుండానే అంతరించిపోతున్నాం. కాదు, విదేశీ భాషావ్యామోహంతో మనల్ని మనమే అంతం చేసుకుంటున్నాం. ఆత్మహత్య చేసుకుంటున్నాం. ఇలా కొనసాగితే భావితరాలకి మనం దొఱక్కుండా పోతాం. మన పేర్లు, మన పూర్వీకుల పేర్లూ వినిపించవు. మన ఘనతలు కనిపించవు. ఇంగ్లీషే కనిపిస్తుంది. ఇంగ్లండే వినిపిస్తుంది. భవిష్యత్తులో ప్రతిదానికీ మూలాలు తెల్లవాళ్ళలోనే వెతకబడతాయి. ఆంధ్రా తెలియదు. ఆంధ్రుల గొప్పతనం తెలియదు. అసలు మనమంటూ మనుషులం ఉన్నామని కూడా భావితరాలకి ఎఱుక కలిగే అవకాశం లేదు.

ఈ దేశంలోంచి ఇంగ్లీషువాళ్ళని వెళ్ళగొట్టి వాళ్ళదైన ప్రతిదాన్నీ ఆబగా అప్యాయంగా కావిలించుకున్న ఈ మానసిక బానిసల జాతికి స్వాతంత్ర్యం ఎందులోనో, దేనికో నా కర్థం కావడంలేదు. మనకీ కుహనా స్వాతంత్ర్యం లేనిరోజుల్లోనే మనం సరైన మార్గంలో ఉన్నట్లు కనిపిస్తున్నది.

(కలగూరగంప బ్లాగునుంచి)

5 కామెంట్‌లు:

Disp Name చెప్పారు...

మాష్టారు,

భాష కీ చర్చు కీ దేవాలయం కీ సంబంధం ఏంటండీ ! మరీ చోద్యం గా ఉంది మీది !


కాస్త వేడి గా చెప్పాలంటే, చర్చోడు రాకుండా ఉంది వుంటే, ఇప్పటికి దేవాలయాలు వుండేవే కావేమో ! వుండి వుంటే అందులో పెర్షియన్/ఉర్దూ లో లిఖితం సర్వం అయి వుండే వేమో ! ఆలోచించి చూడండి.


ఇప్పటి కీ కాల గతి లో వేదం ఇంకా బతికి బట్టకడు తోందంటే దానికి ఆంగ్లం అనువాద భాష గా వుండటం తోటే నేమో అదీ లేకుంటే ఇది ఎప్పుడో గతం లో కి కలిసి పోయేదేమో !


చీర్స్
జిలేబి(మరీ కారప్పూస ఐపోయిన్దేమిటి చెప్మా జిలేబి ఈ మారు ?)

అజ్ఞాత చెప్పారు...

జిలేబి గారన్నట్లు మతానికి, భాషకి సంబంధం లేదు. దేవాలయం అన్నాక అన్ని భాషల వాళ్ళు వస్తారు. అంచేత, ఆంగ్లం/హిందీ వంటి భాషల్లో రాతలు ఉండటం అసలు తప్పేమీ లేదు. ఆంధ్ర క్రైస్తవులు తెలుగులోనూ, అమెరికన్ ISKCON వాళ్ళు ఆంగ్లంలోనూ మాట్లాడడం లేదా - అది తప్పంటారా?

అజ్ఞాత చెప్పారు...

ఈ పై వ్యాఖ్యలతో ఏకీభవించలేకపోతున్నాను,. చర్చోడు రాకుంటే దేవాలయాలు ఉండేవి క్కావేమో అనే వ్యాఖ్యలో ఎంత మతిహీనమో అది వ్రాసినవారికి తెలీకపోవచ్చు. అంతకుముందున్న దేవాలయాల్ని కూలగొట్టే కదా గోవాలోనూ, మద్రాసులోనూ చర్చిలు కట్టారు. తెల్లవాడొచ్చి హిందూమతాన్ని కాపాడినట్లు బిల్డప్ ఇస్తారేంటి ? హిందువులుగా ఉన్న ఈశాన్యరాష్ట్రాలవారిని క్రైస్తవులుగా మార్చి అక్కడ హిందుమతాన్ని నాశనం చేసింది తెల్లవాళ్ళు కారూ ?

వేదం బతికి బట్టకట్టడానికి కారణం తెల్లవాళ్ళా ? ఎంత పచ్చి అబద్ధాలు ? ఎవరు చెప్పారండి బాబూ మీకు ? కల్లిబొల్లి కలికాలమనిపించారు చివఱికి. తరతరాలుగా వేదాల్ని కంఠస్థం చేసి కాపాడుతూ వచ్చిన ఇక్కడి కోట్లాది బ్రాహ్మణులు ఏమయ్యారు ? వాళ్ళందరినీ తీసిపారేసి తెల్లవాడికి కట్టబెడుతున్నారు క్రెడిట్టంతా ? వారు (మాధవాచార్యుడు, మధ్వాచార్యుడు మొదలైనవారు) వేదాలకు వ్రాసిన వ్యాఖ్యానాల సంగతేంటి ? తెల్లవాడు వాస్తవంగా చేసింది - వేదాలకి వక్రభాష్యాలు చెప్పి మన చరిత్రని భ్రష్టుపట్టించడం. ఆ రకంగా మనకి వేదాలంటే అసహ్యం పుట్టించి మనల్ని క్రైస్తవులుగా మార్చాలనుకోవడం

మతానికీ భాషకీ సంబంధం లేదా ? ఎందుకు లేదు బాబూ ? లేదంటే మరి రేపట్నుంచి అరబ్బీలో మంత్రాలు చదవండి. దాన్ని ఏ మతమంటారో తెలుస్తుంది. భాష మారితే మతం మారుతుంది. అల్లా అన్నవాణ్ణి ముస్లిమ్ అంటున్నాం. వెంకటేశ్వరా అన్నవాణ్ణి హిందువంటున్నాం. భాష మారితే దేవుడే మారిపోతున్నాడు గమనించారా ?

హిందూదేవాలయాల్లో గొడ్డుమాంసం తినే మ్లేచ్ఛుల భాష ఉండకూడదు. వాళ్ళ దేశాలలో వాళ్ళకి మన మతం గురించి చెప్పడానికి దాన్ని ఉపయోగించవచ్చు. అంతవరకే దాని పరిధి.

PALERU చెప్పారు...

అజ్ఞాత అన్నాయ్ లు .....

మీ మీద మీకు నమ్మకం, మీరు చెప్పేది నిజం అయినప్పుడు దాక్కోవలిసిన పనిలేదు, మన పేరు దాచుకొని అజ్ఞాత నిపించుకోవడం మీకు అవమానం గా అనిపించటం లేదా....సరేలెండి " మొదటి అజ్ఞాత గారు" మీతో నేను వందశాతం ఏకీభవిస్తున్నాను...ఎందుకంటే ఉదాహరణకు ఒక తెల్ల వాడికి " సనాతన ధర్మం " నచ్చింది అనుకుందాం మరి వాడు ధర్మాలు ఆచారాలు తెలుసు కోవాలి అంటే మన వేదాలు ఆంగ్లం లో ఉండాల్సిందే కదా...వాడు తెలుగు నేర్చుకొని గుడికి వెళ్ళడం వేదాలు నేర్చుకోవడానికి సంస్కృత స్కూలు కి వెళ్ళడం సాధ్యం కాదు కదా....వెల్ ...

రెండో అజ్ఞాతా అన్నాయ్ ...మీరు కొంచెం కోపం లో ఉన్నట్టు ఉన్నారు , చరిత్ర చదివి కొట్టుకోవడం కంటే ప్రస్తుత కాల పరిస్థితులకనుగుణం గా ఉండటం ,నేర్చుకోవాడం మంచిది అని నా అభిప్రాయం, ..అల్లః అన్నా , పరమేశ్వరుడు అన్నా, దేవుడు అన్నా , గాడ్ అన్నా...వొకే భావం మాస్టారు , అది దేవుని నామానికి సర్వనామం....అరబ్ క్రిష్టియనులు అరబ్బిలోనే ప్రధాన చేస్తారు , చైనా యూదులు చైనీస్ లోనే ప్రార్ధిస్తారు, ఏదేమైనా...ఇలాంటి సున్నిత విషయాలలో మౌనంగా ఉండటం మంచి పధ్ధతి, బ్లాగ్ ఓనరు గారికి ఒక విషయం నచలేదు అది తన బ్లాగ్ లో రాసుకున్నారు, అయితే ఏకిభవించటమా లేక సరైనా కారణాలతో ( జిలేబి గారి లాగా) వివరనాత్మకం గా విభేదిన్చడమా చెయ్యాలి..ద్వేషించడం మంచి పద్దతి కాదేమో...ఆలోచించండి మహాశయా....

Unknown చెప్పారు...

Bhaashakee bhavvaaniki sambandham khacchitamgaa undi theeruthundi. Kaanee pellaam baavundani thallini marchipovatam thappu. English lo matlaadithey goppa aney bhavam ghanatha vahinchina TTDpandithulaki kooda alavatugaa maarindi.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి