2, జనవరి 2012, సోమవారం

సనాతనధర్మానికి ప్రమాదం లేదు

మనలో చాలామంది ఆందోళన చెందేది - మతమార్పుల వల్ల హిందూధర్మం కాలగర్భంలో కలుస్తుందేమోనని ! ప్రజాస్వామ్యయుగంలో ప్రజలెక్కువమంది దేనికి జై కొడితే అదే నిలుస్తుందనీ, కనుక హిందువుల సంఖ్య తగ్గితే హిందూధర్మం నశించిపోయినట్లేననీ భావించే భయభ్రాంతిపూరితభావనే ఇందుక్కారణం. ఇది పాక్షికంగా మాత్రమే వాస్తవం. ’పాక్షికంగా” అని ఎందుకంటున్నానంటే హిందూధర్మం చుట్టూ ఏర్పడిన అనంతరకాలీన ఉపరితల నిర్మాణాల్ని (super structures of later times) ని మాత్రమే మతమార్పులు కూలగొట్ట గలవు. మూలహిందూధర్మాన్ని మాత్రం ఏమీ చేయజాలవు. ఉపరితల నిర్మాణాలంటే మన సంగీతం, సాహిత్యం మొ||


కానీ మూలహిందూధర్మం నశించిపోవడం జఱగదు. ఎందుకంటే హిందూధర్మం జనసంఖ్య మీద ఆధారపడినది కాదు. దీన్ని ప్రత్యేకంగా "సనాతనధర్మం" అని పిలవడానికీ, మిగతా వన్నీ కేవలం "మతాలు" (cults) మాత్రమే అవడానికీ గల కారణం ఇది. ఈ "మతాలు" కలిపురుషవిజృంభణలో భాగంగా కొత్తగా ఉప్పతిల్లినటువంటివి. పురాణాలలో చెప్పినట్లు, అల్పజ్ఞానులూ, అల్పమేధస్కులూ, అల్పాయుష్కులూ, శిశ్నోదరపరాయణులూ అయిన కలికాలపు హీనజనం యొక్క సంస్కారానికీ, అవసరాలకూ అనుగుణంగా భగవంతుడు ఆధ్యాత్మికతాకషాయాన్ని బాగా నీళ్ళుపోసి పల్చబార్చి భూలోకంలోకి పంపినటువంటివి. అంటే ఈ సంకుచితమతాలకొక తాత్కాలికమైన చారిత్రిక పాత్ర ఉన్నది. ఆ పాత్ర ప్రయోజనం నెఱవేఱగానే వాటంతట అవే కాలగర్భంలో కలిసిపోతాయి.


ఈ విషయాన్ని మనం కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకోవచ్చు. శ్రీపాద శ్రీవల్లభుల జీవితచరిత్రలో ఇలా ఉంది. దత్తాత్రేయస్వాములవారి ఆజ్ఞానుసారం శంకరభట్టు సంస్కృతంలో శ్రీపాదశ్రీవల్లభుల చరిత్ర వ్రాశాడు. దానికున్న రెండుప్రతులలో ఒకదాన్ని సిద్ధులూ, గంధర్వులూ తీసుకెళ్ళిపోగా ఒక ప్రతి మట్టుకు పశ్చిమగోదావరిజిల్లా భీమవరానికి చెందిన మల్లాదివారింట్లో ఉన్నది. శ్రీమాన్ మల్లాది గోవిందదీక్షితులు తల్లివైపునుంచి శ్రీపాద శ్రీవల్లభుల వంశానికి చెందినవారు. వారు మళ్ళీ దత్తాజ్ఞ ననుసరించి ఆ పుస్తకాన్ని కొద్ది సంవత్సరాల క్రితం తెలుగులోకి అనువదించారు. అనూచానంగా వచ్చిన మూలసంస్కృత ప్రతిని కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. కలియుగం గడిచిపోయి సత్యయుగం వచ్చిన తరువాత సంస్కృతప్రతిని సిద్ధులు మళ్ళీ భూలోకానికి తీసుకొస్తారని వ్రాశారు.


రెండో ఆధారాన్ని వాగ్గేయకారశిరోమణి శ్రీ త్యాగరాజు జీవితంలో చూడవచ్చు. నారదమహర్షి సంగీతం మీద ఒక పుస్తకం వ్రాశారనీ, అది అంతరించిపోయిందనీ విని త్యాగరాజుగారు బాధపడ్డారు. కానీ ఆ తరువాతికాలంలో నారదమహర్షే ఆయనకు స్వయంగా దర్శనమిచ్చి ఆ సంగీతగ్రంథంలోని రహస్యాల్ని బోధించారు. ఆ గ్రంథం భౌతికంగా జనాల పఠనపాఠనాల్లోంచి తొలగిపోయింది. కానీ దాన్ని రచించిన నారదమహర్షి మాత్రం ఇప్పటికీ ఉన్నారు.


మూడో ఆధారాన్ని విద్యారణ్యస్వాములవారి జీవితచరిత్రలోంచి గ్రహించవచ్చు. శ్రీ వేదవ్యాస మహర్షులవారు కాశీలో రోజూ పొద్దుపొడవకముందే మారువేషంలో గంగానదిలో స్నానానికి వస్తారని ఆయన విన్నాడట. రాత్రంతా నిద్రకాచి తెల్లవారుఝామున అక్కడికి నాలుగు కుక్కలతో వచ్చిన మాలవాడే వేదవ్యాసుడని గ్రహించి ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడట. ఆ మాలాయన తనను కసిరినా, తన్నినా, తోసినా, బండబూతులు తిట్టినా విద్యారణ్యుల వారు వదల్లేదట. అప్పు డాయన సంతోషించి తన నిజస్వరూపంతో విద్యారణ్యస్వాములవారికి దర్శనమిచ్చాడట.


నాలుగో ఆధారం - నా స్వానుభవం. నాచేత అమ్మవారు కొన్ని మంత్రాలు చదివించారు. ఆవిడ ఉపదేశిస్తూంటే నేను పలికాను. కానీ చిత్రమేంటంటే ఆ మంత్రాల్ని నేనప్పటి వఱకూ ఎక్కడా వినలేదు, కనలేదు, చదవలేదు. అవి ఉన్నట్లు నాకే కాదు, ఇతరులక్కూడా తెలియదు. ఇవి ఎక్కడివో, ఏనాటివో, ఏ ఋషి దర్శించినవో !!


అంటే ఈ హిందూమంత్రాలూ, శాస్త్రాలూ, ఉపాసనాపద్ధతులూ అన్నీ వాటివాటి అధిష్ఠాన దేవతల చేతా, సిద్ధపురుషుల చేతా, గోత్రఋషుల చేతా భద్రంగా కాపాడబడుతున్నాయి. ఈరోజున బజారులో దొఱక్కపోయినంతమాత్రాన అవేమీ నశించిపోలేదు. ఎప్పటికీ నశించవు కూడా. వాటిని నేర్చుకోవడానికి అర్హులైన ఉపాసకులు లేక వారు వాటిని బహిరంగపఱచడం లేదు. ఈ కలిదోషం పూర్తిగా నివర్తించాలనే వారూ ఎదుఱుచూస్తున్నారు. కానీ మఱో 400 - 500 సంవత్సరాలకు గానీ ఆ శుభదినం రాకపోవచ్చు.

1 కామెంట్‌:

kalyani చెప్పారు...

నమస్కారమండి ,
మీ వ్యాసం చాలా ధైర్యాన్ని ఇచ్చింది. క్రొత్త విషయాలతో పాటు కర్తవ్యం తెలియచేసారు. thankyou very much.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి