24, జనవరి 2012, మంగళవారం

భారతీయిజం

బుద్ధి బలం గల బ్రాహ్మణిజం ఒక ఆధ్యాత్మిక మార్గం. అది మన పురాణాలు, ఉపనిషత్తులు, వేదాల ద్వారా కుల, వర్ణ రహిత జ్ఞానానికి పెద్దపీట వేసి మానవ సమాజాన్ని కర్మబద్ధంగా నడిపిస్తోంది. కాలాంతరంలో కండబలం తోడయి జ్ఞానదీపం కొడిగట్టి మసకబారుతూ అజ్ఞానంలోకి జారిపోతోంది. నిష్ప్రయోజనంగా మారింది. అందుకే బుద్ధి బలం, కండబలం సమాంతరంగా దేని పని అది చేసుకుపోవాలే తప్ప బుద్ధిబలాన్ని కండబలం శాసించడం మానవ జాతి నాశనానికి దోహదమవుతోంది.


మొదట బుద్ధిబలానికే పెద్ద పీట. ఆలోచన నుండే ఆచరణ సాధ్యం. ఆలోచనే కార్యరంగానికి మూలం. శాస్త్రం ఆలోచన ఎప్పుడూ లోక కల్యాణానికే దోహదపడుతుంది. అదే మన భారతీయ శాస్త్రాలకున్న ఇజం. ఆ దిశలోనే ఆచరణ కూడా కొనసాగాలి. మతాలు మానవ మనుగడకే కాని మారణ హోమానికి కాదు. హిందూమతం లేదా సంస్కృతి ఎల్లప్పుడూ మంచి, చెడులను విశ్లేషించి మంచిని ఆశ్రయించి కొనసాగించమని బోధిస్తోంది. నిర్గుణోపాసననే అంతిమ లక్ష్యంగా చేసుకొన్న హిందూ ఆధ్యాత్మికత సగుణోపాసనతో అభ్యసించి తన గమ్యాన్ని చేరుకుంటుంది.

తనకు కనపడే బుద్ధిజీవి మానవుడు కాబట్టి సగుణోపాసనలో దైవానికి కూడా మానవరూపాన్ని ఆపాదించి ముఖానికంటే పాదాలకే అధిక ప్రాధాన్యత నిచ్చి, శ్రీ చరణాలను ఆశ్రయించి మోక్షాన్ని ఇవ్వమని వేడుకుంటోంది. శాస్త్రాలను నిషేధిస్తే ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం ఏర్పడదు. అసలు ఆధ్యాత్మికత అనే పదానికి ప్రజాస్వామ్యం, నిరంకుశత్వం అనే పదాలు జోడించడమే అవివేకం. మన సంస్కృతిలో ఆధ్యాత్మికత అనేది ఒక అనిర్వచనీయమైన భావన. తనని తాను మరిచిపోయి పరమాత్మలో లీనమవడమే ఆధ్యాత్మికత. సకల సృష్టినీ సమభావంతో చూడడమే ఆధ్యాత్మికత.

శాస్త్రాలు ఎప్పుడూ ఖచ్చితత్వాన్ని పాటిస్తాయి. కాలానుగుణంగా మనం ఉపయోగించుకోవాలి తప్ప అసూయ, అహంకారంతో విమర్శించి మరింత అజ్ఞానంలోకి పడిపోకూడదు. హిందూమతమంటేనే వేదాలు, శాస్త్రాలు, పురాణాలు. ప్రస్తుతం మనమనుకొంటున్న సైన్సుకు మూలం మన వేదాలే అనే విషయాన్ని తెలుసుకోనంత కాలం మనం అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతుంటాం.

ఖగోళం, అంతరిక్షం, శక్తి, ప్రాణం, ప్రయాణం అనే బీజభావాలకు నాంది వేదాలే కదా! మాతృప్రేమలో మలినం ఉండదు. బిడ్డ ప్రేమలో మలినం ఉండొచ్చు. వేదాలు తల్లిలాంటివి. మానవుడే మాతృహింసకు పాల్పడి రాక్షసునిగా మారుతున్నాడు. మాతృప్రేమలోని మాధుర్యాన్ని ఆస్వాదించడం తెలియకున్నాడు. ఇంద్రియం నుండి మానవజాతి జనించింది కాని అవయవాల నుండి కాదు. వేదాలు, భగవద్గీతలో కులాల గురించి ప్రస్తావించలేదు. నాల్గవ అధ్యాయం జ్ఞాన యోగంలో

చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః |
తస్యకర్తార మపి మాం విద్ధ్య కర్తార మవ్యయమ్ ||

అని కృష్ణభగవానుడు వివరించాడు. మానవులలో స్వాభావికంగా ఉండే ప్రకృతి గుణముల నుండి పుట్టే కర్మల ననుసరించి మానవజాతిని నాలుగు వర్ణ విభాగాలుగా పేర్కొన్నాడు తప్ప పుట్టుక నుండే కులము, వర్ణము ఏర్పడతాయని కాదు. మానవుడు ప్రకృతిలో ఒక భాగం. తమ గుణాలను తద్వారా కర్మలను సంస్కరించుకొంటూ భగవానుడు పేర్కొన్న చాతుర్వర్ణాలతో స్వేచ్ఛగా ప్రవేశించవచ్చు, నిష్క్రమించవచ్చు. ప్రకృతిని ఆరాధించిన బుద్ధి వశం చేసుకొనే దశకు చేరింది.

ఈ పరిణామ క్రమంలో వర్ణాశ్రమ ధర్మాలను విడనాడి కులమతాల ఉచ్చులో బిగుసుకుంటున్నాము. పాలకుల చట్టాలు కూడా మరింత విభేదాలు, అంతరాలను ప్రోత్సహించేవిగా ఉండడం మన దురదృష్టం. సమాజ సంస్కరణ వాదులు ముందు కులమతాల ప్రాతిపదికన ఉన్న, వస్తూన్న చట్టాలను ప్రతిఘటించి సమాజ స్థాపనకు కృషిచేయాల్సిన తక్షణ అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే మన సంస్కృతి బోధించిన వసుధైక కుటుంబ భావన నెరవేరుతుంది. అంతే తప్ప సంకుచిత దృష్టితో, ద్వంద్వ భావాలతో రంధ్రాన్వేషణలు చేసినంతకాలం అరాచకం తాండవిస్తూనే ఉంటుంది.

- వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు

నేటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో...

కామెంట్‌లు లేవు:

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి