14, జనవరి 2012, శనివారం

మంచిభార్య కావాలన్నా తపస్సు చేయాలి

మంచిభర్త రావాలని పెళ్ళికాని ఆడపిల్లలచేత సాంప్రదాయిక విశ్వాసాలున్న హిందూ పెద్దలు కొన్ని వ్రతాలూ, నోములూ, పండుగలూ, పారాయణలూ ఆచరింపజేస్తూంటారు. ఈ విధమైన ఆచరణల్లో వరలక్ష్మీవ్రతం, అట్లతద్దె మొదలైనవి ఉన్నాయి. ఆడపిల్లల్లో కూడా పాశ్చాత్యవిద్య విస్తారంగా ప్రబలినాక ఈ సత్సంప్రదాయం క్రమేపీ మఱుగున పడుతూ వస్తున్నది. అయినా ఎంతకీ పెళ్ళికాని సందర్భాలలో - వయసు వాటారుతున్న కన్యల చేత ఆఖరి ప్రయత్నంగా రుక్మిణీకల్యాణం పారాయణ చేయించడం ఇప్పటికీ ఉన్నది.

మంచిభార్య రావాలని చెప్పి మగపిల్లల చేత ఈ విధమైన ఆచరణలు చేయించడం మాత్రం ఎక్కడా లేదు. "భార్య అంటే అబల, ఎలా కావాలంటే అలా వాయించదగ్గ తబల, అనుకూలంగా ఉండక ఏం చేస్తుందిలే ?" అనుకుని మనవాళ్లు ఈ విషయానికి అస్సలు ప్రాధాన్యమే ఇవ్వకపోవడం ఒక కారణం. కానీ మన ప్రాచీన కథల్నీ, పురాణాల్నీ పరిశీలిస్తే భర్తలకి జీవితాన్ని నరకప్రాయం చేసిన భార్యలు సృష్ట్యాదినుంచీ ఉన్నారు. వీరు ఫెమినిజంతో వచ్చినవారు కారు. అది పోయినంత మాత్రాన పోయేవారూ కారు. పైకి అందఱి ముందూ అణిగిమణిగి ఉన్నట్లు కనిపిస్తూ (నటిస్తూ) రహస్యంగా తమ తెలివితేటలకి పదునుపెట్టుకునే తరహా స్త్రీలక్కూడా కొదవలేదీ భారతభూమిలో ! కొన్నిసార్లు భర్త ఒక్కడికి మాత్రం విధేయురాలుగా ఉంటూ ఇహ తతిమ్మా కుటుంబసభ్యులందఱికీ ద్రోహం తలపెట్టే క్యారెక్టర్లు కూడా మొదట్నుంచీ ఉన్నాయి. అందుచేత మంచిభార్య, అందమైన భార్య రావాలంటే మగపిల్లలు కాస్త తపస్సు చేయడం అవసరం. ముఖ్యంగా ఈ నాగరికతలో స్త్రీల మనస్సుని మళ్ళించి, వాళ్ళ మతి పోగొట్టి, వాళ్ళు భర్తకీ, పిల్లలకీ పనికిరాకుండా పోయేలా పాడుచేసే బయటి ప్రభావాలు చాలా ఎక్కువయ్యాయి.

మనం రోజూ పొద్దున్నే లేచి ఎవఱి మొహం చూస్తామో, ఎవఱితో కలిసి ఒకే కప్పుకింద నివసిస్తామో, ఎవఱి సాన్నిహిత్యంలో మనసులోని బరువులు దించుకుంటామో, ఎవఱున్నారనే ధైర్యంతో ఇంటినుంచి బయటికీ, బయట్నుంచి ఇంటికీ వెళతామో ఆ జీవితభాగస్వామి(ని) సరైన వ్యక్తి అయి ఉండడం చాలా ముఖ్యం. వధువు ఆరోగ్యవంతురాలూ, పిల్లల్ని కనగల త్రాణ గలిగినదీ, రజోదోషాలతో బాధలు పడనిదీ అయి ఉండాలి. ఆమెకు పెళ్ళి కాక ముందు ఏ ఇతర పురుషుడితోనూ సంబంధం, అభిమానం, అటాచిమెంట్ ఉండకూడదు. ఒకఱో ఇద్దఱో అన్నదమ్ములు గలదై ఉండాలి. కేవలం అక్కచెల్లెళ్ళు మాత్రమే ఉన్న స్త్రీలల్లో ఫెమినిస్టు భావాలు చాలా అధికంగా ఉంటాయి. అలాంటి ప్రిజుడీసులు భర్తతో సర్దుకు పోయే ప్రక్రియకి హిమాలయాల్లా, మేరుపర్వతాల్లా అడ్డుపడతాయి. తండ్రి వదిలేసిన తల్లి గలదీ, మొదట్నుంచీ తల్లిపోషణలోనే ఉన్నదీ అయిన కన్య కూడా ఈ పై తరహాకి చెందినదే అయి ఉంటుంది. కానీ వాళ్ళింట్లో దైవభక్తి బావున్నప్పుడు ఫెమినిస్టు ధోరణులు కాస్త తగ్గుముఖంలోనే ఉంటాయి. కనుక చేసుకోవచ్చు.

ఆమె యొక్క బంధుమిత్త్రవర్గంలో అత్యంత ధనికులూ, కోర్టుపక్షులూ, జైలుపక్షులూ, పాత్రికేయులూ, పోలీసులూ, న్యాయవాదులూ ఉంటే అవన్నీ ఏదో ఒకరోజున వరుడి మెడకి గుదిబండల్లా చుట్టుకోవడం ఖాయం. ఇహపోతే పెళ్ళయ్యాక స్త్రీ జీవితాంతం భర్తకే విధేయురాలై ఉండాలి. ఇతరుల కోసం భర్తని నిలువునా నట్టేట్లో ముంచేదై ఉండకూడదు, ఆ ఇతరులు పుట్టింటివాళ్ళయినా సరే, సాక్షాత్తూ తన కడుపున పుట్టిన పిల్లలైనా సరే ! అతివిద్య, అతితెలివితేటలు, అతి-అఛీవ్‌మెంట్లు, అతిలోకజ్ఞానం, అతిసంపాదన, అతి-ఆస్తులూ, అతిపరిచయాలూ, అతి ఆత్మవిశ్వాసం, అతివాగుడు గల స్త్రీలు కూడా పెళ్ళికి బొత్తిగా పనికిరారు. అలాంటివారిని మొగ్గలోనే తిరస్కరించడం, ప్రయత్నపూర్వకంగా వదిలించుకోవడం మగవాడికి అన్నివిధాలా శ్రేయస్కరం. వారిని కాస్త తెలివిగా సమయస్ఫూర్తితో ఇంటర్వ్యూ చేస్తే ఈ లక్షణాలు వారిలో ఉన్నాయా ? లేదా ? అనేది వాసనపట్టవచ్చు.

అయితే ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా భగవదనుగ్రహం గనక లోపిస్తే గయ్యాళిగంపలు మన ఇంట్లో అడుగుపెట్టడం ఖాయం. వారు మనల్ని రాచిరంపాన పెట్టడం తథ్యం. ఎంత ప్రయత్నించు, సర్వశుభలక్షణాలూ మూర్తీభవించిన ఆ స్వప్నసుందరీమణి ఎక్కడా లభించదు. ప్రతివారిలోనూ ఏవో కొన్ని లోటుపాట్లు ఉండనే ఉంటాయి, మనలో ఉన్నట్లే ! పూర్వజన్మలో స్త్రీలని హింసించినవారు మాత్రమే ఈ జన్మలో వారి చేతుల్లో హింసలు పడతారు. స్త్రీజనాభిమానులైన ఇతరులకి ఏ బాధా లేదు. కాబట్టి "ఈ జన్మలో మంచివాళ్ళమే కదా, మనకీ అశాంతి ఎందుకు సంప్రాప్తమయిందో" అని కుమిలిపోవడం అమాయకత్వం. ఆ జన్మకి సంబంధించిన లెక్కల పుస్తకాలూ, దస్తరాలూ ఎప్పుడో పరిష్కరించి మూసేయడం జఱిగింది. వాటిమీద ’న్యాయమూర్తి’ ఇచ్చిన తీర్పొక్కటే ఇప్పుడు ఈ జన్మ ద్వారా అమలవుతున్నది. ఈ జన్మకి సంబంధించిన అకౌంట్లూ, ఫైళ్ళూ ఇప్పుడింకా తయారవుతూ ఉన్నాయి. వీటిమీద చివర్లో వస్తుంది తీర్పు. అది వచ్చే జన్మలో అమలవుతుంది.

మన కంటే మనల్ని పుట్టించినవాడికి బాగా తెలుసు మనకేది మంచిదో ! కనుక మగపిల్లలు మంచిభార్య రావాలని చెప్పి కనకదుర్గమ్మవారిని లేదా లలితాంబికను నిష్ఠగా కొలిస్తే ఆవిడే పూర్వజన్మదోషాన్ని నివర్తించి తమకు తగ్గ భార్యల్ని సిద్ధం చేస్తారు. తనకు తగ్గ భార్య వస్తే చాలు, ఆమే సర్వశుభలక్షణవతి. అన్ని శుభలక్షణాలూ ఉండి తనకు మాత్రం అనుకూలురాలు కాకపోతే ఉపయోగమేముంది ? నిజం చెప్పాలంటే దుర్గోపాసకులకి భార్యే కాదు. యావత్ స్త్రీజాతీ అనుకూలంగా మారిపోతుంది. ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడాను ! (దీన్ని మఱోలా అపార్థం చేసుకోవద్దు) ఈ విషయప్రాధాన్యాన్ని గమనించే అర్గళాస్తోత్రంలో--

శ్లో|| భార్యాం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీమ్ |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||

అని అమ్మవారిని ప్రార్థించారు కొందఱు పూర్వీకులు. కొందఱు పురుషులు ఒక్క భార్యతో సంతృప్తి చెందరు. వారిక్కూడా ఇదే పద్ధతి. వధువును నిర్ణయించుకోవడానికి 11 నెలల ముందునుంచి సత్కళత్ర సిద్ధి (మంచిభార్య లభించడం) అనే సంకల్పంతో ప్రతినెలా నెలకోసారి చొప్పున లక్ష్మీహోమం చేసుకోవడం కూడా అద్భుతఫలప్రదం. కాస్త ఖర్చవుతుంది కానీ తప్పదు.

4 కామెంట్‌లు:

durgeswara చెప్పారు...

నిజమేనండోయ్ ! చిన్నప్పటినుంచి అమ్మ ఉపాసనలో ఉండబట్టేమో నా ఆలోచనలకు ఎదురుచెప్పని భార్య లభించింది. ఇప్పటిదాకాపరవాలేదు. మీపోస్ట్ చదివితే "చూశారా !పెద్దాయన కూడాచెప్పాడు మీరెంత తపస్సుచేస్తేగాని నేను దొరకలేదు తెల్సా ? అంటుందేమోన్న" సందేహం వస్తుంది.

DARPANAM చెప్పారు...

అవును ఈ పోస్ట్ అక్షరాలా నిజం
వెయ్యి కాపీలు ముద్రించి పంచాలని ఉంది

Disp Name చెప్పారు...

బాల చందర్ అరవ చిత్రం లో జేసుదాసు పాడిన పాత పాట గుర్తు కొస్తోంది మీ ఈ టపా చదివిన తరువాత.
"మనైవి అమైవదేల్లాం ఇరైవన్ కొడుత్త వరం"

" భార్య అమరిక భగవంతుడిచ్చిన వరం "

తపో ఫలానా నేను వారికి దొరికాను , నాకు వారు దొరికారు ! రెండు రెళ్ళు ఆరు !

చీర్స్
జిలేబి.

Tejaswi చెప్పారు...

scriptures గురించి తెలిసినా కూడా చాలామంది మీలాగా సమకాలీన పరిస్థితులకు రిలేట్ చేస్తూ చెప్పలేరు. వాళ్ళపంథాలో వాళ్ళు చెప్పుకుపోతారు. ప్రస్తుతం నెలకొనిఉన్న చెడుధోరణులను కూడా ఉటంకిస్తూ మీరు చెప్పిన విధానం బాగుంది. మీరు చెప్పినట్లు భార్యలలో పెడధోరణులు కలవారు ప్రస్తుతం చాలామంది ఉన్నారు.

చాలా బాగుంది. ఇలాంటివి మరెన్నో వ్యాసాలు రాయాలని కోరుకుంటూ - తేజస్వి

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి