25, జనవరి 2012, బుధవారం

పురాతన ఈజిప్టులో శ్రీకృష్ణుణ్ణి కొలిచేవారా ?-3

పదో సభ్యుడు :



..... గారూ, దేవనాగరికాక వేఱే లిపి అంటే తమిళుల గ్రంథలిపి వంటిదంటారా? నా అసలు ప్రశ్న. మీరు సంస్కృతానికి దేవనాగరి కాక వేఱు లిపి ఉండి ఉండాలి అనుకోవటానికి కారణం నాకు సరిగా అర్థం కాలేదు. కొంచెం వివరించగలరా?


....గారూ, ఆసక్తికరంగా ఉన్నాయి మీరు చెప్పే విషయాలు. .....గారు అన్నట్టుగా, చాలా క్రొత్త విషయాలు తెలుస్తున్నాయి. కొనసాగించగలరు.



మూడో సభ్యుడు :



సంస్కృతానికి పూర్వనాగరికతలో - అంటే ప్రళయానికి ముందు - బ్రాహ్మీలాంటిది కాకుండా ఇంకేదో లిపి ఉండి ఉండాలి. అదేంటో దాని యథార్థస్వరూపం మనకి తెలిసే అవకాశం ఇప్పుడు లేదు. సంస్కృతం అంతర్జాతీయ భాషగా గల పూర్వనాగరికత 5,000 సంవత్సరాల క్రితమే నశించిపోయింది గనుక ! ఆ తరువాత మానవజాతి అంతా మొదట్నుంచీ మొదలుపెట్టుకుంటూ రావాల్సి వచ్చింది గనుక ! నా అంచనాలో అది ఈనాటి రోమన్ లిపి లాంటిది. అపరిపక్వదశలో ఉన్న ఈ ఊహల్ని నేనిప్పుడు సిద్ధాంతం చేయలేను. చేయకూడదు కూడా ! కానీ ఎవఱైనా దీనిమీద పరిశొధిస్తే బావుంటుందని కొంత ఇక్కడ వ్రాస్తున్నాను.


రోమన్ లిపిలో అక్షరాలకి ఒక ప్రత్యేక ధ్వనికి కమిట్ కాని పరిప్లవ వర్ణాలు (Dynamic characters) ఉన్నాయి. ఉదాహరణకి - Rama. దీన్ని రామ అని పలకొచ్చు. రమా అనీ పలకొచ్చు. colleague దీన్ని కలీగ్ అనొచ్చు. లేదా కొలీగ్ అనీ అనొచ్చు. put లోని u నే but లో అకారంగా పలకొచ్చు. అలాగే [i] ని ఇకారంగాను పలకొచ్చు. ఐకారంగానూ పలకొచ్చు. ou ని ఓకారంగా, ఉకారంగా, ఊకారంగా, ఔకారంగా ఇన్నిరకాలుగా పలకొచ్చు. Y ని యకారంగానీ పలకొచ్చు


ఈ లక్షణాన్ని సంస్కృత పదాలతోనూ, వర్ణాలతోనూ సరిపోల్చి చూడండి. లేదా ఈ సంస్కృతపదాల్ని రోమన్ లో వ్రాసి చూడండి.


పరిప్లవ - పారిప్లవ

కత - కాత్యాయన

విశేష - వైశేషిక

కురు - కౌరవ

వ్యాకరణ - వైయాకరణ

న్యాయ - నైయాయిక

రామ : -రామో (సంధిలో) = ఎందుకంటే విసర్గ ముందున్న అకారాన్ని హ్రస్వ ఓకారంగా పలకాలి. అలా పలికితేనే ఈ సంధికార్యానికి అవకాశం. (రామొహ్) -


ఇక్కడ ఒకారానికీ, అకారానికీ అభేదం - అచ్చం రోమన్ లిపిలో మాదిరే ! ఈ లక్షణం ఈనాడు ఈ గడ్డమీద మనకి సంస్కృత ఉచ్చారణలో మాత్రమే కనిపిస్తుంది. ఈ పరిప్లవ ఉచ్చారణ మీద ఆధారపడి సంస్కృతంలో ఏకంగా ప్రత్యయాలే ఆవిర్భవించినట్లు కనిపిస్తుంది. ఆ మొదటి సంస్కృతలిపిని సవ్యంగా (left to right) వ్రాసేవారో, అపసవ్యంగా (right to left) వ్రాసేవారో మఱెలా వ్రాసేవారోమనకి తెలీదు.మొత్తమ్మీద అది అచ్చుల్నీ, హలుల్నీ (vowels and consonants) విదగొట్టి అక్షరాల్ని పక్కపక్కన వ్రాసే తరహా లిపి అని నా ఊహ. ప్రాచీన నాగరికతలో అన్ని సమాచార వినిమయాలూ ఆ పూర్వలిపిలోనే జఱిగుంటాయి. బ్రాహ్మిలాంటి Complex script లో అయ్యుండదు. ఉదాహరణకి భరద్వాజమహర్షి సూచించిన విమాననిర్మాణం ఇత్యాదుల్లో కూడా!


తొమ్మిదోసభ్యుడు :



మీరంటున్నారు "పూర్వం ఎక్కడెక్కడైతే హిందూమతం ఉండేదో అదల్లా భారతదేశం అనుకోవడం సరైన కోణం కాదనుకుంటా. నిజానికి ఈ విషయంలో చాలా confusion ప్రచారంలో ఉంది. " అని ! పై వేగు (mail) లో చెప్పినట్లు ఈ భూమండలం మొత్తం ఒకే నేల, ఒకే ధర్మం, ఒకే సంస్కృతిగా విలసిల్లింది. 19 వ ఇక్ష్వాకు రాజైన అసితుని పాలనలో విధ్వంసాలు చెలరేగాయి. అప్పటివఱకు వసుధైక కుటుంబం. కనుక ఈ భూమండలమంతా హిందూమతమే ఉండేది. దానికి మాతృస్థానం ఈ భరతవర్షమే. విదేశీయులే ఈ మతాన్ని స్థాపించారని మీరు అంటే ఆ స్థాపన ఈ భరతవర్షంలోనే జరిగింది కనుక ఈ సనాతనధర్మం ఈ పుణ్యభూమి నుండే ప్రపంచమంతా వ్యాపించింది అని ఘంటాపథంగా చెప్పవచ్చు.

మీరు ఆ తరువాత ఇలా అంటున్నారు : "భారతదేశం అనేది ఒక ఆధునిక రాజకీయ పరిభావన. ఇది ఇటీవలి British ideological construct. ఇది ప్రాచీనం కాదు. ప్రాచీనకాలంలో తెలిసినవి భరతవర్షం,భరతఖండం మాత్రమే. అయితే ఇవి రాజకీయ స్వరూపాలూ కావు. సాంస్కృతిక స్వరూపాలూ కావు. భౌగోళికాలు మాత్రమే." అని !


సమయాభావం వల్ల సగం టైప్ చేసి డ్రాఫ్ట్ లో వదిలేసాను. ఇప్పుడు ఇది పూర్తి చేసి మీ తదుపరి వేగుకి సమాధానం ఇవ్వదలచుకున్నాను.



ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా, ఆసేతు హిమాచలం నుండి దక్షిణ కొసల వరకు ఒకే సంస్కృతి భాసిల్లినా, కృష్ణుని కాలంలోను అంతకు పూర్వం కూడా ఈ సువిశాల భూమండలం మొత్తం (వివిధ వర్షాలు, ద్వీపాలు) కూడా సనాతన ధర్మమే మతంగా నిలిచింది అప్పట్లో. ఐతే మీరు అనేది ఈ మతం ఎక్కడో ఉండి ఉండచ్చు అక్కడ అంతరించి ఇక్కడ నిలబడి ఉండచ్చు అని. పాత కాలం రోజుల్లో ఈ విషయం విశ్వాసాల మీద ఆధారపడేది. ఈ కాలంలో బాహ్యస్వరూపాలతో నిరూపిస్తే తప్ప నమ్మరు. కనుకనే నా సోర్సెస్ జెనెటిక్ స్టడీస్, ఆర్కియోలాజికల్ పరిశొధనలే అయి ఉంటాయి.


ఇక్కడ నా వాదనలు అన్ని కేవలం సనాతన ధర్మమే కాదు AIT/AMT కూడా కలుపుకుని విషయాలు వ్రాస్తున్నాను.


ఒక చిన్న ఉదాహరణ చూద్దాం : మన తెలుగునాడు చాలా వైశాల్యం కల రాష్ట్రం. దీని రాజధాని భాగ్యనగరం. మన ముఖ్య పనులకు, చదువులకు, ఉపాధులకు, వర్తకాలకు ఎక్కువగా రాజధాని మీదే ఆధారపడతాం. ఆధారపడటం అనేది పక్కన పెడితే రాజధానితోనే ముడిపెట్టుకుంటాం. చదువులకు రాజధానినే మొదటగా ప్రిఫర్ చేస్తాము. ఇదే విధంగా, ఈ ద్వీపాలు ఉన్నప్పటికి వాటన్నిటికి కేంద్రీకృతమైన వర్షం ఈ భరత వర్షం. ద్వీపం జంబుద్వీపం. భూమండలం మొత్తం ఒకే రాజరికం నడిచిన కాలంలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి జ్ఞానులు, ఋషులు తపశ్శక్తితో వాళ్ళు సంపాదించిన జ్ఞానాన్ని సరస్వతీనది తీరాన ఈ పుణ్యభూమి పైనే వికసింప చేసారు అని చెప్పవచ్చు. ఐతే వీళ్ళంతా మ్లేచ్చులు అనకూడదు. తపస్సుకి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి తిరిగొచ్చారని కూడా చెప్పవచ్చు. అప్పటికి భౌగోళిక స్వరూపాలు వేరు. ఇప్పుడున్నంత దూరదూర దేశాలుగా అప్పుడు లేవు. పైగా భూమండలం మొత్తం ఒకే సార్వభౌమాధికారం. చాలా వరకు అన్ని దేశాలు దగ్గరదగ్గరగానే ఉండేవి. వలసలు కేవలం తీరాల వెంబడి కాలిబాటనే జరిగేవి కాబట్టి ఒక మనిషి తన జీవిత కాలంలో దూరదూరాలు ప్రయాణించే వారు. వివిధా రాజ్యాలు, రాజులు, వర్షాలు ఉన్నప్పటికి వాటన్నిటికి సార్వభౌమాధికారం ఈ భరతవర్షంలోనే ఉండేది. మిగతా చోట్లా బహుశా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సామంత రాజ్యాలు అయి ఉండవచ్చు. కాని అవన్ని స్వయం ప్రతిపత్తి కలిగినవి కావు. (ఇది ఎలాగో మునుముందు చర్చను బట్టి సాక్ష్యాలతో వివరిస్తాను). ఇంతవరకు మీరు ఒప్పుకుంటారని అనుకుంటాను.


ఒకవేళ పై పాయింట్ మీకు సమ్మతం లేని ఎడల ఇంకో ఉదాహరణ చెప్తాను. రెండు వేల సంవత్సరాలకి పూర్వం క్రీస్తుమతం లేదు. ఇస్లాం అంతకన్నా లేదు. ఈశా అని పిలవబడే వ్యక్తి తన జ్ఞానార్జన కొరకు ఈ నేల మీదనే అడుగు పెట్టాడు. ఈ ధర్మం యొక్క మూలాలు వేరే ఉన్నట్టు అయితే ఆ ప్రదేశాల ప్రాముఖ్యత గుర్తించక పోరు. అక్కడ దర్శించక పోరు. వాటి వివరణ ఈరోజుకి మనం వింటూ ఉంటామేమో.్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భగవంతుని స్వరూపాలు జన్మించారు. అందరికి ఈ ధర్మమూలం ఈ పుణ్యభూమే అని ఇక్కడే వాళ్ళ తపశ్శక్తిని పెంపొందించుకున్నారు.


ముందు చెప్పుకున్నట్టుగా ఈ భూమండలం మొత్తం ఒకే సాదృశ్యం కలిగిన ధర్మం అవడం చేత, ప్రధాన కార్యాలయమయినట్టు వంటి ఈ భరతవర్షం (ఆర్యావర్తం) లోనే చోటు చేసుకున్నాయి. మిగతావన్ని బ్రాంచీలని అనుకోవచ్చుగా. ఇంతవరకు ఈ పరంపర కలియుగప్రారంభం వరకు నడిచింది. భారతంలో కలిసిన దేశాలు దీనితో అనుసంధానించి ఉండేవి. ఒక్కోసారి కొన్ని కలిసేవి కొన్ని విడిపోతూ ఉండేవి. తదనుగుణంగా మ్లేచ్చులవడం, అవకపోవడం జరిగేది.


ఈ ధర్మం బయట నుంచి వచ్చినది కానే కాదు. ఎంత కాలగతిలో కలిసిపోయినా పురావస్తు పరిశోధనలో ఇన్ని సంవత్సరాలుగా వాటి ఆనవాళ్ళు దొరకకుండా ఉండవు. కాని ఇంతవరకు లభించిన ఆనవాళ్ళు అన్నిటికి ఈ దేశంతోనే ముడిపడి ఉన్నాయి. పైగా ఈ దేశంలో లభించిన వాటికన్న పూర్వకాలానివి మాత్రం ఇంతవరకు లభించలేదు. పరిశోధనలు మన దేశంలో సాగనివ్వడం లేదు కాని ప్రపంచం అంతా తేలికగా చేయగలుగుతున్నారు. అంత సారూప్యత కలిగిన శోధనల్లో తేలనివి వాటికి వేదం యొక్క పుట్టుపూర్వోత్తరాలలో భాగం ఉండటం లేదా ఇవి అక్కడ నుండే ఇక్కడికి వలస వచ్చాయి అనడానికి ఆస్కారం ఎంత మాత్రం లేదు.



(ఇంకా ఉంది)

కామెంట్‌లు లేవు:

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి