23, జనవరి 2012, సోమవారం

పురాతన ఈజిప్టులో శ్రీకృష్ణుణ్ణి కొలిచేవారా ?-2

పుణ్యభూమి గూగుల్ గుంపులో టపా అయిన ఒక చర్చాహారం (Thread)


మూడో సభ్యుడు :

తమ సాహిత్యంలో బ్రిటీషువాళ్ళు ఈ ఉపఖండాన్ని ఒక దేశంగా వర్ణిస్తూనే వచ్చారు మొదట్నుంచీ ! వాళ్ళని ఆ విషయంలో తప్పుపట్టకూడదు. ఇది రాజకీయంగా ఒక దేశం కాదని వాళ్ళు ఎక్కడైనా వ్రాస్తే బహుశా అది అబద్ధం కాదు. ఉన్న వాస్తవం అదే అనిపిస్తుంది. భారతం ఒక రాజకీయ స్వరూపంగా ఎప్పుడూ లేదని,కొనసాగలేదనీ మనకీ తెలుసు. మనకి నానారాజ్యాలు, రాజులూ ఉన్నారు మొదట్నుంచీ ! సమ్రాట్టులు కూడా ఉన్నారు కానీ ఆ చక్రవర్తిత్వం దేశభావనతో కాక వ్యక్తిగత పరాక్రమాన్ని ప్రకటించుకోవడం కోసం చేసిన దండయాత్రల ఫలితమే. ఆక్రమణల్ని జాతిని ఏకం చేయడంగా అభివర్ణించడం కూడా ఒక ఆధునిక ధోరణి. అవి ఆక్రమణలు కాకపోతే, నిజంగా జాతీయభావనే అయితే ఓడిపోయిన రాజ్యం గెలిచిన రాజ్యానికి కప్పం కట్టే అవసరం రాదు కదా !


ఇండియా సాంస్కృతికంగా కూడా ఒక దేశం కాదు ఇప్పటికీ ! అనేక భాషలు గల ఈ ఉపఖండం ఆచరణలో అనేక ప్రాచీన దేశాల సమూహం. ఈ దేశాల్ని ఈ రోజు రాష్ట్రాలంటున్నారు. అంతే తేడా ! పైన చెప్పిన "ఉత్తరం యత్...." ఇత్యాది శ్లోకం ఋగ్వేదంలో నాకు కనిపించలేదు. అయితే ఇది కూడా భౌగోళిక వర్ణనే తప్ప జాతీయవాదంలా అనిపించడం లేదు.



తొమ్మిదో సభ్యుడు :



చరిత్రకందని కాలంలో మానవ వలసలు ఎలా జరిగేవి అని ఉదహరించేందుకు ఈ క్రింది లంకె ఉపయుక్తంగా ఉంటుంది. దీని ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. లక్ష సంవత్సరాల క్రిందట జరిగిన వలసలు. అప్పుడు భౌగోళిక స్వరూపం కూడా వేరుగా ఉండేది. ఈ లంకెలో (ఇప్పుడున్నట్టుగా కాదు) ఉన్నట్టు కాదు.


http://www.bradshawfoundation.com/journey/



మూడో సభ్యుడు :



చూశాను. బావుంది. వారికి లభ్యమైన సమాచారం పరిధిలో వారు తెలియజేస్తున్నారు. కానీ మానవజాతి అంతా ఒకే ప్రదేశంలో పుట్టి, ఒక్కజాతినుంచే పరిణామం చెందిందా ? అందఱు మానవుల పూర్వీకులూ ఒకఱేనా ? అనేది అనుమానాస్పదం. "అందఱూ మొదట నల్ల ఆఫ్రికన్లే" అంటే నా మటుకు నేను అంగీకరించలేను. అందుకు విరుద్ధంగా - ఇతరులే ఆఫ్రికాకి వెళ్ళి అక్కడ నల్లజాతులుగా మారారంటే ఎక్కువ నమ్మబుద్ధేస్తుంది. ఎందుకంటే ఎంత చిన్న జన్యుమార్పుకైనా కనీసం లక్షసంవత్సరాల వ్యవధి కావాలని వాళ్లే అంటున్నారు. అలాంటిది, మానవజాతులు పరస్పరం పోలిక లేని విధంగా రూపాల్ని సంతరించుకోవడానికి ఎన్ని మిలియన్ల సంవత్సరాలు పట్టుతుందో ఊహించండి. కానీ కొన్నివేల సంవత్సరాల వ్యవధిలోనే వివిధజాతులుగా మారిపోయారని చూపిస్తున్నారు. ఇది అవకతవకగా ఉంది. ఇది ఇప్పటికీ శాస్త్రవేత్తల ఊహే తప్ప ఇందుకు బలమైన రుజువులు లేవు. నా అభిప్రాయంలో అయిదాఱు మానవజాతులు ఉండి ఉండాలి మొదట్నుంచీ ! వాళ్ళ నుంచే అన్నిదేశాలవారూ ప్రభవించి ఉంటారు.


చరిత్ర అనేది పాశ్చాత్యులనుకుంటున్నదానికంటే ప్రాచీనమైనది. మనం నాగరికతకు పరాకాష్ఠ కాము. నాగరికతల్ని మనుషులుగా ఉత్ప్రేక్షిస్తే, అనేక నాగరికతల తరాల్లో మనదొకటి. ఈ నాగరికతాక్రమానికంటే ముందు అనేక నాగరికతాక్రమాలు నడిచి తరువాత అంతరించి మానవజాతి మళ్ళీ అంతా మొదట్నుంచీ మొదలుపెట్టుకుంటూ వచ్చింది. రేఖేయవాదులు కనుక పాశ్చాత్యులీ విషయాన్ని ఒప్పుకోరు. కానీ von Daniken లాంటివారి పరిశోధనలు మన అభిప్రాయాన్నే ధ్రువీకరిస్తున్నాయి.



తొమ్మిదో సభ్యుడు :



పై లంకె కొంత వరకు మనకి ఉపయోగపడుతుంది. ఐతే అందరు ఆఫ్రికా నుండే వచ్చారా అంటే కాదు అనే చెప్పాలి. వేల సంవత్సారాల క్రితం విపరీతంగ వలసలు జరిగేవి అనడానికి గట్టి సాక్ష్యాలే ఉన్నాయి. అప్పటికి భారత ఉపఖండం ఆఫ్రికాకి దగ్గరగా ఉండేది. దాదాపు ఎనభై వేల సంవత్సారాల క్రితం "లెమూరియా" కూడా సముద్రమట్టం కంటే ఎత్తులోనే ఉండేది.


మీ మేయిల్ కి సమాధానం చెప్పాలని ప్రయత్నిస్తున్నాను కాని నా చర్చలన్ని గతంలో ఆంగ్లంలో విరివిగా జరిగాయి. పరిశోధనంతా ఆంగ్లంలోనే పొందుపర్చుకున్నాను. నా చర్చలకి కొంత మంది రషియన్ల సమాచారం, హిందువులుగా మారిన పాశ్చాత్యుల రచనలు, సనాతన ధార్మికులు ఎంతో మంది తోడ్పడ్డారు. ఇప్పుడు దానిని అర్థవంతంగా తెలుగులో తర్జుమా చేయాలంటే సమయం పడుతుంది అందుకే వెంట వెంటనే మీకు చెప్పలేకపోతున్నాను పూర్తి సమాచారాన్ని.



ఇవే కాకుండా, ఫ్రాలే, ఎల్ట్‌స్, కజానస్, డనినో, భారత ఇతిహాస పురాణాలు, ప్రాచీన ప్రాంతీయ వ్రాతలు అనగా సంగం మాన్యుస్క్రిప్ట్స్, శాస్త్రీయ పరిశొధనల సమాచారం మరియు *జెనెటిక్ స్టడీస్ *ని నేను ఎక్కువగా పరిశీనలకు తీసుకుంటున్నాను.



1. మిగతా దేశాలతో లాగానే ఈజిప్టుకి ఆర్యులకీ మధ్య వర్తకం బాగా జరిగేది. అశోకుని కాలంలో బౌద్ధం ఎలా వ్యాపించిందో అలానే రామాయణకాలం నుండే ఆర్యులైన మునివర్యులు దేశసంచారం చేసి వేదవిజ్ఞానాన్ని నలుమూలలకూ చేరవేసేవారు. ఆ విధంగా వేదం వ్యాపించింది.



2. రామాయణ కాలానికి పూర్వపు సంగతులను కాకుండా ప్రస్తుతానికి రామాయాణ కాలంతోనే చర్చని కొనసాగిద్దాము. రాముని కాలంలో ఈ ఆర్యావర్త దేశం నుండి ఎంతో మందిని తమ ఆర్యుల/ వేద జీవన విధానాన్ని అనుసరించే వీలు లేకుండా బహిష్కరించడం జరిగింది. ఈ విషయం గతంలో బహుశా పోయిన సంవత్సరం అనుకుంటా బ్రిటిషర్ల గురించి చెప్తూ మీరు కూడా అన్నారు. వాళ్ళు తరలిన ప్రదేశాలలో ఈజిప్ట్ ఒకటి.


3. సముద్ర మార్గాం గుండా వర్తకులు ప్రయాణించి ఆయా దేశాలలో వర్తకం సాగించినప్పుడు ఎంతో మంది తిరిగి రాకపోవడం కూడా జరిగేది. మనుస్మృతిలో పునర్వివాహానికి ఇచ్చిన సౌలభ్యాలలో ఈ విషయం వెల్లడించడం జరిగింది. (క్లుప్తంగా ఉంచడానికి నేను చాప్టర్స్, శ్లోకాలు ఇక్కడ తెలుపడం లేదు. మన్నించండి).


4. కనుక వేద విజ్ఞానం ఈ ఆర్యావర్తం నుంచే ప్రపంచమంతా వ్యాపించిందని చెప్పచ్చుకనుకనే కృష్ణుని కాలానికంటే ముందే అక్కడ విష్ణు-ఆరాధన జరిగేది.


5. ముందు ద్వారక, తర్వాత సరస్వతీ నాగరికత ఆయా నదీ, సముద్ర తీరాలలో అంతరించినప్పుడు, అక్కడి ప్రజలంతా గుంపులుగా తరలి వెళ్ళారన్నది నిర్వివాదాంశం. కొంత జనాభా తిరిగి సరస్వతి నది తీరానికి తిరిగి వెళితే, కొంత మంది దక్షిణదిశగా వింధ్యపర్వతం దాటి, దండకారణ్యం అడవి గుండా ప్రయాణించి దక్షిణ ఆర్యావర్తానికి చేరుకున్నారు. అలాగే తదనంతరం జరిగిన పరిణామాలకు ఈజిప్ట్, అరేబియా, ఇరాన్, గ్రీస్, ఇంకా తూర్పుదిశగా కూడా ప్రయాణించారు. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే అప్పటి జాతికి నది తీరాల వెంబడి నాగరికత చోటు చేసుకోవడం, నివాసాలు ఏర్పర్చుకోవడం, వృత్తి వ్యాపారాలు జీవనం సాగించుకోవడం జరిగేదని ప్రస్పుటంగా తెలుస్తోంది కనుక నదుల వైపు, నీటి చెలమల వైపు, జీవన విధానానికి అవసరమైన భూ, భౌగోళిక వసతులను వెతుక్కుని వెళ్ళేవారు.



మీరు మొదట ప్రస్తావించిన విషయాల మీద నా దగ్గర కొన్ని నోషన్స్ ఉన్నాయి. ఐతే వాటిని ఇంకా విస్తారంగా అధ్యయనం చేశాక ఇక్కడ వివరిస్తాను వీలయినంత వఱకు.



12,000 సంవత్సరాల నాటివైన ఈజిప్షియన్ గీజా పిరమిడ్స్ కట్టినది
.....



ఈ అంశం కొట్టిపారేయలేనిది. ఐతే జీసస్ కూడా మన ఆర్యావర్తదేశానికి వచ్చి ఇక్కడి వేదవిద్యని, తాత్వికజ్ఞానాన్ని ఆర్జించి తిరిగి తన దేశానికి వెళ్ళాడని మనకి తెలుసు.



ఇహపోతే మీరన్న పురాణాల విషయం...



పురాణాలంటే ప్రాచీన చారిత్రిక కథలు లేదా విశ్వంలో జరిగిన యధార్థ కథ అనే కదా మనం భావిస్తాం. హిందువు, హిందూమతం అనే శబ్దాలు పెర్షియన్ల దాడులకు, ఆక్రమణలకు పూర్వం లేదని నేను భావిస్తున్నాను. నా స్నేహితులు పంపిన ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. అసందర్భమే కాని గ్రిప్పింగ్గా ఉందనీ, మీలో ఎవరికైనా నచ్చుతుందని ఇస్తున్నాను. ముందు ముందు కొన్ని విషయాల చర్చలు ఈ లంకెతో సరిపెట్టవచ్చు అని.



http://www.thedailybell.com/1612/Jeffrey-Armstrong-on-the-Mysteries-o...



పదివేల సంవత్సరాల పూర్వం వేదాలే అన్నింటికి మూలం. ఏదైనా ఇక్కడ నుండే వ్యాపించింది కాని బయట నుండి భరతవర్షానికి వచ్చినది కాదు. ఆసేతు హిమాచలం నుండి కన్యాకుమారి కొన వరకు మొత్తం ఒకే దేశంగా, భరత వర్షంగా, ఒకే ఆర్యావర్తంగా విలసిల్లింది. ఒకే సంస్కృతిని పాటించింది. ఒకే సాదృశ్యం కలిగి ఉంది. కనుక వేద ప్రమాణ పరంపర, పరబ్రహ్మ ఆరాధన ఈ భూమండలం మొత్తం ఉండేది కాకపోతే వివిధ పద్దతుల్లో అని భావించవచ్చు. ఇందులో ఎటువంటి సందేహాలకి తావు లేదు. ఎందుకంటే ప్రపంచపు నలుమూలలా నాలుగు వేల సంవత్సరాల పుర్వపు తవ్వకాలలో ఆర్యుల వేదగతులే గోచరిస్తున్నాయి. అన్య రీతులు ఇంత వరకు కానరాలేదు. ఈజిప్ట్ విషయంలో కూడా అదే జరిగింది. 12 వేల సంవత్సారా పుర్వం గీజా పిరమిడ్లు విషయాలు వెలికి తీయాలంటే అంతకు ముందు కాలం నాటి విషయాలు మన దేశం లో వెలుగు చూడాలి.



మీరు ఈ మతం ఇండియా కి మాత్రమే సంబంధించినది కాకపోవచ్చు అని అంటున్నారు. అయితే ఈ సువిశాల భూగోళమంతా వివిధ ద్వీపాలలో వివిధ వర్షాలలో (దేశాలలో) ఇదే సంస్కృతిని ఇదే ధర్మాన్ని అవలంబించారు. ఈ సనాతన ధర్మ అనుసరణలు ఇక్కడి నుండే వెళ్ళాయి అనడానికి చారిత్రిక ఆధారాలు ప్రాచీన తవ్వకాలలో, పురావస్తు పరిశోధనలో చాలా కాలం క్రితమే తేలాయి. మహా అయితే క్రీ.పూ. ఆరు వేల సంవత్సరాల కంటే ముందుకి జరగలేదు. అంతకంటే ఎన్నో సంవత్శరాల ముందు నుంచే ఈ భరత ఖండం మీద ఈ సనాతన ధర్మం అవలంబించారు అనడానికి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. దీని బట్టి ఈ మతం ఇక్కడ నుంచే వివిధ దేశాలకి పాకింది అని ప్రస్పుటమవుతుంది. వివిధ దేశాల నుంచి విజ్ఞులు ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. ఈ మతాభివృధ్ధి చేసి ఉండవచ్చు అంత మాత్రానా ఈ ధర్మం ఇక్కడిది కాకుండా పోదు.

"


కొన్ని ఒరిజినల్ అంశాల్ని ఇక్కడివాళ్ళు జోడించారు. మఱికొన్ని బయటినుంచి వచ్చాయి. వెఱసి హిందూమతం అంటున్నాం." అని మీరంటున్నారు.


దీనికి సమాధానంగా ఈ క్రింది లంకె చూడగలరు.


http://downwithjugears.blogspot.com/2008/02/aryan-ancestors-on-silk-r...



చివరిగా ఒకసారి వాల్మీకి రామాయణం తలుచుకుంటే ఇంకొన్ని విషయాలు తేటతెల్లమవుతాయి. ఇక్ష్వాకు వంశంలో 19వ తరం అయిన అసిత పాలనలోనే విరోధాలు చెలరేగాయి అప్పటి వరకు క్షామం కాని, యుద్ధ కాంక్షలు కాని ప్రతికూల పరిస్తితులు కాని లేవు. కనుక అసితుని తండ్రి అయిన భరతుని పాలన వరకు ఒకే నేల ఒకే రాజ్యం ఒకే సంస్కృతిగా విలసిల్లిన భారతం అసితుని పాలన నుండి విచ్చిన్నం కావడం మొదలయింది. అలా విచ్చిన్నం అయిన వాటిని/వారిని వాల్మీకి మ్లేచ్చుల క్రింద చెప్పడం జరిగింది.



మూడో సభ్యుడు :



.... గారూ ! మీరిచ్చిన సమాచారం చాలా బావుంది. శ్రమ తీసుకుని మీరీ గుంపులో టపా చేశారు. మీ నుండి కొత్తవిషయాలెన్నో తెలుసుకున్నాను. నెనర్లు. కానీ ఒకటి-రెండు మౌలిక ప్రశ్నలు మాత్రం అలాగే మిగిలిపోయాయి. ఇంకా తెఱుపుడు మనస్సు (open mind) తో ఆలోచిద్దాం. గతాన్ని త్రవ్వుకోవడం కనుక ఇది ఇప్పట్లో తేలేది కాదేమో.



నన్నొక మొండిమనిషిగా, పిడివాది (dogmatist) గా భావించకపోతే నా హృదయాన్ని నిజాయితీగా మీ ముందు పఱుస్తాను.



మన పౌరాణిక నామాలు కొన్నింటిని గమనిస్తే అవి యౌగిక శబ్దాలు (Derived structures). ధాతువులు (root-words) కావు. అంటే సారవంతమైన అర్థం ఉండేలా సమాస-సంధి-ప్రత్యయ సంఘటిత రూపాల్లో నిర్మించబడినవి. ఆ నిర్మాణాన్ని బట్టి కొన్నిసార్లు అవి ఏదో ఒక (నశించిపోయిన విదేశీ) ధాతుపదానికి అనువాదాల్లా అనిపిస్తాయి. ఈ ప్రాతిపదిక మీద నాకు మొదట్నుంచీ ఉన్న ఒక అనుమానం ఏమంటే - ఈ పురాణకథల్లో కొన్ని ఇతర జాతులకి చెందినవనీ, పూర్తిగా భారతదేశానికి చెందినవి కాకపోవచ్చుననీ ! కానీ అవి ఇక్కడ భద్రపఱచబడ్డాయనుకుంటా. మిహతాచోట్ల అంతరించిపోయి ఉండొచ్చు.



సంస్కృత వ్యాకరణాన్ని చదివిన తరువాత నాకు కలిగిన ఇంకో సందేహమేంటంటే - ఈ భాషకి (ఖచ్చితంగా రోమన్ కాదు గానీ) రోమన్ లిపిలాంటిదే ఒక అక్షర ధ్వనిలిపి (అచ్చులూ, హల్లులూ పక్కపక్కన వ్రాసుకుంటూ వెళ్ళే లిపి) ఒకప్పుడు - అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం - ఉండేదనిపిస్తుంది. ఇప్పటిలా దేవనాగరిలాంటి Complex script వాడేవారు కారని నా అనుమానం. లిపి భాషనీ, దాని ఉచ్చారణనీ, వ్యాకరణాన్నీ ప్రభావితం చేస్తుందనే సత్యాన్ని ఆధారంగా చేసుకొని నేనిలా అనుమానిస్తున్నాను.



నమోదు కాని చరిత్రపూర్వయుగంలో వివిధదేశాల మధ్య భావవినిమయం (exchange of ideas) జఱిగి ఉంటుందని అంగీకరిస్తే అది మన స్వకీయత (originality) కి భంగం అవ్వదని నేను భావిస్తున్నాను.



(ఇంకా ఉంది)

కామెంట్‌లు లేవు:

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి