4, జనవరి 2012, బుధవారం

హోటళ్ళ సంస్కృతికి ప్రత్యామ్నాయం అవసరం

హైదరాబాదులో ఆదివారం రోజున బయటికి రావాలంటే భయం. మిహతా వారాల్లో కంటే ఆదివారం పూట వాహనాల రద్దీ జాస్తి. రోడ్డు మీద మనల్ని పద్మవ్యూహం లా చుట్టుముట్టే ప్రతివాహనం మీదా ముందుసీట్లో ఒక మగవాడు, వెనకసీట్లో మహిళ(లు). ఇది ఆ రోజు సర్వసాధారణంగా కానవచ్చే దృశ్యం. "ఆదివారం పూటే ఎందుకిలా ?" అనడిగితే చాలా ఉంది చెప్పడానికి. పాపం, ఆ మగవాళ్ళు "కనీసం ఆదివారమన్నా కాస్త ఆలస్యంగా నిద్రలేద్దాం. క్యాంటీన్ వంటని ఒక్కరోజైనా మర్చిపోయి ఇంటివంట రుచిచూద్దాం. భార్యాబిడ్డలతో కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందాం, క్యారమ్సూ, ఛెస్సూ ఆడుకుందాం. చాలా కాలంగా చదవాలని ముచ్చటపడి కొనుక్కున్న పుస్తకాన్ని కనీసం ఈ వారమైనా తెఱిచి చూద్దాం." అని ఏవేవో ఊహలతో ఉంటారు. కానీ ఆ రోజు కూడా వాళ్ళని ప్రశాంతంగా ఒకపూట నిద్రపోనివ్వరు పూర్తికాలిక గృహిణులైన ఆ భార్యలు. "నన్ను బయటికి తీసుకెళతావా ? ఛస్తావా ? నాకు అలా తిరిగి రావాలనుంది" అని బలవంతంగా భర్తల్ని బయటికి బయల్దేఱదీస్తారు. "రోజూ అన్నిచోట్లకూ తిరిగీ తిరిగీ నాకు విసుగొచ్చింది" అని అనదల్చుకున్న ఆ భర్త మాటలు గుండె గొంతుకలోన కొట్లాడినట్లు లోలోపలే అణిగిపోతాయి. ఆ రోజుకిహ ఆ ఇంట్లో వంట ఉండదు. సినిమా మల్టిప్లెక్సు, షాపింగు మల్టిప్లెక్సు, భోజనం మల్టిప్లెక్సు, కాలకృత్యాలు కూడా మల్టిప్లెక్సు.. ఇంటికొచ్చాక బి-కాంప్లెక్సు.


మనకు మన మనుషులు మధురస్మృతులు కావడం మానేసి హోటళ్ళు, సినిమాహాళ్ళూ, ప్లాస్టిక్ చెత్తతో నిండిన పార్కులూ, వాహనరద్దీలూ, పొగలూ, దుమ్మూ, ధూళీ, కాలుష్యం - ఇవన్నీ మధురస్మృతులుగా పరిణమించడం విచారకరం. ఈ రకమైన గృహ అశాంతికి ఒక కారణం - హోటల్ భోజనాలు ఇంట్లో భోజనాల కంటే బావుంటాయనే వృథాభ్రాంతి. అలా ఖర్చుపెట్టడం దర్జా అనే మఱో భ్రాంతి. దాన్ని విశ్రాంతిగా భావిస్తూ, ఒక sense of wellbeing ని అనుభూతి చెందాలని ప్రయత్నించే అమాయకత్వం. ఇది ఎక్కువభాగం వారపత్రికల్లో సీరియళ్ళు చదవడం వల్లా, టీవీలలో సీరియళ్ళు చూడ్డం వల్లా మన కుటుంబాల మీద పడ్డ ప్రతీప ప్రభావం. అదే సమయంలో ధనిక, ఎగువ మధ్యతరగతి జీవనశైలిని అనుభూతి చెందాలనే ఉత్సుకత. సరే, అది ప్రస్తావనాంతరం.


ప్రయాణంలో ఆచారం అర్ధభాగమే అన్నారు పెద్దలు. కనుక ప్రయాణంలో ఉన్నప్పుడు హోటళ్ళ దగ్గఱ రాజీపడొచ్చు. తప్పులేదు. కానీ ఉన్న ఊళ్ళోనే ఉంటూ ఈ అనాచారాలేంటి ? హోటళ్ళు హోటళ్ళుగా ఉండడం మానేసి అవి హిందూజాతికి దేవాలయాలతో సమానమైన ప్రాముఖ్యం గల సంస్థలుగా మారడం చాలా బాధ కలిగిస్తోంది. కొద్ది సంవత్సరాల క్రితం ఒకాయన ఉత్తరాది నుంచి దిగొచ్చి హైదరాబాదు చందానగర్ లో ఒక హోటల్లో మకాం పెట్టాడు "జ్యోతిష్యం చెప్పబడును" అంటూ ! హోటల్ లో మకాం పెట్టి వైద్యం చేసేవారి గుఱించి విన్నాం. జ్యోతిష్యం చెప్పేవారు కూడా ఉన్నారని తెలియడం అదే మొదటిసారి.


అదే విధంగా ఈ మధ్య హోటళ్ళలో పెళ్ళిళ్ళు, గర్భాధానాలూ, ఉపనయనాలూ చేయడం గుఱించి వింటున్నాను. ఇందుకు బ్రాహ్మణులు ఎలా అనుమతిస్తున్నారో నాకు తెలియదు. ఎలా చూసుకున్నా సరే, అవి ఎంత ఖరీదైన హోటళ్ళయినా సరే, హోటళ్ళు పవిత్రమైన ప్రదేశాలు మాత్రం కావు. అక్కడ నానాజాతులవారూ, నానా చిత్ర (చెత్త) అలవాట్లవారూ బసచేస్తారు. అక్కడ కొందఱు జనం బాత్‌రూములకీ, టాయిలెట్లకీ వెళ్ళి కాళ్ళూ చేతులూ కడుక్కోకుండా తిరిగేస్తూ ఉంటారు. అవి అనేక నీచ కార్యకలాపాలకు నిలయాలు. రౌడీలూ, గూండాలూ అక్కడ గదులు తీసుకొని "ఎవఱిని లేపెయ్యాలా ?" అని హింసాత్మక సమాలోచనలు చేస్తారు. భారీ లంచాల డీలింగులు కూడా అక్కడ కుదుర్చుకుంటూ ఉంటారు. అక్కడి సమావేశ మందిరాలలో తఱచుగా మందుపార్టీలు జఱుగుతుంటాయి. పిలుపుబాలికలు చాలా తఱచుగా హోటళ్ళని సందర్శిస్తూంటారు. అలాంటిచోట్ల కూర్చుని "గణానాం త్వా గణపతిం హవామహే, కవిం కవీనాం.." అని దేవతల్ని ఆవాహన చేస్తే వారు వస్తారా ? మన నైవేద్యాలు స్వీకరిస్తారా ? మన క్రతువుల్ని సఫలం చేస్తారా ? ఎవఱెవఱో, ఎందఱెందఱో ఎక్కితొక్కిన పరాయి ముఱికిమంచాల మీద మన గర్భాధాన మహోత్సవాలు జఱుపుకోవడంలోని వెగటునీ, అసహ్యాన్ని ఈ హిందూజాతి అనుభూతి చెందడం లేదేమీ ? మన మతధర్మ స్పృహనీ, మనో సున్నితత్వాల్ని మొఱటుబార్చి మనల్ని ఇలా మనుషుల స్థాయి నుంచి పందుల స్థాయికి దిగజార్చినదెవఱు ?


ఈ వెధవపని చేస్తున్నది మనం (హిందువులం) మాత్రమేననీ, ఇతరమతాలవారు ఇప్పటికీ తమ యొక్క సకలసబ్బండు కర్మల్నీ, సంస్కారాల్నీ తమ ప్రార్థనాలయాల్లోనే నిర్వహిస్తున్నారనీ ఈ సందర్భంగా గుర్తుచేసుకోవడం అవసరం. ఇంట్లో వివాహం కుదఱకపోతే కల్యాణమండపాలన్నారు. సమ్మతించాం. ఇంట్లో ఆబ్దికాలు కుదఱకపోతే అవి జఱిపించే బ్రాహ్మల ఇళ్ళకే వెళుతున్నామన్నారు. తల పంకించాం. పెళ్ళిముహూర్తానికి రాలేనివాళ్ళ కోసం హోటల్లో వారిని కలుసుకునే కార్యక్రమం (రిసెప్షన్) ఏర్పాటు చేశామన్నారు. కానీ అలా మెట్టుమెట్టూ దిగిపోతూ - ఈరోజు మఱీ అంకఛండాలంగా హోటళ్ళలో పెళ్ళిళ్ళూ, గర్భాధానాలూ, ఉపనయనాలూ, బ్రహ్మోపదేశాలూ ఏంటి బాబూ ? హోటళ్ళేమైనా దేవాలయాలా ?


వైదిక/ శ్రౌత/స్మార్త క్రియల నిర్వహణకు సరైన కాలమూ, దేశమూ అవసరం అన్నారు పెద్దలు. యోగాభ్యాసానిక్కూడా సరైన కాలమూ, దేశమూ అవసరమని హఠయోగప్రదీపికలోను, భగవద్గీతలోను చెప్పబడింది. కానీ హోటళ్ళు ఎట్టి పరిస్థితుల్లోను ఆ శ్రేణిలో చేఱవు. పూటకూళ్ళ కొంపల్లో గదులు అద్దెకు తీసుకొని శ్రౌతమూ, స్మార్తమూ నిర్వహించుకో వలసినదని ఏ ధర్మశాస్త్రమూ అనుశాసించి ఉండలేదు.


"గ్రాండ్ కాకతీయలో ఉపనయనము చేసికొనుము"

"హోటల్ వైస్రాయ్ లో పెండ్లి చేసుకొనుము."

"కృష్ణా ఓబెరాయ్ లో శోభనము జఱుపుకొనుము"

"అనేక బ్యాంకుల్ని యథాశక్తి ముంచి రాజీవ్ రెడ్డిగారు నిర్వహిస్తున్న ఖరీదైన కంట్రీక్లబ్ లో నీ తండ్రికి తద్దినము పెట్టుము"


అని ఏ గ్రంథంలోను వ్రాసిలేదు. ఒకవేళ మన ఇళ్ళలో ఈ క్రియల్ని నిర్వహించుకోవడం అధునాతన జీవనశైలిలో ఏ కారణం చేతనైనా వీలుపడకపోతే, హిందువులమంతా కలిసి ప్రతి ఊళ్ళోను వాటి కోసం ప్రత్యేక భవనాలు కట్టుకుందాం. అంతే తప్ప ఈ హోటళ్ళ వ్యామోహంతో తరతరాల పవిత్ర సంప్రదాయాన్ని భ్రష్టుపట్టించరాదు.

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

I totally agree with you.. People have to think about it. Nice and Good One..

anrd చెప్పారు...

బాగా చెప్పారండి..

Jagadeesh Reddy చెప్పారు...

Very good post. we should think about it.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి